వైజయంతీ మూవీసూ తెలంగాణ ముతక సామెత...

తెలంగాణ సామూహిక హృదయం చివుక్కు మంది. ఈ రోజంతా ఒకటే చర్చ. రెండు రాష్ట్రాలకు ఎవరికి తోచిన సాయం వారూచేస్తున్నారు. కానీ వైజయంతి మూవీస్ దోరణి ఎవ్వరికీ నచ్చలేదు...

Update: 2024-09-03 11:28 GMT


 నిన్నంతా తెలంగాణ మోటు సామెత 'తినేది మొగుడి సొమ్ము పాడేది... ' తెలంగాణ యువకుల సోషల్ మీడియాలో చక్కర్లూ కొడుతూ ఉంది. చాలా మంది ఆగ్రహంతో వూగిపోయారు. కారణం ప్రముఖ  చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సంస్థ వరద విరాళం ప్రకటించడంలో వివక్ష చూపిందని విమర్శ.   ‘మేము కేవలం కళాకారులం, మాకు ప్రాంతీయ భేదాలు లేవు అని సన్నాయి నొక్కులు నొక్కే తెలుగు సిని ఇండస్ట్రీ కొన్ని విషయాల్లో చక్కటి ప్రాంతీయవివక్ష చూపిస్తున్నది, అనేది విమర్శ.  సినీ ఇండస్ట్రీలో ఓ వర్గానికి తెలంగాణ అంటే చాలు వాళ్ల ఒంటి మీద పాములు, తేళ్లు పాకుతున్న ఫీలింగ్ ఇంకా ఉన్నట్లుందని సోషల్ మీడియా వ్యాఖ్యానిస్తున్నది.

అసలు విషయం ఏంటంటే, గత వారం రోజులుగా   రెండు తెలుగు రాష్ట్రాల్లో  వానలు వరదలు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, నల్గొండ.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్జా, గుంటూరు జిల్లాల ప్రజలు వరదల ధాటికి అల్లాడుతున్నారు. ప్రభుత్వాలు కూడా తమ శక్తి మేరకు ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నాయి.  రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు వరదావసరాలు తీర్చేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నతీరుకు చాలా ప్రశంసలొస్తున్నాయి.   ఇలాంటి సమయంలోటాలివుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలని ప్రజలు ఎదురుచూస్తుంటారు.   చాలా మంది హీరోలు రెండు రాష్ట్రాలను సమానంగా చూస్తున్నారు. రెండు రాష్ట్రాలకు సమానంగా విరాళాలు ప్రకటిస్తున్నారు.ఎన్టీఆర్, డిజె టిల్లు, మహేష్ బాబు, విశ్వక్సేన్ విరాళాలు ప్రకటించారు.న
ముఖ్యంగా వైజయంతి మూవీస్ బ్యానర్ ధోరణి తెలంగాణలో యువకులకు నచ్చలేదు.    ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరద సాయం కింద ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఆ ప్రకటన కింద ఈ మధ్య ‘‘ కల్కి’’ సినిమాలోని రేపటి కోసం అంటూ వాడే డైలాగ్ ను కూడా జత చేస్తూ ప్రకటన విడుదల చేశారు. కానీ ఈ వరద సాయంలో తెలంగాణ పేరే లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇక్కడే నొప్పించింది.  ఆచేత్తో తెలంగాణ ప్రజలకు సాయం చేసి వుండవచ్చుగా అనేది తెలంగాణ సోషల్ మీడియా అసంతృప్తి.
వైజయంతి మూవీస్ బ్యానర్ తో సహ అనేక బడా సినిమా నిర్మాణ సంస్థలు హైదరాబాద్ లో ఉంటాయి. నిర్మాతలు, సినిమా హీరోలు.. దర్శకులు ఇక్కడే ఉంటారు. తెలంగాణ ప్రజల వనరులే దర్జాగా, తమ అబ్బ సొమ్ములా వాడుకుని సినిమాలు తీస్తారు.
"డబ్బుకోసం  సినిమా టికెట్ల రేట్లు పెంచాలని ఇక్కడి ప్రభ్వుతాలను కోరి రేట్టు పెంచుకుని ప్రజలు నుంచి డబ్బులు పోగేసుకుంటారు.  ఇక్కడే అడ్డగోలుగా సంపాదిస్తారు. ఇదే వైజయంతి బ్యానర్ లో ఈ మధ్య తీసిన సినిమా కల్కికి ఎక్కువ కలెక్షన్ లు ఏ ప్రాంతం నుంచి వచ్చిందో లెక్కలు చెప్పమనండి చూద్దాం.. కానీ తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే మాత్రం కిక్కురుమనరు. ఇది ఎన్నోసార్లు రుజువు అయింది. ఇప్పుడు మరోసారి వైజయంతి మూవీస్ బ్యానర్ రుజువు చేసింది," అని చాలా మంది యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని వరంగల్, ఖమ్మం,నల్గొండ జిల్లాలో వరదల వల్ల 16 మంది అసువులు బాశారు. ఓ హైలెవల్ వంతెన పైన ఉన్న బ్రిడ్జి పై కప్పు మొత్తం కొట్టుకుపోయింది. అంతాల ఉంది వరద తీవ్రత. కేవలం పిల్లర్లు మాత్రమే మిగిలాయి. ఓ యువ శాస్త్రవేత్త వరదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. వందల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. వందల కొలది పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక్కడి జనమంతా ఇలా అల్లాడుతుంటే కనీసం సానుభూతి చూపకపోగా రెచ్చగొట్టేలా కేవలం ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే సాయం ప్రకటించి తమ కురుచ బుద్దిని వైజయంతి చాటుకుందని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టు చేయడ మే కాదు, వీడియోలు తీసి పోస్టు చేశారు.
మొదటి నుంచి ఇంతే..
దీంతో ఆగ్రహం అదుపుతప్పుతుంది, సహజంగానే.   "తెలంగాణ నుంచి వచ్చి టాలీవుడ్ లో నిలదొక్కుకున్న కనీసం ఓ పదిమంది హీరోల పేర్లు టక్కున చెప్పగలరా? తెలంగాణ రావడాని కంటే ముందు ఇక్కడ ప్రజల భాషను ఎంతలా అవహేళన చేశారు. పాత సినిమాల్లోని విలన్ గా నటించిన రామిరెడ్డి, కోట శ్రీనివాసరావులకు ఎటువంటి బాషను వాడేవారు. నాగార్జున- రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన శివ సినిమాలో తెలంగాణ నటుడు ఉత్తేజ్ చెబుతున్న రామాయణాన్ని ఎలా కించపరిచేలా డైలాగ్ లు రాశారు," ఉస్మానియా జెఎసికి చెందిన రీసెర్చ స్కాలర్  మన్నేశ్రీకాంత్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎంతమంది యువత ఆత్మహత్య చేసుకున్నార కనీసం ఓ ప్రకటన అయిన టాలీవుడ్ నుంచి వచ్చిందా? అని మరొక విద్యార్థి ప్రశ్నించారు. 
"మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి.. సామాజిక తెలంగాణ అని ఓట్లు దండుకుని తెలంగాణ ఉద్యమం రాగానే రాత్రికి రాత్రి ప్లేట్ ఫిరాయించి సమైక్యాంధ్ర అనలేదు.. ఇలా తెలంగాణ ప్రజలు మర్చిపోయిన సంఘటనలను ఆంధ్ర సినీ ఇండస్ట్రీ ఏదో సందర్భంలో పుండుమీద కారంలా గెలుకుతూనే ఉంది. తెలంగాణ ఎన్నిసార్లు కరువుతో అల్లాడింది. ఎన్నిసార్లు వరదలలో కన్నీరు కార్చింది. ఏనాడైన ఈ సినీ పెద్దలు.. ఒక్కరూపాయి అయినా విదిల్చారా?," అని ఆయన అన్నారు.ప
రామోజీ ఫిల్మ్ సిటీ, రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ ఇలా మీరు నిర్మించుకున్న సినీ స్టూడియోలన్నీ తెలంగాణ గడ్డపైనే ఉన్నాయి. తెలంగాణ - ఆంధ్ర రాష్ట్రం కలిసే సమయంలో తెలంగాణ భూములు కొనాలంటే ఇక్కడ ప్రజల సమ్మతి అవసరం అనే విషయాన్ని పెద్ద మనుషుల ఒప్పందంలో స్ఫష్టంగా రాసుకున్నారు. కానీ ఇక్కడ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేసి ఆ నిబంధన ఎత్తివేయించుకుని దర్జాగా పావలా, రూపాయికి ఇక్కడి భూములను కొని ఇప్పుడు వేలకోట్లకు అధిపతులు అయ్యారు. ఈ విషయం మీరు మర్చిపోయిన చరిత్ర మర్చిపోలేదని మరొకరు వ్యాఖ్యానించారు.
"తెలంగాణ సమాజాన్ని ఇలాగే రెచ్చగొడితే.. బ్యాన్ ఆంధ్ర సినిమాస్ అనే పేరుతో సోషల్ మీడియాలో.. తెలంగాణ రోడ్లపై ఉద్యమం చేసి కర్రుకాల్చి వాత పెడతారు.. అప్పుడు కానీ మీరు ఊరుకునేలా లేరు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఓ మాట వినిపించేది.. కిరాయిగాళ్లు.. సొంతదారులు..కారు.. అని.. ఇప్పుడు ఇదే విషయాన్ని తెలంగాణలో ఉన్న సినీ ఇండస్ట్రీ పెద్దలు నిరూపిస్తున్నారు. తమ చేష్టలతో.," అనేది మరొక వాట్సాప్ మెసేజ్.

వైజయంతి మూవీస్ సంస్థ 25 లక్షలు ఆంధ్ర CM సహాయనిదికి ఇచ్చినట్లు ప్రకటించింది వారికి ఇవ్వడాన్ని మేము తప్పు పట్టడం లేదు కానీ తెలంగాణ వరదల పట్ల మీ వైఖరీ ఇదేనా అని యన్. యం. శ్రీకాంత్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ (టి. యస్. ఏ) అన్నారు.

"తెలంగాణ సంపదను కొల్లగొట్టి, స్టూడియోల పేరుతో ఆంధ్రపెత్తందారులు ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు లీజుకి తీసుకుని లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ఇది చాలదు అన్నట్లుగా అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారు . కొంతమంది సినీ పరిశ్రమ వాళ్లు ప్రజలు ఆదుకోవడానికి AP సిఎం సహాయ నిధి కి డబ్బులు ఇస్తున్నారు సంతోషం. గతంలో కూడ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్ కి కోట్ల రూపాయలు ఇచ్చారు కానీ హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కనీసం ఎవరు స్పందించలేదు," శ్రీకాంత్ అన్నారు.

వైజయంతీ మూవీస్ సంస్థ తీరులో మార్పు వస్తుందని, దీన్నంత సీరియస్ తీసుకోవసరం లేదని, కచ్చితంగా తెలంగాణ వరద సాయం సంస్థ ప్రకటిస్తుందని మరొక వాట్సాప్ మెసేజ్ తెలంగాణయువకులను శాంతింప చేసే ప్రయత్నం చేసింది..


Tags:    

Similar News