ఇదేమీ న్యాయం రేవంత్ రెడ్డీ!

ఒక్క గుంట వ్యవసాయ భూమి ఉంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నుండి మినహాయిస్తారా?;

Update: 2025-07-27 02:30 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పాలనా ప్రాధాన్యతలు సరిగా లేవని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా క్రింద పంపిణీ చేశామని సంబరాలు జరుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తుంగలో తొక్కి కౌలు రైతులకు రైతు భరోసా క్రింద అందించ వలసిన పెట్టుబడి సహాయం ఎగ్గొట్టిన విషయం కూడా చూశాం.

ఇప్పుడు భూమిలేని గ్రామీణ ఉపాధి హామీ వ్యవసాయ కూలీలకు చెల్లిస్తామన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇప్పటికే ఎంపిక చేసిన వారికి కూడా అందించడానికి నిధులు అందుబాటులో లేవని కాలయాపన చేస్తున్నది.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇందిరమ్మ రాజ్యం –ఇంటింటా సౌభాగ్యం పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభయ హస్తం మానిఫెస్టో లో పొందు పరచిన వరంగల్ డిక్లరేషన్ లో “భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇందిరమ్మ రైతు భరోసా ఇస్తామని” హామీ ఇచ్చింది. ఇదే మానిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీ లలో కూడా “వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు రైతు భరోసా గా ఇస్తామని ” హామీని సవరించింది..

2023 డిసెంబర్ 7 న అధికారం లోకి వచ్చి 13 నెలల కాలం గడిచాక 2025 జనవరి 10 న పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో విడుదల చేసిన జీవో నంబర్ 42 లో హామీని మరింత సవరించి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లో భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి సంవత్సరానికి 12,000 చొప్పున ఆర్ధిక సహాయం అందించబడుతుందనీ, ఈ పథకం 2025 జనవరి 26 నుండీ అమలులోకి వస్తుందనీ ప్రకటించింది. అయితే, ఈ జీవో లో గతంలో ఇచ్చిన హామీలకు కొంత భిన్నంగా “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో నమోదు చేయబడి,2023-2024 ఆర్ధిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని, ఒక్కో కుటుంబానికి రెండు విడతలుగా , ఒక్కో విడతకు 6,000 చొప్పున , సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్ధిక సహాయం విడుదల చేస్తామని” ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో వివిధ దశలలో చేసిన ఈ సవరణల వల్ల గ్రామీణ వ్యవసాయ కూలీ కుటుంబాలకు అన్యాయమే జరిగింది. గ్రామీణ ప్రాంతంలో కూలీ పనులకు వెళ్ళే వ్యక్తులకు అస్సలు భూమి లేక పోవడాన్ని ఈ పథకానికి ఒక ప్రాతిపదికగాపెట్టుకోవడాన్ని ఒక మేరకు అర్థం చేసుకోవచ్చు కానీ, ఈ పథకం క్రింద సహాయం అందించడానికి వ్యక్తులను కాకుండా కుటుంబాన్ని ప్రాతిపదికగా పెట్టుకోవడం, వరంగల్ డిక్లరేషన్ లో, 6 గ్యారంటీ లలో ఇచ్చిన హామీకి విరుద్ధమైనది. అక్కడ ఇచ్చిన హామీ “వ్యవసాయ కూలీలకు ( ఈ పదం ముఖ్య మైనది ) 12,000 రూపాయల సహాయం ఇస్తామని. కానీ జీవో ఇచ్చే నాటికి దీనిని సవరించి “కుటుంబానికి” అని చెప్పి లబ్ధిదారుల సంఖ్యను కుదించారు. అలాగే భూమి లేని వ్యవసాయ కూలీలకు అనే హామీకి భిన్నంగా, ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పని చేసి ఉండాలనే నిబంధన చేర్చడం ద్వారా , లబ్ధి దారుల సంఖ్యను మరింత కుదించారు.

నిజానికి ఈ పథకాన్ని 10,00,000 మందికి వర్తింప చేయడానికి వీలుగా రాష్ట్ర బడ్జెట్ లో 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు కానీ తొలి ఏడాది 2024-2025 బడ్జెట్ లో ముందుగా అసలు నిధులు కేటాయించలేదు. కానీ ఆ సంవత్సర రివైజెడ్ బడ్జెట్ లో మాత్రం కేవలం 413 కోట్ల 52 లక్షల రూపాయలు కేటాయించారు. 2025-2026 లో కూడా అంతే మొత్తంలో కేవలం 413 కోట్ల 52 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఒక్కో కుటుంబానికి 12,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తే 3,44,608 కుటుంబాలకు మాత్రమే సరిపోతాయి. అంటే లబ్ధిదారుల ఎంపికలోనే కోత పెట్టడానికి వీలుగా 2025 జనవరి లో విడుదలైన జీవో లో నిబంధనలు పెట్టినట్లు మనకు కనిపిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో మొత్తం 1,10,56,000 మంది నమోదు చేసుకున్నారు. మొత్తం జాబ్ కార్డులలో కేవలం 32,96,000 జాబ్ కార్డులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. ఈ యాక్టివ్ జాబ్ కార్డులలో 55,86,000 కార్మికులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. నిజానికి ఈ పథకం గ్రామీణ పేద కుటుంబాలకు 100 రోజుల పని హక్కుగా కల్పించడానికి వచ్చింది. కానీ గత 4 సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే ఈ పథకం లక్ష్యాన్ని చేరుకోవడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఆయా సంవత్సరాలలో సగటు పని దినాలు కూడా గణనీయంగా పడిపోతున్నాయి. ఉపాధి హామీ కార్మికులకు నిర్ణయించిన వేతనం కూడా పూర్తిగా అందడం లేదు. ఈ అన్ని కారణాల వల్ల ఈ పథకం ఆధారంగా వ్యవసాయ కూలీ కుటుంబాలకు తగినంత ఆదాయం రావాదం లేదు.

2021-2022 లో మొత్తం జాబ్ కార్డులు ఉన్న కుటుంబాలలో కేవలం 3,28,522 కుటుంబాలు మాత్రమే 100 రోజుల పనిని పొందాయి. ఆ సంవత్సరం సగటు పని దినాలు 50.31 మాత్రమే . ఆ సంవత్సరం కార్మికులకు అందిన సగటు వేతనం కేవలం 172.18 రూపాయలు మాత్రమే.

2022-2023 లో మొత్తం జాబ్ కార్డులు ఉన్న కుటుంబాలలో కేవలం 33,872 కుటుంబాలు మాత్రమే 100 రోజుల పనిని పొందాయి. ఆ సంవత్సరం సగటు పని దినాలు 41.56 మాత్రమే . ఆ సంవత్సరం కార్మికులకు అందిన సగటు వేతనం కేవలం 164.33 రూపాయలు మాత్రమే.

2023-2024 లో మొత్తం జాబ్ కార్డులు ఉన్న కుటుంబాలలో కేవలం 1,34,969 కుటుంబాలు మాత్రమే 100 రోజుల పనిని పొందాయి. ఆ సంవత్సరం సగటు పని దినాలు 47.72 మాత్రమే . ఆ సంవత్సరం కార్మికులకు అందిన సగటు వేతనం కేవలం 181.03 రూపాయలు మాత్రమే.

2024-2025 లో మొత్తం జాబ్ కార్డులు ఉన్న కుటుంబాలలో కేవలం 92,689 కుటుంబాలు మాత్రమే 100 రోజుల పనిని పొందాయి. ఆ సంవత్సరం సగటు పని దినాలు 45.82 మాత్రమే . ఆ సంవత్సరం కార్మికులకు అందిన సగటు వేతనం కేవలం 213.31 రూపాయలు మాత్రమే.

నిజానికి ఉపాధి హామీ పథకం లో దినసరి వేతనం 235 రూపాయలు అనుకున్నా, 100 రోజుల పని దొరికితే వారికి కనీసం 23,500 రూపాయల ఆదాయం రావాలి. కానీ సగటు పని దినాలు పడి పోవడం వల్ల, నిర్ణయించిన పూర్తి వేతనం వారికి అందకపోవడం వల్ల ఈ పథకం లో దొరికే ఉపాధితో ఆయా కుటుంబాలకు కేవలం సంవత్సరానికి 7500-8000 రూపాయలు మాత్రమే అందుతున్నాయి. అంటే కనీసం ఒక్కో కుటుంబం 15,000 రూపాయలు నష్టపోతున్నదన్నమాట. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేసినా, ఆయా కుటుంబాలకు ఉపాధి హామీ పథకం లో జరుగుతున్న నష్టం పూడదు.

ఈ పరిస్థితిని పట్టించుకోకుండా, 2023-2024 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం లో కనీసం 20 రోజులు పని చేసిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింప చేస్తామని ప్రకటించడం ఆయా కుటుంబాలకు అన్యాయం చేయడమే.

ఈ పథకం అమలుకోసం ప్రభుత్వం పెట్టుకున్న ముఖ్యమైన నిబంధనలలో ఒకటి, కుటుంబానికి అసలు సాగు భూమి లేకుండా ఉండడం, రెండవది, ఉపాధి హామీ పథకం లో 2023-2024 సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసి ఉండడం .

ఈ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో సర్వే పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. 576 మండలాలలో 12,587 గ్రామ పంచాయితీలలో ఈ ఎంపిక జరిగింది. ప్రభుత్వం నుండీ అందిన సమాచారం మేరకు మొత్తం లబ్ధిదారుల సంఖ్య 4,97,545 ( ఇంకా కొంత పెరిగే అవకాశం ఉంది). వీరిలో షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు 1,36,111 కాగా , షెడ్యూల్డ్ తరగతుల కుటుంబాలు 82,375,వెనుకబడిన తరగతుల కుటుంబాలు 2,50,369 , మైనారిటీ కుటుంబాలు 12,417, ఇతర కుటుంబాలు 16,273 ఉన్నాయి. ఈ మొత్తం కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున అందిస్తే అయ్యే బడ్జెట్ కేవలం 597,05,40,000 రూపాయలు మాత్రమే. కొన్ని కుటుంబాలు అదనంగా పెరిగినా అయ్యే బడ్జెట్ 600 కోట్ల లోపే ఉంటుంది.

అంటే కనీసం 5,00,000 కుటుంబాలు ఇంకా ఇప్పటికీ తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలుగా ఉన్నాయనీ, వారు ఉపాధి హామీ పథకం లో ఒక సంవత్సరంలో కనీసం 20 రోజులకు మించి పనికి కూడా వెళుతున్నారనీ అర్థం. ఇంకా గ్రామీణ ప్రాంతం నుండీ పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు వలస వెళ్ళిన కుటుంబాలకు అసలు లెక్కేలేదు.

నిజానికి ఉపాధి హామీ పథకంలో 2023-2024 ఆర్ధిక సంవత్సరంలో 1 నుండీ 14 రోజుల లోపు ఉపాధి పొందిన కుటుంబాలు 4,87,405 ఉన్నాయి. 15 నుండీ 30 రోజుల లోపు ఉపాధి పొందిన కుటుంబాలు 4,78,499 ఉన్నాయి. 31 నుండీ 40 రోజుల ఉపాధి పొందిన కుటుంబాలు 2,50,825 ఉన్నాయి. 41-50 రోజుల ఉపాధి పొందిన కుటుంబాలు 2,20,718 ఉన్నాయి. ఆ సంవత్సరంలో మొత్తం ఉపాధి పొందిన 25,32,565 కాగా 11 లక్షల కుటుంబాలకు పైగా కేవలం 50 రోజులలోపు మాత్రమే ఉపాధి పొందారు. 14 రోజులలోపు పని చేసిన మొదటి క్యాటగిరీ 4,87,405 కుటుంబాలలో అనేకమంది భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలు ఉండే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి కనీసం 20 రోజులు పని చేసి ఉండాలనే నిబంధన వల్ల ఈ కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలన్నిటికీ ఒక్క రోజు ఉపాధి హామీ పథకం లో పని చేసినా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయడం అవసరం. మిగిలిన పథకాలతో పోల్చినప్పుడు ఇందుకోసం బడ్జెట్ కూడా ఎక్కువ ఖర్చు కాదు.

గ్రామీణ కుటుంబాలకు ఒక్క గుంట ( రెండున్నర సెంట్లు) వ్యవసాయ భూమి ఉన్నా వారిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నుండీ మినహాయిస్తున్నారు. రైతు భరోసా పథకం పరిధి లోకి నెడుతున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లో భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు అందుతాయి. కానీ ఒక్క గుంట సాగు భూమి ఉన్న కుటుంబానికి సంవత్సరానికి కేవలం 300 రూపాయలు అందుతాయి. భూ కమతాల నిర్వచనంలో నిజానికి ఎకరం లోపు సాగు భూమి ఉన్న రైతులందరూ భూమి లేని రైతుల (near to landless ) క్యాటగిరి లొకే వస్తారు.

కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గుంట సాగు భూమి ఉన్నా వారిని రైతు భరోసా పథకం లోకి నెట్టడం ద్వారా అన్యాయం చేస్తున్నది . రాష్ట్రంలో ఒక ఎకరం లోపు సాగు భూమి కలిగిన రైతులు 24,22,000 మంది ఉన్నారు. వీరందరూ పేదలే. వ్యవసాయ కూలీపై ఆధార పడే వారే . వారందరినీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పరిధిలోకి తీసుకు వచ్చి ఆయా కుటుంబాలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయల సహాయం అందించాల్సిన అవసరంఉంది. అయితే ఈ ప్రక్రియలో రియల్ ఎస్టేట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు లబ్ధి పొందకుండా చూడాలి.

గ్రామీణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించడానికి నిధులు లేవనే పేరుతో, ఇప్పటి వరకూ కేవలం 83,887 కుటుంబాలకు మాత్రమే 6,000 చొప్పున సహాయం అందించారు. మిగిలిన వారికి ఇంకా అందాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి మిగిలిన వారికి కూడా వెంటనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహాయాన్ని అందించాలి. ఎకరం లోపు రైతులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకు వచ్చి, భూమి విశతరీనాన్ని బట్టి కాకుండా వారికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయల సహాయం అందించాలి. గ్రామీణ ప్రాంతంలో లబ్ధి దారుల సంఖ్యను మరింత పెంచడానికి ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పని చేసి ఉండాలనే నిబంధనను తొలగించాలి.

Tags:    

Similar News