కుల పురాణాలు కలకాలం నిలిచాయెందుకో?

బిజినెస్ అంటే ముంబైని గుర్తుకు తెచ్చిన నుస్లీ వాడియా ఓ పార్సీ. ఆయన తల్లి ఓ ముస్లిం దీనా. ఆమె పాకిస్తాన్ పితాహమహుడు మహమ్మద్ ఆలీ జిన్నా కూతురు.

Reporter :  The Federal
Update: 2023-12-01 03:31 GMT
resemblance picture

(అమరయ్య ఆకుల)

లం పట్టి గళమెత్తి ఇంగ్లీషోళ్లను పారదోలిన సరోజినీ దేవి ఛటోపాధ్యాయ. ఓ బెంగాలీ బ్రాహ్మణ్. చేసుకున్నది మాత్రం పదహారణాల ఆంధ్రా కాపు, సినీమా అంటే చెవికోసుకునే డాక్టర్ గోవింద రాజులు నాయుడు. బిజినెస్ అంటే ముంబైని గుర్తుకు తెచ్చిన నుస్లీ వాడియా ఓ పార్సీ. ఆయన తల్లి ఓ ముస్లిం దీనా. ఆమె పాకిస్తాన్ పితాహమహుడు మహమ్మద్ ఆలీ జిన్నా కూతురు. కమ్యూనిస్టు పార్టీ పత్రిక విశాలాంధ్ర. ఈ డెయిలీని కుడి చేత్తో ఎడమ చెత్తో నడిపిన చక్రవర్తుల రాఘవాచారి తమిళ బ్రాహ్మిన్. అక్కడెక్కడో అరవ రాష్ట్రం నుంచి నెల్లూరు, వరంగల్ మీదుగా విజయవాడ వచ్చి స్థిరపడిన వైదికుడు. చేసుకున్నది మాత్రం ఓ కమ్మోళ్ల అమ్మాయిని. ఇలా ఎన్నైనా చెప్పవచ్చు.

....

కులం కుళ్లును అగ్గితో కడిగేయాలన్న కాలమది. కులాన్ని కూకటి వేళ్లతో పీకేయాలనుకున్న టైం అది. ఇప్పుడు లెక్కలు మారాయి. కులం పునాదుల్ని కాంక్రీట్తో బిగిస్తున్నారు. కులం పునాదులపై ఎగబాకాలనుకుంటున్నారు. పైకి మాత్రం ఇవి పోవాల్సిందేనబ్బా అంటుంటారు. చాన్స్ వస్తే కుల పురాణాలను విప్పుతారు. వాటి గొప్పతనాల్ని విన్పిస్తుంటారు. కాసేపు ఈ గోల పక్కనబెడితే.. ఈ మధ్య కులం కథలు బాగా ప్రచారంలోకి వస్తున్నాయి. వీటిని చదివినప్పుడు సాంస్కృతిక నేపథ్యం తెలుస్తుంది. కులానికి పురాణాలకు మధ్యున్న లంకెమిటో తెలుస్తుంది.

మా మాస్టారు శౌరయ్య గారిని వీటిని గురించి అడిగితే... చుండూరు ఊచకోత తెలుసు. కారంచేడు మారణకాండ తెలుసు. గుజరాత్ గాయం తెలుసు. ఈ కులం కథలేంటో అస్సలు తెలియవంటాడు. 66 ఏళ్లు. గుంటూరులోని ఓ పేరున్న స్కూలుకి హెడ్మాస్టర్ గాపని చేసి రిటైర్ అయ్యారు. తానెప్పుడూ వాటిపై దృష్టి సారించలేదని చెబుతూనే కుల వివక్షను రుచి చూశానంటాడు.

ఇంతకీ జాతి, కులం ఒక్కేటేనా అన్నది ఆయన ప్రశ్న. భారతీయులు 2వేల ఏళ్లుగా వాడుతున్న పదం జాతి. 3వందల ఏళ్ల కిందట యూరోపియన్లు వాడిన పదం కులం. నేడు కులం అంటరానితనంతో ముడిపడింది. అయోమయంలో ఉంది. దేశంలో 3 వేల కులాలు, మరో 25వేల ఉపకులాలు ఉన్నాయంటున్నారు ఇండాలజిస్టులు. ఇవెన్నున్నా దళితులు, దళితేతరులు అనే రెండే నేటి సామాజిక సత్యం. ఎవరి కథలు వాళ్లు రాసుకోవడమే నేటి చరిత్ర. అందుకే శౌరయ్య మాస్టారు లాంటి వాళ్లూ ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టారు. ‘వాళ్లు చెప్పని ఈ కథల్ని’ మీకు చెప్పే ప్రయత్నం ఇది.

3 వేలకు పైగా కులాలు

ప్రముఖ దళితనాయకుడు కత్తి పద్మారావు మాటల్లో.. దేశంలో 3 వేలకు పైగా జాతులున్నాయి. ప్రతి జాతీ వాళ్లవాళ్లతోనే జత కడుతుంటాయి. ప్రతి జాతికీ ఏదోక వారసత్వ వృత్తి ఉంది. ఓ కథో, కాకరకాయో ఉంది. నమ్మకమో, ఆచారమో ఉంది. అయితే ఇవేవీ బ్లాక్ అండ్ వైట్ కాదు. పుక్కిటి పురాణాలే. ఆనోటా ఈనోటా చెప్పుకునేవే. అందుకే కాస్త చదువుకున్న వారు రాతపై దృష్టి పెట్టారు. కులాల మ్యాపింగ్ కి మూలమేమిటో తెలియదు. వేదకాలం నాటి లెక్క ప్రకారం నాలుగు వర్ణాలున్నాయి. అవి- బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర.

మేలు జాతనే భావన లేకపోలేదు

సామాజిక చట్రంలో పైనున్నది బ్రాహ్మణ వర్ణం. మేలు జాతనే భావన లేకపోలేదు. మిగతా మూడింటా చాలా తేడాలున్నాయి. బోలెడన్ని ఎగుడు దిగుళ్లున్నాయి. నిజానికి ఈ వర్గీకరణ చాలా టెన్షన్‌తో కూడిందే. తరచుగా కోర్టులకు ఎక్కుతుంది. వివాదం అవుతూనే ఉంది. గొర్రెల కాపరిని వైశ్యుడనల్నా లేక శూద్రుడిగా చూడాల్నా? రైతు వర్గం నుంచి వచ్చిన రాజును క్షత్రియుడిగా చూడాల్నా? మరి అలాంటప్పుడు ఓ భూస్వామిని, ఓ భూమి లేని పేద రైతును, ఇంకో కౌలు రైతును సైన్య విభాగంలో ఎక్కడ గుర్తించాలి?

మూతికి ముంత, మొలకి చీపురెందుకు?

ఈ నాలుగు వర్ణాలే సరైనవైతే మరి దళితులు ఎవరు?? ఎలా పుట్టుకొచ్చారు? 'అంటరానివారు'గా ఊరి బయటకి ఎందుకెళ్లారు? ఎవరివి వాళ్లు ఎత్తిపోసుకోవడానికి బదులు మిగతావాళ్లవి (మలమూత్రాలు) ఎందుకు ఎత్తిపోయాల్సి వచ్చింది. మూతికి ముంత, మొలకి చీపురెందుకు కట్టుకోవాల్సి వచ్చింది? పూజకు పనికి రాని పూవులుగా.. ప్రధాన స్రవంతికి దూరంగా.. ఏ వర్ణం లేకుండా అవర్ణగా ఎందుకు మిగిలారు. ఎక్కడా క్లారిటీ లేదు. శూద్రుల్లో అతి-శూద్రులన్నారు కొందరు. అతి శూద్రులైతే నిచ్చెన మెట్ల సమాజంలో పైన ఉండాలి కదా. కానీ నాలుగో వరసలో చివరివానిగా ఎందుకు మిగిలారు.

భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులంగా పిలిచే ఈ అతి శూద్ర, ఈ అత్యల్ప స్థాయి వర్గం దేశ జనాభాలో 15 శాతం. ఇక, ఊళ్లకు దూరంగా కొండకోనల్లో బతుకు వెళ్లబారుస్తున్న గిరిజనులు. రాజ్యాంగ లెక్క ప్రకారం షెడ్యూల్డ్ తెగలు 10%. బ్రాహ్మణులు 5%. అంటే దేశంలోని 70% మంది ఈ నిచ్చెన మెట్ల జాతి చట్రంలో అటు పైవాళ్లూ కాదూ ఇటు కింది వాళ్లు కాదు. మధ్యలో ఉన్న వీళ్లందరికీ వేలాది కమ్యూనిటీలున్నాయి. ఒక్కో కమ్యూనిటీకి ఒక్కో జాతి పురాణం ఉంది.

మనం ఏ కథను నమ్మాలి?

కథ నెంబర్ 1.... రుగ్వేదంలోని పురుష సూక్తం ప్రకారం విష్ణువు తల నుంచి బ్రాహ్మణులు, చేతుల్నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు. అయితే పద్మశాలీల (నేతన్నలు) వాదన వేరుగా ఉంది. ‘మా వాళ్లు విష్ణువు బొడ్డు నుంచి పోగులు తీసి దేవుళ్లకే గుడ్డలు నేశారంటారు’ వాళ్లు. అలాంటప్పుడు నేతన్నలు ఎక్కడి నుంచి పుట్టినట్టు? తల నుంచా? పాదాల నుంచా?

కథ నెంబర్ 2... చిట్టాలు రాయడంలో దిట్ట చిత్రగుప్తుడు. యముడికి మొగుడనే కన్నా మంచి సేవకుడు. ఆ చిత్రగుప్తే తమ పూర్వీకుడంటారు లెక్కలు రాసే లేఖకులు. ఈ చిత్రగుప్తుడు రుగ్వేదంలోని పురుష సూక్తం కంటే ముందే ఉన్నాడట. వడ్రంగులు, బంగారపు పని కంసాలీలు... (మెటల్, గోల్డ్ స్మిత్‌లు) మా మూలపురుషుడు విశ్వకర్మ అంటారు. ఈ సృష్టికి మూలమే విశ్వకర్మని చెబుతారు వాళ్లు. సామాజిక చట్రంలో పెద్దపీట దక్కాలంటారు. కానీ వీరి కథలకి హిందూ మత ప్రామాణిక మహా పురాణాలలో చోటు దక్కకపోవడం వల్ల పౌరాణిక గాధలు గానే మిగిలిపోయాయి. సో.. తేలేదేమంటే జాతి పురాణాలు జనాదరణ పొందిన వేదాలను సవాలు చేశాయి. చేస్తున్నాయి.

బ్రాహ్మలు శాఖాహారులా?

ఇంకొన్ని కథలు కూడా ఎలా పుట్టాయో చూద్దాం. బ్రాహ్మలు మామూలుగా శాఖాహారులు. కానీ ఉత్తరాదిన కొంతమంది బ్రాహ్మలు చేపలు తింటారు. దాని వెనుకా ఓ కథ ఉంది.

కథ నెంబర్ 3... ఓసారి సరస్వతీ నది ఎండిపోయిందట. ఆ నదికి ఇరువైపులా ఉన్న వేదపండితులు గత్యంతరం లేక అలో లక్ష్మణా అంటూ పొట్ట చేత బట్టుకుని వలస పోవాల్సి వచ్చిందట. ఆకలి రుచి ఎరుగదన్నట్టుగా అప్పుడా పండితులకు ఈ వైదిక కర్మకాండలేవీ గుర్తుకురాలేదు. బతికుంటే బలుసాకు తినొచ్చనుకున్నారు. వలస పోయిన వారు పోగా మిగిలిన ఓ తెగ... నదిలోని నిల్వ నీటిలో చేపల్ని వేటాడింది. వాటినే తింటూ బతికేసింది. దీని సమర్ధనకు ఇంకో కథ వ్యాప్తిలోకి వచ్చింది. చేపలు మాంసాహారం కాదన్నారు. జలపుష్పాలని పేరు పెట్టారు.

కథ నెంబర్-4.. గంగాతీరం.. సరయు నది. నదికి ఇరువైపులా బ్రాహ్మలే ఎక్కువ మంది. రామరావణ యుద్ధం జరిగింది. ఈ ఇద్దరూ బ్రాహ్మలే. రాముడు రావణ్ణి చంపాడు. రాముడు బ్రహ్మ హత్యాపాతకానికి పాల్పడ్డారని కొందరు.. శుద్ధి చేస్తే పాపహరణం జరుగుతుందని మరికొందరు.. ఇలా రెండు వర్గాలు విడిపోయారు. సరయు నదీ తీరంలోని బ్రాహ్మణుల్లో పోటీకి ఇప్పటికీ ఈ కథే సాక్ష్యం.

రాజపుత్రుల రూటే సెపరేట్...

ఇక, రాజపుత్రులు. వీళ్లు తమ సంతతే ప్రత్యేకమైందంటారు. సూర్య-వంశమో, చంద్ర వంశమో అదీ ఇదీ కాకుంటే అగ్ని వంశం అంటారే తప్ప వేద పురుషుని చేతుల నుంచి పుట్టలేదంటారు. దేశమంతటా రాచరిక కుటుంబాల్లో మనకు ఇటువంటి కథలు వినపడతాయి.

కథ నెంబర్ 5...అనగనగా ఓ రోజున ఓ పసికందు దారిపైన పడుందట. ఆ శిశువుకు ఓ పాము పడగ పట్టి ఎండ నుంచి కాపాడుతుందట. ముఖం నిండా రాజసం తొణికిసలాడుతోందట. చేతులు, పాదాలపై శుభ సంకేతాలున్నాయి. దేవతలు ఆశీస్సులు అందిస్తున్నారు. ఆ శిశువు పక్కన ఓ కత్తి, మరెంతో సొత్తు ఉంది. అలాంటప్పుడు దారిన పోతున్న ఓ బ్రాహ్మణుడో, ఓ జైన సన్యాసో, ఇంకో గిరిజనుడెవరో కాపాడారు. అందువల్ల రాజపుత్రులు పుట్టుకతోనే సంపన్నులు. కత్తులు కటార్లు, సిరిసంపదలతో పుట్టిన దైవాంశ సంభూతులు. అంతేతప్ప ఎవరి చేతుల నుంచో వేళ్లనుంచో పుట్టలేదు. ఇదెవరైనా కాదన్నరో కత్తివేటుకు గురికావాల్సిందే అన్నది వాళ్ల వాదన.

రైడింగ్ కాకుండా ట్రేడింగ్...

వైశ్యులకూ వాళ్ల సొంత కథలు లేకపోలేదు. వాస్తవానికి తామూ యోధులమేనని, కాకపోతే కొన్నికారణాల రీత్యా ఆయుధాల్ని వదిలేశామంటారు.

కథ నెంబర్ 6... వైశ్యుల తండ్రిగా భావించే వారిని పరశురాముడు చంపేశాడు. దాంతో కోపతాపాలు పెరిగాయి. శివుడు జోక్యం చేసుకున్నారు. సర్దుబాటు చేశారు. వైశ్యులపై జైన సన్యాసుల ప్రభావం మెండే. వైరం పరిష్కారం కాదని ఉపదేశం వంటబట్టించారు. వీటన్నింటి వల్ల వాళ్లు శాకాహారాన్ని ఎంచుకున్నారు. యుద్ధాన్ని వదిలేశారు. అంతేతప్ప వాస్తవానికి తామూ యోధులమేనంటారు వైశ్యులు. వీళ్లకు సంబంధించి ఇంకో కథా ప్రచారంలో ఉంది. స్వారీ (యుద్ధం) చేయడం కంటే వ్యాపారం చేయడంలోనే వైశ్యులకు మంచి తెలివితేటలు ఉన్నాయవి వాళ్ల పూర్వీకులు గుర్తించారన్నదే ఆ కథ.

మేమూ రుషుల నుంచి వచ్చిన వాళ్లమే...

సాంప్రదాయకంగా జంతు కళేబరాలు, తోళ్లు, చెత్తాచెదారాన్ని ఎత్తిపోసే వాళ్లు కూడా తమ పూర్వీకులు రుషులనో, రాజులనో చెబుతుంటారు. తాము అక్కడి నుంచే వచ్చామని, కాకపోతే మధ్యలో మోసపోయామని చెబుతారు.

కథ నెంబర్ 7.. ఓ రోజు ఓ చోట ఓ జంతువు చచ్చిపోయింది. అందరూ కలిసి తీసేద్దాం రమ్మన్నారు. నిజమేనని అందరూ వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత... ముందు మీరు పట్టండ్రా అని ఓ పెద్దాయన అన్నారు. చెప్పింది మనోడే కదా అని ఆ పని పూర్తి చేశారు. ఇలా తెలివైన ఓ వర్గం తమ పూర్వీకుల్ని మోసం చేయడం వల్లే తాము ఆ పనికే పరిమితమై పోయామన్నది ఈ వర్గాల క్షోభ. చివరికి తమ వారసులకి ఈ చచ్చిన జంతువుల్ని తీసేసే పనే ఆచారమైందన్న ఆక్రోశం ఉంది. ఆచార నియమాల్ని ఉల్లంఘించి, దేవతలను కించపరిచేలా మాంసాన్ని వండుతారని, లేదా వారు బౌద్ధులు కాబట్టి బ్రాహ్మణుల చేత శిక్షింపబడ్డారన్న కథలూ ఉన్నాయి.

కథ నెంబర్ 8.. ఇంకో కథా ప్రచారంలో ఉంది. ఈ వర్గాలు ఇస్లాం మతంలోకి మారడానికి నిరాకరించారట. అందువల్ల పారిశుద్ధ్య పనివాళ్లుగా మిగిలిపోవాల్సి వచ్చిందట. ఇవన్నీ విన్న తర్వాత ఈ కుల సోపాన పటంలో ఎవరికి వారు పై గళ్లో ఉండాలనుకుంటున్నారే తప్ప కుల నిర్మూలన కాదని అన్పిస్తోంది.

నిజానికి ఇవన్నీ ఆనోటా ఈనోటా విన్న కథలే కావొచ్చు. రుజువుకు నిలబడక పోవచ్చు. మతపరమైన గ్రంధాల మాదిరే జాతి పురాణాల్లోనూ సాంస్కృతిక సత్యం ఉన్నమాట అక్షరసత్యం. అంతోఇంతో హేతుబద్ధత ఉంది. సామాజిక వ్యవస్థ స్వరూపాన్ని తెలుసుకునే విషయాలున్నాయి.. ఏ వేద గ్రంథాల్లోనూ ఇవి లేవు. అందువల్ల ఇవి ప్రివిలైజ్డ్ కథలు కాదు. 

Tags:    

Similar News