ఉద్యమించే ప్రజలను అణచేస్తే ప్రభుత్వం సక్సెస్ అవుతుందా?

BRS నిరంకుశ పాలన కొనసాగినా పదేళ్ల తర్వాత ప్రజలు తిరస్కరించారు...;

Update: 2025-02-07 08:52 GMT

“అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు,

లాటీలు, తూటాలు ఉద్యమాల నాపలేవు ”

తెలుగు రాష్ట్రాలలో ఈ వాక్యాలను వినని వాళ్ళూ, తమ తమ ఉద్యమాల సందర్భంగా ఈ నినాదాన్ని ఇవ్వని వాళ్ళూ ఉండరంటే అతిశయోక్తి కాదు.

రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీని వ్యతిరేకిస్తున్న యాచారం మండల ప్రజలూ, నారాయణ పేట జిల్లాలో ఇథనాల్ కంపనీ కాలుష్యాన్ని వ్యతిరేకిస్తున్న మరికల్, చిన్నచింతకుంట మండలాల ప్రజలూ, తమ గ్రామాల మధ్యలో నిర్మాణమవుతున్న ఇథనాల్ కంపనీని వ్యతిరేకిస్తూ 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు సాగిస్తున్న గద్వాల జిల్లా పెద ధనవాడ తదితర 15 గ్రామాల ప్రజలూ ఈ నినాదాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ముందు భాగంలో ఉన్నారు.

వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజక వర్గంలో ప్రభుత్వ భూసేకరణ కు వ్యతిరేకంగా పోరాడిన లగచర్ల గ్రామ ప్రజల ప్రతిఘటన, తమ ప్రాంతంలో నిర్మాణమవుతున్న ఇథనాల్ కంపనీకి వ్యతిరేకంగా రోడ్డెక్కి గంటల పాటు బైటాయించిన నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల ప్రజల పోరాట శక్తీ రాష్ట్ర ప్రజలకు జ్ఞాపకం ఉండే ఉంటుంది.

ఇప్పుడు మళ్ళీ ఈ నినాదాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చిందంటే, రాజ్య హింసతో సాగించిన పదేళ్ళ BRS నిరంకుశ పాలనను కూల దోసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తమను తాము మళ్ళీ కూడ దీసుకుని, ఉద్యమాల బాట పడుతున్నారు. ఆయా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను, ప్రస్తుత ప్రజల డిమాండ్లను పట్టించుకోకపోగా, పోలీసుల నిఘా, ఆంక్షలు పెంచడం ప్రజలలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నది.

గత ప్రభుత్వ కాలంతో పోల్చినప్పుడు, ఈ ప్రభుత్వ కాలంలో హైదరాబాద్ నగరంలో హాల్ మీటింగులకు అనుమతించడం, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నాలకు అనుమతించడం చూసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్నట్లు కొందరికి అనిపించవచ్చు.

కానీ, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటున్నది. సూర్యాపేట జిల్లాలో ఇథనాల్ కంపనీకి వ్యతిరేకంగా దీక్షలు చేయాలని భావించిన వివిధ ప్రజా సంఘాలు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న తీరు, ఫార్మా సిటీ ప్రాంతంలో పోరాట కమిటీ సభలు నిర్వహించాలనుకుంటే అడ్డుకున్న తీరు, చివరికి కోర్టు అనుమతితో సభ నిర్వహించు కోవాల్సిరావడం, మైలారం లో మైనింగ్ కు వ్యతిరేకంగా దీక్షలు చేయాలని భావించిన ప్రజల పోరాటానికి సంఘీభావం ప్రకటించడానికి వెళుతున్న ప్రొఫెసర్ హర గోపాల్ గారిని మార్గ మధ్యంలోనే ఆరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన తీరు – ఈ ఘటనలన్నీ గ్రామీణ ప్రాంతంలో పోలీసుల నిఘా ఎంతగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా నారాయణ పేట జిల్లా చిత్తనూరు, ఎక్లాస్ పూర్ , జన్నారం గ్రామాల అనుభవాలు రాష్ట్ర ప్రజలు వినాలి. చిత్తనూరు లో 2022 లో ప్రారంభమైన ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సంవత్సరం పాటు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. పాద యాత్రలు , దీక్షలు, భారీ బహిరంగ సభలు, ధర్నాలు , స్థానిక, జిల్లా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ప్రాతినిధ్యాలు – మొత్తంమీద అత్యంత ప్రజాస్వామికంగా ఈ ఉద్యమం జరిగింది.

2023 అక్టోబర్ 22 న కంపెనీ నుండి కాలుష్య పూరిత వ్యర్ధ జలాలను బయటకు ట్యాంకర్ ల ద్వారా తరలించడాన్ని చూసిన గ్రామాల ప్రజలు, ఆ ట్యాంకర్ లను ఆపారు. అధికారులకు కబురు చేశారు. ట్యాంకర్ లను సీజ్ చేసి, కేసు పెట్టాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. కానీ కంపనీ యాజమాన్య పక్షం తీసుకున్న ప్రభుత్వ అధికారులు , ట్యాంకర్ లను సీజ్ చేయకుండా, వాటిని ఫ్యాక్టరీ యాజమనులకే అప్పగించాలని నిర్ణయించారు. దీనిని వ్యతిరేకించిన ప్రజలపై , పోలీసు అధికారులు విచ్చలవిడిగా లాటీ ఛార్జీ చేశారు. ప్రజలను విచ్చలవిడిగా కొట్టారు. ఈ నిర్బంధాన్ని ప్రజలు తిప్పికొట్టారు. ప్రతిఘటించారు. లాటీల తో తమ మీదికి వస్తున్న పోలీసు అధికారులను నిలువరించారు. ఈ క్రమంలోనే పోలీసుల వాహనాన్ని ఎవరో తగల బెట్టారు.

ప్రజల ప్రతిఘటనను పోలీసులు సహించలేకపోయారు. ఆ రోజు రాత్రి గ్రామాలపై పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు విరుచుకు పడ్డాయి. అప్పటికే కొందరు యువకులు గ్రామాలను వదిలిపెట్టి వెళ్లిపోయారు. గ్రామాలలో దొరికిన వాళ్ళను తీసుకు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన స్థానిక గ్రామస్థుడు, జూనియర్ కాలేజీ లెక్చరర్,కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నాయకులు బండారి లక్ష్మయ్య , రిటైర్డ్ టీచర్, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు చంద్ర శేఖర్ లను, మరి కొంతమందిని పోలీస్ స్టేషన్ లో ఉంచి చిత్ర హింసలు పెట్టారు. అక్రమ కేసులు బనాయించారు. ఈ చిత్ర హింసలు అనేకమంది ఆరోగ్యాలను తీవ్రంగా దెబ్బ తీశాయి. వాళ్ళు పూర్తి స్థాయిలో కోలుకోలేకపోయారు. పదే పదే పోలీసు అధికారులు గ్రామలపై దాడి చేసి, ఆయా గ్రామాల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేశారు. మహిళలని కూడా చూడకుండా, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. కొట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజ్య హింస విశ్వ రూపాన్ని ఆయా గ్రామాల ప్రజలు చూశారు. రైతులు చేతుకి వచ్చిన తమ పంటలకు కోసి ఇంటికి తెచ్చుకోలేకపోయారు. అనేక రోజుల పాటు, వందలాది యువకులు హరామలను విడిచి పెట్టి బయట బతకాల్సి వచ్చింది.

ఈ హింసా కాండను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు తీవ్రంగా ఖండించింది. తాము అధికారం లోకి వస్తే ప్రజలకు న్యాయం చేస్తామనీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. ప్రజలపై పెట్టిన కేసులు ఎత్తేయించుతామని కూడా హామీ ఇచ్చారు. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ప్రజలు మూడు నియోజక వర్గాలలో BRS అభ్యర్ధులను ఓడించాలని ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు ఇచ్చింది. ప్రజలు ఈ పిలుపును ఆదరించారు. మూడు నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించారు.

కానీ ఎప్పటి లాగే ప్రజలు మోస పోయారు. సంవత్సరం గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇథనాల్ కంపనీ మూత పడలేదు. ప్రజలపై కేసులు ఎత్తేయలేదు. కంపనీ నుండి కాలుష్యం సమస్య తగ్గలేదు. ఒకప్పుడు మూడు గ్రామాలకు పరిమితమైన కాలుష్యం సమస్య ఇప్పుడు 50 గ్రామాలకు విస్తరించింది.

ప్రభుత్వ నిర్బంధాన్ని చవి చూసిన గ్రామాల ప్రజలు గత సంవత్సర కాలంగా మౌనంగా ఉన్నారు. పోలీసులు ఎక్కడ వచ్చి మళ్ళీ దాడులు చేసి, పోలీస్ స్టేషన్ లో పెడతారేమో అనే ఆందోళనలో ఉన్నారు. పోలీసు కేసుల చుట్టూ తిరగలేమనే నిర్ధారణకు వచ్చారు. ఆ రోజుల్లో బెయిల్ కోసం తాము పడిన తిప్పలను తల్చుకుని వణికి పోతున్నారు. మీటింగ్ లన్నీ ఆగిపోయాయి. కమిటీ గత ఏడాదిపాటు స్థానికంగా ఎటువంటి కార్యక్రమాలను చేపట్టలేకపోయింది.

ఈ పోలీస్ నిర్బంధాన్ని గురించి ఇంత వివరంగా ఇప్పుడు ఎందుకు రాయవలసి వచ్చిందంటే, సమస్య తీవ్రతను అక్కడి ప్రజలు గుర్తించి, మళ్ళీ పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ లో ఆయా గ్రామాల ప్రజలు కూర్చుని చర్చించుకుని, ఫిబ్రవరి 6 న మరికల్ మండల రెవెన్యూ అధికారులకు మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా 50 గ్రామాల లోనూ కరపత్రాలు పంచి, ప్రజలను చైతన్య పరిచారు. ప్రజల సంతకాలు సేకరించారు.

ఇథనాల్ కంపనీ వ్యతిరేక పోరాట కమిటీ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 6 న మరికల్ మండల అధికారిని కలిసి మెమోరాండం ఇచ్చారు. ప్రజా సంఘాల కార్యకర్తలతో పాటు, స్థానిక గ్రామాల రైతులు కూడా ఈ కార్యక్రమంలో మళ్ళీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నిర్బంధం , రాజ్య హింస ప్రజలను కొద్ది కాలం పాటు వెనక్కు నెట్టవచ్చు, భయ భ్రాంతులకు గురి చేయవచ్చు, కానీ సమస్యలను ఎదుర్కుంటున్న ప్రజలు చైతన్యం పెంచుకుని భయం నుండీ బయట పడతారు, పోరాట మార్గం లో ముందుకు వెళతారనడానికి ఈ రోజు చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్ పూర్ గ్రామాల రైతుల కదలిక మంచి నిదర్శనం.

ప్రజలు అధికారులకు ఇచ్చిన మెమోరాండంలో ముఖ్యమైన అంశాలు ఇవి:

1. నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ అనే పేరుతో ఇథనాల్ కంపెనీని 2022 ఫిబ్రవరి నెలలో ఏర్పాటు చేశారు. ఆ కంపెనీ 2023 సెప్టెంబర్ నెల నుండి ఇథనాల్ ఉత్పత్తిని ప్రారంభించింది.

2. ఇథనాల్ ఉత్పత్తి వల్ల విపరీతమైన దుర్వాసన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చ గ్రామాలకు కూడా వ్యాపించడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. కంపెనీ వెదజల్లే విష రసాయన వ్యర్థ పదార్థాలు మన్నెవాగులోకి కలవడం వల్ల జంతు జీవజాలం మనుషులకు తీవ్ర ప్రమాదాలు జరిగాయి. జరుగుతున్నాయి.

3. ఈ విషయాన్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా నిర్ధారించింది. కాలుష్య నియంత్రణ మండలి ఇథనాల్ కంపెనీ పై ఆంక్షలు విధించినప్పటికీ కంపెనీ యజమాన్యం లెక్కచేయకుండా యదేచ్ఛగా పర్యావరణ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నది.

4. కాలుష్యకారక ఇథనాల్ కంపెనీని మూసివేయాలని పోరాడుతున్న ప్రజల రైతులు పై 2023 అక్టోబర్ 22న పోలీసులు లాఠీచార్జ్ చేసి దాడి చేసి కొట్టారు. చిత్తనూరు, ఎక్లాస్పూర్, జిన్నారం బాధిత గ్రామాల ప్రజలను నెలరోజులు పోలీస్ నిర్బంధంలో ఉంచి వారి జీవన చర్యలపై దాడి చేశారు. భవిష్యత్తులో పోరాటం చేయకుండా అక్రమ కేసులు, రౌడీ షీట్లు తెరిచి భయాందోళనలకు గురి చేశారు.

5. ఒకవైపు గత మూడు సంవత్సరాలుగా చిత్తనూరు ఇథనాల్ కంపెనీని మూసివేయాలని బాధిత ప్రజలు, రైతులు పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తుంటే మరొకవైపు పుండు మీద కారం చల్లినట్లు కంపెనీ యజమాన్యం సింథటిక్ కెమికల్స్ అనే అమోనియం ప్లాంటును ప్రజాభిప్రాయ సేకరణ జరుపకుండా దొడ్డిదారిన అక్రమంగా ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్నది.

6. కంపెనీ యజమాన్యం చేస్తున్న అక్రమాలను చట్టప్రకారం అడ్డుకోవాలని కోరుతున్నాము. ఇతనాల్ కంపెనీ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల గాలి, నీరు, భూములు కలుషితమవుతున్న పరిస్థితులను అంచనా వేయడానికి సాంకేతిక పరికరాలను గ్రామాలలో అమర్చాలని కోరుతున్నాము.

 అదేవిధంగా క్రింది డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

1. చిత్తనూరు ఇథనాల్ కంపెనీకి అనుబంధంగా అక్రమంగా ఏర్పాటు చేస్తున్న సింథటిక్ కెమికల్స్ అనే అమోనియం ప్లాంటును వెంటనే నిలిపివేయాలి.

2. చిత్తనూరు ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలి.

3. చిత్తనూరు ఇథనాల్ కంపెనీ నుండి ఘన, ద్రవ, వాయు రూపంలో

వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టి దానిని లెక్కించడానికి అవసరమైన సాంకేతిక పరికరాలను ( VOC మీటర్లను ) బాధిత గ్రామాలలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి.

4. కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద కేటాయించిన పూర్తి ఆయకట్టు 52 వేల ఎకరాలకు నీరు ఇచ్చేవరకు చిత్తనూరు ఇతనాల్ కంపెనీకి ఆ ప్రాజెక్టు నుండి ఎటువంటి నీరు ఇవ్వరాదు.

5. బాధిత గ్రామాల ప్రజలు, రైతులు, పోరాట కమిటీ ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీషీట్ ను వెంటనే ఎత్తివేయాలి.

Tags:    

Similar News