కుటుంబ బంధాలను తెంచేస్తున్న ఉత్తరాంధ్ర కాలుష్యం

"గాలి, నీరు, భూమిని నాశనం చూసిన కాలుష్యం ఇపుడు కుటుంబాల్లోకి చొరబడుతూఉంది.";

Update: 2025-04-08 02:00 GMT
Representative Picture

-రెడ్డి శంకర్ రావు

ఉత్తరాంధ్ర వూహించని సాంఘిక సంక్షోభం ఎదుర్కొంటున్నది. ఒక వైపు నుంచి ఉత్తరాంధ్రకి పరిశ్రమలువస్తున్నట్లు కనిపిస్తుంది. మరొకవైపు అవి తీసుకువస్తున్న విచ్ఛిన్నం అంతా ఇంతా కాదు. భూమి,నీరు,గాలి కలుషితం కావడమే కాదు, ఈ కాలుష్యం ఇపుడు కుటుంబ అనుబంధాల విచ్ఛిన్నానికి కారణమవుతూ ఉంది.

సామాజిక సంబంధాలను తెoచేస్తున్న కాలుష్యం

ఈ ప్రాంతాన్ని కాలుష్యం కభళిస్తూ ఉంది. దీనితో నీరు పాడై, పంట పనికిరాని రాకుండా పోతున్నాయి.  ఇక్కడ పండే బియ్యం, పప్పులు, ఇతర తృణ ధాన్యాల తినడం వలన ప్రమాదకరమయిన కేన్సర్, కిడ్నీ రోగాలు వస్తున్నాయని ఇక్కడి ప్రజల్లోభయం అలుముకుంటూ ఉంది. దీనితో పండుగలకి పబ్బాలకి పిలిచినా చుట్టాలు రావడం తగ్గిపోతున్నది. అంతేకాదు,ఇక్కడి పిల్లలకు పెళ్లిళ్లు చేసుకునేందుకు ఎవ్వరూ పిల్లలని ఇవ్వడం లేదు. ఇక్కడ భూములను అత్యవసరానికి అమ్ముకుందామంటే ఎవ్వరూ కోనటానికి రావడం లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో పడి ప్రజలు వారి పిల్లలని చదివించుకోలేని పరిస్థితి దాపురించింది. వైద్యానికి డబ్బులు లేని పరిస్ధితి ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడి ప్రజలు మెల్లిగా బంధువులనుంచి సామాజిక వెలికి గురికావడం మొదలవుతున్నదనవచ్చు. వృత్తులు చేసుకుని బతుకు తున్న గొర్రెల మేకల పెంపకం దార్ల, క్షౌర,విశ్వ బ్రహ్మణ వృత్తులు పూర్తి గా పనులు పోయి వలసలు పోతున్నారు. ఇది కుటుంబాల పరిస్థితి

ఇంత దారుణం ఎక్కడ జరుగుతున్నది సుందరమయిన ఉత్తరాంధ్రలో...

తూర్పు కనుమల్లో ఒక పక్క పచ్చని పంట పొలాలు, మరో ప్రక్క సుదీర్ఘ మైన 340 కిలో మీటర్ల సముద్ర తీరం మధ్య ఉన్న ప్రాంతం అందమైన ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ ప్రాంతమంతాఎత్తైన ఆహ్లాదకరమైన అడవులకు నిలయం. వంశధార నాగావళి,వేగవతీ,.శారదా,తాండవ నదులు తాండవమాడే ప్రదేశం. ఇలాంటి ప్రాంతం ఇపుడు శాపగ్రస్త. ఈ ప్రకృతి రమణీయ ప్రాంతం నేడు కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిలలాడు తుంది. ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం , పార్వతీపురం మన్యం , విజయనగరం , విశాఖపట్నం , అల్లూరి సీతారామరాజు జిల్లాలో సగం, అనకాపల్లి జిల్లాలు.

కాలంమారిందిగాని బతుకులు పతనం..

ఒకప్పుడు జ్యూట్టు మిల్లులు, పంచదార మిల్లులు, పెరో ఎల్లాయ్ స్ లాంటి సాంప్రదాయ పరిశ్రమల కి నెల వుగా ఉండేది. అవి పోయి వాటి స్థానములో కాలుష్యం చిమ్మే కార్పొరేట్ సంస్థల మందులు, కెమికల్, ధర్మల్ విద్యుత్ కంపెనీలు వచ్చాయి. వాటిని సముద్ర తీరంలోను, నధులు ప్రవహించే చోట్ల ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమల కాలుష్యం ఉత్తరాంధ్రను కభళిస్తూ ఉంది. ఈ పరిశ్రమల చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉన్న నీరు తాగునీరు తాగడానికి పనికి రాకుండా పోయింది. సాగు నీరు పoటలకు పనికి రాకుండా పోయింది, పండే పంట, వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా వరి, జొన్న, రాగి, తదితర పంటలు పండే భూములు విషతుల్యం అయిపోయాయి. ఉదాహరణకు..

కంది, వలస గెడ్డ చుట్టూ ఉన్న గ్రామాలు అల్లాడి పాలెం, కొణతల పాలెం, చోడ మ్మ అగ్ర హారం గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ ఉన్న రెడ్డి ల్యాబ్స్ , అరబిoధో కంపెనీలు అత్యంత ప్రమాదకరమైన విష తుల్యమైన పదార్థాలు కంది వలస గెడ్డ కి వదులు తున్నారు. అలానే మైలాను ,ఎస్ ఎంఎస్, విటిఎ కంపెనీలు నుండి వచ్చే కాలుష్యం నీరు కొవ్వాడ అగ్రహారం, చోడవరం, నక్కాని పేట, గోవింద పురం గ్రామాలను, వీటితోపాటు సముద్ర తీరంలో మత్య్స కారులు గ్రామాలులో తాగేందుకు గుక్కెడు నీరు కూడా లేక అల్లాడుతున్నారు.ఈ ప్రాంతంలో నీరు, పంట, పొలం, భూమి, సముద్రాన్ని విష తుల్యం చేస్తున్నవి ఈ కెమికల్ పరిశ్రమలు శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలంలోని పైడిభీమవరం తో పాటు అన్ని సుమారు 40 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు .వీటికి తోడు ఇప్పుడు కొవ్వాడ అణువిద్యుత్ మరో కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది

ఇది ఎటువంటి నాణ్యత లేని యంత్రాలతో ,టెక్నాలజీతో అమెరికా వంటి బలమయిన దేశాల వత్తిడి కి తలొగ్గి వారు వాడి వదిలేసిన యంత్రాలను కొనుగోలు చేసి ఇక్కడ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అణు ధార్మికత వలన ప్రజలు ప్రాణాలు కు ముప్పు వస్తుందని చెబుతూ అభివృద్ధి చెందిన ప్రాన్స్, జపాన్, జర్మనీ దేశాలు సౌర విద్యుత్, పవన విద్యుత్తు వైపు మల్లు తున్నాయి. ఇప్పుడు అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న కొవ్వాడ ప్రాంతాన్ని భూకంప జోన్ గా గుర్తించారు. అటువంటి చోట అణు పరిశ్రమ పెట్టడం అంటే ప్రమాదం పక్కలో పెట్టుకోవడం. ఈ వాతావరణం అలుము కుంటూ ఉండటంతో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలంతా భయం భయంగా బతకే పరిస్థితి వస్తున్నది.

ఈ ప్రాంతంలోని మరొక ప్రకృతి రమణీయ ప్రదేశం అరకు లోయ. ఇక్కడి పాడేరు ప్రాంతాల్లో బాక్సైట్ గనులు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేశారు. ఇది మాకు వద్దని ప్రజలు తిరగ బడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీన్ని వలన తాండవ, శారద నధులు అదృశ్యమైనా ఆశ్చర్య పడ వసరoలేదు. ఎందుకంటే, బాక్సైట్ ఉన్నఅడవులే ఈనదులకు మూలం. బాక్సయిట్ ను తవ్వి ఆ ఆడవులను నాశనం చేస్తే, ఈ నదులు ఎండిపోతాయి. అప్పుడు విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడతారని పర్యావరణ వేత్తలు9 హెచ్చరిస్తూనే ఉన్నారు. మొత్తానికి ఈ పరిశ్రమల వల్ల అమూల్యమయిన పర్యావరణం దెబ్బ తింటున్నది. గాలి, నీరు, భూమి, పంట కలుషితం అవుతున్నది.

ఇప్పుడు కొత్తగా అనకాపల్లి లో అణువిద్యుత్ కంపెనీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం లోని షిప్ యార్డు తో పాటు అనేక పరిశ్రమలు కాలుష్యం వెదజల్లు తున్నాయి. అనకాపల్లి అచ్యుతాపురం ప్రాంతాల్లో కాలుష్యం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చిన కూల్ డ్రింక్స్, మైకా , పోలీతీన్ ఉత్పత్తుల తో భూమి ఇప్పటికే కలుషితము అయ్యింది.

ప్రత్యామ్నాయం కోసం పోరాటాలే పరిష్కారం

పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల లాభాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, కొత్తవి నిర్మించ కుండా ఉద్యోగులును తొలగించి, కొత్త ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమల ఏర్పాటు చెయ్యాలి కధా అని పరిశ్రమలను ఏర్పాటు చేస్తే కాలుష్యం అంటే ఎలా? అని వితండవాదం చేస్తున్నారు పాలకులు, వారి తాబేదారులు వాస్తవానికి పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించాక పరిశ్రమల వ్యర్ధలు ఏమీ చెయ్యాలి, ఎలా ఇక్కడ ప్రజలు కి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అనేక చట్టాలు ఉన్నాయి. అనేక నిబంధనలు చెపుతున్నాయి కాని వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం, అధికారులు యజమానులు కి సేవలు చేస్తూ ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. పూస పాటి రెగ ప్రాంతంలో ప్రజలు పోరాడితె ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనిమెల్ల వద్ద వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడ నుండి నీరు సరఫరా చేస్తున్నారు. అధి కూడ అరకొర మాత్రమే.

కాబట్టి ప్రత్యామ్నాయం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తే కుండా మన సమస్యలు పరిష్కారం కావు. అందుకు మన ముందు సోంపేట, కాకరాపల్లి,కొమరాడ లచ్చయ్యపేట లలో ధర్మల విద్యుత్ పరిశ్రమ ఏర్పాటును ప్రజలు పోరాడి ప్రాణత్యాగం చేసి అడ్డు కున్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ప్రమాదాన్ని అడ్డుకున్నారు. ఇవన్నీ ప్రజా చైతన్యంతోచేసిన పోరాటాలు, ప్రజలు తిరగబడి పోరాడిన చోట్ల విజయాలు సాధించిన చరిత్ర మనముoదు ఉన్నాయి. ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు చేస్తున్నా పోరాటం కళ్లు ముందే ఉన్నది. వాటి స్ఫూర్తితో ఉత్తరాంధ్రనీ కాలుష్యం కోరల్లో నుండి కాపాడడం అసాధ్యం కాదు. అంధుకు ఇప్పటికే పోరాడుతున్న వామపక్షాలు, స్వచ్చంద సంస్థలు, ఎంజిఒలు , పర్యావరణ పరిరక్షణ సంస్థలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉధృతం చేయడం ఒక్కటీ మార్గం.

( రెడ్డి శంకరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. విజయనగరం,ఉత్తరాంధ్ర)

Tags:    

Similar News