ఇవన్నీ మట్టిని నమ్మిన మనుషుల కథలే!

ఓ రోజు ఇందిరా గాంధీ ప్రధానమంత్రి హోదాలో వ్యవసాయ శాస్త్రవేత్త మాధవపెద్ది మురళీ కృష్ణను ఉన్నపళంగా రమ్మని హుకుం జారీ చేసింది. ఆయనకు గుండెలు జారిపోయాయి...ఇక అంతే..

Reporter :  The Federal
Update: 2023-11-29 18:23 GMT

ఇవన్నీ మట్టిని నమ్మిన మనుషుల కథలే..

Unsung Heroes of Agriculture Scientists

……..

ఓ రోజు ఇందిరా గాంధీ ప్రధానమంత్రి హోదాలో వ్యవసాయ శాస్త్రవేత్త మాధవపెద్ది మురళీ కృష్ణను ఉన్నపళంగా రమ్మని హుకుం జారీ చేసింది. ఆయనకు గుండెలు జారిపోయాయి. ఈపూటతో ఈ ఉద్యోగం గోవిందా అనుకుంటూ పీఎంవోలోకి అడుగుపెట్టాడు. ఇందిరా గాంధి వస్తూనే.. సీ మిస్టర్‌ మురళీ.. మనం పెదలకు పౌష్టికాహారాన్ని అందించాలి. మీరేం చేస్తారో తెలియదు.. దానికో ఫార్ములా కనిపెట్టి చెప్పండి.. అని చెప్పి వెళ్లిపోయారు. ఆ ఫార్ములాయే మోడరన్‌ బ్రెడ్‌. నామమాత్రపు ధర.. పేదల ఇళ్లల్లో కళ కళ. ఆ మురళీ మన తెలుగువాడు.

...

బ్రెయిలీ లిపి లేని రోజులవి. బంగారం లాంటి ముగ్గురు పిల్లల్లో ఒకరికి చూపు మందగించింది. దివ్యాంగురాలైంది. ఇక, ఆ ఇంట్లో పరిస్థితి ఎట్లుంటదో ఊహించండి.. కానీ పోటు రంగారావు డిఫరెంట్‌. కణం, కణ విభజనలో ఆరితేరిన శాస్త్రవేత్త. కుమార్తె కోసం ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాడు. ఆమెకు మూడో కన్నయ్యాడు. పెద్ద లాయర్ని చేశాడు. అమెరికాలో అటార్నీ చేశాడు. ఆయన మనోడు. ఆరణాల తెలుగోడు.

...

1950ల ప్రాంతం.. ఎటు చూసినా తిండిగింజల కొరత. దిగుబడులే ప్రధాన సమస్య. ఆ భారం వ్యవసాయ శాస్త్రవేత్తల నెత్తిన పండింది. సంకరాలు, హైబ్రీడ్లు సృష్టించారు. అలా వచ్చిందే మన బీపీటీ 5204 ఎలియాస్‌ సాంబ మసూరీ. దీన్ని రూపొందించిన వారెవరో తెలుసా? డాక్టర్‌ మొరవపల్లి వెంకట రమణ రెడ్డి అనే డాక్టర్‌ ఎంవీ రెడ్డి. మన తెలుగుబిడ్డ. దేశానికే దారిచూపిన దిట్ట. ఈవేళ దేశంలో సుమారు కోటి ఎకరాల్లో ఈ బీపీటీలు సాగవుతున్నాయంటే మనం మీసం మెలెయ్యాలి కదా..

...

నర్సమ్మ.. ఓ కానిస్టేబుల్‌ బిడ్డ. చిన్నప్పట్నుంచి అన్నీ కష్టాలే. 2005లోనైతే ఏకంగా క్యాన్సర్‌తోనే ఢీ కొట్టారు. వెరవదు, బెదరదు. ఐఆర్‌ఎస్‌ చేసింది. ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ప్రిన్సిపల్‌ కమిషనర్‌ అయింది. కష్టాల సుడి నుంచి బయటపడింది. ఈమె కూడా మన తెలుగింటి ఆడపడుచే.. మట్టి వాసన తెలిసిన మనిషే..

...

ఎవరీళ్లు? ఏమిటీ కథ? అనుకుంటున్నారా.. ఇదో పెద్ద చరిత్ర. రాస్తే రామాయణం, చెప్తే మహాభారతం.. అయితే వీళ్లందరికీ ఓ కుదురుంది. ఓ నీడుంది. అదే బాపట్ల వ్యవసాయ కళాశాల. పెట్టి 75 ఏళ్లు దాటింది. వేల మంది డిగ్రీలతో బయటకొచ్చారు. కొందరు శాస్త్రవేత్తలయ్యారు. రాజకీయనాయకులయ్యారు. ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఆర్‌ఎస్‌ లయ్యారు. విత్తన వ్యాపారులు, వ్యాపార సంస్థల యజమానులయ్యారు. ఇంకా కొందరు స్వచ్ఛంద సంస్థలు పెట్టారు. బడాబడా కంపెనీలకు సీఇవోలయ్యారు. ఒకరిద్దరు నాబార్డ్‌ ఛైర్మన్లూ అయ్యారు. కొంతమందైతే పరిశోధనల కోసమో, ప్రభుత్వ ఉద్యోగాల పేరిటో విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. ఇంతవరకు వింతేమీ లేదు గాని వీళ్ల జీవన రేఖల్ని ఓ చోటకు చేర్చడమే ప్రయాస.

....ఇలా మొదలైందీ ప్రస్థానం...

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉంది. చావు తప్పి ఇంటికొచ్చి ఓ వారమై ఉంటుంది. ఓ రోజు పొద్దున మిత్రుడు వలేటి గోపీచంద్‌ ఫోన్‌ చేశాడు. కుశలం కోసమేననుకున్నా. ఆ తర్వాత నేనో ప్రాజెక్ట్‌ చేపట్టా, మీ సహకారం కావాలన్నాడు. గోపీచంద్‌ ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌. వ్యవసాయమంటే మక్కువ. వీటన్నింటికీ మించి జనం మనిషి, మనసున్న మట్టి మనిషి. నాకిష్టమైన వాడు. మహా అయితే ఏదో ఉపన్యాసం ట్రాన్స్‌లేషనో, రేడియోలో టాకేమోలో అనుకుంటూ –మన స్నేహానికి భంగం కలిగించనిదైతే– ఓకే అన్నా. అప్పుడు చెప్పాడు.. బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి ఎందరెందరో ప్రముఖులు, మహానుభావులొచ్చారు. వాళ్లెవరూ వారి జీవిత చరిత్రలను రాసుకోలేదు. అందుబాటులో ఉన్న వారి జీవనరేఖల్ని భావితరాల కోసమైనా గ్రంథస్థం చేయాలనుకుంటున్నానన్నాడు. సాక్షి పత్రిక యాజమాన్యం ఇంటి నుంచి పని చేయడానికి వెసులు బాటిచ్చినందున ఎలాగూ ఇంటిపట్టునే ఉంటున్నా గనుక రాద్దాంలెమ్మన్నా.. అలా హరితరేఖల సంకలం ప్రారంభమైంది. ఇప్పటికి మూడు సంపుటాలు వచ్చాయి. నేను, గోపీచంద్, ఆచార్య తుమ్మల రత్నసుధాకర్, చెన్నూరు సీతారాం కలిసి సుమారు 185 మంది జీవనరేఖల్ని చిత్రికబట్టాం.

...నంబీయార్‌ సినిమాతోనైనా...

వెలుతురు తోవలు, వెలుగుపూలు తర్వాత మూడో సంపుటి వెలుగు దివ్వెలు వస్తున్న తరుణంలో ఇస్త్రో శాస్త్రవేత్త నంబియార్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా వచ్చింది. ఈ బయోపిక్‌ మంచి సక్సెస్‌ కూడా అయింది. పుక్కిటి పురాణాల మీద, కాయకల్ప చరిత్రల మీద పుంకానుపుంకాలుగా వందల కోట్లు తీసినన్ని తెలుగు సినిమాలు ఏ ఒక్క వ్యవసాయ శాస్త్రవేత్త జీవితం మీదా వచ్చిన దాఖలాలు లేవు. బహుశా జంతు, వృక్ష శాస్త్రాలలో శాస్త్రవేత్తగా ఖ్యాతిగాంచిన జగదీష్‌ చంద్రబోస్‌ మీద ఏదైనా డాక్యుమెంటరీ వచ్చిందేమో గాని తెలుగులో అటువంటివీ రాలేదు.

...అక్కడైతే ప్రతి ఒక్కటీ బయోపిక్కే...

నిజానికి వీళ్ల చరిత్రలు చదువుతున్నప్పుడు ఇవన్నీ బయోపిక్‌లకు అర్హమైనవేననిపించింది. విదేశాల్లోనైతే కచ్చితంగా తీస్తారు కూడా. టీ (తేయాకు)ని మార్కెట్‌ చేయడానికి బ్రిటీషోళ్లు మన రాష్ట్రంలో పడిన కష్టాన్ని (అదేలే.. వ్యూహాన్ని) డాక్టర్‌ దాశరధి రంగాచార్య తన జీవనయానంలో అమోఘంగా రాస్తాడు. అదే పంట దిగుబడిని పెంచడానికి ఈ దేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఈవేళ రసాయన ఎరువుల వాడకం వద్దు మొర్రో అంటున్నారు గాని స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో యూరియా, పొటాష్‌ వంటివి వాడడానికి రైతులు ముందుకు రాకపోతే శాస్త్రవేత్తలు రాత్రుళ్లు పొలానికి వెళ్లి వేసివచ్చేవారట. అలా దిగుబడి పెంచి దేశంలో తిండిగింజల కొరత తీర్చారు. ఇలా వందలాది మంది సేద్యమే జీవితంగా బతికారు. ప్రయోగశాలల్లో రేయింబవళ్లు గడిపారు. కొత్త గింజల రూపకల్పనకు పొలం ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తే ఊరి పెద్దల్ని పట్టుకుని ఇల్లిల్లు తిరిగి విత్తనాలను తయారు చేశారు. ఇలా రెండు తరాలు అంటే మొదటి యాబై ఏళ్లలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పడిన ఇక్కట్లు చెప్పతరం కాదు. ఆ తర్వాతి తరానికి కొన్ని సౌకర్యాలు అబ్బాయి. పని సులువైంది.

... వీళ్లూ సమాజంలో భాగమేగా...

ఇంటర్నల్‌ పాలిటిక్స్, రాజకీయ జోక్యం ఎక్కువైంది. వీళ్లలోనూ తెలివిపరులు తయారయ్యారు. శరీరమంతా కుళ్లిపోయినప్పుడు ఏ ఒక్క అంగమో బాగుండడం కుదరదు కదా. సమాజంలోని అష్టవంకర్లు ఈ వ్యవస్థలోకీ చొరబడ్డాయి. ఒకర్ని ఒకరు అణగదొక్కుకోవడం, పైకి వస్తాడనుకున్న వాణ్ణి మానసికంగా వేధించడం, హింసించడం, బదిలీలు వంటి వాటితో వాళ్లంతట వాళ్లే బయటకు పోయేలా చేసుకున్నారు. ఇప్పటికీ చేసుకుంటున్నారు. అది వేరే విషయం.

...ఒకే ఒక్కడు గోపీచంద్‌...

అంతర్గత కుమ్ములాటల్లో, అణగదొక్కుకోవడాల్లో, పైకి ఎదగాలన్న కుతిలో తమ బయోడేటాలకు ఎన్నెన్నో విశేషణాలు తగిలించుకునే వారు కూడా వారి జీవిత చరిత్రలను రాసుకోకపోవడం విచారకరమే. నిజమైన శాస్త్రవేత్తలెవ్వరికీ అటువంటి తీరిక లేకపోయి ఉండవచ్చు కానీ వాళ్ల రక్త సంబంధీకులైనా, యూనివర్శిటీలు, రిసెర్చ్‌ అకాడమీలైనా ఆ పని చేయించాల్సింది. కానీ అటువంటి పనిని ఓ వ్యక్తి చేయాల్సి రావడమే విషాదం. బాపట్ల వ్యవసాయ కళాశాలంటే మోజు, ఇతరుల కృషిని మెచ్చుకునే పెద్దమనసు, జీవితగమనానికి దారి చూపిందన్న కృతజ్ఞతతో గోపీచంద్‌ తన మిత్రుడు, రైతు నేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్, పద్మశ్రీ వై.వెంకటేశ్వరరావు కలిసి ఈ బరువు నెత్తికెత్తుకున్నాడు. ఇందులో నన్నూ భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు. ఓ వ్యవస్థో, ఓ సంస్థో చేయాల్సిన పనిని ఒకే ఒక్కడు మా గోపీచంద్‌ చేశాడు. ఈ క్రమంలో ఆయన పడిన కష్టాలు, ఎదుర్కొన్న ఈసడింపులు, వెటకారాలు నాకు తెలుసు. ఏమైనా ఆయన సక్సెస్‌ అయ్యాడు. ఒకరా ఇద్దరా... 180, 190 మంది జీవన రేఖల్ని అక్షరబద్ధం చేసి వాళ్ల చేతుల్లో పెట్టాడు. ఈవేళ ఎవరైనా పలానా వ్యక్తి గురించి నాలుగు మాటలు చెప్పండ్రా అంటే చదవడానికి ఈ పుస్తకాలున్నాయి. (కొనుక్కుంటారా, కాంప్లీమెంటరీ కాపీ అడుగుతారా? అనేది వేరే విషయం) అదీ గోపీచంద్‌ చేసిన కృషి. ఉద్దండ పిండాలాంటి వాళ్లు– డాక్టర్‌ ఐవీ సుబ్బారావు, డాక్టర్‌ మాలకొండయ్య, డాక్టర్‌ చింతల గోవిందరాజులు, డాక్టర్‌ పద్మరాజు, డాక్టర్‌ ఏ విష్ణువర్ధన్‌ రెడ్డి మొదలు నేడు రాజకీయ, వ్యాపార రంగాలలో వెలుగొందుతున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జీవీఎల్‌ నరసింహారావు, డాక్టర్‌ యాగంటి వెంకటేశ్వర్లు, బి.శ్రీహరిరెడ్డి, రామ్‌ కౌండిన్య, చంద్రశేఖర్, స్వర్ణ వంగడం సృష్టికర్త వి.రామచంద్రరావు లాంటి వారెందరో జీవన రేఖలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి. కొన్ని మచ్చుకు ఉదహరించాలి గనుక రాయాల్సి వస్తోంది గాని అందరి పేర్లను, వాళ్ల కృషిని తప్పకుండా ఇక్కడ గుర్తు చేయాలి గాని ఇది సరైన చోటు కాదు.

... ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే..

ఉత్తమం సేద్యం, మధ్యమం వ్యాపారం, అథమం సేవక వృత్తి అనే నానుడికి కాలం చెల్లింది. ఈవేళ సేద్యమే అథమం. రైతంటనే ఎగతాళి. రైతు బిడ్డకు పిల్లనిచ్చే వాళ్లూ కరవయ్యారు. రసాయనాలు ఎక్కువై భూ సారం తరిగింది. పర్యావరణ పరిరక్షణ పచ్చి వ్యాపారమైంది. ప్రకృతి సాగుకు వ్యవసాయ పరిశోధనలు గిట్టకుండా పోతున్నాయి. గిట్టుబాటు లేక రైతులు చేలల్లోని చెట్లకు వెళాడుతున్నారు. ఈ దుస్థితి నుంచి రైతును కాపాడాల్సిందే వ్యవసాయ శాస్త్రవేత్తలు, రాజకీయ వ్యవస్థలే. ఆ దిశగా ఓ చూపు చూసేందుకు ఈ పుస్తకాలు, ఈ మహనీయుల కృషి పనికి వస్తాయి. రైతే అల్వేస్‌ రైట్‌ అని నిరూపించేందుకు ఉపయోగపడతాయి. ఓ రైతు శ్రేయోభిలాషి, కవి శెట్టిపల్లి వెంకటరత్నం చెప్పినట్టు..

ఆగునా జీవాలు, సాగునా లోకాలు.. రాజుగా మనమెంచి రైతు జూడకపోతే..

Tags:    

Similar News