తెలంగాణ పార్టీల మాట, మూడు ముక్కల ఆట

ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం తెలంగాణ రాజకీయాల విశ్లేషణ;

Update: 2025-05-18 08:30 GMT

రానున్న జూన్ రెండు నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయ క్రీడా మైదానం లో ముఖ్యంగా మూడు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి . మూడు రాజకీయ పార్టీలు ముచ్చటగా అచ్చటగా మూడు ముక్కలాట ఆడుతున్నాయి. ఈ ఆటలో వారి వారి కళా కౌశల్య నైపుణ్యాలు,దాగుడుమూతలు ప్రదర్శిస్తున్న వైఖరులను నాకు కలిగివున్న అవగాహన మేరకు ప్రజలకు తెలియజేయాల్సిన సందర్భం ప్రస్తుతం ఏర్పడినది.

పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు
2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల సభలలో నాటి కాంగ్రెస్ రాష్ట్ర రథసారధి ప్రజలకు అనేక హామీలను ఇచ్చాఢు.. నేటి ముఖ్యమంత్రి నాటి అధికార పార్టీ బిఆర్ఎస్ నాయకుల పైన అనేక అవినీతి అక్రమాల పైన ఆరోపణలు తన విస్ఫులింగాల వంటి ఉసన్యాస విన్యాసాలతో రాష్ట్రం ఏర్పడిన రాష్ట్ర అవతరణ జరిగిన పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి దోహదం చేశాడు . దీనికి తోడు జనంలో నివురు కప్పిన నిప్పులా ఉన్న అసంపూర్తి ఒక్కసారి భగ్గుమని లేచి ఓట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని సరియైన సమయంలో చూపెట్టారు. ఇల్లు అలుకగానే పండుగ కాదన్నట్టు అధికారంలోకి వచ్చిన నాయకులు తీరా లెక్కలు చూసేసరికి చీకేసిన బొక్కలు కనబడ్డాయి. కరి మింగిన వెలగపండులా బొక్కసం వెక్కిరించింది. అయినా అధికార పార్టీ ఒక్కొక్కటిగా ముఖ్యమైన హామీలను శాయశక్తులా నెరవేర్చే ప్రయత్నం చేస్తూవున్నది. ఆర్థిక ఉపద్రవానికి కారణ భూతమైన పార్టీ నాయకులు అది చేయలేదు ఇది చేయలేదని విమర్శలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా నాయకునికి పాలన చేతకావడం లేదని నోరు ఉన్నోడిదే ఊరు అన్నట్టు విపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. రాళ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు కదా అనుకొని తన మార్గంలో ప్రభుత్వం ముందుకు కొనసాగుతున్నది .
టీ కప్పులో తుఫాన్లు
2001, ఫిబ్రవరి 27న తెలంగాణ సాధన ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమై 2014, జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన ఎన్నికలలో అధికారం చేపట్టాక కెసిఆర్ ఇక టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని స్వయంగా ప్రకటించాడు. అప్పటికే పక్కా తెలంగాణ వాదులను ఏదో నెపంతో బయటకు పంపించారు. తనకు తన కుటుంబ నాయకులకు ఉద్యమకారుల నుంచి ఈషన్మా త్రం కూడా ముప్పు విమర్శలు ఒత్తిళ్లు ప్రశ్నలు రాకుండా ముందే జాగ్రత్త పడ్డారు. తెలంగాణ కోసం నిబద్ధతతో పని చేసే ఉద్యమ నాయకులు కెసిఆర్ వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేక పోవడం వలన తెలంగాణకు మరోసారి తీరని ధోకా జరిగింది. తెలంగాణ ప్రజల బతుకులు మరోసారి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టైపోయింది. నీళ్లు నిధులు నియామకం ప్రధాన పతాక నినాదం కాకతీయ భగీరథ కాళేశ్వరం మిషన్ల పేరిట అప్పులు తెచ్చి తెలంగాణ అభివృద్ధి చెవిలో పువ్వులు పెట్టారు. పదేళ్లలో ఈ నాయకులకు పట్టపగ్గాలు లేకుండా ప్రజలతో ప్రవర్తించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా కుటుంబ నాయకులలో ఒకరైన కేటీఆర్ తెల్లారి లేస్తే ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఉండడం వలన గత పది సంవత్సరాలలో తాము చేసిన నిర్వాకాన్ని అడుగడుగునా గుర్తు చేస్తున్నట్టు అవుతుంది .
బిఆర్ ఎస్ లో నాలుగు స్తంభాలాట
ఇకపోతే పై కుండ పైన ఉండగానే కింది కుండ కింద ఉండగానే మధ్య కుండను మాయం చేసే హరీష్ రావు తన కోటరీని కాపాడుకుంటూ, ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద తీస్మాన్ కాన్ లా మీడియాను మేనేజ్ చేస్తూ ఆవాకులు చెవాకులు పేలుతు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటాడు. ఇకపోతే తెలంగాణను బతుకమ్మ పేరుతో జాగృతం చేస్తూ ఏటేటా ఆడబిడ్డ కట్నాలు పొందిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాత కూడా ఆమె నేను కూడా మైదానంలో ఉన్నానని విమర్శిస్తుంటుంది. పైకి పార్టీలో ఈ ముగ్గురి మధ్య భేదాభిప్రాయాలు పొడ చూపినట్టు ప్రవర్తిస్తుంటారు. ఇకపోతే పార్టీ అధినాయకుడు కేసిఆర్ ఫామ్ హౌస్ లో నుంచి అప్పుడప్పుడు రాజకీయ అతిథిలా వచ్చిపోతుంటాడు. మొత్తానికి వీరు నాలుగు స్తంభాలాట ఆడుతుంటారు. ప్రజలు ఓడించినప్పటికీ కనీసం జ్ఞానోదయం కానీ ,పశ్చాత్తాపం ప్రకటించని ఆ పార్టీ తమది ఉద్యమ పార్టీ అని ఉద్యమ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పుకుంటుంటారు. పైగా వీరు ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియాలలో తన గురించి వార్తలు అహరహం ఉండేలా ప్రచారం జరిగేలా చూసుకోవడానికి ఉవ్విళ్ళూరుతుంటారు. కుటుంబ సభ్యుల నడుమ తీవ్ర విభేదాలు ఉన్నట్టు టి కప్పులో తుఫాన్లు సృష్టించి తీరం దాటకుండానే ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో ఉపశమనం పొందుతాయి.

కూట్లె రాయి తీయలేనోళ్లు ఏట్లె రాయి తీస్తరా:--ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ పార్లమెంటు ఎన్నికలలో మునుపు ఎన్నడూ లేని విధంగా చెప్పుకోదగ్గ స్థాయిలో పలితాలు బిజెపి సాధించింది. పార్టీ మంచి ఊల్ మీద ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఎన్నికల అప్పుడు బీసీ అభ్యర్థి మా ముఖ్యమంత్రి అని ప్రకటించిన భాజపా ఇప్పటివరకు రాష్ట్ర నాయకుని ఎన్నిక విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నది. పుట్టు బిజెపి పెట్టు భాజపా నాయకుల మధ్య రసవత్తరమైన రాజకీయ క్రీడా పోటీ జరుగుతున్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రతి రాజకీయ పార్టీలోంచి నాయకులు భిన్న కారణాల రీత్యా అటు ఇటూ మారుతుంటారు కానీ దేశంలో జాతీయ పార్టీలు గానీ ప్రాంతీయ పార్టీలు కొత్త తరం రక్తాన్ని ఎక్కించి పూర్తిస్థాయిలో యువతరాన్ని తయారు చేసుకోలేక పోవడం భారత ప్రజాస్వామ్యంలో విషాదకరం.
పైగా ఈ నాయకులు అధికార పార్టీ అధినాయకత్వం మారుతుందని పదేపదే జ్యోతిష్యం చెప్పే పండితుల అవతారం ఎత్తుతుంటారు. పైగా అధికార పార్టీ మంత్రివర్గ విస్తరణ చేయలేని అసక్తతలో ఉందని ఆరోపణలు చేస్తుంటారు . తమ పార్టీ ఏమో తెలంగాణలో నూతన తెలంగాణ ఉద్యమ ఆనుపానుల పట్ల అవగాహన కలిగిన అధ్యక్షున్ని ఎన్నుకోవడంలో మల్లగుల్లాలు,గుంజాటన పడుతుంది.

అధికారం చేపట్టిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణ మాఫీ, స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం,సామాజిక కులగణన మరియు ఎస్సీ వర్గీకరణలతో మూడు ముక్కల "పరేలా" ఆటలో షో చెప్పగానే, టిఆర్ఎస్ భాజపా ప్రతిపక్ష పార్టీలు తమలో తాము ఎటూ పాలు పోలేక తేల్చుకోలేక కండ్లు బైర్లు కమ్ముతున్నాయి .


Tags:    

Similar News