ప్రశ్నార్ధకమవుతున్న మోదీ రాజకీయ భవిష్యత్తు!!

ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ఇటీవల నాగపూర్ లో చేసిన ప్రసంగంలో మోదీ మీద పేరు చెప్పకుండా ఎక్కుపెట్టిన విమర్శలుగా భావించవచ్చు.

Update: 2024-06-14 11:40 GMT


- దివికుమార్


ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ఇటీవల నాగపూర్ లో చేసిన ప్రసంగం  నేను నిన్న రాత్రి (12-6) పూర్తిగా విన్నాను. మూడు వంతులకు పైగా అర్థమైందనే అనుకున్నాను. మోదీ భక్త బృందానికి ఆ ప్రసంగాన్ని వినమని సలహా ఇవ్వాలని కూడా అనిపించింది. ఆయన తన ప్రసంగంలో ఫ్రెంచ్ విప్లవాన్ని, రష్యా విప్లవాన్ని కూడా ప్రస్తావించారు. పాలకులు దుష్టులైనప్పుడు ప్రజలు తిరుగుబాట్లు చేయటం సహజం అని చెప్పారు. ప్రజలలో ఉన్న అసంతృప్తిని ఆనాటి విప్లవకారులు వినియోగించుకున్నారు అని కూడా చెప్పారు.

ఆ తర్వాత సర్వము నేనే అని అహంకరించే వ్యక్తిగత పోకడలను తప్పుపట్టారు. పిదప, మణిపూర్ సంవత్సర కాలంగా  మండిపోతున్న పరిస్థితి పైనా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉంటాయి గాని విరోధిపక్షాలు ఉండవు అనే అంశం పైనా మాట్లాడారు. సమాజంలో భిన్నాభిప్రాయాలకు ఎల్లప్పుడూ స్థానం ఉంటుందని ఋగ్వేద సూక్తిని కూడా ఉల్లేఖించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుని ప్రస్తావించారు. సంత్ కబీరు దోహాని ఒక దానిని వినిపించారు. ఇవన్నీ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీ మీద పేరు చెప్పకుండా ఎక్కుపెట్టిన విమర్శలుగా భావించవచ్చు.

గడిచిన పది సంవత్సరాల పరిపాలనలో కొన్ని విజయాలు సాధించినట్లు కూడా చెబుతూ ఆర్థికంగా, సాంకేతికంగా, క్రీడలలో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడటం, విశ్వ గురువుగా పిలిపించుకోవడం మొదలైనవి ప్రస్తావించారు.

అయితే... చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అధినాయకుడుగా చలామణి అవుతున్న మోదీ పైన ఆ ప్రసంగంలో పరోక్షంగా బహిరంగ విమర్శలే ఎక్కువ ఉన్నాయి. సాంకేతిక అభివృద్ధి సహాయంతో అసత్యాలను విపరీతంగా ప్రచారం చేయడం తప్పు, అది మన సంస్కారం కాదు అని కూడా గట్టిగా చెప్పారు. అబద్దాల ఫ్యాక్టరీ వారి అడ్డగోలు ప్రచారాలను, కాపీ పేస్టులు చేసి ఫార్వర్డ్ చేసేవాళ్ళు అతిముఖ్యంగా దీనిని అర్థం చేసుకోవాలి. (ఇంతకూ అబద్దాల ఫ్యాక్టరీ ద్వారా వ్యాప్తిలో ఉన్న వాట్సాప్ యూనివర్సిటీకి ఆర్ఎస్ఎస్ వారి అనుమతి లేకుండానే అది సాగిపోతోందను కోవచ్చునా? లేక గాంధీ హంతకుడు నాధూరాం గాడ్సేకు తమకు సంబంధం లేదని చెప్పుకున్నట్లే భావించాలా?)

ఢిల్లీలో ఆందోళన చేసిన రైతాంగంపై మోదీ ప్రభుత్వం శత్రువుల్లాగా అణిచివేతను ప్రయోగించినప్పుడు ఆర్ఎస్ఎస్ నాయకులు బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. ఆ మాటకు వస్తే మణిపూర్ గురించి కూడా సంవత్సరం తర్వాత ఇప్పుడే వారు బయటపడి మాట్లాడటం.

అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి క్రీడలలో ప్రతిష్టాత్మకమైన పతకాలను సాధించిన మహిళా మల్లయోధులపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు కూడా వారు ఏమీ బహిరంగంగా  మాట్లాడలేదు.  అలా ఒకటేమిటి బిల్ కీస్ బానో కేసు విషయంలోనూ , అవినీతి స్కాములమయమైన ఎలక్ట్రోరల్ బాండ్లు... ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడే ఈ విధంగా మోహన్ భగవత్ ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? మోదీ తరహా వ్యక్తిగత పోకడల నిరంకుశ పరిపాలకుడిని ప్రజలు సహించరు, దాన్ని మోదీ భక్త బృందాలు లాగా ఆత్మవంచనతో కప్పిపుచ్చుకుంటే అది దాగేది కాదు.

ఆర్ఎస్ఎస్ లేదు సరే, భాజపా పేరు కూడా లేకుండానే అన్నీ మోదీ హామీల పేరుతో ఎన్నికలలో పాల్గొన్న తీరు బెడిసి కొడితే దాని రాజకీయ నష్టాన్ని ఎవరు భరించాలి? భారతీయ జనతా పార్టీనా? దాని నిర్దేశకురాలైన ఆర్.ఎస్.ఎస్సా? తాను ఆ నైతిక బాధ్యతను స్వీకరించటానికి నిరాకరించాలంటే, లేక దానితో తమకు సంబంధం లేదని చెప్పుకోవాలంటే నరేంద్ర మోడీని బలిపశువును చేయక తప్పదు! నరేంద్ర మోదీ రాజకీయ క్రీడకు ఇక చెక్ పెట్టి తీరాలి అనే నిర్ణయానికి ఆర్ఎస్ఎస్ వారు వచ్చారని భావించవచ్చు.

ఈ సందర్భంగా నాకు మూడున్నర ఏళ్ల క్రితం, ఢిల్లీ నగరంలో రైతులు ఆందోళనకు దిగిన తరువాత  2020 డిసెంబరు చివరి రోజులలో, మా తమ్ముడితో ఫోన్లో మాట్లాడిన ఒక విషయం గుర్తుకు వచ్చింది. మా బాబాయి గారి అబ్బాయి అయిన ఆ తమ్ముడు, కరోనా కాలంలో మమ్ములను, మా ఆరోగ్యాలను  ఫోను పలకరింపు ద్వారా తెలుసుకుందామని చేశాడు. అతను పూర్తి కాలం ఆర్ఎస్ఎస్ కార్యకర్త. కుటుంబీకుల యోగక్షేమాలు అయిన తరువాత నేను అతనితో ఒక మాట చెప్పాను. రైతాంగ ఉద్యమం మోదీ తరహా పరిపాలన అంతంకాబోతోంది అనటానికి ఒక సూచిక. 

మీరు మోదీని గట్టిగా చెక్ చేయలేకపోతే, సహీంద్ర తక్షకాయ స్వాహా! అయిపోతారు . ఆ ఇంద్రుని పీఠంతో పెన వేసుకున్న మీరు కూడా ప్రజా వ్యతిరేకతను  చవిచూడవలసి వస్తుంది. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట. అని మా తమ్మునికి గట్టిగా చెప్పాను. తను దాన్ని ఎంతవరకు ఇతరులకు తెలిపాడో, చర్చించాడో నాకు తెలియదు. కానీ ఇప్పుడు సరిగా అలాంటి తీవ్ర ప్రమాదాన్ని ఆర్ఎస్ఎస్ పసిగడుతోంది అని అర్థం చేసుకోవచ్చు.

ఒకప్పుడు బహిరంగంగా తిట్టిన, తిట్టించుకున్న చంద్రబాబు నాయుడుతో మోదీ ఇప్పుడు గాఢాలింగనాలు చేసుకునే మహానటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నాడు కానీ, ప్రస్తుతం ఆయన రాజకీయ నైతిక విలువలు అత్యంత హీనస్థాయిలో ఉన్నందువల్ల నిజమైన ప్రజాభిమానాన్ని అతను పొందలేడు. ఆయన భక్త బృందం ఆయనకు ఉండినప్పటికీ ఆయన పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత చాలా తీవ్రమైనది. ఆ వ్యతిరేకత కాకను ఆర్ఎస్ఎస్ కూడా అర్థం చేసుకుంటోంది. అతనితో పెనవేసుకుని ఇక తాము నష్టపోదల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. వీటినన్నిటినీబట్టి మిగిలిన పరిణామాలు ఎలా ఉన్నా, మోడీ పదవీ చ్యుతుడయే కాలం వేగవంతమవు తోందని ఊహించవచ్చు. 

Tags:    

Similar News