మధ్యాహ్న భోజనం ఔట్ సోర్సింగ్... వేలమందికి నష్టం

మధ్యాహ్న భోజన పథకంలో ప్రస్తుతం ఉన్న సమస్యల్ని సవరించడం పరిష్కరించడం ప్రభుత్వానికి ఉన్న మొదటి కర్తవ్యం. పిల్లలకి వంట చేసే కార్మికులకి సరైన జీతం ఇవ్వకపోవడం సమస్య.

Update: 2024-08-16 12:42 GMT


 -కన్నెగంటి రవి, జి. రాజగోపాల్  ( తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ)


ఇస్కాన్ ఫౌండేషన్ (హరే కృష్ణ హరే రామ) అనుబంధ సంస్థ అయిన అక్షయపాత్ర, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో 28,000 మంది స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడానికి తెలంగాణ సర్కారుతో ఒప్పందం చేసుకుంది.

ఇది స్కూల్ పిల్లలకు భోజనం అందించే కార్యక్రమం. బడికి వెళ్లే పిల్లల పోషణ అవసరాలు తీర్చి తద్వారా మెరుగైన చదువు అందించడం ఇటువంటి పథకాల ప్రధాన లక్ష్యం. దేశంలో దాదాపు 13 లక్షల స్కూళ్లలో చదివే కోటీ 20 లక్షల పై చిలుకు విద్యార్థులకు ఈ పథకం ద్వారా భోజనం లభిస్తుంది. ఇటువంటి పథకాలలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం.

ఈ పథకం ప్రస్తుత రూపంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కంపల్సరీగా అమలు అవడానికి కారణం 2002 సుప్రీంకోర్టు తీర్పు. రైట్ టు ఫుడ్ కేసుగా అందరికీ తెలిసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (PUCL) దాఖలు చేసింది. సుదీర్ఘ కృషి తర్వాత కోర్టు తీర్పుతో ఈ కృషి సాకారం అయింది. ఆర్టికల్ 21 - రైట్ టు లైఫ్ (జీవించే హక్కు) లో భాగంగా రైట్ టు ఫుడ్ కూడా ఉందని సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యానించింది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లో పడి ఉన్న ధాన్యాన్ని దేశంలో ఆకలి తీరని ప్రజలకు పంచాలని పియుసిఎల్ ఈ కేసులో వాదించింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ ఆధారిత స్కూల్స్ లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. ఈ కారణం చేతనే, మధ్యాహ్న భోజనం కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, దీనికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో పాటు, జాతీయ ఆహార బధ్రత చట్టం క్రింద చట్టబద్ధత కూడా ఉన్నాయి.

మధ్యాహ్న భోజన పథకం వల్ల స్కూల్స్ లో పిల్లల చదువు మెరుగు పడింది. ఇది ఎన్నో అధ్యయనాలలో బయటపడింది. ఆకలితో ఉన్న పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టలేరు. ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువగా వచ్చే బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఈ పథకం వల్ల ఎంతో లాభపడ్డారు. ఈ పథకం ప్రవేశ పెట్టాక ప్రభుత్వ స్కూల్ లో విద్యార్ధుల నమోదు , వారి హాజరు శాతం పెరగడం, బడి మానేసే పిల్లల సంఖ్య తగ్గడం, లాంటి పరిణామాలు స్పష్టంగా కనపడ్డాయి.

తెలంగాణ రాష్ట్రంలో 27, 872 ప్రభుత్వ ఆధారిత పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నది. వాటిలో సుమారు 21, 59,439 మంది చదువుతుండగా ఇందులో దాదాపు 75 శాతం మంది బడి భోజన పథకం వాడుకుంటున్నారు. ఇంతమంది పిల్లల ఆకలి తీర్చడానికి 52 వేల మందికి పైగా వంట కార్మికులు ఉన్నారు. ఇలా చూస్తే ఇది చాలా పెద్ద పని.

ఈ పథకం అమలులోనూ , పర్యవేక్షణ లోనూ, ఎన్నో సమస్యలు ఉంటాయి. పైగా మన స్కూల్స్ లో మౌలిక వసతులు అంటే కిచెన్ షెడ్లు, వంట పాత్రలు వంటివి కూడా ఒక్కోసారి అందుబాటులో ఉండవు. మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేసి, ఈ పథకాన్ని మరింత బాగా అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ఇదంతా సెంట్రలైజ్ చేస్తే బాగుంటుందని ఆలోచనలు చేస్తున్నది. రాష్ట్ర వ్యాపితంగా ఏవో కొన్ని సంస్థలు వంట చేసి అందరికీ పంచి పెడితే ఆ సంస్థలపై పర్యవేక్షణ ప్రభుత్వానికి సులభమవుతుందని ప్రభుత్వ భావన.

ఇప్పటికే కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు అక్షయపాత్ర వంటి సంస్థలు ఈ పథకాన్ని నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో కూడా హైదరాబాద్ నగరంలో పూర్తిగానూ, కొన్నిజిల్లాలలో పాక్షికంగానూ స్కూళ్లలో నాంది ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంధ సంస్థలు సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్వహిస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ ధోరణిలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్ లో అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో బడి భోజనాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్ తో ఒక పైలెట్ ప్రాజెక్టుగా బడి భోజనాన్ని అందిస్తున్నారు.

అక్షయపాత్ర లాంటి సంస్థలు తయారు చేసే భోజనంలో ఉల్లి,వెల్లుల్లి, గుడ్లు, మాంసం వంటి ఆహార పదార్ధాలను అస్సలు వాడవు.. పైగా పోషకాహార లోపం అత్యధికంగా ఉన్న భారత దేశంలో గుడ్డు ఒక ప్రధానమైన ఆహారం. అందుకే తెలంగాణలో వారానికి మూడు రోజులు పిల్లలకి గుడ్లు ఇస్తున్నారు. కేవలం శారీరిక ఎదుగుదలకే కాదు, గుడ్డు లాంటి పోషక విలువలు కలిగిన ఆహారానికి పిల్లల మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర ఉంది. మరి ప్రభుత్వం అక్షయపాత్ర లాంటి సంస్థను పిల్లలకు తప్పకుండా వారానికి మూడు రోజులు గుడ్లు ఇవ్వమని చెప్తుందా, చెప్తే వాళ్ళు అమలు చేస్తారా?

సెంట్రలైజ్డ్ కిచెన్ అంటే, ఒకే చోట ఆహారం వండి అనేక పాఠశాలలకు తరలించడం. ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థలో ప్రతి బడిలోనూ ఒక వంటశాల, కొంతమంది వర్కర్స్ ఎప్పటికప్పుడు ఆహారం వండి పిల్లలకి అందిస్తారు. అక్షయపాత్ర వంటి సంస్థలు ఒకే చోట ఒక పెద్ద వంటశాలను నిర్మించి అక్కడే వండి ట్రక్కుల ద్వారా వివిధ పాఠశాలలకు తరలిస్తారు.

నిజానికి పట్టణాల్లో పెద్దగా సొంత స్థలం లేని పాఠశాలలకు ఇటువంటి విధానం సౌకర్యం గానే ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచన పట్టణాల గురించి కాదు అత్యధికంగా పాఠశాలలు ఉండే పల్లెల గురించి. ఇటువంటి సెంట్రలైజ్డ్ కిచెన్ లలో చేసే వంట అన్ని ప్రాంతాల వారికి అనుగుణంగా ఉండకపోవచ్చు. మన ఊర్లో మన టేస్ట్ కి తగ్గట్టుగా మన దగ్గర దొరికే కూరగాయలతో చేసే ఆహారానికీ , ఒక వంద కిలోమీటర్ల దూరం నుండి ఒకటే స్టాండర్డ్ రుచితో వచ్చే భోజనానికి – ఇంటికీ, హోటల్ కి ఉన్న తేడానే ఉంటుంది. అలాంటి భోజనాన్ని ఎప్పుడో ఒకసారి తినగలుగుతాం గానీ రోజు తినలేము.

పైగా ఈ తరహా పద్ధతిలో భోజన తయారీ ఖర్చులకు , రవాణా ఖర్చులు అదనంగా తోడవుతాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే సంగారెడ్డిలో అత్యధికంగా 70 కిలోమీటర్ల పైన ఆహారం సరఫరా అవుతుంది అందుకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.

పథకం అమలుకు అక్షయపాత్ర సంస్థకు ముందుగానే అడ్వాన్సులు చెల్లించే రాష్ట్ర ప్రభుత్వం, స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం వండి పెట్టే కార్మికులకు మాత్రం 6 నెలలు గడిచినా డబ్బులు శాంక్షన్ చేయదు. దీనివల్ల, అక్కడ పని చేసే టీం సభ్యులు, ప్రధానోపాధ్యాయులు- అందరికందరూ నిత్యం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పథకాన్ని సరిగా అమలు చేయలేకపోతున్నారు.

ఇవన్నీ కలిపి చూస్తే, సొంతగా పాఠశాలలోనే వంట చేసే కంటే బయట సంస్థలకు పిల్లల మధ్యాహ్న భోజన పథకం బాధ్యతలు అప్పగిస్తే పిల్లల పోషణ, తద్వారా వారి చదువు దెబ్బతినడమే కాకుండా, ఈ సంస్థలకు ఎటువంటి జవాబుదారీతనం లేకపోవడం వల్ల ప్రజా ధనం నష్టపోయే అవకాశం కూడా ఉంది

బడిలోనే వంట చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందడమే కాకుండా పల్లెటూర్లలో ఉండే కొందరు మహిళలకూ ముఖ్యంగా బలహీన వర్గాల కుటుంబాలకూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

తల్లిదండ్రులకి, పిల్లలకి, స్కూలు యాజమాన్యానికి భోజనం నాణ్యత పై కొంత నియంత్రణ కూడా ఉంటుంది. వంట బాగా లేకపోతే వీళ్ళలో ఎవరైనా వంట కార్మికులను నిలదీసి అడగవచ్చు.

ప్రభుత్వానికి అధికారులకు నిజంగా ఉత్సాహం ఉంటే స్కూల్ ఆవరణలోనే కిచెన్ గార్డెన్స్ ను ప్రోత్సహించవచ్చు. తద్వారా పిల్లలకు మంచి అవగాహన కల్పించవచ్చు. సర్కారు బడికి కొంత ఆదాయం కూడా పెంపొందించవచ్చు అన్నింటికంటే ముఖ్యంగా మన ముందు తరాలు కులం అడ్డు గోడలలో బందీలు కాకుండా ఉండేందుకు గట్టి పునాది చిన్న వయసు లోనే పడుతుంది.

ప్రతి స్కూలు, అంగన్వాడి కేంద్రంలో వంట సదుపాయాలు మంచినీరు మరియు పారిశుధ్యం వంటి వసతులు తప్పకుండా కల్పించాలని జాతీయ ఆహార భద్రత చట్టం 2013 స్పష్టంగా చెప్పింది. కేవలం పట్టణాలలో ఎక్కడైతే వంట సదుపాయాలు కష్టమో అక్కడ మాత్రమే దీనికి మినహాయింపు ఇచ్చింది. పల్లెటూర్లలో స్కూల్స్ కు సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా బడి భోజనం అందించడం నిజానికి ఈ చట్టాన్ని ఉల్లంఘించడమే.

మధ్యాహ్న భోజన పథకంలో ప్రస్తుతం ఉన్న సమస్యల్ని సవరించడం పరిష్కరించడం ప్రభుత్వానికి ఉన్న మొదటి కర్తవ్యం. ప్రస్తుతం ఈ పథకానికి ఉన్న అతిపెద్ద సమస్య పిల్లలకి వంట చేసే కార్మికులకి సరైన జీతం ఇవ్వకపోవడం.

ఇంకో గమ్మతైన విషయం ఏమిటంటే, వంటకి కావలసిన సామాను అందుకు అయ్యే ఖర్చు అంతా కూడా ముందు ప్రభుత్వం భరించదు. ఒక్క బియ్యం మాత్రమే FCI నుంచి వస్తుంది. పప్పు నూనె కూరగాయలు గుడ్లు వంటివి స్కూలే కొనుక్కోవాలి. ప్రభుత్వం వీటికి ఇచ్చే ధరలు కూడా తక్కువగానే ఉంటాయి బియ్యం ఉచితంగా సరఫరా చేయడంతో పాటు, మధ్యాహ్న భోజనానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ఖర్చు ఇలా ఉంది. 1 నుండీ 5 వ తరగతి పిల్లలకు రోజుకు 5 రూపాయల 70 పైసలు కేటాయిస్తున్నారు. 6 నుండీ 8 వ తరగతి వరకూ పిల్లలకు రోజుకు 8 రూపాయల 40 పైసలు, తొమ్మిది, పది తరగతుల పిల్లలకు రోజుకు 10 రూపాయల 40 పైసలు కేటాయిస్తున్నారు. పిల్లలకు వారానికి మూడు గుడ్లు భోజనంతో పాటు ఇవ్వాలి. నిత్యావసర సరుకులు పెరిగిన దశలో , విద్యారధిపై మధ్యాహ్న భోజనానికి పెట్టె బడ్జెట్ కూడా తప్పకుండా పెంచాలి.

ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల, చాలా స్కూళ్లలో వంట కార్మికులే ముందు మధ్యాహ్న భోజనం ఖర్చు భరిస్తున్నారు. తరువాత ఎప్పుడో గాని గవర్నమెంట్ వీరికి ఈ బిల్లులు పాస్ చేయదు. ప్రధానోపాధ్యాయులు అనేక రకాల బిల్లులు ప్రతి రోజూ తయారు చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వారిపై అదనపు భారాన్ని మోపడమే.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 52,000 మంది వంట కార్మికులు వివిధ స్కూళ్లలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో వీళ్ళకి నెలకు రూ.10000 వేతనం ఇస్తామని వాగ్దానం చేసింది. వీళ్లు, వీళ్ళ కుటుంబాలు గంపెడాశతో ప్రస్తుత ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించుకున్నారు.

నిజానికి వీళ్ళు అడిగేది అంత పెద్ద గొంతెమ్మ కోరిక ఏమి కాదు, కనీస వేతనాల చట్టం ప్రకారం అత్యంత కనిష్ట వేతనం రోజుకి 450 రూపాయలు, అంటే నెలకి దాదాపు రూ.13,500 రూపాయలు చెల్లించాలి. ఆ డిమాండ్ న్యాయమైనది.

మన పిల్లలకు వంట చేసి పెట్టే పేద కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పెడ చెవిన పెట్టి నిరసన తెలియజేస్తే వాళ్ళ నోర్లు నొక్కి వాళ్లపై కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య పై అందరూ చర్చించుకుంటుంటే ఇది వరకే పని ఉన్న ఈ 52,000 మందిని నిరుద్యోగులను చేసి , అవినీతి ఆరోపణలు ఉన్న సంస్థకి కాంట్రాక్టులు కట్టబెట్టడం సమంజసమేనా? సరైన జీతం ఇవ్వక వాళ్ళ శ్రమని ప్రభుత్వం ప్రజల పేరు మీద దోచుకుంటుంది. ఇది అన్యాయం.

Tags:    

Similar News