‘కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలను రేవంత్ వ్యతిరేకించాలి’
‘కార్మికులకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలి’;
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశా వ్యాపితంగా కార్మికులు,రైతులు ఉమ్మడిగా పోరాడుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల సంఘాలు మే 20 న దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె కు పిలుపు ఇచ్చాయి.
కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఈ సమ్మె జులై నెలకు వాయిదా పడినప్పటికీ, మే 20 న వివిధ స్థాయిలలో కార్మికులు, రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లో కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ముందు మేము నిరసన ప్రదర్శన నిర్వహించాయి. కమిషనర్ ఆఫ్ లేబర్ గారి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కొన్ని అసంఘటిత రంగాల కార్మికుల సమస్యలపై నిర్ధిష్ట డిమాండ్లతో ఒక మోమోరాండం ను రాష్ట్ర ముఖ్యమంత్రి గానూ, కార్మిక శాఖా మంత్రి గానూ ఉన్న రేవంత్ రెడ్డి గారికి అంద చేశాయి. .
ఈ కార్మిక ధర్నా కార్యక్రమానికి తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ( TPJAC), ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (NAPM) నేతృత్వం వహిస్తున్నప్పటికీ, ఈ వేదికలలో భాగస్వాములుగా ఉన్న అనేక కార్మిక సంఘాలు తమ సభ్యులైన సాధారణ కార్మికులతో కలసి పాల్గొన్నాయి.
ఈ సంఘాలన్నీ, తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ధాలుగా కార్మికుల, ముఖ్యంగా అసంఘటిత కార్మికుల హక్కులు, సంక్షేమం, ఇతర సమస్యలపై పోరాడుతున్నాయి. వేలాది మంది సభ్యులు కలిగిన ఈ సంఘాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండీ , తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ గత ప్రభుత్వం రాష్ట్ర కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో దారుణంగా విఫలమైంది.
గత దశాబ్ధ కాలంగా రాష్ట్రంలో వివిధ సంస్థలు అనేక కంపనీలను, కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటిలో పని చేసే కార్మికలు, ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. కానీ ఈ కార్మికులకు ఎటువంటి చట్టబద్ధ హక్కులు అమలు కావడం లేదు. వారికి సాంఘిక బధ్రత కూడా అందడం లేదు. కనీస వేతనాలు, పని గంటలు, సెలవులు, ప్రావిడెంట్ ఫండ్ , ESI, గ్రాట్యుటీ, పెన్షన్ లాంటి సౌకర్యాలు ఏమీ లేక కార్మికులు, ఉద్యోగులు దారుణ దోపిడీకి గురవుతున్నారు. పని స్థలాలలో ప్రమాదాలు సంభవించి కార్మికుల ప్రాణ నష్టం జరిగినప్పుడు, వారి కుటుంబాలకు నష్ట పరిహారం కూడా యాజమాన్యాలు చెల్లించడం లేదు.
హైదరాబాద్ నగరానికి, ఇతర జిల్లాలకు వివిధ రాష్ట్రాల నుండీ లక్షలాది మంది కార్మికులు జీవనోపాధి వెతుక్కుంటూ వలస వస్తున్నారు. వారికి సరైన గృహ వసతి ఉండడం లేదు. వారికి యాజమాన్యాలు కనీస వేతనాలు ఇవ్వడం లేదు. తక్కువ కూలీ చెల్లించి, ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారు. వారికి జీవన బధ్రత, సాంఘిక బధ్రత కూడా లేదు. గత ప్రభుత్వం వలస కార్మికులకు ఒక విధాన పత్రం తయారు చేయాలని ప్రయతించినా, అది ముందుకు పోలేదు.
చాలా కంపనీలలో , కార్యాలయాలలో పర్మినెంటు స్వభావం కలిగిన చోట్ల కూడా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కాంట్రాక్టు, దినసరి, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కార్మికులను, ఉద్యోగులను నియమించుకుంటున్న పరిస్థితి ఉంది. వారికి కనీస వేతనాలు అమలు కావడం లేదు. వారికి 8 గంటల పని దినం అమలు కావడం లేదు. వారికి వేతనంతో కూడిన సెలవులు లభించడం లేదు. సర్వీస్ లో ఉండగా ప్రమాదానికి గురై మరణించినా వారికి సరైన నష్ట పరిహారం దక్కడం లేదు. ఆదర్శ యాజమాన్యాలుగా ఉండాల్సిన సింగరేణి, ఆర్టీసీ , వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కాంట్రాక్టు, క్యాజువల్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే కార్మికులను ,ఉద్యోగులం నియమించుకుంటున్నాయి. స్కూల్స్ లో బోధనేతర సిబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా కనీస వేతనాలు అందడం లేదు.
అసంఘటిత రంగంలో ఉన్న గృహ కార్మికుల, హమాలీ కార్మికుల , భవన నిర్మాణ కార్మికుల, సెక్యూరిటీ ఉద్యోగుల , దుకాణాలలో, మాల్స్ లో పని చేసే షాప్ ఎంప్లాయీస్ పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి. వారిపై శ్రమ దోపిడీ విచ్చలవిడిగా సాగుతున్నది.
రాష్ట్రంలో కోట్లాది మంది కార్మికుల సంక్షేమం కోసం పని చేయడానికి రాష్ట్ర క్యాబినెట్ లో ప్రత్యేక కార్మిక శాఖా మంత్రి లేరు. కార్మిక శాఖ కూడా సిబ్బంది కొరతతో అత్యంత బలహీనంగా తయారైంది. కంపనీలు, సంస్థలు, దుకాణాలు, లాంటి చోట్లకు ప్రత్యేకంగా వెళ్ళి, కార్మికుల సమస్యలను పరిశీలించే ధోరణి కూడా కార్మిక శాఖ లో పూర్తిగా తగ్గిపోయింది. కార్మిక సంక్షేమానికి బాధ్యత పడాల్సిన కార్మిక శాఖ కు అన్ని స్థాయిలలో సిబ్బంది నియామకం దశాబ్ధాలుగా జరపడం లేదు. ఈ శాఖకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు కూడా బాగా తగ్గిపోయింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయడానికి ఇప్పటి వరకూ నిర్ధిష్టమైన అడుగులు ప్రభుత్వం వైపు నుండీ పడలేదు. రాష్ట్రంలో గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల సంక్షేమానికి మే 1 నుండీ ప్రత్యేక చట్టం తెస్తామని ప్రకటించినప్పటికీ, ఇంకా అది కార్యరూపం దాల్చలేదు.
ఈ నేపధ్యంలో రాష్ట్ర కార్మికుల సమస్యలను, వారి నిర్ధిష్ట డిమాండ్లను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్ళి, వీటిపై వెంటనే తగిన దృష్టి సారించి, పరిష్కారానికి పూనుకోవాలని కోరాయి.
కార్మికుల డిమాండ్లు :
1. రాష్ట్రంలో కార్మికుల, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర కార్మిక శాఖను బలోపేతం చేయాలి.
2. రాష్ట్ర కార్మిక శాఖలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, డిప్యూటీ లేబర్ కమిషనర్, జాయింట్ లేబర్ కమిషనర్ ల సంఖ్యను పెంచాలి. రాష్ట్రంలో కార్మికుల , ఉద్యోగుల , కార్మిక హక్కులకు కార్మిక శాఖ బాధ్యత వహించాలి.
3. అన్ని ప్రభుత్వ సంస్థలలో పర్మినెంటు స్వభావం కలిగిన పనులలో కార్మికుల, ఉద్యోగుల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ నియామక పద్ధతులను రద్దు చేయాలి. ఆయా పోస్టులలో పర్మినెంట్ ఉద్యోగులను భర్తీ చేయాలి.
4. ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రంలో గిగ్ అండ్ ప్లాట్ ఫాం కార్మికులకు, ఉద్యోగులకు సమగ్ర సంక్షేమ చట్టం వెంటనే ప్రకటించి అమలు చేయాలి.
5. కార్మికులు, వలస కార్మికులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో ప్రభుత్వ రంగంలో కొత్త స్కూల్స్ ఏర్పాటు చేయాలి. వారికి అనువైన భాషలో బోధనకు టీచర్లను నియమించాలి. ఆయా స్కూల్స్ లో మౌయలిక సదుపాయాలను కల్పించాలి.
6. స్కూల్స్ లో మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనం చెల్లించాలి. అన్ని స్కూల్స్ లో పర్మినెంట్ బోధనేతర సిబ్బందిని నియమించి, వారికి రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాలు చెల్లించాలి. స్కూల్ స్వీపర్లకు కనీస వేతనం రూ,,21 వేలకు పెంచాలి. వారిని రెగ్యులరైజ్ చేయాలి.
7. రాష్ట్రంలో పెరుగుతున్న కార్మికుల సంఖ్యకు అనుగుణంగా మల్టీ స్పెషాలిటీ ESI ఆసుపత్రులను అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయాలి.
8. రైతు బీమా తరహాలో రాష్ట్రం లోని అసంఘటిత కార్మికులందరికీ సహజ మరణానికి 5 లక్షలు రూపాయల బీమా చెల్లించాలి.
9. తక్షణ కార్యక్రమంగా రాష్ట్రంలో మొత్తం అసంఘటిత కార్మికులను నమోదు చేసే బాధ్యత కార్మిక శాఖ తీసుకోవాలి. ఇందులో ఆయా కార్మిక సంఘాలను భాగస్వాములను చేయాలి.
హమాలీ కార్మికుల డిమాండ్లు:
1. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
2. రాష్ట్రం లో అన్ని చోట్లా హమాలీ కార్మికులకు ఒకే వేతనం ( పీస్ రేట్) అందేలా చూడాలి.
3. హమాలీ కార్మికులకు PF,ESI సౌకర్యాలను అమలు చేయాలి.
4. హమాలీ కార్మికులకు మండల కేంద్రాలలో హమాలీ కాలనీలు ఏర్పాటు చేయాలి.
గృహ కార్మికుల నిర్ధిష్ట డిమాండ్లు :
1. గృహ కార్మికుల హక్కుల రక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ఒక సమగ్ర చట్టం తీసుకు రావాలి.
2. గృహకార్మికులను, యజమానులను నమోదు చేయడానికి వీలుగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
3. గృహ కార్మికులకు ESI, PF, పెన్షన్ సౌకర్యాలను అమలు చేయాలి.
4. గృహ కార్మికులకు ప్రసూతి సెలవు వేతనం చెల్లించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించాలి.
5. గృహ కార్మికుల సమస్యలు విని,పరిష్కారం కోసం కృషి. జేయడానికి నిర్ధిష్టంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
హైదరాబాద్ సాఫ్ సమితి డిమాండ్లు :
1. చెత్త సేకరించే కార్మికులను 'నిత్యావసర కార్మికులు' గా గుర్తించి, గుర్తింపు కార్డులు జారీ చేయాలి. .
2. నెలకు రూ.250 ఫీజుగా నిర్ణయించి చెత్త ఉత్పత్తి చేసే ఇళ్ల నుంచి ఆన్లైన్లో చెల్లించడం తప్పని సరి చేయాలి.
3. ఇళ్ల వద్ద తడి, పొడి చెత్తను వేరు చేసేలా నియంత్రించండి. తద్వారా కార్మికులకు మురికి మరియు గాయాల ప్రమాదం తగ్గుతుంది.
4. సామాజిక రక్షణ కల్పిస్తూ, కార్మికులకు ఆరోగ్య, ప్రమాద, మరియు జీవిత భీమా సౌకర్యం అందించాలి.ఇందుకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలి.
5. కార్మికులకు ఇంటి స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.
6. చెత్త సేకరించే వాహనాల నిర్వహణ కోసం ఏటా రూ.25,000 గ్రాంటు ఇవ్వాలి.
ఉపాధి హామీ కార్మికుల డిమాండ్లు :
1. జాతీయ గ్రామీణ ఉపాధి హమి కూలీలకు పని ప్రదేశంలో కనీస వసతులు నీరు,నీడ,వైద్య సౌకర్యాలు హక్కుగా కల్పించాలి.
2. వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులకు రైతు బెమా తరహాలో సామాజిక భద్రత కల్పించాలి.
3. ఉపాధి హమి కూలీలను ఇ - శ్రమ్ లో నమోదు చేయాలి. వారికి సాంఘిక సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
ఇతర అసంఘటిత కార్మికుల డిమాండ్లు :
2) భవన & ఇతర నిర్మాణ కార్మికులు వారి పని స్థలంలో , ఇతర ప్రైవేట్ రంగ కంపనీలలో పని చేస్తున్న కార్మికులు వారి పని స్థలంలో ప్రమాద మరణానికి గురైతే, వారి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలి.
3) ప్రసూతి మరియు వివాహానికి రూ,, 90 వేల చొప్పున పెంచాలి.
4) కార్మికులు సంక్షేమ బోర్డు నుండీ సంక్షేమ బెనిఫిట్స్ కై దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లో క్లెయిమ్ ను పరిష్కరించాలి .
5) బీడీ కార్మికులకు కార్మిక భృతి రూ,,4016 అమలు చేయాలి. వారి ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని బీడీ కార్మికులకు ప్రత్యాన్మయ ఉపాధి కల్పించాలి. మానిఫెస్టో లో హామీ ఇచ్చినట్లుగా బీడీ కార్మికులకు 2014 పి. ఎఫ్ కటాఫ్ తేదీని తొలగించి చేయూత పెన్షన్ వెంటనే అందించాలి.
6) అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం అమలుకై నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలి.
ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల డిమాండ్లు :
1. TGRTC సంస్థలో కార్మిక సంఘాల పునరుద్ధరణ కు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. వారి వేతన బకాయిలను చెల్లించాలి.
2. సింగరేణి లో కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి.
3. అన్ని యూనివర్సిటీలలో బోధనేతర సిబ్బందిని అవుట్ సోర్సింగ్ చేయకుండా , ఆయా యూనివర్సిటీ లే పర్మినెంటు కార్మికులుగా నియమించుకోవాలి. వారికి కనీస వేతనాలు చెల్లించాలి. ఇతర సాంఘిక బధ్రత సౌకర్యాలు అమలు చేయాలి.
ఈ మోమోరాండం పై ప్రొఫెసర్ హరగోపాల్ (TPJAC కన్వీనర్) , ఎస్.జీవన్ కుమార్ (HRF జాతీయ నాయకులు), మీరా సంఘమిత్ర ( NAPM జాతీయ కమిటీ సభ్యులు ), ఖలీదా ఫర్వీన్ ( NAPM రాష్ట్ర నాయకులు ), Dr. ఉస్మాన్ (APCR రాష్ట్ర కో ఆర్డినేటర్ ), కన్నెగంటి రవి ( TPJAC కో కన్వీనర్ ) , పి.శంకర్ (దళిత బహుజన ఫ్రంట్ – DBF జాతీయ ప్రధాన కార్యదర్శి), సిస్టర్ లీజీ, ఫాలియా - తెలంగాణ గృహ కార్మికుల యూనియన్ (TDWU), మంజుల - గృహ కార్మికుల యూనియన్ (GUTS) నాయకులు , సామ్రాజ్యం (తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ), షేక్ సలావుద్దీన్ (గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ), ఎస్. డి ఖలీల్ (TFTU రాష్ట్ర అధ్యక్షులు ) , సరస్వతి (సఫాయి కర్మచారి ఆందోళన్ నాయకులు ), జయలక్ష్మి అరిపిన (హైదరాబాద్ చెత్త సేకరించే కార్మికుల కలెక్టివ్) సంతకాలు చేశారు.