తెలంగాణ బడ్జెట్ సైజు పెరిగింది, డైరెక్షన్ లేదు...
వ్యవసాయ కూలీలకు రైతు బీమా పథకానికి ఈ సారి కూడా నిధులు పెంచలేదు. అంటే వారికి 2018 నుండీ జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నమాట.;
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ రెండవ బడ్జెట్ పై కామెంట్ రాయాలని రాత్రి నుండే ప్రయత్నిస్తున్నా, ఆలోచన ముందుకు సాగడం లేదు. ప్రతి సంవత్సరం పెరిగే బడ్జెట్ పరిమాణం గురించి రాయాలా? బడ్జెట్ లో నిధులు కేటాయించినా, ఆచరణలో ఖర్చు చేయని వైనం గురించి రాయాలా? కొన్ని పథకాలకు నిధులు పెంచినా, మార్గదర్శకాలు సరిగా లేనందున, జరిగే నిధుల దుర్వినియోగం గురించి రాయాలా ? ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థూల ఆర్ధిక ఉత్పత్తి విలువ ( GSDP) పెరుగుతున్నా, దీని ఆధారంగా లెక్కించే తలసరి ఆదాయం అంకెలు కూడా పెరుగుతున్నా, వాస్తవ దృశ్యంలో రాష్ట్రం పై, రాష్ట్ర ప్రజలపై పెరుగుతున్న అప్పుల భారం, ఎప్పటికప్పుడు పెరగడమే తప్ప, ఏ మాత్రం తగ్గని రేషన్ కార్డుల సంఖ్యా ప్రభుత్వ గణాంకాలను వెటకరిస్తున్నాయని రాయాలా ?
ఏ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టినా, కొన్ని విషయాలు మూసలో పోసినట్లుగానే ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరేమి మాట్లాడినా, అధికారంలోకొచ్చాక పాత అభివృద్ధి నమూనానే కొనసాగిస్తారు. ఆర్ధిక సంక్షోభాన్ని, పేదరికాన్ని పోగొట్టేలా, పథకాలకు వాస్తవ లబ్ధి దారులుగా ఉండాల్సిన వాళ్ళను గుర్తించే సాహసం లేకపోవడం, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా రంగానికి మొండి చేయి చూపించడం, కోట్లాదిమంది శ్రామికుల హక్కులను కాపాడాల్సిన కార్మిక శాఖకు నిధులు నామమాత్రంగా కేటాయించడం మనకు సాధారణంగా కనిపించే అంశాలు.
ప్రభుత్వ అవినీతి గురించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పుంఖాను పుంఖాలుగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీలు, తాము అధికారం చేపట్టాక, ఆ అవినీతిని బయట పెట్టి, నిరూపించి, అవినీతి పరుల నుండీ డబ్బులు వసూలు చేసి ఖజానాలో జమ చేసి , అవినీతి పరులను చట్ట పరంగా శిక్షించే వరకూ ఒకే రకమైన వేగంతో పని చేస్తాయని మనం ఆశిస్తాం. కానీ సంవత్సరాలు గడుస్తున్నా, అదేమీ జరగదు. తాము అధికారం చేపట్టగానే, తాము అనుకున్న అభివృద్ధి నమూనా, అందుకు అనుగుణంగా వేగంగా ప్రణాళికలు, నిధుల కేటాయింపులు, అందులో నుండీ కమిషన్ లకు, అవినీతికి అవకాశాలు మామూలుగా జరిగిపోతాయి. నీటి పారుదల ప్రాజెక్టులు ఇందులో పెద్ద ఉదాహరణ,
వ్యవసాయ రంగ అభివృద్ధి పేరిట జరిగే ఈ నీటి పారుదల ప్రాజెక్టులకు ఖర్చు అంచనాలు భారీగా పెరిగిపోవడంలో నిండా అవినీతి ఉంటుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టులు పొందే కంపెనీలు, అవి పొందే లాభాలు, అవి రాజకీయ నాయకులకు,ప్రజా ప్రతినిధులకు అందించే కమిషన్ లు సర్వ సాధారణం. ఈ సాగు నీటి ప్రాజెక్టులన్నీ తప్పకుండా వ్యవసాయ రంగానికే ఉపయోగపడతాయనే మాట అబద్ధం. లేదా ప్రజల తాగు నీటి అవసరాలను ఉచితంగా తీరుస్తాయనె మాట కూడా అబద్ధం. ఈ ప్రభుత్వాలు నదీ జలాలను నగరాలకు తరలించడం, లేదా నీటిని పెద్ద మొత్తంలో పరిశ్రమలకు కేటాయించడం, లేదా తాగునీరు అమ్మే మార్కెట్ లో ఉన్న కోకో కోలా లాంటి బాట్లింగ్ కంపనీలకు అమ్మడం మనం చూస్తున్నాం. రాష్ట్రంలలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నా, మిషన్ భగీరథ పేరుతో, ఉచిత తాగునీటి సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్నా, పట్టణాలలో, గ్రామాలలో మంచి నీళ్ళ వ్యాపారం ప్రతి సంవత్సరం పెరగడం దేనికి తార్కాణం?
అంతకు ముందు అధికారంలో ఉండి అవినీతికి పాల్పడిన వాళ్ళు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి, కొత్త ప్రభుత్వ అవినీతి గురించి, అసమర్ధత గురించి మాట్లాడడం ఒక సహజ నాటకంగా కనిపిస్తుంది. ఈ ప్రక్రియలో పేదలు, శ్రామికులు నిరాశ చెందడం, కాంట్రాక్టర్లు, కార్పొరేట్లు ప్రయోజనం పొందడం కూడా మామూలుగా మారిపోయింది.
అందుకే ఎన్నికలన్నా, బడ్జెట్ లన్నా ప్రజలకు ఆసక్తి తగ్గిపోయింది. ఎన్నికల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వివిధ పార్టీల తరపున అభ్యర్ధులుగా నిలబడి విజయం సాధిస్తున్నారు. సాధారణ వ్యక్తులకు, ప్రజల పక్షాన పోరాడే నిజాయితీ పరులకు ఈ ఎన్నికల వ్యవస్థలో స్థానం లేకుండా పోయింది..
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితిలో అధికారం లో ఉన్న పార్టీ కూడా, ఎన్నికలలో పోటీ పడి , ప్రజల అభిమానం పొంది, విజయం సాధించడానికి బదులు, గవర్నర్ కోటా లో, లేదా శాసన సభ్యుల కోటాలో తన అభ్యర్ధులను నియమించుకోవడం, ఈ పరిస్థితుల్లో వ్యాపారులు, కార్పొరేట్ వ్యక్తులు, బీజేపీ లాంటి పార్టీల నుండీ పోటీ చేసి, డబ్బులు వెదజల్లి, ఎన్నికలలో విజయం సాధించడం ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికలలో చూశాం.
బడ్జెట్ ల పరిస్థితి కూడా అంతే. 2014-2015 లో రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది లక్ష కోట్లతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. 2025-2026 లో ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక నిరుడు ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్ కంటే,ఈ సారి బడ్జెట్ పరిమాణం పెరిగినా ఆచరణలో గత సంవత్సర బడ్జెట్ అమలు తీరు ఆశించిన విధంగా లేదు. అభయ హస్తం మానిఫెస్టోలో ఇచ్చిహ 6 గ్యారంటీలకు మొదటి సంవత్సరం 49,315 కోట్లు కేటాయించినా, ఖర్చు చేసింది మాత్రం కేవలం 24,948 కోట్లు మాత్రమే. దీంతో ఈ సంవత్సరం 6 గ్యారంటీల అమలుకు 56,000 కోట్లు కేటాయించినా ఆచరణలో ఖర్చు అవుతాయన్న గ్యారంటీ లేకుండా పోయింది.
వ్యవసాయ రంగ బడ్జెట్ లో గత సంవత్సరం కూడా పంటల బీమా పథకానికి 981 కోట్లు కేటాయించారు. కానీ ఆ పథకం అమలు చేయలేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించారు కానీ, పథకం అమలు చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. పైగా మొత్తం పంటలకు సమగ్ర పంటల బీమా పథకం అమలు చేస్తామనీ, రైతు ప్రీమియం వాటా కూడా తామే చెల్లిస్తామనీ ప్రభుత్వం హామీ ఇచ్చినందున, ఈ కేటాయింపులు సరిపోవు.గత బడ్జెట్ లో రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ లో దాని ప్రస్తావన కూడా లేదు. నిధులు కేటాయింపు లేదు.
గత సంవత్సరం రైతు బీమా పథకానికి కేవలం పట్టా హక్కులు కలిగిన భూమి యజమానులకు మాత్రమే 1589 కోట్లు నిధులు కేటాయించారు. 42,16,000 మంది రైతులకు, ఒక్కొక్కరికి ప్రీమియం 3400 రూపాయల చొప్పున LIC కి చెల్లించి ఈ పథకాన్ని అమలు చేశారు. కానీ హామీ ఇచ్చిన విధంగా భూమిలేని కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు రైతు బీమా పథకాన్ని విస్తరించడానికి వీలుగా ఈ సంవత్సరం కూడా నిధులు పెంచలేదు. అంటే వారికి 2018 నుండీ జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా కొనసాగించ దలిచింది. ఇంత కంటే సిగ్గు చేటు ఏముంటుంది ?
రైతు భరోసా పథకానికి ఎకరానికి 12,000 చొప్పున కోటిన్నర ఎకరాలకు సరిపోయే విధంగా 18,000 కోట్లు కేటాయించారు కానీ, హామీ ఇచ్చిన విధంగా కౌలు రైతులను గుర్తిస్తామనీ, వారికి కూడా రైతు భరోసా సహాయం అందిస్తామనీ , బడ్జెట్ ప్రసంగంలో అయితే ప్రకటించలేదు. కాబట్టి ఈ రైతు భరోసా నిధులలో 40 శాతం నిధులు తప్పకుండా వృధా అవుతాయి. ఈ నేరానికి పాల్పడే రాష్ట్ర ప్రభుత్వం తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే నైతిక అర్హతను కోల్పోతుంది.
సన్నవడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చే పథకానికి 1800 కోట్లు కేటాయించారు. రెండు సీజన్ లూ కలిపి 36,00,000 టన్నుల సన్నధాన్యం సేకరణకు ఇవి సరిపోతాయి. రెండు సీజన్ ల లోనూ కలిపి ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణకు సన్న ధాన్యం సేకరించి, ఉగాది నుండీ సన్న బియ్యం పంపిణీ చేయాలనే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ కేటాయింపులు జరిగాయని అనిపిస్తుంది.
రాష్ట్రంలో రెండు సీజన్ లు కలిపి ఒక కోటీ 10 లక్షల ఎకరాలలో వరి సాగు అవుతుంది కనుక, ఎకరానికి కనీసం 25 క్వింటాళ్ల ఉత్పత్తి వస్తుంది అనుకున్నా, మొత్తం 2.75 కోట్ల టన్నుల ధాన్యం వస్తుంది. వీటిలో దొడ్డు ధాన్యం కూడా ఉంటుంది కనుక FCI వాటిలో కొంత భాగాన్ని సేకరిస్తుంది. మిగిలిన ధాన్యాన్ని వ్యాపారులు కొనాల్సిందే.
రాష్ట్ర ప్రజా పంపిణీ అవసరాలకు మించి రాష్ట్రంలో సన్న ధాన్యం ఉత్పత్తి అయితే, వాటిని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు రైతులకు MSP కి మించి ధర చెల్లిస్తారా, ఒకవేళ చెల్లించక పోతే, మిగిలిన రైతులు కూడా బోనస్ ఆశించి ప్రభుత్వం దగ్గరకు వస్తే, మొత్తం సన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయగలుగుతుందా ? రైతుల ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, మళ్ళీ వాటిని టెండర్ లు పిలిచి, తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముతుందా? ఫలితంగా రాష్ట్ర బడ్జెట్ పై పడే భారానికి ఎవరు బాధ్యత వహిస్తారు ? ఇవన్నీ జవాబు కోసం వేచి చూసే ప్రశ్నలు. రాష్ట్రంలో వరి సేద్యాన్ని తగ్గించకుండా, ఇలా ఎంతకాలం కొనసాగిస్తారన్నది అసలు ప్రశ్న.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి కూడా కేవలం 600 కోట్లు కేటాయించారు. సంవత్సరానికి 12,000 చొప్పున, ఇవి 5 లక్షల కుటుంబాలకు సరిపోతాయి. రాష్ట్రంలో వ్యవసాయ కూలీల గణాంకాలతో పోల్చినప్పుడు ఇది చాలా తక్కువ. సంవత్సరానికి 20 రోజులు ఉపాధి హామీ పథకంలో పని చేసి ఉండాలనే నిబంధన వల్ల, చాలా కుటుంబాలు అర్హత సాధించలేక పోతున్నాయి. సాధారణంగా ఉపాధి హామీ పథకంలో ఒక కుటుంబానికి కల్పించే పని దినాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ పథకంలో పని చేసినా, ఆయా కుటుంబాలకు వేతనాలు సకాలంలో అందడం లేదు,. కాబట్టి ఈ పథకంలో పని చేయ;లనే ఆసక్తిని ఆ కుటుంబాలు కోల్పోయాయి. ఒక విడతలో కేవలం 6,000 రూపాయలు మాత్రమే ఒక కుటుంబం చేతికి అందినప్పుడు, ఆ మొత్తం ఒక వ్యవసాయ కూలీ కుటుంబ ప్రాధమిక సమస్యలను కూడా పరిష్కరించలేదు.
పైగా మొత్తం సమాజంలో భాగంగా వ్యవసాయ కూలీ కుటుంబాలలో ఉండే మద్యం వ్యసనం వల్ల, తిరిగి ఆ డబ్బులు ప్రభుత్వానికే చేరే అవకాశం ఉంది. ఒక్కో కుటుంబం (ముఖ్యంగా మగవాళ్ళు) మద్యం పై కనీసం సంవత్సరానికి 30,000 రూపాయలు ఖర్చు చేస్తుందని ఒక అంచనా. ప్రైవేట్ వైద్యం పై సంవత్సరానికి కనీసం మరో 15,000, ప్రైవేట్ విద్యపై సంవత్సరానికి మరో 15,000 ఖర్చి చేస్తుందని అంచనాలు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహించడం వల్లా, ప్రజలకు ఉచిత విద్యా, వైద్యం అందించక పోవడం వల్లా, ఒక పేద కుటుంబం సంవత్సరానికి 60,000 రూపాయలు కోల్పోతుంటే, ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో చెల్లిస్తున్నది మాత్రం సంవత్సరానికి కేవలం 12,000 రూపాయలు. అది కూడా అన్ని కుటుంబాలకు కాదు. ఒక ఎకరం లోపు రైతులకు రైతు భరోసా కనీసం 12,000 అందే అవకాశం కూడా లేదు.
నిజంగా పేద కుటుంబాల మౌలిక సమస్యలు పరిష్కారం చేయని ఇటువంటి ప్రభుత్వ పథకాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. భూమి లేని పేద కుటుంబాలకు భూమి హక్కుగా అందించడం, కౌలు ధరలపై నియంత్రణ విధించడం, కౌలు రైతులను గుర్తించడం, వారికి సహాయం చేయడం, గ్రామీణ ప్రాంతంలో పేద కుటుంబాలకు ఆదాయాన్ని పెంచేలా జీవనోపాధి అవకాశాలు పెంచడం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వివిధ నిత్యావసర సరుకులను పేద కుటుంబాలకు తక్కువ ధరలకు అందించడం లాంటి చర్యలు నిజంగా పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఉపయోగపడతాయి.
ఇక విద్యా రంగానికి 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇచ్చినా, గత సంవత్సరం, ఈ సంవత్సరం ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోలేదు. అతి తక్కువ నిధులను మాత్రమే కేటాయించారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్ లో పిల్లల సంఖ్య 23 లక్షల మందికి పడిపోయింది. ప్రభుత్వ ధోరణి ఇలాగే కొనసాగితే మరో రెండు మూడు సంవత్సరాలలో ఈ సంఖ్య మరింత పడిపోతుంది. అప్పుడు వివిధ పేర్లతో గురు కులాలు మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్న మిగిలిన పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్స్ కు తరలిపోతారు. టీచర్లు రిటైర్ అయిపోతారు. ప్రభుత్వ స్కూల్స్ లేకపోయితే, టీచర్ పోస్టులు నింపే బాధ్యత కూడా ఉండదు.వారికి వేతనాలు, పెన్షన్ లు, డి.ఏ లు కూడా ఇచ్చే పని ఉండదు. ప్రభుత్వ స్కూల్స్ లేకపోతే రిజర్వేషన్ లు అమలు చేసే బాధ్యత కూడా ఉండదు.
గత ప్రభుత్వం లాగే, ఈ ప్రభుత్వం కూడా అదే కోరుకుంటున్నట్లు ఉంది. విద్యా రంగానికి గత పదేళ్ళ బడ్జెట్ కేటాయింపులు చూస్తే అదే అనిపిస్తుంది.