స్టాన్ ఫోర్డ్, కోడంగల్ కి ఎంత తేడా?
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో నెలకొన్న స్మశాన ప్రశాంతి గురించి యోచించరా?;
తల్లికి తిండి పెట్టలేదు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు కొని పెడుతానన్నడంట వెనకటికి ఒకడు,. ఇక్కడ ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు దిక్కు లేదు ఉత్తరాంధ్రకు జార్జియా యూనివర్సిటీ తెస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలను ఎలా బతికించాలోఇంతవరకు కార్యాచరణ ప్రకటించలేదు. అక్కడ టీచింగ్, రీసెర్చ్ ఎలా ఉందో మాట్లాడం లేదు. కానీ, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో ఆంధ్రా చదివిన విద్యాశాఖ మంత్రి ప్రవచనాలు బోధించే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని విద్యార్థులకు నైతికత మానవ సంబంధాలు మెరుగుపడడానికి సలహాదారులుగా నియమించారు.
ఈవిషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా ముందుంది. పల్లెటూరు కొడంగల్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసించిన తెలంగాణ ముఖ్యమంత్రి విద్యారంగాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు మొదలుపెట్టారు. విద్య కమిషన్ ఏర్పాటు చేసి విద్యారంగంలో నిష్ణాతులైన వారిని నియమించి స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేసి, చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయానికి 550 కోట్లు కేటాయించి ముందుకు దూసుకుపోయారు.
బెట్టింగ్ భూతాన్ని పీచమణచడానికి ఇప్పటికే అగ్రతారలపై కేసులు బనాయించారు, పేట్రేగిపోతున్న హింస, అనైతికత అశ్లీలతకు డ్రగ్ మాదకద్రవ్యాల సంస్కృతికి కఠిన చర్యలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం రే మామ ఏక్ పెగ్ లా అంటూ దబిడి దిబిడే పాటల్లో నటించిన వారికి బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వారికి పద్మ అవార్డులు ఇచ్చి సత్కరిస్తున్నారు. ఊడిపోయే జుట్టు ఎంత ఒత్తిన ఏముందిలే అంటాడు సినారె, అయ్యవార్లు లేక, రీసర్చ్ గ్రాంటులు, బ్లాక్ గ్రాంట్స్ లేక శ్మశాన ప్రశాంతత నెలకొన్న విశ్వవిద్యాలయాలలో ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లని యూజీసీ ప్రకటించింది.
గత పది సంవత్సరాలుగా దేశంలోని విశ్వవిద్యాలయాలలో చలనం లేకుండా పోయింది. విశ్వవిద్యాలయాల పరిస్థితి సమీక్షించుకుంటే అశాంతి, అలజడులు, సుదీర్ఘ పోరాటాలకు ప్రధాన కారణం బోధన సిబ్బంది నియామకాలే అని గ్రహించగలం. బోధన, పరిశోధన, క్రమశిక్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే అధ్యాపకులను నియమించాల్సిందే. విశ్వవిద్యాలయాలకు అద్భుతాలు సృష్టించే శక్తి ఉంది, విద్యారంగంలో అత్యంత కీలకం తరగతి బోధనేనని ఉపకులపతులు గ్రహించాలి. విద్యార్థులపై తరగతి బోధన విధానం తీవ్ర ప్రభావం చూపుతుంది, అధ్యాపకులు సైతం విద్యార్థులను ప్రభావితం చేసే విధంగా బోధన విధానాలు, సామర్థ్యాలు ఉన్నతీకరించుకోవాలి.
విశ్వవిద్యాలయం పరీక్షల్లో అనేక మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉంది, అలాగే వివిధ వర్శిటీల్లో అమలులో ఉన్న పరీక్షల విధానం సమగ్ర అధ్యయనం చేసి విద్యార్థులకు లాభం చేకూర్చే పద్దతిని అవలంబించుకోవాలి. విద్యా విధానంలో నాణ్యత తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, ప్రధానంగా పాలన, ఆర్థిక వనరుల కేటాయింపు, పరిశోధన ప్రగతి, ఏపీఐ స్కోర్, పర్ఫామెన్స్ బేస్డ్ అకడమిక్ స్కోర్ వంటి కీలకాంశాలు విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నేడు స్మశాన ప్రశాంతత నెలకొని ఉంది.
ఉన్నత విద్యాధికారులు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తూ వీటిలో సీట్లు భర్తీ అయిన తర్వాత మొక్కుబడిగా అడ్మిషన్లు చేపడుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో సీట్ల భర్తీ జూన్ నెలలో ముగుస్తుంది, ఇక్కడ సెప్టెంబర్ అయినా అడ్మిషన్ ప్రక్రియ మొదలవదు. పరిస్థితి ఇలాగే ఉంటే 2030 నాటికి దేశంలో 80 శాతం ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పడతాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇంజనీరింగ్ కళాశాల కనీసం ముప్పై శాతం సీట్లు భర్తీ కాక మూసివేశారు. డిప్లొమా విద్య ఇంకా దారుణంగా కేవలం 35 శాతం అడ్మిషన్లు అయింది అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విశ్వవిద్యాలయాలకు మరింత స్వేచ్ఛను అందించినప్పుడే ఉన్నత విద్య, పరిశోధన రంగంలో నాణ్యత మెరుగుపడుతుంది అలాగే దేశీయ విశ్వవిద్యాలయాలలో విద్య పరిశోధన రంగంలో అంతర్జాతీయ విద్యా సంస్థల పోటీ పడాలంటే రీసెర్చ్ గ్రాంట్లు, మైనర్, మేజర్ ప్రాజెక్టులు రూపకల్పన చేయాలి.
ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో సెంటర్ ఆఫ్ పొటెన్షియల్ ఎక్సెలెన్స్ ఉన్న విభాగాలు ఒక్కటీ లేదు. దేశంలో ఉన్నత విద్య రంగానికి కేటాయిస్తున్న నిధులు ఇతర అన్ని రంగాల కంటే అత్యల్పంగా ఉంది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఉన్నత విద్యారంగానికి కేటాయించే నిధులు పెంచడంతోపాటు వివిధ మార్పులకు అవకాశం కల్పించాలి .
విశ్వవిద్యాలయాలు గుర్తింపులు ఇవ్వడాన్ని రద్దు చేసి, పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకు వచ్చినప్పుడు విద్యా రంగంలో నాణ్యతతో కూడిన ప్రమాణాలు మెరుగుపడతాయి. విద్యారంగానికి దశాబ్దం క్రితం వరకు ఎంతో ప్రాధాన్యం ఉండేది, విశ్వవిద్యాలయాలు సమాజ ఉన్నతికి దోహదపడే విధంగా ఉండాలి. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, సిలబస్ నిర్ణయించడంలో, అమలులోకి తీసుకు రావడం అధ్యాపకుడి పాత్ర ప్రధానంగా ఉండి, జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, విలువలు పెంచేదిగా విద్య ప్రణాళిక ఉండాలి.
ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అధ్యాపకులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించడానికి ప్రైవేటు కన్సల్టెన్సీలు ఉన్నాయి. లోపం ఎక్కడుంది గ్రహించకుండా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. విద్యార్థిని కేంద్రీకృతం చేసుకొనే పద్ధతి ఈనాడు అవసరము, ఓపన్‌బేస్ ఎడ్యుకేషన్ విధానాన్ని విస్తృతపరిస్తే విద్యార్థి విజ్ఞాన స్థాయి మెరుగుపడుతుంది. సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, అలాగే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కొత్తగా ప్రవేశ పెడుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లార్న్ఇంగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ అంశాలు అధ్యాపకులు బోధించడానికి అకడమిక్ స్టాఫ్ కాలేజీలు లేవు, అధ్యాపకులకు వీటిపై నైపుణ్యత పెంపొందించుకొని బోధిస్తే ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చు. పరిశోధన ప్రాజెక్టులు కొన్ని మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతున్నాయి, వాటికి కారణం నిధులు నిలిపివేయడం లేదా తగ్గించడం జరుగుతుంది. ప్రభుత్వం అశాస్త్రీయమైన విధానాలు, జీవం లేని విద్య ప్రమాణాలు తో నైపుణ్యం లేని సమాజాన్ని తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మెరుగైన జీతాలు లేక ప్రభుత్వ ఉపాధ్యాయులు, జీతాలే లేక ప్రైవేటు ఉపాధ్యాయులు కాలం వెలిబుచ్చుతున్నారు.
ఈ సంక్షోభం ఇక్కడితో ఆగదు, అజ్ఞాన సమాజం లో వికృత రూపాలు తో సామాజిక సంక్షోభం రాబోతున్నది. ఇప్పుడైనా ప్రభుత్వ సలహాదారులు, విద్యా రంగంలో నిష్ణాతులు, మేధావులు, ఉపాధ్యాయులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు మంచి జీతాలు ఇచ్చి పర్యవేక్షణ ఏర్పాటు చేసి విలువలు తో కూడిన విద్య ప్రమాణాలు ను తీసుకొని రావాలి. విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాలు లేవు అధ్యాపకులకు బోధనా సామర్థ్యాలు అంతకంటే లేవు. యాభై సంవత్సరాలు ముందు వెలసిన విశ్వవిద్యాలయాల్లో అకడమిక్ స్టాఫ్ కాలేజీ లు మూతపడి దశాబ్దం అవుతుంది. రిఫ్రెషర్ కోర్సులు, ఓరియెంటేషన్, స్టాఫ్ డెవలప్మెంట్ కోర్సు అన్నీ అనీత విద్య లాగా టీవీలు, కంప్యూటర్లలో బోధిస్తున్నారు. . విద్యాలయాలంటే బిల్డింగులు స్థలాలు కాదు, అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాలు ఎలా నడుపుతారో బోధ పట్టం లేదు.