అదానీ ‘గ్రీన్‌ ఎనర్జీ’ మరో ఎన్‌రాన్‌ కానుందా?

ఎన్ రాన్ అంటే ఏమిటి, ఆ కంపెనీ చేసిన హాని ఏమిటి?

Update: 2024-12-02 08:46 GMT

-కొండూరి వీరయ్య

ఒకప్పుడు దేశమంటే మోదీ అన్న నినాదం విన్న మనం ఆ మధ్యకాలంలో దేశమంటే అదానీ, అదానీయే దేశం అన్న ప్రకటనలు కూడా విన్నాము. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెల్లడించిన వాస్తవాలకు సమాధనాలు ఇవ్వలేకపోయిన అవన్నీ భారతదేశంపై చేస్తున్నఆరోపణలని అదానీ తిరస్కరించారు. అయినా హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలుగులో అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అదానీ గ్రూప్‌ కంపెనీ కార్యాలయాలపై సోదా చేసింది. హార్డ్‌ డిస్కులు, ఈమెయిల్‌ రాతకోతలు, సామాజిక మాధ్యమాల ద్వారీ జరిగిన సంభాషణలు, లావాదేవీల వివరాలు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేసింది.

ఈ దర్యాప్తు ఆధారంగా అమెరికా న్యాయ శాఖ ఓ నేరారోపణ పత్రాన్ని రూపొందించింది. మన వ్యవహారంలో ఛార్జిషీటు లాంటిది. ఇంతవరకూ ఒక ఎత్తు, గతంలో ఏ కంపెనీ మీద వచ్చిన ఆరోపణల సందర్భంలో జరగని విధంగా అదానీ కంపెనీ నిర్దోషి అని ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ సోషల్‌ మీడియా హాండిల్స్‌తో పాటు మాజీ అటార్జీ జనరల్‌ ముకుల్‌ రోహతగి, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది మహేష్‌ జెఠ్మలానీ వంటి వారు బహిరంగ సమర్ధనలకు దిగటం ఆశ్చర్యకరం. ఈ స్క్రీన్‌ ప్లే ఇంకా క్లైమాక్స్‌కు చేరాల్సి ఉంది. కానీ అమెరికా న్యాయ శాఖ రూపొందించిన నేరారోపణ పత్రం (ఇండైట్మెంట్‌)లో పేర్కొన్న ఘటనలు, వరుస క్రమం, ఆరోపణలు, ఆధారాలు పరిశీలిస్తే 1992 నుండీ 2002 వరకూ దేశాన్ని ఓ కుదుపు కుదిన ఎన్‌రాన్‌ (Enron) కథనం గుర్తుకు తెస్తోంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీస్‌ (Green Energy) కంపెనీపై అమెరికాలో వచ్చిన ఆరోపణల తీవ్రతను అర్థం చేసుకోవాలంటే ఎన్‌రాన్‌ కథను రీప్లే చేయాల్సిందే.

ఎన్‌రాన్‌ కంపెనీ పూర్వాశ్రమంలో చమురు సరఫరాకు కావల్సిన పైపులైన్ల వ్యాపారంలో ఉండేది. 1980 దశకం చివరి ఎన్‌రాన్‌ అవతారమెత్తి విద్యుత్‌ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించింది. చమురు పైపులైన్ల వ్యాపారంలో భాగంగా నైజీరియా నుండి సహజవాయువు వెలికితీత, రవాణా, అమ్మకాలకు ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఓ ముడిసరుకు చేతికి వచ్చిన తర్వాత పెట్టుబడిదారుడు దాన్ని వినియోగించటానికి కావల్సిన చట్రాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఎన్‌రాన్‌ కంపెనీ కూడా అదే విధంగా వ్యవహరించింది. తమ స్వాధీనంలో కావల్సినంత సహజవాయువు ఉన్నందున దీన్ని అమ్ముకోవడానికి గాను మార్కెట్ల వేటలో పడిరది.

అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం పతాక స్థాయికి చేరింది. ప్రధానంగా దేశ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడంలో కీలక భాగంగా ఉన్న చమురు దిగుమతులు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం కొనుగోళ్లకు చెల్లించాల్సిన విదేశీ మారకద్రవ్యం నిల్వలు చెల్లించలేని పరిస్థితులు తలెత్తాయి. ఇదే అదనుగా తీసుకుని అటు ప్రపంచ బ్యాంకు, ఇటు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ దేశాన్ని చెల్లింపుల సంక్షోభం నుండి బయటికి తీసుకురావడానికి సహాయం చేస్తున్నామన్న ముసుగులో మొత్తం భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేందుకు కావల్సిన విధి విధానాలను రూపొందించనారంభించాయి. ఆయా విధానాలే కాలక్రమంలో కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వశాఖల ద్వారా జారీ చేస్తున్న నోటిఫికేషన్లు, పాత చట్టాల సవరణ, కొత్త చట్టాలుగా రకరకాల అవతారాలెత్తాయి.

ఈ విధానాలన్నీ కలిపి గంపగుత్తగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకురణ విధానాలని పిలుస్తున్నాము. ఈ ప్రైవేటీకరణ తొలి వేటును చవిచూసిన రంగం విద్యుత్‌ రంగం. మన్మోహన్‌ సింగ్‌ 1992 ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో దేశంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించవల్సిన అవసరంతో పాటు, దానికున్న మార్గాల గురించి వివరంగా ప్రస్తావించారు. బడ్జెట్‌ ఉపన్యాసంలో భాగంగా ఆయన ‘‘నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా విదేశీ పెట్టుబడుల పట్ల మన దృక్ఫధాన్ని మార్చుకున్నామము. విదేశీ పెట్టుబడుల వలన మనకు మూడు ప్రయోజనాలు కలగనున్నాయి. మొదటిది మన సాంకేతిక పరిజ్ఞానం స్థాయి పెరుగుతుంది. మన పారిశ్రామిక రంగం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో మమేకమవుతుంది. అప్పుతో పని లేని ఆర్థిక వనరులు సమకూరుతాయి. దేశ ఆర్థికాభివృద్ధికి కావల్సిన కీలకమైన రంగాలను ముందుకు తీసుకెళ్లేంత సామర్థ్యం, పెట్టుబడులు మన దగ్గర లేని పరిస్థితుల్లో ఆయా రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొన్నది. విద్యుత్‌ రంగంలో విదేశీ పెట్టుబడులతో సహా ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించటానికి కావల్సిన విధానపరమై చర్యలు ఈపాటికే తీసుకున్నాము.’’ (1992 కేంద్ర బడ్జెట్‌ ఉపన్యాసం).

అయితే కేంద్ర ప్రభుత్వ నూతన విధానాలు అమలు జరగాలంటే 1948 నాటి విద్యుత్‌ సరఫరా చట్టాన్ని సవరించాల్సి వచ్చింది. 1948 నాటి చట్టం ప్రకారం దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి, రవాణా, పంపిణీ, విద్యుత్‌ సేవల నిర్వహణ యావత్తూ ప్రభుత్వరంగంలోనే జరగాలి. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం 1991 విద్యుత్‌ (సవరణ) చట్టాన్ని ఆమోదించింది . ఇందులో భాగంగా 1992 బడ్జెట్‌ కంటే ముందే కేంద్ర విద్యుత్‌ శాఖ ద్వారా అనేక నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో విదేశీ స్వదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవటం ఈ నోటిఫికేషన్ల సారాంశం. కొత్తగా ఆమోదించిన చట్టం ప్రకారం విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు పెట్టే ప్రైవేటు పెట్టుబడిదారులకు కనీసం 16 శాతం లాభాలు గ్యారంటీ చేస్తామన్న షరతులు కూడా ఉన్నాయి.

నైజీరియా నుండి సహజవాయు నిక్షేపాల నిల్వలు కొనుగోలు చేసిన ఎన్‌రాన్‌ కంపెనీ ఆ సహజవాయువు ముడిసరుకుగా విద్యుత్‌ ఉత్పత్తి చేయటానికి ఉన్న అవకాశాలు, మార్కెట్ల వేటలో పడింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా తీసుకుంటున్న చర్యలు ఎన్‌రాన్‌ కంపెనీకి మంచి అవకాశంగా మారాయి. ఇదే అదునుగా కేంద్ర ప్రభుత్వంలో సంప్రదింపులు మొదలు పెట్టింది. తొలి అడుగుగా జూన 1992 నాటికి మహారాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మహారాష్ట్ర విద్యుత్‌ బోర్టుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. మరో ఆర్నెల్లు కూడా ముగియక ముందే రాష్ట్ర విద్యుత్‌ బోర్డుతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నది. దభోల్ (Dabhol Power Station) విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించేందుకు అవసరమైన పెట్టుబడులు సమీకరించేందుకు ఈ ఒప్పందం ఆధారంగా ఎన్‌రాన్‌ కంపెనీ సిద్ధమైంది. బ్యాంక్‌ ఆఫ్ అమెరికా నుండి ఈ ప్రాజెక్టు కోసం 635 మిలియన్‌ డాలర్లు లోను కూడా అనుమతులు తీసుకుంది ఎన్‌రాన్‌ కంపెనీ. తర్వాత అదనపు వనరుల కోసం ఎబిఎన్‌ ఆమ్రో, భారతీయ బ్యాంకులు, అమెరికా ఎగ్జిం బ్యాంకు, విదేశాల నుండి ప్రైవేటు పెట్టుబడులు కూడా సమీకరించింది. ఈ పెట్టుబడుల సమీకరణకు పునాది మహారాష్ట్ర విద్యుత్‌ బోర్డుతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం. ఈ ఒప్పందం కింద ధబోల్‌ లో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌ను మహారాష్ట్ర 20 ఏళ్ల పాటు కొనాలి. ఈ ఒప్పందంలో షరతులు ఏమున్నాయన్నది దేశానికి తెలీకుండా దాదాపు మూడు సంవత్సరాల పాటు కళ్లు కప్పగలిగింది ఎన్‌రాన్‌ కంపెనీ. ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని వందల కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చాయి.

ఈ సమయంలోనే మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ధాబోల్‌ ముడుపులు పెద్ద గాలిదుమారం లేపాయి. ధాబోల్‌ కంపెనీని అరేబియా సముద్రంలో కలిపేస్తామన్న శివసేన అధినేత బాల్‌ థాకరే విమర్శలు మొత్తం ప్రాజెక్టు మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. అందరూ అనుమానించినట్లు 1995లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయి శివసేన బిజెపి ప్రభుత్వం అధికారానికి వచ్చింది. మనోహర్‌ జోషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్‌రాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒప్పందం షరతులు అధ్యయనం చేసేందుకు ముండే నాయకత్వంలో ఓ కమిటీ నియమించారు. ఎట్టకేలకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వివరాలు వెల్లడిరచక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని గ్రహించిన ఎన్‌రాన్‌ కంపెనీ యాజమాన్యం ఒప్పంద పత్రాలు బహిర్గతం చేసింది.

ఈ ఒప్పందాన్ని విశ్లేషించటనానికి స్వతంత్ర సంస్థ అయిన వాన్‌గార్డ్‌ కాపిటల్‌ అనే సంస్థకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ సంస్థ విశ్లేషణలో వెల్లడైన వివరాలు అప్పటి వరకూ ఎన్‌రాన్‌ కంపెనీ వ్యవహారాలపై విద్యుత్‌ రంగ నిపుణుల ఆందోళనలు నిజమని రుజువు చేశాయి. కేవలం రెండున్నర రూపాయలకే విద్యుత్‌ సరఫరా చేస్తామని బయటికి వాగ్దానం చేసినా అంతిమంగా యూనిట్‌ కు మహారాష్ట్ర విద్యుత్‌ బోర్డు 12 రూపాయలు చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందని వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడులకు భరోసా కల్పించటానికి వీలుగా కేంద్ర విద్యుత్‌ శాఖ 16 శాతం కనీస లాభాలకు హామీ ఇస్తే మహారాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎన్‌రాన్‌కు కనీసం 21 శాతం వరకూ లాభాలు గ్యారంటీ చేసేదిగా ఉంది. తొలుత ఈ ప్రాజెక్టుకు రుణాలు మంజూరు చేయటానికి సిద్ధమైన ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్టుకు అనుమతులు పొందటంలో ముడుపుల వ్యవహారం బట్టబయలు అయ్యాక విరమించుకున్నది.

ఈ ఒప్పందం షరతులన్నీ అంకెల్లోకి మార్చి చూస్తే ఒప్పందంలో కుదుర్చుకున్న రాష్ట్ర ప్రజలు అదనంగా ఎన్‌రాన్‌ కంపెనీకి 1400 కోట్ల వరకూ చెల్లించాల్సి వస్తోంది. ఈ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత ఒప్పందాన్ని అమలు చేసే సమస్యే లేదని శివసేన ప్రభుత్వం ప్రకటించింది అప్పటికే అమెరికా అధ్యక్ష భవనంలో క్లింటన్‌ బృందంలో పాగా వేసిన ఎన్‌రాన్‌ కంపెనీ ధాబోల్‌ ఒప్పందాన్ని అమలు చేయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్‌రాన్‌ అంతర్జాతీయ విభాగం వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న రెబెక్కా మార్క్‌ ముంబయిలో దిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ జోషితో పాటు శివసేన అధినేత బాల్‌థాకరేను కూడా కలిశారు. ఈ సమావేశం అప్పట్లో భారత, అమెరికా మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ సమావేశం తర్వాతనే రెబెక్కా మార్క్‌ ఎన్‌రాన్‌ కంపెనీ ప్రధాన కార్యాలయంలో తన సిబ్బందిని పిలిచి ఇటువంటి వ్యూహాత్మక సమావేశాలకు వెళ్లేటప్పుడు అవతలివారిని రంజింపచేసేలా వస్త్రధారణ ఉండాలని, తదనుగుణంగా తన బట్టల బీరువా నిరంతరం సిద్ధంగా ఉంటుందని బీరువా తెరిచి చూపించిందని అప్పట్లో అమెరికా పత్రికలు రాశాయి. ఈ బీరువాలో ఏ తరహా సమావేశానిక వెళ్లుతున్నపుడు ఏ రకమైన వస్త్రధారణ అవసరమో ఆ విధంగా అన్నీ అమర్చి ఉన్నాయి. ఈ సమావేశంలోనే రెబెక్కా మార్క్‌ ‘‘నేను ప్రపంచంలో ఎంతో మందిని రాజకీయ నాయకులను, ప్రభుత్వాధినేతలను, వ్యాపార దిగ్గజాలను కలుస్తున్నాను. ఎంతమందిని కలిశానో నాకే గుర్తు లేదు. కానీ నన్ను కలిసిన ప్రతివాళ్లూ నన్ను తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు’’ అని ప్రకటించించారు. అప్పట్లో అమెరికా అధ్యక్ష భవనం అండతో ఎన్‌రాన్‌ కంపెనీ అంతగా చలాయించేది.

ఈ క్రమంలోనే ఎన్‌రాన్‌ కంపెనీ అంతర్జాతీయ విపణిలో తన షేరు ధరలు పెంచుకోవడానికి, మదుపరుల నుండి పెద్దమొత్తంలో పెట్టుబడులు రాబట్టుకోవడానికి అక్కౌంటింగ్‌ మోసాలకు పాల్పడింది. మహారాష్ట్ర విద్యుత్‌ సంస్థతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఎన్‌రాన్‌ కంపెనీ షేరు ధరలు అమాంతం పెరిగాయి. ఈ విషయాలన్నీ 2001లో బట్టబయలు కావటంతో అమెరికా పార్లమెంటరీ కమిటీలు, సెక్యూరిటీస్‌ ఎక్ఛేంజి కమిషన్‌, విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ సంఘం వంటివి ఎన్‌రాన్‌ వ్యవహార శైలిపై లోతైన దర్యాప్తు జరిపాయి. ఈ దర్యాప్తులో భాగంగానే రెబెక్కా మార్క్‌ భారత రాజకీయ నాయకులకు ధాబోల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు ప్రయోజనాల గురించి అవగాహన కల్పించటానికి 20 మిలియన్‌ డాలర్లు వెచ్చించాల్సి వచ్చిందని వాంగ్మూలమిచ్చారు. అంటే తప్పుడు పద్ధతుల్లో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు పొందటానికి, ప్రజలపై వివరించనలవిగాని రీతుల్లో విద్యుత్‌ ఛార్జీల భారాలు మోపేలా ప్రభుత్వాలను సిద్ధం చేయటానికి ఇచ్చిన లంచాలు అప్పట్లో 20 మిలియన్‌ డాలర్లు ముడుపులు ఇచ్చారు అని తేలింది. 1993లో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అందించిన ముడుపులు లెక్కలోకి తీసుకుంటే ఈ మొత్తం మరింతగా పెరుగుతుంది. ఇంతటి అవినీతి మయమైనందునే దభోల్‌ వ్యవహారాన్ని గార్డియన్‌ పత్రిక 2001, నవంబరు 30 నాటి తన వ్యాఖ్యానంలో భారత కార్పొరేట్‌ చరిత్రలో అతి పెద్ద కుంభకోణంగా పేర్కొంది. అమెరికా సెక్యూరిటీస్‌ ఎక్చేంఇ కమిషన్‌ ద్రవ్య మార్కెట్ల ప్రతిష్టను పణంగా పెట్టి ఎన్‌రాన్‌ లాభాలు దండుకున్నదని నిర్ధారించింది.

ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి ఎన్‌రాన్‌ కంపెనీ స్థానంలో ఇప్పటి అదానీ గ్రీన్‌ ఎనర్జీని కంపెనీని, ఎన్‌రాన్‌ అధినేత కెన్నెత్‌ లే స్థానంలో అదాని కంపెనీ అధినేత గౌతమ్‌ అదానీని, రెబెక్కా మార్క్‌ స్థానంలో సాగర్‌ అదానీని, మహారాష్ట్ర విద్యుత్‌ బోర్డు స్థానంలో భారత సౌర ఇంధన కంపెనీని, వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్‌ బోర్డులను మార్చుకుని ఈ మొత్తం కథనం చదువుకుంటే కార్పొరేట్‌ కంపెనీలు, ప్రత్యేకించి ప్రభుత్వాల అండదండలతో మార్కెట్‌ మంత్రదండాన్ని ఝళిపిస్తున్న గుత్త పెట్టుబడిదారులు రచిస్తున్న కార్పొరేట్‌ మోసాల చిట్టాల స్క్రీన్‌ ప్లేలో ఎటువంటి మార్పూ లేదని అర్థమవుతుంది. తేడా అల్లా ఒక్కటే. అప్పట్లో రాజకీయ అవినీతి బకాసుర పొట్టలు షుమారు రెండు వందల కోట్ల రూపాయల సొమ్ము స్వాహా చేసే సామర్థ్యం కలిగినవైతే నేడు ఆ సామర్థ్యం నేడు రెండున్నర వేల కోట్ల రూపాయలు స్వాహా చేయగల స్థాయికి చేరింది. ఈ ఒక్క మార్పు తప్ప విద్యుత్‌రంగంలో ప్రత్యేకించి ప్రైవేటు రంగంలో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాల్లో నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్న కంపెనీలు చేస్తున్న మోసాల శైలి, స్వభావంలో ఎటువంటి మార్పూ లేవని అదానీ కంపెనీ ముడుపుల మాయాజాలం కథనం నిరూపిస్తోంది.

Tags:    

Similar News