పతనమౌతున్న ప్రభుత్వ బడులు – పేదల చదువులు
దేశంలో విద్యావిధానం మారాల్సినవసరం ఉంది. అందుకే చదువంటే బండెడు పుస్తకాలు మోయం, బట్టీపట్టడం కాదని చెప్పిన పరిశోధన పుస్తకాలు.;
భారత దేశం వేద భూమి. వేద వేదాంగాలను, అష్టాదశ పురాణాలను,108 ఉపనిషత్తులను, బౌద్ద, జైన, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, శైవ, వైష్ణవ, శాక్తేయ, చార్వాక ఇత్యాది ఆధ్యాత్మిక తాత్విక శాస్త్రాలను యావత్ ప్రపంచానికి అందించిన దేశం.. మన దేశం. వాల్మీకి, బుద్ధ, వేదవ్యాస, కపిల, వశిష్టాది మహా ఋషులు నడయాడిన నేల. దైవ స్వరూపుడైన కృష్ణుడు, పేద బ్రాహ్మణుడైన కుచేలుడు లాంటి వారు ఒక చోట వర్గభేదం, జాతి వైరం, తారతమ్యం లేకుండా విద్యను అభ్యసించే “గురుకులం” అనే వినూత్న విధానమును ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప సంస్కృతి మనది. గురుకులంలో రాజు కొడుకైనా, మంత్రి కొడుకైనా, సైనికుడి కొడుకైనా.. ఇలా ఎవరైనా సరే.. ఒకసారి గురుకులంలోకి వచ్చిన తర్వాత గురువు ముందు అంతా సమానమే. గురువు చెప్పిన దానిని అందరూ తూచా తప్పకుండా పాటించాల్సిందే. గురుకులం వ్యవహారాలలో ఎంతటి మహారాజైనా తలదూర్చే వాడు కాదు. విద్యా ప్రమాణాలలోనూ, పరిమాణంలోనూ, నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ అన్న మాటకు కూడా స్థానం లేదు. భౌతిక, మానసిక వికాసమునకు కావలిసిన అస్త్ర, శస్త్ర విద్యలు, వివిధ శాస్త్రాలలో విద్య నేర్పడములతో పాటు, విద్యార్థులు అంతా కూడా సమిష్టిగా పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా కలిసి పనిచేయడం లాంటి పనులు కూడా చేసే వారు. కంద మూలాలు తవ్వాలి, వంట చెరుకు తేవాలి, వంట చేయాలి, కుటీరాలు కట్టాలి. గురువు సమక్షంలో ఏ పని అప్పగిస్తే ఆ పని చేసి, వివిధ శాస్త్రాలలో శిక్షణ పొంది అన్ని విద్యలలో ఆరితెరే వారు విద్యార్థులు. ఇంతటి గొప్ప విలువలు ఉన్న మన విద్యా బోధన విధానం, విద్యా బోధన పద్దతులు ప్రపంచానికే తలమానికం.
అంతేగాక ప్రస్తుత తరుణంలో మన జాతీయాదాయం పెరిగింది. విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక రంగంలో అనూహ్య అభివృద్ది సాధించి రోదసిలోకి దేశీయంగా స్వయంగా తయారీ చేసిన కృత్రిమ ఉప గ్రహాలు దూసుకుపోతున్నాయి. అత్యాధునిక ఆయుధ సంపత్తిని స్వయంగా తయారు చేసుకునే నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాం. వీటితో పాటు దేశీయ సంపద(GDP)కూడా పెరిగింది. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలలో మనది కూడా ఒకటి గొప్పగా చెప్పుకుంటున్నాం.
కానీ ప్రస్తుత విద్యా ప్రమాణాల సర్వేక్షణ ఫలితాలు(national achievement servey 2024)ప్రపంచ దేశాల ముందు తల దించుకునేలా ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో పిల్లల చదువు నాణ్యత గణనీయంగా పడిపోయింది. ప్రైవేట్ బడులలో చదివే 2 వ తరగతి, 3 వ తరగతి పిల్లల చదువుకు, ప్రభుత్వ బడులలో చదివే 8 వ , 9 వ తరగతి పిల్లల చదువుతో సమానంగా ఉంది. అంటే ప్రభుత్వ బడులలో చదువు నాణ్యత దయనీయమైన స్థాయిలో ఉందన్నమాట. ఈ ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు కనీస సామర్థ్యాలు కూడా లేవని, రాయడం, చదవడం రాకపోవడమే కాకుండా చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేని స్థితిలో ఉండటం అందరికీ విస్మయాన్ని కలిగించింది. ఇలాంటి ఘోరమైన పరిస్థితి గత ఏ రాచరిక, నియంతృత్వ, సామ్రాజ్య వాద, వలసవాద పాలనలో కూడా లేదేమో.
వీటిని దృష్టిలో పెట్టుకుని పేద పిల్లలు చదివే సర్కారు బడులు, ఉపాధ్యాయులు, చదువు విద్యా బోధనపై ఒకరిద్దరు చేసిన ప్రయోగాల, పరిశోధన పుస్తకాలు తదితరాలతో కూడిన కొన్నింటిని పరిశీలిద్దాం
1. టీచర్లకు చిన్నారుల లేఖ (A letter to Teacher),
ఇటలీలో మారుమూల కొండ ప్రాంతాలలో ఫ్లోరెన్స్ దగ్గరలో బార్బీయాన పాఠశాలకు చెందిన 8 మంది పిల్లల విద్య సామర్థ్యం, వారికి అందుతున్న విద్యవిధానం వంటి అనేక అంశాలపై పరిశోధన చేసి ఒక అరుదైన పుస్తకాన్ని రాయడం జరిగింది. దీనిని రాయడానికి సంవత్సరం పట్టింది. ఈ పుస్తకంలో ఇటలీ విద్యా వ్యవస్థలోని లొసుగులను, లోపాలను గణాంకాలతో సహా విశ్లేషించారు. టీచర్ తాను బోధించే తరగతి పట్ల, పిల్లల పట్ల ప్రవర్తించిన తీరుపై, వినియోగించిన భాష యాసను, తదితరాలను, బడులకు ఏ విదంగా ప్రతికూలముగా ఉన్నయో కుండ బద్దలు కొట్టినట్లు వివరించారు. అంతేకాదు మంచి బడికి, మంచి టీచరకు ఎలాంటి సంస్కరణలు, మార్పులు కావాలో కూడా సూచించారు. ఇది ఇటలీలోని పేద పిల్లల తల్లిదండ్రుల కోసం రాయబడింది. కానీ దీనిని ప్రతి పేదవారికి, మన దేశములోని ప్రభుత్వ బడుల పరిస్తితులకు అన్వయించవచ్చును. ఇది ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. అంతకుమించి నిలదీస్తుంది.
2. పగటి కల- గిజుబాయి: పూర్వ ప్రాథమిక స్థాయిలోనూ, పిల్లలతో ఎలా పని చేయాలి? వాళ్ళలను ఎలా ఆకట్టుకోవాలి? వాళ్ళ అభిమానాన్ని ఎలా పొందాలి? పిల్లల తక్షణ అవసరాలను గుర్తించడం ఎలా? అవేంటి? వాటిని తీర్చడం ఎలా? ఇటువంటి అనేక ఆసక్తికర విషయాలను ప్రయోగ పూర్వకంగా చేసి, ఆ అనుభవాలను మనకు పుస్తక రూపంలో అందించిన మహనీయుడు గిజుబాయి బదేక. అతడు రాసిన “పగటి కల” , “టీచర్” , “తల్లి దండ్రుల తల నొప్పి” లాంటివి , వివిద స్థాయిల్లో గల బోధన పద్దతుల గురించి విశ్లేషిస్తాయి. మంచి బడి, చెడ్డ బడి అనే బడికి ఉండాల్సిన కనీస అవసరాలు, టీచర్ అంటే దృడ సంకల్పముతో చేసే వృత్తి. అంతటి సంకల్పం లేని వారు చదువును, పిల్లలను, టీచర్ వృత్తిని వదిలి వేరే వృత్తుల్లోనూ, వ్యాపారాలలోనూ చేరి పోవాలని నిక్కచ్చిగా చెప్పిన వ్యక్తి గిజుబాయి బదేక.
లేని వసతులు గురించి ఆలోచించకుండా, ఉన్న వసతులను అత్యదికంగాను, సక్రమంగాను ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలిపారాయన. తరగతి శుభ్రం చేసుకోవడం, తాను శుభ్రంగా ఉండటం, ఎప్పటికప్పడు గోర్లు తీసేసుకోవడం, స్నానం ఎలా చేయాలో దగ్గర ఉండీ మరీ నేర్పించి, పిల్లలకు ఎలా దగ్గర కావాలో స్పష్టపరిచినాడు. టీచర్ అంటే ఒక పెత్తందారి మోతుబరి లాగా, ఒక పెద్ద రాయుడులా చూడగానే భయంతో పిల్లలు గజగజా వణుక కుండా, టీచరును చూడగానే చనువుగా, ప్రేమగా పలకరించి, అప్పటి వరకు గల భయాలు అభద్రత భావం పోయి, తనకు రక్షణ , వాత్సల్యం లభించినట్లు అనుభూతి పొందేలా ఎలా ఉండాలి అనే విషయాలను ఈ చిన్న పుస్తకం చెప్పుతుంది. అంటే గాక పిల్లల బాషను, యాసను, వాళ్ళ ఉండీ-లేని దుస్తులను , రంగు, జాతి లాంటి భేదాలను ప్రేమించిన వారు గిజుబాయి.
గిజుబాయిది స్వతహాగా న్యాయ వాద వృత్తి అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వ విద్యా శాఖాదికారి ప్రత్యేక అనుమతితో ఒక పాఠ శాలలో ఒక తరగతిని దత్తత తీసుకుని ప్రయోగం చేసినాడు. అది అంత తేలిక విషయం ఏమి కాదు. ఆ ప్రయోగం సమయంలో ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. కొన్ని లేని వసతులతో వస్తే.. మరికొన్ని తోటి ఉపాధ్యాయుల మాటల రూపంలో వచ్చాయి. అరకకొర వసతులు, మారుమూల పల్లే, టీచర్ల ఎగతాళి. ఇతడేమో ప్రయోగాలు చేస్తాడట. ఇదేమి చదువో ?పుస్తకాలు పక్కకు పెట్టాడు, చదువు చెప్పడం లేదు. ఇదేమి పద్దతి అంటూ ఎందరో అవహేళనలు చేశారు. అవేకాక ఇంకెన్నో ఆగచాట్లు, అడ్డంకులు వచ్చినా అవేవీ కూడా ఆయన ప్రయత్నానికి, దృఢ సంకల్పానికి అడ్డు రాలేదు.
మొట్ట మొదట పాఠ్య పుస్తకాల కంటే ముందు పిల్లలకు కథలతోనూ, చిన్న చిన్న అటలతోనూ, ఆరు బయటకు తీసుకువెళ్ళి ప్రకృతిని పరిశీలించడం, సరదాగా గడపడం లాంటి వాటితో పిల్లలో ఆసక్తిని కలిగించి , తాను , తామున్న తరగతి బడి చుట్టూ పక్కల శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి నేర్పించారు. ఆ తర్వాత అక్షరాలను గుర్తించడం, వాటిని రాయించడం లాంటివి కూడా పిల్లలకు నేర్పినాడు. ఆ తరువాత చిన్న చిన్న లెక్కలు నేర్పించాడు. ఎక్కడా కూడా తానే అన్నీ చెప్పి తన పాండిత్య ప్రదర్శన చేయలేదు. పాఠ్యపుస్తకంలోని పాఠములో గల అంశాలను, పాత్రలు(characters)గా సృష్టించి, ఒక నాటిక రూపంలోను, ఒక సంభాషణ రూపంలోనూ, ఒక చర్చ రూపంలోనూ పిల్లలచేత చేయిస్తూ, పిల్లను చురుకుగా భాగస్వాములను చేస్తూ బోధన చేసిన తీరు అమోఘం.
కాని ఈ బడిలో , ఈ ఊరిలో మంచి వసతులు లేవు, ఈ పిల్లలు వినరు, వీరి తల్లి దండ్రులు ఇలాంటి వాళ్ళు, అని ఎక్కడ కూడా చెప్పినట్టు గాని, పలువురిని తప్పు పట్టిన(blaming) సందర్భాలు ఎక్కడ వెదికినను అసలు కనిపించవు. అలా చేసిన వాడు టీచర్ వృత్తికే అసలు పనికిరాడు అని తన రచనలలో ఘాటుగా చెప్పిన వ్యక్తి గిజుబాయి. ఒకరితో ఒకరికి పోటీ తత్వాన్ని ప్రోత్సాహించాలనే భావన వల్ల ఈర్ష్య ద్వేషాలు, నాకే రావాలనే, నాకే అన్నీ తెలియాలనే అత్యాశలాంటివి పెరిగి పిల్లల మధ్య సోదర భావము కంటే కూడా శత్రుభావం పెరుగుతుందని భావించి ఉండ వచ్చును. అందుకే పోటీ తత్వమును ప్రోత్సహించకుండా, అందుకు బదులుగా అందరు కలిసి ఐకమత్యంతో పని చేయడం వల్ల ఎలా అధిక ఉత్పత్తిని, నాణ్యమైన ఫలితాలు సాదించవచ్చునో ప్రత్యక్షంగా, ప్రయోగ పూర్వకంగా, అనుభవముతో చేసి చూపినాడు గిజుబాయి. అతడి రచనలు ఒక సంపుటముగా కూడా మార్కెట్లో దొరుకుతుంది. అందుకే అతన్ని అందరు “ మీసాలు గల తల్లి” అని ప్రేమగా సంబోధించేవారంటే మనం ఆశ్చర్య పోనక్కర లేదు.
3. అలారీ పిల్లల్లో అద్బుత మార్పులు- అంటన్ మకరెంకో ( the Road to life): అంటన్ మకరెంకో అనే రష్యన్ విద్యా వేత్త రాసిన గొప్ప పుస్తకం. ఇది ఏదో ఊహించి రాసిన కాల్పనిక కథానిక కాదు. రష్యా విప్లవ తధనంతరము, విప్లవ ప్రభావంతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఆదరణ లేని పిల్లలు, చెడు అలవాట్లకు, దుర్వ్యసనాలకు , దొంగతనాలకు తధితర సంఘవ్యతిరేక కార్యకలాపాలతో చెడు మార్గాన వెళ్తున్న పిల్లలు, అనాథలు, అభాగ్యులు లాంటి వారిని సంస్కరించి, మంచిగా తీర్చిదిద్ది, వారికి ఎలా విద్యా బుద్దులు నేర్పించాడో తెలియజేసే చక్కని విద్యా పరిశోధన ప్రయోగ రచన.
ఇందులో పిల్లలు తమ పనులు గుర్తించడం, ఎంపిక చేసుకోవడం, పనుల విభజన, ఆయా పనుల నిర్వహణ, ఆయా పనుల అనంతరం సమీక్ష లాంటివి పిల్లలతో చేయించి, పిల్లలనే ముఖ్య భాగస్వాములుగా మలిచి, వివిధ భిన్నమైన ప్రక్రియల ద్వారా పాఠశాల తమ సమిస్టీ ఆస్తి అని, అందరికి సొంతం అనే భావనను కలిగించి, ప్రవర్తన లోపాలను సరి దిద్దిన తీరు చక్కగా ఉంటుంది. ఇందులో బోధనకు, బోధనేతరాలకు, ఇతర పనులకు సంబంధించిన అన్ని విషయాలలో కూడా ప్రత్యేక్షంగాను, చురుకుగాను భాగస్వామ్యం చేసిన విధానం, నిర్ణయాత్మక విషయాలు అన్ని కూడా పిల్లలు సమిష్టిగా ఒక పార్లమెంటులో మాదిరిగా చర్చించి నిర్ణయించడం ఒక అరుదైన విషయం. ఇక్కడ టీచర్ లేదా పాఠశాల అధిపతి పాత్ర ఒక అనుసంధాన కర్త (facilitator) గానే ఉంటుంది. అతడు నామమాత్రపు పెద్దగా ఉంటూ పిల్లల అభిప్రాయాలు, ఇబ్బందులను రివ్యూలో , మీటింగులలోనూ ప్రవేశ పెట్టి, చర్చించి, వాదోప వాదాలు పిల్లల నుండే రాబట్టు విధానంలో పిల్లలకు ప్రజాస్వామ్య విలువలను, ప్రజాస్వామ్య పద్దతులను నేర్పించిన తీరు కూడా గొప్పగా ఉంటుంది. ఒకసారి పైఅధికారి వచ్చి “ అంటన్ , మీరు పిల్లలకు అధిక వేసులుబాటు ఇస్తున్నారు. వాళ్లకు తెలియవు కదా? నువ్వే ఒక్కడివే పెద్దగా బడి అధిపతిగా ఏక పక్షంగా నిర్ణయం తీసుకుని , సమయం ఆదా చేయవచ్చు గదా” అని మంద లిస్తాడు. అందుకు అంటన్ “ వారు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. అవకాశం ఇస్తే వాళ్ళే మన కంటే కూడా మంచిగా నిర్ణయం తీసుకోగలరు. వారికి మంచి ఏదో , చెడు ఏదో తెలుసు, అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటే వాళ్ళేమి నేర్చుకుంటారు ? వాళ్ళకు నేర్పించడం కదా మన ఉద్దేశ్యం “ అని సున్నితంగా చెప్పిన తీరు కూడా చక్కగా ఉంటుంది.
ఒకసారి అంటన్ ఏదో విషయంలో అసహనం కోల్పోయి “ మీరు సరిగ్గా మాట మీద ఉండటం లేదు, వినడం లేదు , నాకు మీకు చదువు చెప్పటం, చదువు నేర్పడం సాధ్యం కాదు” అని తన జేబులో నుండి పిస్టల్ ను తీసి తన తల నొసలుకు పెట్టుకుని గట్టిగా అరిచాడు. అప్పుడు పిల్లలందరు సద్దు మణిగి , భయముతో “ తాము అలా చేయమని ఒక్కసారిగా ప్రమాణం చేసినారు. ఇది అయ్యి పోయిన కొన్ని రోజుల తరువాత ఏదో ఆలోచిస్తూ అంటన్ మకరెంకో.. ఒక సాయంకాలం వాకింగ్‌కు బయలుదేరుతాడు. అది చూసిన పిల్లలు చడీచప్పుడు చేయకుండా అతనిని అనుసరించారు. కొంచెం ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా పిల్లలంతా అంటన్ ముందు వచ్చి నిల్చున్నారు. వారిలోనుంచి ఒక పిల్లవాడు ముందు వచ్చి ‘అంటన్’ అని పిలిచాడు. వెంటనే అతని జేబులు చెక్ చేసి “మీ జేబులో పిస్టల్ లేదుకదా ?” అని అంటారు. అప్పుడు అప్పటి వరకు ఊపిరి భిగబట్టి ఉన్న పిల్లలంతా శ్వాసతీసుకుంటారు. ఏమి కాలేదు అని తిరిగి వెళ్ళి పోయారు. వెంటనే అంటన్ నిశ్చేస్తుడు అవుతాడు. అంటన్ తన పిస్టల్ తో కాల్చుకుని చచ్చి పోతాడేమో అని బయపడినారని తెలిసినప్పుడు ఆ టీచరకు, పిల్లలకు మద్య ఎంతటి సాన్నిహిత్యం(Rapport) ఉందో అర్థ అవుతుంది.
4. రైలు -బడి-టోటో చాన్ : రైలు- బడి అనే పుస్తకంను టోటో ఛాన్ రాశారు. ఇది పిల్లల విద్య పై చేసిన భిన్నమైన ప్రయోగం. ఇది అల్లరి పాపకు చదువుల బడిలో చెప్పిన చదువు కథ. ఏ బడి కూడా మీ పాపకు చదువు చెప్పలేమని, మీ పాప బడిలో చాలా వెనుక బడి ఉన్నాడని, తరగతిలో మిగతా పిల్లలను చదవ నివ్వడం లేదని, అల్లరి ఎక్కువ చేస్తున్నాడని, మీ పాపకు చదువు చెప్పడం మా వల్లకాదని చేతులు ఎత్తివేసినప్పుడు ఆ పాపను ఒక ప్రత్యేక బడిలో చేర్పించిన తీరు, అక్కడి ప్రకృతిలో ఆడుతూ పడుతూ చదువు నేర్పించిన తీరు అంత కూడా ఆ రైలు బడిలో ఉంటుంది. ఇందులో ఎక్కడా పిల్లలు అడిగే ప్రశ్నలకు, వాళ్ళ అభిప్రాయాలను కించపరచడం గాని, పిల్లల పట్ల విసుగు చెందడం కాని, వారిని గద్దించడం కాని మచ్చుకైనా ఉండదు. పిల్లల అభిప్రాయాలను, వారి మాటలను, భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు కాని, ఎక్కడ నిరుత్సాహం చూపాడు.
“బడి’’ అంటే పుస్తకాలతో కుస్తీ పట్టడం, బట్టీ పట్టడం, మళ్ళీ మళ్ళీ వల్లే వేయడం కాదు. ఆవిధంగా బోరుకొట్టి, విసుగు కలిగేలా కూడా కనిపించదు.
“ ఒక మనిషికి జీవితములో ఏమేమి కావాలో , ఇతరుల మాటలు ఎలా వినాలో , తన అభిప్రాయాలు ఇతరులు, ఇతరుల అభిప్రాయాలు తాను ఎలా గౌరవించాలో తెలియజేయడంతో పాటు ,చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రకృతి లోని చెట్లు, చెమలు, మట్టి , జీవులు తదితరాలతో బోధనకు అవసరమైనది కానిది వారి చుట్టూ పక్కల ఎక్కడ ఉండదు. “ బోధించాలనే తపన, దృడ సంకల్పం గల వాడికి ప్రతిదీ బోధన పరికరమే, ప్రతి దానిని కూడా బోధన మెటీరియల్ గా మార్చుకోవచ్చు లేదా మలుచు కోవచ్చు అని ఆచరించి చూపిన తీరు అమోఘం.
“ ఇలాంటి పుస్తకాల పఠనం , చర్చ లాంటివి మన బోధన శాస్త్ర శిక్షణ కాలములో లేక పోవడం, సిలబస్ లో ఒక ముఖ్య భాగం కాక పోవడం కూడా మనం చూస్తుంటాం. కొందరు టీచర్లకు ఇలాంటి పుస్తకాలు ఉంటాయని తెలియదు. ఇంకా కొందరికి పుస్తక పఠనం అలవాటు కూడా ఉండదు. ఎవరయినా వీటి గురిచి చెప్పితే , ఇలాంటివి డిఎస్సి, tet లాంటి పరీక్షలకు ఏమి ఉపయోగం ఉండదు ” అని ఒకరు వాపోయారు.
అప్పుడు -ఇప్పుడు: పిల్లల అర్థం చేసుకోవడం లోనూ, బోధన చేయడంలోనూ పై ప్రయోగాలు చాల ఉపకరిస్తాయని ఇప్పటి వరకు అందరు అంగీకరిస్తున్నారు.
గిజుబాయి తీసుకున్న పాఠశాల గాని, మకరెంకో పియాయోగం చేసిన ప్రాంతము గాని, టోటో ఛాన్ ప్రయోగం చేసిన ప్రాంతాలు అన్నియు కూడా మారుమూల ప్రాంతాలే, అక్కడి వసతులు అంతంతే, పిల్లల ఆర్థిక సామాజిక పరిస్థితులు అన్ని కూడా అట్టడుగు స్థాయివే, మకరెంకో తీసుకున్న పిల్లల ఇంకా దుర్బర పరిస్థితుల నుండి వచ్చి, ప్రవర్తన లోపాలు, అసంఘీక పనులు లాంటి ఎన్నో అవ లక్షణాలు గల వారు. ఇక బోధన పరికరాలను, బోదన మేటెరియలు లాంటివి అసలు లేవు. వారికి ఏది దొరికితే అదే బోధన సాధనముగా మలుచుకుని వాడుకున్నారు. అయినప్పటికీ ఆయా టీచర్లు, పరిశోదకులు తమ దృడ సంకల్పం, ఏదో చేయాలన్న తపన మాత్రమే వారి ముఖ్య ఆయుదయం.
మరి ప్రస్తుతం విశాలమైన భవనాలు, విశాలమైన మైదానాలు, అత్యాదిక విద్యావంతులైన టీచర్లు, వారి ఎంపిక కూడా కాచి, వడబోసి,, పరిక్షల మీద పరిక్షలు, కఠినమైన ఇంటర్వ్యూల మీద , ఒక వ్యవస్ఠీకృత నిపుణుల బృందం , ఉన్నతాధికారుల నిశితమైన పర్యవేక్షణ ద్వారా ఎంపిక చేస్తారు.
అన్ని వున్నప్పటికి అంగట్లో శని ఉన్నట్టు బడులు పిల్లలు లేక బోసి పోతున్నాయి. టీచర్ల సంఖ్య ఎక్కువ, పిల్లల సంఖ్య తక్కువ, ఇంకా విద్యా ప్రమాణముల విషయం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉన్నత పాఠశాల పిల్లలు కూడా కనీసం చిన్న చిన్న లెక్కలు చేయలేక పోతున్నారు. వాక్యాలు , రాయడములోనూ, చదవడం లొను చాలా వెనుక బడి ఉన్నారని ఈ మద్య జరిగిన అ ద్యయనములో తెలిసింది.
ఇక టీచర్ల విషయానికి వస్తే సుమారు లక్ష రూపాయలు తీసుకునే శాస్విత ఉద్యోగి వద్ద అతని జీతంలో 10 శాతం కూడా జీతం లేని ఒప్పంద టీచర్లు, అతిధి టీచర్లు, లేదా పంతుళ్ళు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది , బోధనేతర సిబ్బంది ఉన్నారు.ఈ ఔట్ సోర్సింగ్ , ఈ ఒప్పంద అనే విధానం విద్యా రంగంలో చొప్పించడం చాలా దారుణం. వీరు గత 10 -15 సంత్సరాల నుండి చాలీ చాలని జీతంతో బతుకు వేళ్ళ దీస్తున్నారు. వీరు శాస్విత సిబ్బంది వద్ద బండ చాకిరీ చేస్తున్నారు. సాదారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి కాల పరిమితి 30 -35 సంవత్సరాలు. వీరు రిటైర్మెంట్ లో సగం జీవితము చాలి చాలని జీతముతో గడిచి పోయింది. ఇంకా వీరు అంత ఎప్పుడో ఒకప్పుడు క్రమబద్దీకరణ చేస్తారని ఎదురు చూస్తూ నానా తంటాలు పడుతున్నారు. వీరి రోధన అరణ్య రోధన అయ్యింది. వీరు పేరుకే టీచర్లు, లెక్చరర్లు , ప్రొఫెసర్లులు గాని వీరి జీతం మోటు పని చేసే అడ్డ మీది కూలీ కంటే కూడా హీనమే. ఒక హోటల్ సర్వర్ పని గాని, ఒక సెక్యూరిటీ గార్డ్ పని చేసే వ్యక్తికి వచ్చే టిప్పు కంటే కూడా తక్కువే. ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగులు, పంతుళ్ళు ఉంటే వారి నుండి ఎలాంటి విద్యా ఫలితాలు ఆశించ గలము.
అంతే గాక ప్రభుత్వ పాఠశాలల చదువుల గురించి ఎందరో బాధ పడుతూ ఉంటారు కాని తమ పిల్లలను ఎందుకు ప్రభుత్వ బడిలో చేర్పించరు మరి. చేర్పిస్తామని ఎందుకు అనరు. ప్రైవేట్ బడిలో చదువుకోవడం ఒక సామాజిక గొప్పతనం (status) అయ్యింది. సర్కారు బడి చులకన అయ్యింది. అప్పుడప్పుడు నూటిలకో కోటికో ఒక టీచరు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించితే పేపరులో ఒక పెద్ద వార్త పోటో తొ సహా , ఒక కలెక్టర్ తన బార్య పురుడు ప్రభుత్వ ఆసుపత్రి జరిగితే కూడా ఒక పెద్ద వార్తే మరీ, ఇలా ఒకరు , ఇద్దరు చేస్తే బడులు బాగుపడుతాయా ? ఆసుపత్రులు బాగు పడుతాయా ? జనాలకు ప్రభుత్వ బడులపైన నమ్మకం పేరుగుతుందా? బడుల పట్ల సదాభి ప్రాయం కలుగుతుందా ? ఇలా అందరు ఉద్యోగులు, కార్మికులు తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చదివించుటకు ముందుకు రావాలి. అలా ముందుకు ఎందుకు రారు? అంటే మీకు పేదల బడులను చక్కదిద్దాలనే తలంపును శంకించాల్సి వస్తుంది కదా ?ఇది ఉద్యమంలాగా అన్ని ప్రాంతాలలో, అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు తదితరులు ఏకం కాకుండా సాద్యం అవుతుందా?
ఇంకొక పెద్ద మనిషి మాతృ బాషలో విద్య బోధన గిరించి ఉపన్యాసం ఉంటుంది. అసలు విషయం ఏమిటి అంటే అతని కుటుంబలో గత రెండు తరాలనుండి ఎవరు కూడా మాతృ బాషలో చదివిన వారు గాని ప్రభుత్వ పాఠశాల లో చదివిన వారు అసలు ఉండరు.ఇలాంటి వాళ్ళ సామాజిక నేపద్యం కావచ్చు, ఆర్థిక నేపద్య కావచ్చు సామాజిక స్తాయి, వాళ్ళ మాటలు సామాన్య జనం ఎప్పుడు నమ్మినట్లు ఉండదు. మమ్మల్ని ఏదో విదంగా సర్కారు బడిలో చేర్పించి, నాసి రకం చదువులు మాకు అంట గట్టాలని చూస్తున్నారు అనే అప
నమ్మకం కూడా పక్క దారి పట్టయిచ్చినట్టే ఉంటుంది. అదోరకమైన క్లిష్ట సమస్య.
“ఇంకా కొందరు దేశ విదేశాలు తిరిగి పలు దేశాలలో గల ప్రభుత్వ బడులను పరిశీలించి వచ్చిన వాళ్ళు కూడా పలు గణాంకాలతో విశ్లేషణ చేస్తారు. ఇదంతా కూడా పరిమాణాత్మ అద్యయనం(quantitative) మీదనే ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. కాని గుణనాత్మకత(qualitative) ను ప్రభావం చేసే అంశాలను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. బార్బీయాన పిల్లలు చేసిన పరిశోదన లాంటిది ఎవరు చేయలేదు ” ఒకరి స్పందన
ఇంకొకరు “విద్య హక్కు వచ్చిన తరువాత ముందు ముందు కొన్ని సంస్థలు బడి బయట పిల్లలను తీసుకు వచ్చి బడిలో ఉద్యమ స్థాయిలో చేర్పించారు. అప్పుడు ఆ సంస్థలు టీచర్ల శిక్షణ , మెటియాల తయారీ తదితరాల మీద భిన్నంగా ఆలోచించి , కొంత వరకు పని చేసి, బోధన రంగంలో కొంత వరకు అధర్శముగ(Role model) ఉండి, కొన్ని స్వతంత్ర శిక్షణ కేంద్రాలు ఉండేవి.కాని ఇప్పుడు అవి ఏవి కూడా లేవు అలా భిన్నంగా ఆలోచించే వారు లేరు, అలాంటి సంస్థలు లేవు. మరియు ఆ తరువాత ఒక బిన్నమైనా మాడెల్ ఎక్కడ లేదు” చెప్పారు.
ఇంకొకరు “ విద్య హక్కు చట్టం తరువాత కావచ్చు , వివిద సంఘాలు, సంస్థ లు కావచ్చు పిల్లలతో బడులను నింపినారు. విద్య హక్కు చట్టం ప్రకారం వయస్సు కు తగిన తరగతి, ఫెయిల్ చేసే పద్దతి లేనందున విద్య ప్రమాణాలు , నాణ్యతా ప్రమాణాలు గణ నీయంగా పడి పోయావి. కుటుంబ నియంత్రణ కావచ్చు , ఇతర చైతన్య కార్యక్రమాల వల్ల కావచ్చు పిల్ల చదువు పట్ల శ్రద్ద పెరిగి , పిల్లల చదువుకు అధిక ప్రధాన్యం ఇవ్వడం తల్లి దండ్రులలో మార్పు రావడం. ఇదే సమయాలో ప్రైవేట్ స్కూల్ కూడా పెద్ద గ్రామాలలో కూడా రావడం జరిగినది. అటు నాణ్యలోనూ రాజీ పడలేక , సమాజంలో తక్కువ చూపు వల్ల ప్రైవేట్ స్కూలు వాళ్ళకు వరంగాను మారింది” ఇంకొకరి అనారు.
డానికి తోడు “ ఒకప్పుడు ఒకరికి ఇంటిలో ఎందరో పిల్లలు ఉండే వారు, వారికి కూడు గూడు లాంటి పెట్టుటకే చేసి కష్టం చాలేది కాదు. చదువుకు చిట్ట చివరి ప్రధాన్యం. ఒక పెన్ను , ఒక పెన్సిల్, ఒక నోట్ బుక్ కోసం పిల్లాలు నానా ఆగచాట్లు పడేవారు. కాని ఇప్పుడు చదువు మొట్ట మొదటి ప్రధా న్యత అయ్యింది.” ఒక చెప్పారు.
ఇంకొకరు చర్చలో పాల్గొనుచు “ మనం చదివే రోజుల్లో మేము చదువు కోలేదా ? ఒకరి ప్రశ్న
ఇంకొకరు “అప్పుడు ఇలాంటి ఆటంకాలు (distortions) అంటే WhatsApp, Facebook, ఇంత transportation లాంటివి లేవు. ఇన్ని ప్రైవేట్ బడులు లేవు. చాలా చోట్ల టీచర్ల, ధనవంతుల, మద్య తరగతి , అందరు ప్రభుత్వ బడిలోనే చదివే వారు.” అని అన్నారు.
ఇంకోకరు “ బడి విషయములో గాని , చదువు విషయములో గాని రాజకీయ జోక్యం, ఉన్నత అధికారుల ఒత్తిడి కూడా ఇంత ఉండేది కాదు. సమాజములో మంచి గౌరవం , విలువ ఉండేది” అంటూ నిరాశ వ్యక్త పరిచారు.
అంతే కాదు “ అప్పుడు టీచర్లకు జీతమే ప్రధాన ఆదాయ వనరు. ఇప్పుడ జీతం అదనపు ఆదాయమే తప్ప, ప్రాతమిక ఆదాయం కాదు. వాళ్ళ వ్యాపారాలు, భూ దందాలు ఇతర వ్యవహారాలు చాలా ఉన్నాయి. అప్పుడు తమ వృత్తి పట్ల , బడి పట్ల సదాభిప్రాయం , గౌరవం ఉండేది. అవి లేవు కాబట్టే వాళ్ళ పిల్లలు ఎవరు వారు చెప్పే బడులలో చదివించడం లేదు” అని వివరించాడు.
ఇంకొకరు “ప్రజా ప్రతినిధుల , ఎన్నికలలో నిలబడే అభ్యర్థుల పిల్లలు తప్పని సరిగా సర్కారు బడిలో చదివే తట్టు , ప్రతి ఉద్యోగి తమ పిల్లలు ప్రబుత్వ బడిలో తప్పని సరిగా చదీవించేటట్లు, సర్కారు బడిలో చదివిన వారే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు అనే అధితరాలను చట్ట బద్దం చేయాలి. అట్లయితే ప్రభుత్వ బడులు ముఖ్య యూనిట్లు(major )గా ను , ప్రైవేట్ బడులు ద్వితీయ శ్రేణి యూనిట్లు(auxiliary)గా ఉంటాయి. లేనిచో పోలీస్ , న్యాయ , రెవెన్యూ తప్ప మిగతా శాఖలు అన్నీ ప్రైవేట్ పరం అయ్యి మరో నయా సామ్రాజ్య వాదానికి దారి తీస్తుంది.” ముగించాడు.
ఏది ఏమైనా పేదల బళ్ళు , పేదల చదువులు చావు బతుకుల్లో వున్నవి. ఒక పక్క దేశ జాతీయ ఆదాయం గణనీయంగా పెరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాలు అభవృద్ది పథం శర వేగంగా దూసుకు పోతున్నాయి. ఇక్కడ పేద చదువులో నాణ్యత ప్రమాణాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. ఇది సరళీకరణ శపమా ? ప్రైవే టీకరణ పాపమా ? ప్రపంచీకరణ లోపమా ? పెట్టుబడి దారి విజయ విలాస ఫలితమా ? కమ్యూనిజం పతన ఫలితమా?