అనైతిక గర్భసంచి తొలగింపు ఆపలేమా?
డాక్టర్ సామవేదం వేంకట కామేశ్వరి రాసిని ‘గర్భసంచిని కాపాడుకుందాం’ పుస్తకం రాజ్యలక్ష్మి పొన్నపల్లి సమీక్ష;
రాజ్యలక్ష్మి పొన్నపల్లి
సమాజంలో స్త్రీల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయబడుతోంది అనేది ఒక వాస్తవం. సమాజంలో స్త్రీ ఆరోగ్యానికి ఇచ్చే విలువ, ఆ స్త్రీకి సమాజం ఇచ్చే ప్రాధాన్యత పై ఆధారపడి ఉంటుంది.అందువల్ల తక్కువగా చూడబడే స్త్రీ ఆరోగ్యం విలువ కూడా తక్కువగానే ఉంటుంది.ఒకప్పుడు బాగా పనిచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సైతం ఇప్పుడు నిర్వీర్యమై పోయాయి. ఈ రోజున స్త్రీల శరీరాలు ప్రయోగ శాలలుగా మార్చబడ్డాయి.ఆధునిక వైద్యం వాణిజ్యం గా మారిపోయిన తర్వాత ప్రజలకు వైద్యం అనేది అందని ద్రాక్ష పండే అయింది.ప్రభుత్వాసుపత్రులు నామమాత్రమైపోయిన ఈ సందర్భంలో ప్రభుత్వాలు స్త్రీ ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నాయో పరిశీలిస్తే,ఆశ్చర్యకరమైన వాస్తవాలు కనబడతాయి.
వైద్యులు స్త్రీల జీవితాలతో, ఆరోగ్యాలతో చెలగాటమాడుతన్న ఈ సందర్భంలో డా.సామవేదం వెంకటకామేశ్వరి ,సూర్యప్రకాష్ దంపతులు 2001 లో మెదక్ జల్లా సదాశివపేట లో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నప్పుడు మునిపల్లె మండలం లోని దాదాపు 20 గ్రామాలలో 171 మంది కి గర్భసంచి లు అతిపిన్న వయస్సులోనే తొలగించారని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈ ఘోరమైన అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలనే పట్టుదలతో చిత్తశుద్ధితో LIFE HRG సంస్థ ద్వారా మెడికల్ ఎథిక్స్ విభాగంలో దీన్ని ఒక కేసు క్రింద తీసుకుని (2009-12) మధ్య కాలంలో ఈ అంశాన్ని చర్చించింది.
“ గర్భసంచి కాపాడుకుందాం సమాజాన్ని బలపరుద్దాం “అనే ఈ పుస్తకాన్ని మొదట 2017 సంవత్సరం లో ప్రచురించారు. తెలంగాణా ప్రభుత్వ సహకారంతో 2018 సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరోగ్యసిబ్బందికి,ఆశా వర్కర్లకు, మహిళాసమాఖ్య సభ్యులకు,81 గ్రామాలలో 16000 మందికి పైగా స్త్రీలకు పెద్ద ఎత్తున గర్భసంచి ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు.అంతే గాక రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక పాఠశాలల్లో, కాలేజీలలో విధ్యార్ధినులకు గర్భసంచి ప్రాధాన్యత గూర్చి వివరించారు.
ఇక జాతీయస్ధాయిలో దేశంలో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.ప్రాదివాలా ధర్మాసనం 2023 ఏప్రియల్ 5న గర్భసంచి తొలగింపు ఆపరేషన్లను కట్టడిచేస్తూ 3 నెలల కాల వ్యవదిలో రాష్ట్రప్రభుత్వాలు,కేంద్రపాలితప్రాంతాలలో అమలుచేయాలని కేంద్రప్రభుత్వం ఆరోగ్యశాఖకు మార్గదరర్శకాలు జారీచేసింది.అయినా ఇంతవరకు క్శేత్రస్ధాయిలో ఎటువంటి చర్యలు అమలులోకి రాలేదు.
వీరి కృషి ఫలితంగానే ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పథకాలలో, అప్పటివరకు విచ్చలవిడిగా అమలవుతున్న అనవసర గర్భసంచిల ఆపరేషన్లను గతంలో 2011లో ఉమ్మడి ఆంధ్ర పదేశ్ ప్రభుత్వం తొలగించింది.ఈ మధ్య మళ్ళీ గర్భసంచి తొలగింపు ఆపరేషన్ లను రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లో ప్రవేశపెట్టబడిందని తెలుసుకున్న డా.కామేశ్వరి 2022 న ఆం.ప్ర.రాష్ర ప్రభుత్వ ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ విభాగాల ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకురావటం తో తక్షణమే స్పందించి ఆరోగ్యశ్రీ నుంచి ఈ ఆపరేషన్ లను తొలగించడం జరిగింది.
ఈ పుస్తకం మొదటి ముద్రణను 2017 ఆగస్ట్ లో తీసుకు వస్తే, ఆ తరువాత మలి ముద్రణను అదనపు సమాచారంతో 2024 ఆగస్ట్ లో తీసుకు వచ్చారు. ఈ పుస్తకం లో 12 అధ్యాయాలు ఉన్నాయి.ఈ కింది ఆంశాలను సులభంగా స్త్రీలకు అర్ధమయ్యే విధంగా వివరించారు.
1. ఎటువంటి ఆధారాలు లేకుండా అనైతికంగా గర్భసంచి తోలగింపులు
2. గర్భసంచి స్త్రీల ఆరోగ్యానికి సూచికగా ఎలా ఉంది?
3. పునరుత్పత్తి అవయవాల మధ్య సమన్వయం
4. ఎముకల గట్టిదనానికి ఖనిజాలకు మధ్య సంబంధం
5. గర్భసంచి అండాశయాల పాత్ర
6. హెబ్.పి.వి,పాప్ స్మియర్ పరిక్షల ప్రాధాన్యత
7. ఆరోగ్య విషయాల్లో స్త్రీలకు నిర్ణయాధికార ఆవశ్యకత
8. కౌమారదశలో స్త్రీల సమస్యలు
9. క్షేత్రస్థాయి పరిశోధన-ఫలితాలు
10. గర్భసంచి తొలగించిన స్త్రీ ల ఆరోగ్య భద్రతకు తక్షణ చర్యల ఆవశ్యకత గూర్చి, సవివరంగా తెలియచేసారు.
అమెరికాలో ఈ “ గర్భసంచి తొలగింపు” ఆపరేషన్ లు ప్రతి 10,000 మందిలో 55 మందికి జరిగితే,ఇంగ్లండ్ లో కేవలం 20మందికి మాత్రమే ఈ ఆపరేషన్ లు జరిగాయి.కాని ఎంతో అభివృద్ది చెందిన విగా,ఘనంగా చెప్పుకుంటున్న మన రెండు తెలుగు రాష్రాలలో మాత్రం 10,000 మందిలో 920 మందికి ఈ ఆపరేషన్ లు జరిగాయంటే,అది కూడా స్త్రీలకు 29 ఏళ్ళ వయస్సు లోనే చేస్తున్నారంటే ,స్త్రీల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలనిర్లక్ష్య వైఖిరి కి అద్దం పడుతోంది. .
చిన్న చిన్న సమస్యలకు అనవసర గర్భసంచి తొలగింపులు:
ఈ పుస్తకం లో కామేశ్వరి స్త్రీ శరీర నిర్మాణం గురించి,అవి చేసే విధుల గురించే కాకుండా స్త్రీలకు తమ శరీరాల పట్ల ఉన్న అవగాహన లేమిని,దానిని సొమ్ము చేసుకునే వైద్యులను కూడా ప్రశ్నిస్తారు.స్త్రీలకు తమ శరీరాల పట్ల ఉండాల్సిన కనీస పరిజ్ఞానాన్నిఅందిస్తూనే,చిన్న,చిన్న కారణాల తోనే (మందులతోనే నయం చేసే లక్షణాలకు కూడా భయపడి) వైద్యుల వద్దకు వెళ్ళటం వారు మరింత భయభ్రాంతులకు గురి చేయటం,దానికి గర్భసంచి యే ప్రధాన కారణంగా చూపుతూ తొలగించటమనేది వైద్యరంగం లోనే అనైతిక చర్య గా భావిస్తారు .నిజానికి ఈ సమస్యను గుర్తించటం ఎంత అవసరమో,ఈ సమస్యకు కారణమైన మూలాలను అంతే లోతుగా అధ్యయనం చేయాలంటారు.
ఈరోజన వైద్యరంగం లో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, ఆధునిక వైద్యవ్యవస్థ,పునరుత్పత్తి విషయంలోనూ,స్త్రీల ఆరోగ్య విషయం లోనూ నిర్లక్ష్యం చేయబడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తారు.సాధారణం గా ఎదుర్కొనే తెల్లబట్ట,దురద ,దుర్వాసన, పొత్తికడుపు నొప్పి , వళ్ళునెప్పులు,నీరసం లాంటి కారణాలతో స్త్రీలు గర్భసంచి ని తొలగించుకుంటున్నారని, దానివల్ల స్త్రీల జీవితాలు మరింత దుర్భరంగా మారుతున్నాయని దాన్ని ఎవరు సరిచేస్తారు?అని నిలదీస్తారు.తొలగించిన అవయవాల పనులను అవి స్రవించే హార్మోన్ల లను ఎలా భర్తీ చేస్తారు? అని ప్రశ్నిస్తారు.
మనదేశంలో ఉన్న సాంఘిక,ఆర్ధిక,లైంగిక, అసమానతల వల్ల స్త్రీలు నివసించడానికి అత్యంత ప్రమాదకరంగా చెప్పబడిన ప్రపంచ దేశాలన్నింటిలో మనం నాల్గవ స్థానంలో ఉన్నామంటారు.అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వారు సైతం మన దేశం లోనే అధికంగాఉన్నారని అంటూ,.
స్త్రీలు తమ అవగాహనలేమి వల్ల డాక్టర్ల తప్పుడు సలహాల వల్ల, కాన్చర్ వస్తుందేమోననే భయం వల్ల,పిల్లలు పుట్టిన తర్వాత గర్భసంచి అవసరం లేదనే తప్పుడు అభిప్రాయాల వల్ల స్త్రీల్లు తమ పునరుత్పత్తి అవయవాలను తొలగించుకుంటున్నారు. ఈ విషయం గురించి కామేశ్వరి, అసలు పునరుత్పత్తి అవయవాల పనితీరు గురించి మనకు అవగాహన కలిగిస్తారు. పునరుత్పత్తి అవయవాలైన గర్భసంచి,అండాశయాలు ,అండవాహికలు కలిసి ఒక వ్యవస్థగా పనిచేస్తాయని,.ఇవన్నీ కలిసి ఒక క్రమపద్ధతిలో పనిచేయడానికి శరీరంలోని ఇతర
అవయవాలు అక్కడ స్రవించే హార్మోన్లు తోడ్పడతాయని,.ఇక్కడ తయారయ్యే హార్మోన్లు శరీరం అంతటా వ్యాపించి జీవక్రియలు సక్రమంగా జరిగేటట్లు, శరీరం ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తాయని అంటారు.
రుతుక్రమంలో వచ్చే సమస్యలు:
అలాగే రుతుచక్రంలో వచ్చే మార్పులు గురించి వివరంగా ప్రస్తావిస్తూ,తెల్లబట్ట గరించి న అపోహలను తొలగిస్తూ,అసలు తెల్లబట్ట కావటమనేది ఆర్యోగకరలక్షణమని, రుతుచక్రంలో తయారయ్యే హార్మోన్ల వల్ల యోని మార్గం ఎప్పుడూ తేమగా ఉండేటట్లు చేస్తూ తెల్లబట్టను స్రవించేలా చేస్తాయంటారు.ఆవిడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్తారు. గర్భసంచి సెర్విక్స్ కి సంబంధించిన పొర ఒకటి అప్పుడప్పుడు బయటికి వస్తుందని, అది ఎర్రగా ఉండటం వల్ల డాక్టర్లు సైతం దానిని కాన్సర్ పుండుగా భ్రమపడటం జరుగుతూ ఉంటుందని,అది కేవలం పొరపాటు మాత్రమేనని,కాని ఆ ప్రదేశంలో పొలసులతో కూడిన చర్మం మరల వస్తుందని ఆ ఎరుపు కూడా తగ్గుతుందని అంటారు.అందువల్ల స్త్రీలు చేస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని వాటి ఇబ్బందులకు కారణాలను వెదకకుండా,ఇది మందులతో పరిష్కారమయ్యే సమస్య ,కాదా అన్నది అలోచించకుండా హిస్టరెక్టమీ ఆపరేషన్ చేస్తే స్త్రీకి అన్యాయం చేసినట్లేనంటారు
మరి స్త్రీల ఆరోగ్యాన్ని ఇంతగా కాపాడే గర్భసంచిని తొలగిస్తే,స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడడానికి మరొక అవయవం ఆమె శరీరంలో లేదు.కిడ్నీ,గుండె లాంటి అవయవాలు మార్పిడి చేసినట్లుగా గర్భసంచిని మార్పిడి చేయడం ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా విజయవంతం కాలేదు.
అలాగే స్తీ జీవితం లో రుతుచక్రంలోని వివిధ దశలను వివరిస్తూ,అసలు పురుషుడి పునరుత్పత్తి అవయవాలతో పోలిస్తే,స్త్రీ పునరుత్పత్తి అవయవాలు వైవిద్యభరితంగానూ సంక్లిష్టంగానూ, కియాశీలకంగానూ ఉంటాయంటారు.ఇంతటి వైవిధ్యభరితమైన స్త్రీ శరీర నిర్మాణం స్త్రీకి రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది. ,1980 వరకు కూడా స్త్రీ లలో స్రవించే ఈస్ట్రోజన్ హార్మోన్ ను కేవలం పునరుత్పత్తి హార్మోన్ గానే భావించేవారట . ఆ తర్వాతర్వాత పరిశోధనల ద్వారా తెలిసిన విషయం,ఈస్ట్రోజన్ హార్మోన్ అండాశయ,గర్భసంచి ధమనులలో రక్తసరఫరాను పెంచడమే కాకుండా,ఈ రెండు కలిసి రక్తనాళాల వలయాలను ఏర్పాటు చేసుకుంటాయని.మరిఇంతటి విలువైన గర్భాశయ ధమనిని తొలగించటం వల్ల ఈ వలయం విఛ్ఛిన్న మవుతుంది.దీని వల్ల అండాశయ పనితీరులో దీర్ఘకాలంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఆధునిక వైద్యులకు కూడా తెలియదంటారు కామేశ్వరి. మరి అలాంటప్పుడు ఇంత బాధ్యతారహితంగా వైద్యులు ప్రవర్తించటమనేది క్షమించలేని నేరంగానే భావించాల్సి వస్తుంది.
చిన్న వయస్సులో మొనోపాజ్ వల్ల జరిగే నష్టాలు:
పునరుత్పత్తి అవయవాలకు, ఎముకల గట్టిదనానికి,వాటిలో ఉండే ఖనిజాలకు ఉన్న సంబంధాన్ని కూడా వివరిస్తారు.ముఫ్ఫైదు సంవత్సరాల వయస్సులో గరిష్ట స్థాయిలో కాల్షియం జమ అయిన స్త్రీలలో మెనోపాజ్ తర్వాత కూడా కొంత బలం తగ్గినా,ఎముకల పటుత్వం విరిగిపోయేంత బలహీనమవ్వదు.అలాంటప్పుడు 35 సంవత్సరాల లోపే గర్భసంచి,కొన్ని సందర్భాలలో అండాశయాలను కూడా తొలగించడం వల్ల ఎంతటి నష్టం వాటిల్లుతుందో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగతుంది.
అలాగే అండాశయాలు స్రవించే ఈస్ట్రోజన్ హార్మోన్ నిర్వర్తించే పనులను వివరిస్తూ,1980 ల నుండి వీటిపై విస్తృత పరిశోధనలు జరిగాయని,అవి- ఎముకలు,ఖనిజాలు, జీవక్రియల,బి.పి.రక్తప్రసరణ వ్యవస్థపై పనిచేసి,గుండెను,రక్తప్రసరణ వ్యవస్థను కాపాడటం మాత్రమే కాక బయటకు వచ్చే నాళం - మూత్ర విసర్జన స్వాధీనంలో ఉంచటం.
మానవ మెదడు ఒక సమాచారాన్ని గుర్తుంచుకునే పద్ధతి,పోషకాల శోషణ-జీవక్రియలను ఒక పద్ధతిలో నిర్వర్తించటం చేస్తూఉంటాయని కాబట్టి.మన శరీరం లోని హార్మోన్స్ ఇన్ని రకాల విధులు నిర్వర్తిస్తూ,స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతూ, స్త్రీకి ఒక రక్షణ కవచంగా ఉన్న ఈ పునరుత్పత్తి అవయవాలను ఎలాంటి ప్రాధాన్యత లేనివిగా భావించి తొలగిస్తున్న పరిస్థితుల్లో అసలు ఎలాంటి సందర్భాలలో ఈ అవయవాలను తొలగించవచ్చు అనే దానికి కామేశ్వరి-“కాన్సర్ కారకమైన బలమైన కుటుంబ చరిత్ర ఉన్నప్పుడు,క్యాన్సర్ కారక జన్యువులను గురించి క్యాన్సర్ గా ధ్రువపరిచినప్పుడు మాత్రమే ఈ అవయవాలను తొలగించాల్సి ఉంటుందని,చిన్న,చిన్న సమస్యలకు మందులతో తగ్గించవచ్చని అంటారామె.
అలాగే చిన్న వయసులోనే ఈ అవయవాలను తొలగించటంవల్ల(స్త్రీ సహజమైన శారీరక ప్రక్రియగా బహిష్టు ఆగిపోవటం కాకుండా) అకస్మికమైన మెనోపాజ్ రావడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయంటారు. .
క్యాన్సర్ గురించి అపోహలు,భయాలు ఉన్నప్పుడు శాస్త్రీయ పద్ధతిలో చేసే ఒక ముఖ్యమైన పరీక్ష (పాప్ స్మియర్) గురించి చాలా సమగ్రంగా వివరిస్తారు.ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కు ఈ పరీక్షను ఉపయోగిస్తారు.మూడు నిమిషాలలో చేసే ఈ పరీక్ష అందుబాటులో ఉన్నప్పుడు,క్యాన్సర్ పట్ల అనవసరమైన ఆందోళనలతో, భయాలతో గర్భసంచిని తొలగించుకొని అదనపు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటం అవసరమా? అని ప్రశ్నిస్తారు.
మన తెలంగాణా రాష్ట్రంలో స్త్రీల జనాభా 1,72,52,723.అందులో బాలికలు,45,54,845 . పునరుత్పత్తి వయస్సులో ఉన్న స్త్రీలు 96,79,547 మంది ఉన్నారు.పునరుత్పత్తి వయస్సులో ఉన్న స్త్రీలలో మనకు ప్రతి వంద మందిలో 9.2 మందికి గర్భసంచిని తొలగించే ఆపరేషన్ లు జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయని మన ముందుంచారు కామేశ్వరి.ఈ సర్వే పది సంవత్సరాల క్రితం జరిగిందని,ఆపరేషన్ లు జరిగిన వారిని మినహాయిస్తే మిగిలిన 87,89,029 మందికి ఈ ఆపరేషన్ లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన అవసరం సమాజం మీద,వైద్య వ్యవస్థ మీద ఉందంటూ, ఈ సమస్య కు ఉన్న మూడు పార్శ్వాల గురించి చర్చిస్తారు కామేశ్వరి.
1.గర్భసంచి తొలగించుకున్న స్త్రీల ఆరోగ్యం పై వచ్చే దుష్ప్రభావాలను లోతుగా పరిశోధించటం,వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తీసుకోవలసిన తక్షణ చర్యలగురించి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించటం జరగాలని కామేశ్వరి అభిప్రాయపడతారు.
2.గర్భసంచి ఉన్న స్త్రీల ఆరోగ్య రక్షణ ,వారికి సరైన సలహాలు,సూచనలు ఇవ్వటం ద్వారా అవసరం లేని గర్భసంచి ఆపరేషన్ లను జరగకుండా నివారించటం.
3.పైన సూచించిన రెండు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ముందు తరాల స్త్రీలకు ఈ రకమైన ఇబ్బందుల నుంచి నివారించగలగటం.Let it Flow అనే ఈ ప్రచా రానికి రూపకల్పన చేశారు Life HRGతరఫున కామేశ్వరి.
స్త్రీలు, బహిష్టు సమయం లో చికాకు ఉంటుందని,తెల్లబట్ట,పొత్తికడుపు నొప్పి లాంటి చిన్న,చిన్న సమస్యల కోసమో,లేక పిల్లలు పుట్టిన తర్వాత వాటి అవసరం తీరింది అనో గర్భసంచిని తొలగించుకోవటం అనేది స్త్రీలు చేజేతులా వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటమే అవుతుంది.
జననేంద్రియాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లకు కారణాలు:
అలాగే జననేంద్రియాలలో వచ్చే ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుతూ, సాధారణంగా స్త్రీలకు భర్తల నుంచి సంక్రమిస్తాయి. దీని నివారణకు భార్యాభర్తలిరువురు యాంటిబయాటిక్ మందులు వాడాల్సి ఉంటుందని అంటారు.నిజానికి స్త్రీలకు ఇన్ ఫెక్షన్స్ భర్త నుండి సంక్రమిస్తాయి. మన సమాజంలో పురుషులు స్త్రీలు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు తమకేమి సంబంధం లేనట్లు,ఈ పునరుత్పత్తి ప్రక్రియలో తనకేమి భాగస్వామ్యం లేనట్లు ప్రవర్తిస్తారు.కనీసం డాక్టర్ వద్దకు వెళ్లడానికి కూడా ఇష్టపడక పోవడం వెనుక ఈ ఆధిపత్య ధోరణి కనిపిస్తూ ఉంటుంది.
స్త్రీలు కౌమార దశలో రజస్వల కావడం,ప్రకృతి సహజ సిద్ధంగా శరీరంలో వచ్చే ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా రజస్వల అయ్యే సగటు వయస్సు దశాబ్దాల తరబడి తగ్గిపోతూ వస్తోందని దానికి కారణాలను విశ్లేషిస్తారు.పిల్లలు తరగతి గదులకే పరిమితమవుతూ,సరియైన వ్యాయామం లేకపోవడం,పోషకాహార లోపం వల్ల మాత్రమే కాకుండా, అంతకన్నా ప్రమాదకరమైనవి మనం తీసుకునే ఆహార పదార్థాలు ఉండే రసాయనాలు,రసాయనిక ఎరువులు,ప్లాస్టిక్ బాటిల్స్ నిత్యం ఉపయోగించే డిటర్జెంట్ సబ్బులు -ఇలా మనం వాడే ప్రతి వస్తువు యొక్క ప్రభావం మన శరీరంలోని వినాళ గ్రంధుల మీద,వ్యాధి నిరోధక వ్యవస్థ పైన,పునరుత్పత్తి వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.అంతే కాకుండా ఈ రసాయనాలు సహజంగా తయారయ్యే హార్మోన్ల ఆకారం లోను పని చేసే పద్ధతి లోను పోలి ఉండటం వల్ల శరీరంలో సహజమైన హార్మోన్ల పనిని అనుకరించటం ద్వారా వాటి పనిని అడ్డుకుంటాయి.ఈ విధంగా మనం మన జీవనశైలి విధానం ద్వారా ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నాం.
అలాగే వారు చేసిన ఈ అధ్యయన ఫలితంగా వచ్చిన ప్రభావాల గురించి చెప్తూ-ఈ అధ్యయనం వల్ల ఆరోగ్యశ్రీ కింద గర్ఛసంచి తొలగింపు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం,ఈ విషయాన్ని ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ సమాచారంగా అందజేయటం,అంతే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం జరిగిందని, డా.కామేశ్వరి చెప్పారు. ఆవిడ చేసిన కృషి కి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 సంవత్సరాల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2011 మార్చి 8 న అవార్డు కూడా ప్రదానం చేశారు. వీరు చేసిన ఈ కృషిని ఇతర రాష్ట్రాలలోని అనేక సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని అన్నారు.
మనతో ముచ్చట్లు పేరుతో చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఆసక్తిదాయకమైన శీర్షిక ఉంటుంది.అది తప్పనిసరిగా చదవాలి. .అందులో గర్భసంచి, ప్రతీప్రాణి తనలో జీవం పోసుకునే విషయాన్ని గుర్తించక పోవటాన్ని ప్రశ్నిస్తుంది.నిర్లక్ష్యం చేయటాన్ని తప్పుపడుతుంది.స్త్రీల ఆరోగ్యాన్ని తాను ఎంతగా కాపాడుతుందో వివరిస్తుంది. నీ జీవన విధానాన్ని మార్చుకుని నాతో సహకరించమంటుంది.స్త్రీలే కాకుండా పురుషులు కూడా ప్రాణం పోసుకునే ఈ గర్భసంచిని ఎలాంటి విలువ లేనిదిగా,యాంత్రికమైన దానిగా భావించే ఈ పురుష సమాజానికి ఇది ఒక చెంపపెట్టులా, హెచ్చరికలా పనిచేస్తుంది.
ఈ విధంగా ఈ పుస్తకం స్త్రీల శరీరాలకు సంబంధించిన సమాచారమే కాకుండా దాని పట్ల మన అవగాహనను, చైతన్యాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది.విద్యావంతులైన స్త్రీలు సైతం తమ శరీరం పట్ల ఎలాంటి అవగాహన లేని ఈ పరిస్థితుల్లో ఈ పుస్తకం ఎంతో అవగాహనను కలిగిస్తుంది.
స్త్రీల శరీరం మీద నిర్ణయాధికారం స్తీలకే వుండాల్సిన ఆవశ్యకత:
అయితే, వీటన్నిటి వెనక సామాజిక,ఆర్థిక సాంస్కృతిక దృక్కోణాలు ఉన్నాయి.స్త్రీకి తన శరీరం మీద, తన ఆరోగ్యం పట్ల నిర్ణయాధికారం లేదు.అందువల్లనే స్త్రీల ఆరోగ్యం పై పురషుడి పెత్తనం,సమాజం అదుపు ఉంటాయి.స్త్రీ పిల్లల్ని కనాలా!వద్దా!కంటే ఎంతమందిని కనాలి? ఎవరిని కనాలి? (ఆడ,మగ)అనే విషయంలో నిర్ణయం పురుషుడిదే. స్త్రీల ఆరోగ్యం గురించి పట్టించుకోని ఈ ప్రభుత్వాలు, ఈ వ్యవస్థలు స్త్రీలు ఎలా ఉండాలో,ఎలా ఉండకూడదో శాసిస్తుంది.కాబట్టి వ్యవస్థీకృతం చేయబడిన ఈ సమాజం లోనే స్త్రీ మనుగడ సాగించాల్సి వస్తుంది.దానికి భిన్నంగా ఆలోచించిన,ప్రవర్తించిన స్త్రీ సమాజం నుంచి అనేక సవాళ్ళను ఎదుర్కోవలసివస్తుంది.ఈ రోజు ప్రభుత్వాలు,కార్పొరేట్ వైద్య వ్యవస్థల నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఈ “ అనవసర గర్భసంచి తొలగింపులు .దానికి తోడు స్త్రీల అవగాహన లేమి సామాజిక,ఆర్థిక పరిస్థితులు కారణాలుగా ఉంటున్నాయి.“ వెనకబడిన సామాజిక వర్గాల వారి పరిస్థితి కూడా ఇందుకు దోహదమవుతోంది.
అన్నింటి కన్న ప్రధానంగా ఈ విషయాల పట్ల ముందుగా స్పందించాల్సిన వైద్యులు నిమ్మకు నీరెత్తిన చందంగా మౌనంగా ఉండటం దేనిని సూచిస్తుంది? .స్త్రీలశరీరాలను ప్రయోగశాలలు గా మార్చిన ఈ ఆధునిక వైద్య వ్యవస్థను ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం,వత్తిడి తీసుకు రావాల్సిన అవసరం ఉంది.ఆధునిక వైద్యులు సైతం స్పందించక పోవడం అనేది స్త్రీల ఆరోగ్యాల పట్ల డాక్టర్ నిజాయితీని,నిబద్ద తతను ప్రశ్నించాల్సిన అవసరముంది.
వైద్య వ్యవస్థలో పరిశోధనలకు ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వక పోవడం,బడ్జెట్ కేటాయింపులు జరగకపోవడం వలన స్త్రీల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతోంది.
అయితే,ప్రభుత్వాలు గాని,ఆధునిక వైద్యవ్యవస్థలు గానీ,పట్టించుకోని ఈ సందర్భం లో విద్యావంతులైన యువతీ,యువకులు ఈ సమస్యను రాజకీయ సమస్యగా గురించి విద్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విశ్వవిద్యాలయాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి స్త్రీలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరముంది.
స్త్రీల అరోగ్యం ఒక రాజకీయ సమస్య:
స్త్రీ,లు తమ ఆరోగ్యం గురించి ,గర్భసంచిలను అనవసరంగా తొలగించటం లాంటి విషయాల గురించి, ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో స్త్రీలు పోటీ ఛేయడం ద్వారా రాజకీయంగా కూడా సవాల్ చేయవచ్చు.ఈ పనిని నేడు ఉనికిలో ఉన్న రాజకీయ పార్టీలు పట్టించుకునే స్థితిలో లేదు. డాక్టర్.కామేశ్వరి గారి లాంటి ఔత్సాహికులైన వైద్యులు వ్యక్తిగత స్థాయిలో చిన్న సంస్థ ద్వారా చేసే ప్రయత్నానికి మహళలు, స్త్రీల సమస్యల కోసం పనిచేసే మహిళా సంఘాలు ముందుకు వచ్చి తమ తోడ్పాటును అందించడం చాలా అవసరం .
ఈనాడు లాటిన్ అమెరికా, క్యూబా లాంటి దేశాలు ఇంటిపని,పిల్లల పెంపకం ప్రభుత్వ బాధ్యత గా ఉండాలని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. అబార్షన్ హక్కు స్త్రీలకు ఉండాలని,పిల్లలు కనాలా!వద్దా! అనేది స్త్రీలే నిర్ణయించుకోవాలని పోరాడుతున్నాయి.అందువల్ల స్త్రీల సమస్యల పై జరిగే ఈ పోరాటాల నుంచి స్ఫూర్తి పొంది దీన్ని రాజకీయ సమస్య గా గుర్తించి స్త్రీల హక్కులకై పోరాడడం ద్వారానే స్త్రీల ఆరోగ్య హక్కును సాధించుకోవాల్సివుంది.