బీజేపీ కట్టడికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యూహం..
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంతో కర్ణాటకలో బీజేపీ దూకుడును కట్టడి చేసేందుకు సీఎం సిద్ధరామయ్య సిద్ధమవుతున్నారు. ఇంతకు ఆయన ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం..
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జనవరి 22న ప్రధాని మోదీ చేతులమీదుగా జరిగిన విషయం తెలిసిందే.
బీజేపీ అగ్రనేతల సూచన మేరకు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమం గురించి కర్ణాటకలో విస్త్రతంగా ప్రచారం చేశాయి. ఇంటింటికి ఆహ్వాన పత్రికలు పంచుతూ, అక్షింతలు పంపిణీ చేశారు.
అయోధ్య ప్రభావంతో కాంగ్రెస్‌లో కలవరం..
లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీజేపీ తలపెట్టిన ఈ కార్యక్రమం సీఎం సిద్ధరామయ్యను కలవరపెడుతుంది. బీజేపీ కట్టడికి ఆయన వ్యూహం రచించారు. ఆలయాల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 100 రామాలయాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే.. ఏకంగా రామాలయాన్ని సందర్శించే కర్ణాటక భక్తుల కోసం అతిథి గృహాన్ని కూడా నిర్మిస్తానంటున్నారు.
రామభక్తుడిగా మారిన సిద్ధరామయ్య..
నాస్తికుడిగా పేరు మూటగట్టుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పుడు బహిరంగంగా రామభక్తిని చాటుకుంటున్నారు. బెంగళూరుకు 170 కి.మీ దూరంలోని మైసూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం వరుణలోని సిద్ధరామహుండిలో ఆయన ఇప్పటికే రామాలయాన్ని ప్రారంభించారు.
బెంగళూరు దేవాలయం..
ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన రోజే, ఐటీ రాజధాని బెంగళూరులో ఓ రామమందిరాన్ని సిద్ధరామయ్య ప్రారంభించారు. ‘‘జై శ్రీరాం’’ అని నినాదాలు చేస్తూ, తనను అనుకరించాలని చెప్పి పార్టీ శ్రేణులను, ప్రజలను షాక్‌కు గురిచేశారు.
ఓట్లను కొల్లగొట్టేందుకే..
‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు రామమందిరాన్ని బీజేపీ వాడుకుంటోంది’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకుడు ఫెడరల్‌తో అన్నారు.
బడ్జెట్ కేటాయింపు..
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేవలం ఆలయాల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించనుంది. మతపరమైన సంస్థలకు సంబంధించి వివిధ కార్యక్రమాల కోసం బడ్జెట్‌లో మొత్తం రూ. 690.28 కోట్లు కేటాయించినట్లు దేవాదాయ శాఖ అధికారి తెలిపారు.
‘‘2024-25లో, అయోధ్యలో పురాతన రామాలయాలను పునరుద్ధరించడం నివాస భవనాన్ని నిర్మించే ప్రణాళికలను సిద్ధరామయ్య ప్రకటించవచ్చు’’ అని ఒక అధికారి తెలిపారు.
నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్..
తమ శాఖకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి ప్రతిపాదించినట్లు దేవాదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి ఫెడరల్‌కు తెలిపారు.ఈ నిధులతో మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలను కూడా పునరుద్ధరించే ఆలోచన ఉందన్నారు.
‘‘అయోధ్య రామ మందిరం దాని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఏం ఇదంతా చేయడం లేదు. రాష్ట్రంలోని రామాలయాలతో సహా ఇతర దేవతల ఆలయాలను పునర్ధురించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు’’ అని చెప్పారు.
‘‘దేవుడు, మతాన్ని రాజకీయాలకు వాడుకోరాదు. విశ్వాసం, భక్తి అనేవి కేవలం ఆధ్యాత్మికకు సంబంధించినవి’’ అని పేర్కొన్నారు.
మరిన్ని ప్రతిపాదనలు..
కొప్పల్ జిల్లాలో హులిగెమ్మ కోసం టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, బెంగుళూరు రూరల్ జిల్లాలో ఘాటి సుబ్రమణ్యస్వామి కోసం మరొక అథారిటీ ముజ్రాయ్ శాఖ పరిధిలో ఏర్పాటుకానున్నాయి. టిబెట్‌లోని మానససరోవరాన్ని సందర్శించే భక్తుల కోసం రూ.3 కోట్లు, ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్రకు రూ.7 కోట్లు, భారత్ గౌరవ్ యోజన కింద పుణ్యక్షేత్రాలకు రైళ్లలో వెళ్లే భక్తులకు రూ.13.31 కోట్లు, యాత్రికుల కోసం రూ.15 కోట్లుతో ప్రతిపాదనలు కూడా రూపొందించారు. కర్ణాటకలోని వివిధ మఠాలకు రూ.210 కోట్లు, నోటిఫైడ్ సంస్థలను నిర్వహించడానికి రూ.20 కోట్లు, తిరుపతిలోని కర్ణాటక రాష్ట్ర అతిథి గృహాలకు రూ.2 కోట్లు కేటాయించనున్నారు.