సుంకాల సమరం నుంచి భారత్ పాఠాలు నేర్చుకుంటుందా?
ట్రంపు సుంకాల పెంపు వల్ల అమెరికాకు దూరమై, చైనాకు సన్నిహితమవుతున్న దేశాల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం;
అమెరికా దాదాపు అన్ని దేశాలపై నాటకీయంగా సుంకాలను పెంచినప్పటికి తనతో మాట్లాడటానికి క్యూ కట్టే డజన్ల కొద్దీ దేశాలతో చర్చల ద్వారా గొప్ప ఒప్పందాలు కుదుర్చుకుంటామని ట్రంప్ ఇప్పటికీ భావిస్తున్నాడు. 75 దేశాల ప్రతినిధులు తనకు ఫోన్లు చేశారని, వారు 10% పెంపుదలకు అంగీకరించి ఒప్పందాలకు సిద్దంగా వున్నారని గొప్పలకు పోతున్నాడు. అమెరికా పై ప్రతీకార సుంకాలను విధించని దేశాలకు 90 రోజులు సుంకాల అమలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ చైనా పై విధించిన 145% సుంకాలకు ఈ రాయితీ వర్తించదు. దానితో చైనా వెనక్కు తగ్గలేదు సరికదా తన ప్రతీకూల సుంకాన్ని 84% నుండి 125% కు పెంచింది. ఐరోపా సమాఖ్య కూడా ప్రతిఘటనకు పిలుపు ఇచ్చింది. ట్రంప్ మాదిరి అది కూడా ప్రతికూల సుంకాలను విధిస్తామన్నది. అయితే ఈ సుంకాల యుద్దంలో ఎవరూ విజేతలుండరని చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ అన్నారు. అయితే అమెరికా ఏకపక్ష వాదాన్ని, ఆర్ధిక దౌర్జన్యాన్ని తిప్పికొట్టాలని ప్రపంచ దేశాలన్నీ, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.
అమెరికా ఆర్ధికమంత్రి స్కాట్ బెసెంట్ ఈ వ్యవహారాన్ని” బేరసారాల వ్యూహం” గా ప్రకటించాడు. ”సమస్యంతా చైనా వంటి దేశాలతోనే, అవి ప్రపంచ వాణిజ్యంలో ఆర్ధిక అసమతౌల్యానికి కారణమవు తున్నాయని ధ్వజ మెత్తాడు. చైనా పొరుగు దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, ఇండియాలతో వాణిజ్య ఒప్పందాలు కుదురుతాయి. ఆ దేశాలు అందుకు తయారుగా వున్నాయి” అని ప్రకటించి ఈ టారిఫ్ కల్లోలం వెనుక వున్న అసలు వుద్దేశ్యాన్ని బహిరంగ పరిచాడు. చైనాను ఒంటరిని చేసి కక్ష సాధించడమే, తన భౌగోళిక ఆర్ధిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటమే అమెరికా లక్ష్యం అని తేలిపోయింది. కానీ ఈ చర్యల వల్ల అమెరికాకు దూరమై, చైనాకు సన్నిహితమవుతున్న దేశాల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
తయారీ రంగంలో ఉద్యోగాలు అమెరికాకు తిరిగి వచ్చేలా చూడటానికి సుంకాలు ఒక శక్తివంతమైన ఆయుధం అని ట్రంప్ దీర్ఘకాలంగా నమ్ముతున్నాడు. అందుకే ఆయన చర్యలు కొందరు భావిస్తున్నట్లు పిచ్చివాడి చేతిలో రాయి కాదు. ఆయన ఒక ప్రణాళిక ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగా గురిచూసి విసురుతున్నరాయి. ఆయన తన ఎలక్షన్ ప్రచారంలో పదే పదే ప్రకటించిన విధానాలనే అమలు చేస్తున్నాడని గమనించాలి. ఇలా చేస్తాడని తెలిసి కూడా అమెరికా ఓటర్లు ఆయనకు పట్టం కట్టారు. అంటే ఆయన ద్వారా “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అనే లక్ష్యం నెరవేరు తుందని వారు భావిస్తున్నారు. అయితే ఈ విధానం తో ఆయన కోరుకుంటున్న ఫలితం వస్తుందా అనేది అసలు సమస్య. ఎంతో బింకంగా సుంకాల బాంబు వేసిన ట్రంప్ , షేర్ మార్కెట్లు కుదేలైపోవటంతో వారం రోజుల లోనే తన విధానాలను వెనక్కి తీసుకోవటం, స్తంభింపజేయటం జరిగినది. సుంకాలు అనూహ్యమైన స్థాయిలో పెంచినప్పుడు రాబోయే పరిణామాలను , ముఖ్యంగా మార్కెట్ల పతనం వూహించకుండా ప్రవేశపెట్టరు కదా. అంటే వారి అంచనాలకు మించి నష్టం జరిగిందనుకోవాలా? కొద్దిగా నష్టాలున్నప్పటికి ఒక ఆర్ధిక విప్లవం రానున్నదని, అమెరికా స్థాయి , బలం ఊహాతీతంగా పెరిగిపోతుందని నమ్మ బలికిన ట్రంప్ వారం లో తిరోగమించడంలో అర్ధమేమిటి? సుంకాలను నిలిపి వేయటం ఆయన ప్రభుత్వంపై కార్పొరేట్ల, మార్కెట్ శక్తుల ప్రభావం ఎంతగా వుందో తెలియ జేస్తుంది.
అమెరికా సుంకాల వేధింపును ఎదుర్కోవటానికి రెండు అతి పెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు[భారత్ ,చైనాలు] కలిసి నిలవాలని చైనా ప్రతిపాదించింది. అలాగే ఈ వాణిజ్య పోరు వల్ల పేద, అభివృద్ది చెందుతు న్న దేశాలు నష్ట పోతున్నాయని, ఏకపక్షంగాను, సంరక్షణ వాదం తోనూ అమెరికా తీసుకుంటున్న చర్య లను ప్రపంచ దేశాలన్నీ కలిసి వ్యతిరేకించాలని పిలుపు నిచ్చింది. చైనా అధ్యక్షుడు భారత రాష్ట్రపతితో ఏప్రిల్ మొదటి వారంలో సంభాషిస్తూ పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికగా సాగుతున్న భారత్, చైనా సంబంధాలు మరింత దృఢతరం కావాలని అది డ్రాగన్, ఏనుగుల సంయుక్త నృత్య విన్యాసమై సాగాలని అభిలషించారు. ఆధిపత్య రాజకీయాలను వ్యతిరేకించటంలో బీజింగ్, న్యూ డిల్లీ కలిసి నాయకత్వ పాత్ర వహించాలని చైనా విదేశాంగమంత్రి పేర్కొన్నారు.
అమెరికా దిగి రావాలంటే దాని బాధిత దేశాలన్నీ ఏకం కావటం తప్ప మరొక మార్గం లేదు. ఉక్రెయిన్ సంక్షోభంలో తనతో కలసి పని చేస్తున్న ఐరోపా దేశాలను పక్కన పెట్టిన ట్రంప్‌ను నమ్మేదెలా అని యూరప్ దేశాలు ఆలోచిస్తున్న తరుణంలో వాటి మీద కూడా పన్నుల యుద్ధం ప్రకటించాడు. అలాంటి దేశాలన్నింటినీ కూడ గట్టేందుకు చైనా పూనుకుంది. చైనా ప్రధాని లీ క్వియాంగ్ ఐరోపా సమాఖ్య అధ్యక్షు రాలు ఉర్సులా వాండెర్ లియాన్‌తో మాట్లాడాడు. ఆయా దేశాల వాణిజ్య ప్రతినిధులు చర్చిస్తున్నారు. ఆగ్నేయాసియా దేశాల కూటమితో కూడా చైనా సంప్రదింపులు జరుపుతోంది. ఈ పోరులో అన్నిదేశాలు కలవక పోవచ్చు,కొందరు అమెరికా అనుకూల పాత్ర పోషించ వచ్చు.
ఈ స్థితిలో ఇండియా సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుత సంక్షోభ కాలంలోనూ భారత్ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తోంది. ఇది కేవలం తన ఒక్కరి సమస్య అయినట్లు అమెరికాతో మాట్లాడి పరిష్కరించుకొంటామన్నట్లు వ్యవహరిస్తోంది. దాన్ని కొందరు సమతుల్యత అని వర్ణిస్తున్నారు. కొందరు వ్యూహాత్మక మౌనం అంటున్నారు గాని వాస్తవంలో ఒక శ్వేత జాత్యహంకార ధూర్తునికి, ఒక ఆధిపత్య శక్తికి పరోక్షంగా సమర్ధన ఇస్తోంది. తుపాకి గుండు నాకు రాసుకు పోయింది గాని తగలలేదు అన్నట్లు గా వుంది. సామూహిక అక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని నిరోధించక తటస్తంగా వుండటమంటే, మౌనంగా వుండిపోవటమంటే, నేరస్తునికి మద్దతుగా నిలవటమే అవుతుంది. ఇప్పుడు ఇండియా, బాధిత గ్లోబల్ సౌత్ దేశాలతో గాని, అభివృద్ధి చెందుతున్న పేద మధ్యతరగతి దేశాలతో గాని సంఘీభావం లేకుండా అమెరికాతో ఏదో ఒప్పందం చేసుకుని తాను బయట పడాలను కోవటం అంతర్జాతీయ బాధ్యత నుండి తప్పించుకు పోవటమే అవుతుంది. ఒకరి ఇల్లు తగుల బడుతుంటే తాను చలి కాచుకోవటం లాంటిది.
కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, గొప్ప ఆర్ధిక రాజకీయ విశ్లేషకులు, ఐక్యరాజ్యసమితికి ప్రముఖ సలహా దారు జెఫ్రీ సాక్స్ ఈ మధ్య “ రైజింగ్ భారత్” కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలను మనం బాగా గమనించాలి.” భారతీయులకు ఒక స్నేహపూర్వక హెచ్చరిక” అంటూ ఆయన ఇలా చెప్పారు – చైనాను దెబ్బతీయటానికి అమెరికా భారతదేశాన్ని తన దుడ్డుకర్ర లా ఉపయోగించాలనుకొంటోంది. అయితే భారతదేశం అమెరికా ఆడుతున్న ఆటలో పాల్గొనకూడదు. ఇండియా చాలా పెద్ద దేశం అది అమెరికా కోసం ఆడ కూడదు. తన ప్రయోజనాల కోసం ఇతర దేశాలు పరస్పరం కలహించుకునేలా చేయటం వాషింగ్టన్ దీర్ఘ కాలం గా అనుసరిస్తున్న వ్యూహం. ఆ భౌగోళిక వ్యూహంలో ఇండియా చిక్కుకోకూడదు.” "అమెరికన్లు, ప్రత్యేకించి చైనా పట్ల పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీని లోకి మిమ్మల్ని లాగుతున్నారు. మీరు రాకండి. భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సమస్యలు, వివాదాలు ఉన్నాయని నాకు తెలుసు.
మీకు మేలు జరగా లంటే మీకు మీరు గానే స్వయంగా వాటిని పరిష్కరించుకోండి. మీ ఇద్దరూ కలిసి ప్రపంచ జనాభాలో 40% ఉన్నారు. మీరు ఇద్దరు కలిసి ప్రపంచాన్ని మరింత మంచి మార్గంలో నడిపించగలరు.” అంతేకాదు అమెరికాకు ప్రయోజనం చేకూర్చే క్వాడ్ లాంటి వ్యూహాత్మక ముఠాలలో మీరు సభ్యులుగా వున్నారు. మీ రాజకీయ నాయకులు కొందరు మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ట్రంప్ వాణిజ్య విధానం వల్ల కాదనీ , చైనా వల్ల అనీ వక్రీకరించి చెబుతున్నారు. అది నిజం కాదు.ఈనాటి సంక్షోభం ట్రంప్ వల్ల వచ్చిందే. మీరు ఆయన మాయ లో పడకుండా జాగ్రత్త పడాలి. ఆయన హెన్రీ కిసింగర్ ప్రఖ్యాత వ్యాఖ్యను గుర్తు చేశారు. “ఎవరికైనా అమెరికాను వ్యతిరేకించి దాని శత్రు పక్షం లో వుండటం చాలా హానికరం. అయితే అమెరికా మిత్రవర్గం లోవుంటే మీరు మరింత జాగ్రత్తగా వుండాలి. అది చాలా ప్రమాదకరం.” దిగజారిపోతున్నతన ప్రతిష్టను, ప్రపంచ ఆధిపత్యాన్నిఎలా నిలబెట్టుకోవాలా అన్నదే ఆమెరికాకు ప్రధానం. దానికోసం అది తన మిత్రుల్ని, సహచరుల్ని బలి చేస్తుంది.”
“ బ్రిటిష్ వలస పాలనకు ముందు అనేక శతాబ్దాల పాటు ఇండియా ప్రపంచంలో గొప్ప ఆర్ధిక వ్యవస్థ గా వెలుగు లీనింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ అది అభివృద్ధిలో నిచ్చెన మెట్లు ఎక్కుతోంది. అయితే ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న చైనా ఏవిధంగా అమెరికా నుండి పగ, కక్షలను ఎదుర్కొంటోందో, రేపు మరింత అభివృద్ధి చెందితే ఇండియా కూడా అలాగే అనుభవించవలసి వస్తుంది. తనను దాటి ఎవరు ముందుకు వెళ్ళినా అమెరికా సహించదు” అని ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ ప్రస్తుతమున్న ఒత్తిళ్లను సంక్షోభాలను అధిగమించి, అమెరికాను దాటి భారత్ దూసుకుపోతుందని, మరో పాతిక సంవత్సరాల కాలంలో ప్రపంచంలో రెండో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని” ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. జెఫ్రీ సాక్స్ లాంటి విదేశీ విజ్ఞుల మాటలయినా మన పాలకుల చెవిని బడతాయా? ఇప్పటికైనా భారత్ సరైన పాఠాలు నేర్చుకుంటుందా? అమెరికా వ్యూహం నుండి బయటపడి తన స్వతంత్రతను, జాతి ప్రయోజనా లను కాపాడుకుంటుందా?