కృష్ణా బోర్డు కార్యాలయం కర్నూలుకు రావాలి
తేవాల్సిన బాధ్యత రాయలసీమ ప్రజా ప్రతినిధులదే;
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు మల్యాల వద్ద కృష్ణమ్మకు జల హారతి ఇచ్చి హంద్రీనీవాకు నీరు విడుదల చేసే సందర్భంగా చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు. వీటిలో ప్రధానమైనవి రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం.. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం... లోకేష్ బాబు గారు ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ అమలు చేస్తాం... రాయలసీమలో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడానికి అధికారుల, ప్రజాప్రతినిధుల నుండి సూచనలను ఆహ్వానించడం.
అదేవిధంగా హంద్రీనీవాకు నీటిని విడుదల చేసే ఒక రోజు ముందు కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రితో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడతాం అని ప్రకటించారు. ముఖ్యమంత్రి గారి ఈ ప్రకటనలను మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారిని అభినందిస్తున్నాం. అయితే రాయలసీమ సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టడానికి లోతైన విశ్లేషణతో, సరైన కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం వుంది.
రాయలసీమలో 90 లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. ఇందులో కృష్ణా నది, దాని ఉపనదులైన తుంగభద్ర, వేదవతి తదితర నదుల మీద ఆధారపడి సుమారుగా 21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి చట్టపరమైన అనుమతులతో ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులలో బచావత్ ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు పొందిన కేసీ కెనాల్, తుంగభద్ర ఎగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ, బైరవానితిప్ప, గాజులదిన్నె ప్రాజెక్టులు మరియు రాష్ట్ర విభజన చట్టం ద్వారా హక్కులు పొందిన తెలుగుగంగ, గాలేరు - నగరి, వెలిగొండ, గురురాఘవేంద్ర ఎత్తిపోతల, సిద్దాపురం ఎత్తిపోతల తదితర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
కానీ ఈ ప్రాజెక్టుల ద్వారా కేవలం 8 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు మాత్రమే నీరు లభిస్తున్నది. అంటే రాయలసీమలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో కేవలం 8.8% భూభాగానికి మాత్రమే సాగునీరు లభిస్తోంది. అత్యంత తక్కువ వర్షపాతం కలిగిన రాయలసీమలో కనీసం 30 శాతం వ్యవసాయ యోగ్యమైన భూమికి నీరు లభిస్తే ఈ ప్రాంతం కొంత ఊపిరి తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ఆశయం ప్రకారం ప్రతి ఎకరాకు నీరు అందించే దిశగా ముందుగా నిర్మించిన ఈ ప్రాజెక్టుల ద్వారా పూర్తిగా నీటి హక్కులను వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా పూర్తి నీటి హక్కును వినియోగించుకుంటే సుమారు రాయలసీమలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో 23 శాతం భూభాగానికి సాగునీరు వినియోగించుకునే అవకాశం లభిస్తుంది.
A. కృష్ణానదిలో నీరు లభిస్తున్నప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు నీరు లభించకపోవడానికి ప్రధానమైన కారణాలు..
- శ్రీశైలం ప్రాజెక్టు విధివిధానాలు అమలు పరచకపోవడం : శ్రీశైలం ప్రాజెక్టు విధివిధానాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల రాయలసీమ వినియోగించుకోవలసిన నీరంతా సముద్రం పాలవుతున్నది.
- నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుకు అవసరమైన నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేసే లాగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.
- నాగార్జునసాగర్ ఆయకట్టుకు కేటాయించిన 264 టీఎంసీలు కృష్ణా డెల్టా కేటాయించిన 80 టీఎంసీల కృష్ణా జలాలు మొత్తం కలిపి 344 టీఎంసీల నీటిని వినియోగించి మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలి.
- బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం భవిష్యత్తులో గోదావరి జలాలను కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టులకు మళ్ళిస్తే కేవలం 180 టిఎంసిల కృష్ణా జలాలు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాలి.
- పట్టిసీమ నిర్మాణం జరిగిన తర్వాత 80 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు చేరుతున్నాయి. దీనితో శ్రీశైలం ప్రాజెక్టు నుండి కృష్ణా డెల్టాకు కేటాయించిన 80 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాల్సిన అవసరమే లేదు. అందువల్ల కేవలం నాగార్జునసాగర్ ఆయకట్టుకు కేటాయించిన 264 టీఎంసీల నీటిని వినియోగించి మాత్రమే విద్యుత్ ఉత్పత్తి సాగించాలి.
- పట్టిసీమ ద్వారా ఆదా అయిన కృష్ణా జలాలలో 35 టీఎంసీలు గతంలో జరిగిన ఒప్పందాల ప్రకారం కర్ణాటక, మహారాష్ట్రలు వినియోగించుకుంటాయి. మిగిలిన 45 టీఎంసీల కృష్ణా జలాలను శ్రీశైలం రిజర్వాయర్లో నిలువ ఉంచుకొని రాయలసీమ ప్రాజెక్టుల అవసరాలకు వాడుకునే హక్కును రాష్ట్ర విభజన చట్టం కల్పించింది.
- ఇండియన్ ఇరిగేషన్ కమిషన్, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ లో ప్రథమ ప్రాధాన్యత త్రాగునీటికి, ద్వితీయ ప్రాధాన్యత సాగునీటికి, చివరి ప్రాధాన్యతను మాత్రమే విద్యుత్ ఉత్పత్తికి ఇవ్వడం జరిగింది.
- పై హక్కులకు తిలోదకాలిస్తూ విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు విధివిధానాలను అమలు చేయకుండా శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేయడం ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలోని వెనకబడిన ప్రాంతాలకు నీరు అందక, ఆ నీరంతా సముద్రం పాలవుతున్నది.
- శ్రీశైలం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం కనీస నీటిమట్టాన్ని 854 అడుగులు నిర్వహించాల్సి ఉంది. కానీ అంతకంటే దిగువకు నీటిని తరలిస్తూ రాయలసీమ సాగునీటి హక్కులకు విఘాతం కలిగిస్తున్నారు.
- కమాండ్ ఏరియా అభివృద్ధి జరగకపోవడం : సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఎత్తిపోతల పంప్ హౌస్ లు, రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు చేపట్టినప్పటికీ, వీటి ద్వారా నీటిని పంట పొలాలకు అందించే వ్యవస్థను పాలకులు నిర్లక్ష్యం చేశారు. దీనితో అనేక రిజర్వాయర్లలో నీళ్లు నిలువ చేసుకోగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ పంటపొలాలకు నీళ్లు ఇవ్వలేని దుస్థితి ఉంది. సాగునీటి ప్రాజెక్టుల కీలకమైన నిర్మాణాలు జరిగినప్పటికీ కమాండ్ ఏరియా అభివృద్ధి జరగకపోవడంతో రాయలసీమ సాగునీటి వ్యవస్థకు దుస్థితికి లోనైంది.
- సాగునీటి ప్రాజెక్టుల మౌలిక నిర్మాణాల, నిర్వహణల లోపాలు సరిదిద్దకపోవడం : తుంగభద్ర డ్యాంలో పూడిక చేరడం వల్ల ప్రాజెక్టు నిర్వహణ సామర్థ్యం తగ్గడం వలన రాయలసీమ ప్రాజెక్టుల నీటి హక్కులను పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, అమృతసాగర్ రిజర్వాయర్ తో పాటు వేదవతి ఎత్తిపోతల పథకం, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాలను చేపట్టవలసింది. అదేవిధంగా నిర్వహణ లోపాలతో తెగిపోయిన అన్నమయ్య, అలగనూరు రిజర్వాయర్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. నిర్మాణం పూర్తి కాక పోయినప్పటికీ, ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో గోరుకల్లు రిజర్వాయర్లో నీరు నింపడం వల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దుతూ, నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వెలుగోడు రిజర్వాయర్ కు బైపాస్ కెనాల్ ఏర్పాటు, వెలుగోడు రిజర్వాయర్ నుండి మద్రాసు కాలువ ద్వారా బ్రహ్మ సాగరకు నీటిని తీసుకుపోయే వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనుమతించిన ఆర్డీఎస్ కుడికాల నిర్మాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. తుంగభద్రా నది ద్వారా కేసీ కెనాల్, తుంగభద్ర దిగువ కాలువ, తెలంగాణలోని ఆర్డీఎస్ ప్రాజెక్టులకు హక్కుగా కేటాయించిన జలాలను నిలువ చేసుకోవడానికి గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టవలసి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూడిక చేరకుండా నిలువరించి ప్రాజెక్టు జీవిత కాలాన్ని పెంచడానికి, ప్రాజెక్టుకు రక్షణగా ఉండటానికి, రాయలసీమ ప్రాజెక్టులకు నీరు సక్రమంగా అందించడానికి సిద్దేశ్వరం అలుగు (Siddeswaram Weir; It is not Barrage) నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉంది. కనీస నిర్వహణ లేక అస్తవ్యస్తంగా ఉన్న రాయలసీమలోని అనేక ప్రాజెక్టుల ప్రధాన కాలువల పునరుద్ధరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
- రాయలసీమ నీటి హక్కులను పరిరక్షించడం: రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన బచావత్ ట్రిబ్యునల్ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు లభించిన సాగునీటి హక్కులను, రాష్ట్ర విభజన చట్టం ద్వారా తెలుగుగంగ, గాలేరునగరి, వెలుగొండ, గురురాఘవేంద్ర, సిద్దాపురం ఎత్తిపోతల ప్రాజెక్టులకు లభించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలది. దీనికి విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోకుండా రాయలసీమ హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు మరీ ముఖ్యంగా రాయలసీమ నీటి హక్కులకు విఘాతం కలిగేలాగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 6 2023 న రాజ్యాంగ విరుద్ధమైన బ్రిజేష్ కుమార్ కి ఇచ్చిన కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సును తక్షణమే రద్దు చేయించాల్సిన అవసరం ఉంది.
- .రాష్ట్ర విభజన చట్టంలోని ప్రత్యేక ప్యాకేజీ నిధులను సాధించకపోవడం : రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమాన అభివృద్ధి చెందడానికి బుందేల్ఖండ్, బోలంగిర్, కోరాపుట్ తరహా ప్యాకేజీలు ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా సుమారు 30 వేల కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉంది. ఈ నిధులను రాబట్టి రాయలసీమలో చెరువుల వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ వీటిని వాగులు, వంకలు, నదులు, కాలువలతో అనుసంధానం, సామాజిక అడవుల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణ, పెన్నా దాని ఉపనదుల పునరుజ్జీవనం చేపట్టాల్సి ఉంది.
B. రాయలసీమ ప్రజా ప్రతినిధులు సాధించాల్సిన కీలకమైన అంశాలు.
- కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు : శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణా జలాల నిర్వహణకు అత్యంత కీలకం. రాజ్యాంగము, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు విధివిధానాలను తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ఈ విధానాలను అమలుపరచకపోవడం వలన విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు తరలించి వెనుకబడిన రాయలసీమ, మహబూబ్ నగర్ జిల్లాలకు తీవ్రమైన సాగునీటి ఇబ్బందులు కలిగాయి. ఇలాంటి ఇబ్బందులు రూపుమాపడానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధంగా పొందిన సాగునీటి హక్కులను పరిరక్షించడానికి కృష్ణానది యాజమాన్య బోర్డును రాష్ట్ర విభజన చట్టం ఏర్పాటు చేసింది. అటువంటి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కృష్ణా జలాల నిర్వహణకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలో ఏర్పాటు చెయ్యాలి. ఈ కార్యాలయం కర్నూలు లో ఏర్పాటుకు విజయవాడ కేంద్రంగా అఖిలపక్ష సమావేశంలో కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేసేలాగా రాయలసీమ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, వారు ఆశించిన రాయలసీమ సాగునీటి వ్యవస్థ అభివృద్ధి దిశగా తొలి అడుగు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
- రాయలసీమ ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ : రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇందులో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, ప్రాజెక్టుల నిర్వహణకు, ఆయకట్టు స్థిరీకరణకు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కు, చెరువుల అభివృద్ధికి మరియు పర్యావరణ పరిరక్షణతో పెన్నా నది పునరుజ్జీవన చేపట్టడానికి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలి.
గతంలో ప్రజా ప్రతినిధులు పై అంశాలను ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకుపోవడంలో, ఒప్పించడంలో, సాధించడంలో విఫలమయ్యారు. రాయలసీమ సమాజం ఎప్పుడూ లేనంత అత్యధిక మెజార్టీని ఇచ్చిందని, ఈ ప్రాంతానికి రుణపడి ఉన్నానని, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరి చేస్తానని, ఈ ప్రాంతాన్ని రతనాలసీమగా మారుస్తానంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి దగ్గరికి పై విషయాలను తీసుకొని పోయి రాయలసీమ ప్రజల జీవనాన్ని అభివృద్ధి దిశగా నడపాల్సిన బాధ్యత రాయలసీమ ప్రజాప్రతినిధులదే ! ఈ దిశగా చేపట్టే కార్యాచరణలో రాయలసీమ ప్రజాప్రతినిధులు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం.