ఎర్ర జెండా ఏటు పోయింది, కాషాయమవుతున్న ఉత్తర తెలంగాణ

ఇవాళ్ళ ఉత్తర తెలంగాన చాలా పట్టణాలలో, మండలాలలో పౌర సమాజమే లేకుండా పోయిందంటున్న తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్నెగంటి రవి;

Update: 2025-03-10 07:37 GMT

కొమురం భీమ్ అందించిన స్ఫూర్తితో, ఆదివాసీలు విప్లవ చైతన్యంతో ఉద్యమించి, ఇంద్రవల్లి ని సృష్టించిన ఆదిలాబాద్ అడవులలో దశాబ్ద కాలం క్రితమే కాషాయ మూకలు ప్రవేశించి, బలపడ్డాయంటే కలవరపడ్డాం. నిర్మల్ జిల్లా భైంసా లాంటి ప్రాంతంలో మత కల్లోలాల మీద ఆశలు పెట్టుకునే సంఘ్ పరివారం, 2024 నాటికి ఉత్తర తెలంగాణ అంతా బీజేపీ పార్టీ మొత్తం పార్లమెంటు స్థానాలను గెల్చుకునేలా విస్తరించిందంటే ఆందోళన చెందాం.

తాజాగా చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా విద్యార్ధులకు జ్ఞానం అందించాల్సిన ఉపాధ్యాయులు భారీగా ఓట్లు వేసి, గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎం. ఎల్. సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధులను గెలిపించారంటే సమకాలీన పరిస్థితి ఎక్కడికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఫాసిస్టు మూకలను అడ్డుకోవడం గురించి మనం ఇంకా చర్చలలో మునిగే ఉన్నాం. వాళ్ళు చాప క్రింద నీరులా రాష్ట్రమంతా విస్తరిస్తున్నారు.

సిరిసిల్ల, వేములవాడ రైతాంగ పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర ల గురించి మనం మురిసిపోతూ మాట్లాడుకుంటాం. ఉత్తర తెలంగాణ నక్సలైట్ ఉద్యమాల గురించి మన అల్లం రాజయ్య రాసిన రచనలను పదే పదే ముద్రించి చదువుకుని ఆనందపడతాం. కానీ ఉత్తర తెలంగాణ లో మారిన పరిస్థితుల గురించి , ప్రజల ఆలోచనలలో వస్తున్న మార్పు గురించి మనకు స్పృహే లేదు.

సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ ప్రతిఘటనా పోరాటాలను అణచివేయడానికి నాడు, ఆయా ప్రాంతాలను పాలక పార్టీలు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించాయి కానీ, నిజానికి ఇవాళ బీజేపీ పార్టీ విస్తరణతో , ఉత్తర తెలంగాణ ప్రాంతం కాషాయీకరణ చెందింది. హిందూ,ముస్లిం కల్లోలాలకు, దళితులపై దాడులకు పునాది వేసింది.

ప్రజాస్వామిక, లౌకిక, సమానత్వ స్పృహను తెలంగాణ ఎందుకు కోల్పోయింది ? ఎప్పుడు కోల్పోయింది? ఈ ప్రశ్నలు మనం వేసుకుని జవాబులు వెతుక్కోవాలి. స్వీయ పరిశీలనతో తప్పులను గుర్తించాలి. సవరించుకోవాలి.

ఉత్తర తెలంగాణ లో ఒకప్పుడు, రైతాంగ ఉద్యమాలు ఊరూరా దొరల గడీల దౌర్జన్యాన్ని ఎదిరించాయి. గ్రామీణ భూస్వాములను గ్రామాల నుండీ తరిమి కొట్టాయి. భూస్వాముల భూముల్లో ఎర్ర జండాలు నాటాయి. భూములను ఆక్రమించుకుని పేదలకు పంచాయి. నోరు లేని ప్రజలను నినదించేలా చేశాయి.

మహిళలపై అత్యాచారాలు చేసిన దొరలను ఉరికించి కొట్టాయి. లక్షలాది బీడీ కార్మికులను కూడగట్టి బలమైన సంఘాల నిర్మాణం చేశాయి. సింగరేణి వ్యాపితంగా విప్లవ శంఖం పూరించాయి. సంఘాల నేతృత్వంలో పాలేర్లు, వ్యవసాయ కూలీలు ఆత్మ గౌరవం చాటిన సందర్భాలెన్నో. వివిధ కులాలకు చెందిన కమ్యూనిస్టు కార్యకర్తల కులాంతర వివాహాలు వందల్లో జరిగాయి. గ్రామాలకు తరలండి నినాదంతో వందలాది మంది విద్యార్ధులు , గ్రామాలకు తరలి వెళ్ళి, ప్రజలలో మమేకమయ్యారు. ప్రభుత్వాల వర్గస్వభావాన్ని, సమస్యలపై శ్రామిక ప్రజలు ఐక్యంగా ఉద్యమాలు సాగించాల్సిన అవసరాన్ని విప్పి చెప్పారు.

గమనించాల్సింది ఏమంటే, తెలంగాణ ప్రజలతో, విప్లవ పార్టీలు మమేకమై పని చేస్తున్నప్పుడు , ఈ ప్రాంతంలో బీజేపీ రాజకీయంగా ఈ స్థాయిలో ఎదగలేదు. సంఘ్ మూకలు సైద్ధాంతికంగా ఈ స్థాయిలో గ్రామ గ్రామానా విస్తరించలేదు. ఇది అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. చరిత్రను సరిగ్గా జ్ఞాపకం పెట్టుకోవడం, ఎప్పుడైనా భవిష్యత్తుకు మేలు చేస్తుంది.

పౌర హక్కుల ఉద్యమ నాయకుడు గోపి రాజన్నను సంఘ్ మూకలు హత్య చేసినప్పుడో, డాక్టర్ బాలగోపాల్ పై ABVP వాళ్ళు దాడి చేసినప్పుడో రాష్ట్రమంతా అట్టుడికింది. ఇది మరోసారి జరిగేందుకు వీల్లేదని పౌరహక్కుల సంఘం ప్రకటించింది. 1970,1980 దశకాలలో ఉత్తర తెలంగాణ అంతటా , వివిధ పట్టణాలలో, కాలేజీలలో RSU, PDSU లాంటి విప్లవ విద్యార్ధి సంస్థల నేతృత్వంలో బీజేపీ అనుబంధ విద్యార్ధి సంఘం ABVP రౌడీయిజాన్ని తరిమి కొట్టిన ఘటనలు ఎన్నో. జననాట్యమండలి, అరుణోదయ పాటల క్యాసెట్లు ఊరూరా మారుమోగిన తీరు ఇంకా చెవుల్లో గింగురు మంటూనే ఉంది.

1990 దశకం భారత దేశం లోనూ, తెలంగాణ లోనూ అత్యంత కీలకమైనది. పాలక వర్గాలు నూతన ఆర్ధిక, పారిశ్రామిక విధానాలను ప్రవేశ పెట్టాయి. దేశ వ్యాపితంగానూ, తెలంగాణ లోనూ, ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా ప్రైవేట్ పరమయ్యాయి. లేదా మూతపడ్డాయి. విద్యా రంగంలో ఈ ప్రైవేటీకరణ విశ్వ రూపం దాల్చింది. విద్యార్ధులలో విభజన ప్రారంభమైంది. కొద్దిపాటి ఆర్ధిక, సామాజిక, రాజకీయ స్థోమత ఉన్న వాళ్ళ పిల్లలందరూ ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టారు. అక్కడ విద్యార్ధి సంఘాలకు స్థానం లేకుండా పోయింది. నిరుపేదల పిల్లలు మాత్రమే ప్రభుత్వ స్కూల్స్ లో , కాలేజీలలో మిగిలారు. గత ముప్పై ఏళ్లలో ఈ అంతరాలు మరింత పెరిగిపోయాయి. ప్రభుత్వ స్కూల్స్ లో టీచర్లు కూడా సామాజిక బాధ్యత కోల్పోయి, ఉత్త విద్యారంగ ఉద్యోగులుగా మిగిలారు.

1980 దశకం చివరిలో, 1990 దశకంలో ప్రభుత్వాలు కూడా విప్లవోద్యమంపై నిర్బంధాన్ని పెంచాయి. ఎన్ కౌంటర్లు భారీగా పెరిగాయి. వందలాది మంది కార్యకర్తలు బూటకపు ఎన్ కౌంటర్లలో చనిపోయారు. మిగిలిన వాళ్ళు రక్షణ వెతుక్కుంటూ, ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఇదే కాలంలో విప్లవ పార్టీల మధ్య తగాదాలు, సంఘర్షణలు, పరస్పర దాడులు మరెంతో మంది మరణాలకు కారణమయ్యాయి. ఈ స్థితి ఉత్తర తెలంగాణ ఎక్కువ చవి చూసింది. విప్లవ పార్టీల మధ్య పూడ్చుకోలేనంత అగాధం ఏర్పడింది. రైతాంగ ఉద్యమాలు బలహీన పడ్డాయి. విద్యార్ధి సంఘాలు బలహీన పడ్డాయి. సాంస్కృతిక రంగం చిన్నాభిన్నమైంది. పౌర హక్కుల రంగంలో పని చేసే కార్యకర్తల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇవాళ్ళ ఉత్తర వతెలంగాన చాలా పట్టణాలలో, మండలాలలో పౌర సమాజమే లేకుండా పోయింది.

విప్లవోద్యమ ప్రభావంతో ఊళ్లు వదిలి వెళ్ళిపోయిన భూస్వాములు, మళ్ళీ గ్రామాలకు తిరిగి వచ్చారు. ఎర్ర జండాలు పాతి, పేదలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఊరికి చేరిన దొరలు బీజేపీ, కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలలో చేరి ఆయా పార్టీల అభివృద్ధికి పని చేశారు. 2002 లో KCR నేతృత్వంలో తెరాస పార్టీ ఏర్పడిన తరువాత చాలామంది భూస్వాములు ఆ పార్టీలో కూడా చేరారు.

ఈ పాలక పార్టీలకు లౌకిక స్వభావం లేదు. ప్రజాస్వామిక లక్షణం లేదు. ఓట్లు, సీట్ల కోసం , రాజకీయ ప్రయోజనాల కోణంలో రాజకీయాలు చేయడం తప్ప, వివిధ మత విశ్వాసాలకు చెందిన ప్రజల మధ్య , కులాల మధ్య ఐక్యతను కాపాడాలనే చిత్త శుద్ది కూడా లేదు. ఈ పరిస్థితి సంఘ్ మూకల విస్తరణకు పునాదిగా ఉపయోగపడింది. కొన్ని ప్రాంతాలకు పరిమితమైన ఈ సంఘ్ మూకలు ఉత్తర తెలంగాణ ప్రాంత మంతా విస్తరించడానికి, విప్లవ పార్టీలు బలహీన పడడం, అవకాశవాద పాలక పార్టీలు బలపడడం ఒక ప్రధాన కారణంగా పని చేసింది. దేశ వ్యాపితంగా బీజేపీ బలపడుతున్న కొద్దీ, ఉత్తర తెలంగాణ లో కూడా ఈ అవకాశవాద రాజకీయ నాయకులు, ఆ పార్టీలో కూడా చేరి, తమ స్వార్ధ ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు.

ఉత్తర తెలంగాణ వ్యవసాయ రంగంలో కూడా తీవ్ర మార్పులు వచ్చాయి. గత 7 దశాబ్ధాలలో నీటి పారుదల సౌకర్యాలు విస్తరించడంతో, మెట్ట పంటల స్థానంలో సాగు నీరు ఎక్కువ అవసరమైన పత్తి, వరి,మొక్క జొన్న, సోయా లాంటి వాణిజ్య పంటలు విస్తరించాయి. రసాయనాల వినియోగం భారీగా పెరిగింది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి, వ్యవసాయ కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి. స్వంత భూములు ఉన్న వాళ్ళు అదనపు ఆదాయాన్ని ఆశిస్తూ, నగరాలకు, సింగరేణి లాంటి ఇతర రంగాలలో ఉద్యోగాలకు, గల్ఫ్ దేశాలకు తరలిపోవడంతో ఆయా భూములను కొత్త సామాజిక వర్గాలు కౌలుకు తీసుకుని సాగు చేయడం పెరిగింది. పంటల సాగు ఖర్చులు పెరిగిపోవడం, వాణిజ్య పంటలలో నష్టాలు, కౌలు రైతులకు గుర్తింపు లేక పోవడం తదితర కారణాల వల్ల ఉత్తర తెలంగాణ లో రైతుల ఆత్మహత్యలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఉద్యమ కేంద్రాలుగా ఉన్న అనేక గ్రామాలలో ఇప్పుడు రైతుల ఆత్మహత్యా బాధిత కుటుంబాలు ఉన్నాయి.

నిజాం సుగర్స్ లాంటి పాత ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూత పడ్డాయి కానీ, కొత్తగా రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు పెరిగాయి. తాజాగా వరి, మొక్క జొన్న ఆధారిత ఇథనాల్ పరిశ్రమలు ఉత్తర తెలంగాణ వ్యాపితంగా ఏర్పడుతున్నాయి. కొత్త పరిశ్రమలు వస్తున్నా, వాటిలో స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేకుండా పోయింది. వ్యవసాయంతో సహా, అన్ని రంగాల లోకీ , ఇతర రాష్ట్రాల నుండీ చవక కూలీలు వచ్చి, రాష్ట్ర మంతా విస్తరిస్తున్నారు. తగిన నైపుణ్యాలు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ పై అవగాహన లేకా, తగినన్ని ఉపాధి అవకాశాలు లేకా , నష్టాలలో కూరుకుపోయిన వ్యవసాయ రంగంలో ఉపాధి ఎంచుకోవడం ఇష్టం లేకా, ఈ ప్రాంత యువత ఎక్కువ భాగం నిరుద్యోగులుగా ఉంటున్నారు. కేవలం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం, వాటి నోటిఫికేషన్ ల కోసం ఎదురు చూస్తున్నారు. సరైన వ్యాపకం లేక, మద్యం, డ్రగ్స్ లాంటి వ్యాసనాలకు బానిసలవుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఉత్తర తెలంగాణ పర్యావరణం కూడా అన్ని విధాలా ప్రమాదపు అంచులలో ఉంది.

మారిన ఈ పరిస్థితులను అర్థం చేసుకుని , ప్రజలను చైతన్య పరచడానికి, సరైన డిమాండ్లతో ప్రభుత్వాలపై సమస్యల పరిష్కారానికి ఒత్తిడి పెంచడానికి, తద్వారా ప్రజాస్వామిక ఉద్యమాలను బలపర్చడానికి ప్రస్తుతం ఉత్తర తెలంగాణ లో అవకాశాలు మెండుగా ఉన్నా, క్షేత్ర స్థాయిలో పని చేసే రాజకీయ సంస్థలు , కార్యకర్తలు, నాయకులు లేకుండా పోయారు. ఈ బలహీనతను గుర్తించకుండా ముందుకు వెళ్ళడం అసాధ్యం.

ప్రజల పట్ల ప్రేమ, పర్యావరణ స్పృహ, ప్రజాసామ్యం పట్ల గౌరవం, వివిధ రకాల దోపిడీలకు, వివక్షకు వ్యతిరేకంగా ఉత్తర తెలంగాణ లో కూడా శ్రామిక వర్గ ఉద్యమాలను నిర్మించాలనే నిబద్ధత ఇందుకు అవసరం. ఉద్యమాల చరిత్ర పట్ల ఆపేక్ష ఉండడం అవసరమే కానీ, వర్తమానంలో ఏమి చేయాలనే ఆలోచన, అందుకు తగిన కృషి చాలా ముఖ్యం. మాకు అన్నీ తెలుసనే అహంభావం వదిలేసుకుంటే, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది అర్థమవుతుంది. ప్రగతిశీల శక్తుల ఐక్యత అవసరాన్ని గురించి ఉపన్యాసాలు ఇవ్వడం సరిపోదు , క్షేత్రస్థాయిలో అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించడం తక్షణావసారం.

ఉత్తర తెలంగాణ లో ఉద్యోగులు, చదువుకున్నవాళ్ళు, ఉపాధ్యాయులు ఎక్కువమంది బీజేపీకి ఓటేశారని అనుకుంటే, కొంత వరకూ అర్థం చేసుకోవచ్చు. ప్రపంచీకరణ ప్రభావంతో సామాజిక బాధ్యత కోల్పోయి ఈ శక్తులలో మెజారిటీ , చాలా కాలం క్రితమే సాధారణ ప్రజలకు దూరమయ్యారు. వీళ్లలో నిండి పోయిన స్వార్ధ ఆర్ధిక ప్రయోజనాలు ఒక్కటే కాదు, సంఘ్ పరివార్, బీజేపీ ప్రవచిస్తున్న హిందూత్వ భావజాలం కూడా ఈ శ్రేణులను తొందరగా తమ వైపు లాక్కుంది. ముస్లిం లపై ద్వేషం, ప్రైవేటీకరణపై మోజు ఏక కాలంలో ఈ శక్తులు కలిగి ఉంటాయి. సరైన చరిత్ర అధ్యయనం, శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండడం కాక, వాట్సప్ యూనివర్సిటీ విద్యా బోధనపై మక్కువ కలిగి ఉండడం వీరి లక్షణం.

మనం ఆందోళన చెందవలసింది , వీళ్ళు ఇలా ఎలా మారారు అని కాదు, వీళ్ళ చేతుల్లో ఉండే లక్షలాది మంది తెలంగాణ విద్యార్ధుల భవిష్యత్తు ఏమి కానుంది అనేది.. భవిష్యత్ ప్రయోజనాల దృష్టితో, సంఘ్ పరివార్ కు పిల్లలపై దృష్టి పెట్టే లక్షణం మొదటి నుండీ ఉంది. సరస్వతి శిశు మందిర్ , గ్రామాలలో, బస్తీలలో సంఘ శాఖలు, ఆదివాసీ ప్రాంతాలలో వనవాసీ కళ్యాణ పరిషత్ లాంటి సంస్థల ఏర్పాటు, రాష్ట్ర మంతా ప్రజ్ఞాభారతి లాంటి సంస్థలు చురుకుగా పని చేయడం, వ్యవసాయ రంగం,లో ఏకలవ్య ఫౌండేషన్ లాంటి సంస్థలు చురుకుగా ఉండడం. ప్రగతిశీల శక్తులకు ఎప్పుడూ తెలంగాణ లో నిరంతరాయంగా అలాంటి ప్రత్యామ్నాయ కృషి చేసిన అలవాటు లేదు.

ప్రగతి శీలశక్తులు ఆలోచించినంతగా, మాటలు చెప్పినంతగా ఆచరణ లోకి దిగడం లేదు. అదే పెద్ద వైఫల్యం. ఫాసిస్టు శక్తులు తెలంగాణలో పెరగకూడదని అందరికీ ఆశే కానే, దాని కోసం ఆచరణలో ఏమి చేయాలనేది , అంతుబట్టని ప్రశ్నగా చాలా మందికి ఉంది. లౌకిక వాద పాలక వర్గ పార్టీలు బీజేపీని నిలువరిస్తాయని ఆశించడం అత్యాశే అవుతుంది. గతంలో ఆ పని KCR చేయలేదు. ఇప్పుడు రేవంత్ చేయడు. పైగా ఈ పాలక వర్గ పార్టీలు, తమ పాలన వైఫల్యంతో బీజేపీ బలపడడానికి కావలసిన వాతావరణాన్ని పెంచి పోషిస్తాయి.

శ్రామిక ప్రజల మధ్య ఐక్యత , తెలంగాణ లో ప్రజాస్వామ్యం కోరుకునే ఎవరయినా తక్షణ కార్యాచరణకు సిద్దం కావాలి. మొదట అన్ని స్థాయిలలో నిజాయితీగా ఆలోచించే సంస్థల మధ్య, ఆయా వ్యక్తుల మధ్య ఐక్య కార్యాచరణకు అవసరమైన ఐక్యతను సాధించడం. ఇది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరగాలి. స్కూల్ నుండీ యూనివర్సిటీ వరకూ విద్యా రంగంలో ఈ అంశం ఎజెండాగా ప్రత్యేక కృషి జరగాలి.

ప్రజల సమస్యలు ఎపుడు ముందుకు వచ్చినా, వారి పోరాటాలు ఎప్పుడు బద్దలైనా, వాటికి బేషరతుగా మద్దతు ప్రకటించాలి. ఇప్పుడు అది జరగడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉంది కనుక, మనం ప్రజల పోరాటాలకు మద్ధతు ఇస్తే, అది ఈ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచి, బీజేపీ రాజకీయంగా బలపడుతుంది అనే వాదన కూడా సరైంది కాదు.

మనం ప్రజల సమస్యల పట్ల, పోరాటాల పట్ల సరిగా స్పందించకపోతేనే, వారి ఉద్యమాలకు దూరంగా ఉండి , మౌనంగా ఉంటేనే మరింత ఎక్కువ ప్రమాదం. సమస్యలు సృష్టించే అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఎప్పుడైనా, తమకు తోచిన ప్రతిపక్ష పార్టీని ఎన్నుకుని ముందుకు వెళ్లిపోతారు. మన కోసం ఆగరు. అందుకే సరైన శక్తు,లు ఉద్యమాల ముందు వరసలో ఉంటే ప్రజలు వారిని తప్పకుండా అనుసరిస్తారు. లౌకిక, సమానత్వం, ప్రజాస్వామిక స్పృహలను కోల్పోకుండా కలిగి ఉంటారు. ఉద్యమాలను ఉపయోగించుకుని, రాజకీయంగా లాభ పడదామని ఆలోచించే బీజేపీ, BRS లాంటి తప్పుడు శక్తులు బలపడకుండా ఉంటాయి.

గ్రామీణ యువత అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టడం, ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీలు ఎదుర్కుంటున్న ప్రత్యేక సమస్యలపై కృషి చేయడం, వెనుక బడిన వర్గాలు, దళితులు వ్యక్తం చేస్తున్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ ఆకాంక్షలను బలపర్చడంతో పాటు , ప్రజా ఉద్యమాలు, రాజ్యాంగ విలువల రక్షణ తోనే వాటిని సాధించడం సాధ్యం అవుతుందనే అవగాహన కల్పించడం అవసరం. ఇదే సమయంలో సమాజంలో విస్తరిస్తున్న హిందుత్వ భావజాలం కారణంగా వంటరవుతున్న ముస్లిం ప్రజలకు భరోసా ఇవ్వడం, వారిని వివిధ సామాజిక, రాజకీయ ఉద్యమాలలో భాగస్వాములను చేయడం కూడా మన బాధ్యత .

రాజ్యాంగ రద్ధు కోసం పని చేసే బీజేపీ పట్ల ఆయా వర్గాలు మెలకువగా ఉండాలని ప్రజలను హెచ్చరించాలి. ప్రజల కోసం కాకుండా, కార్పొరేట్ సంస్థల ఆర్థిక ప్రయోజనాల కోసమే బీజేపీ పని చేస్తుందని ఉదాహరణాలతో ఓపికగా వివరించాలి. ఇందుకోసం, మొత్తంగా శ్రామిక ప్రజలను అంటి పెట్టుకుని ఉండడం అవసరం. పాలక వర్గాలు సాగించే నియంతృత్వ పోకడలను , హిందుత్వ మూకల వ్యాప్తిని అడ్డుకోవాలంటే, ప్రజలు ఐక్యంగా సాగించే ఉద్యమాలే శరణ్యమని నమ్మాలి.

Tags:    

Similar News