హైదరాబాద్ లో ‘బానిస గూడ’ ఎక్కడుందో తెలుసా?
హైదరాబాద్ లో ఏదైనా ఒక పారిశ్రామిక వాడకి వెళ్లండి. అక్కడ మనుషుల్ని చూడండి, గాలి పీల్చండి, ఒక గుక్కెడు నీళ్లు తాగండి... మీకు బానిస గూడ ఎక్కడుందో తెలుస్తుంది;
16 లక్షల కోట్ల జీఎస్డీపీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని పక్కనే ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో ఒక్క రూము లోనే ఐదుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబం సర్దుకుని బతుకు తుందని మీకు తెలుసా ? రాష్ట్ర సగటు తలసరి ఆదాయం 3 లక్షల రూపాయలకు పైగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అనేక పారిశ్రామిక ప్రాంతాలలో 15 ఏళ్లుగా ప్రమాదకరమైన పరిశ్రమలలో రోజూ 12 గంటలు పని చేస్తూ ఇప్పటికీ నెల వేతనం 15 వేల రూపాయలు దాటని కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నారని ఎంత మందికి తెలుసు ? రాష్ట్ర విద్యా రంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకునే రాష్ట్రంలో స్కూల్ కు వెళ్లని వలస కార్మికుల పిల్లలు పారిశ్రామిక ప్రాంతంలో ఒక్క బస్తీలోనే 50 మందికి పైగా ఉన్నారని ఎంత మందికి తెలుసు ?
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించీ, రాష్ట్రానికి తరలి వస్తున్న పరిశ్రమలు, సంస్థల గురించీ అట్టహాసంగా ప్రకటించుకునే ప్రభుత్వాల మాటలు కొన్ని రోజులు వినడం మానేయండి. మీరు స్వయంగా ఏదో ఒక రోజు బస్సు ఎక్కి, లేదా మీ బండి, కారు తీసుకుని హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఏదో ఒక పారిశ్రామిక ప్రాంతానికి వెళ్ళండి. అక్కడి గాలిని పీల్చండి. నోట్లో పోసుకోకుండా కేవలం అక్కడి నీటి రంగును చూడండి. ఆ పారిశ్రామిక ప్రాంతంలో ఏదైనా ఒక పరిశ్రమ ముందు కార్మికుల సంఘం జండా ఎగురుతుందేమో పరిశీలించండి.
కొద్ది సేపు ఆ పరిశ్రమ ముందు నిలబడి లోపలి నుండీ బయటకు వచ్చే కార్మికులను పలకరించండి. వాళ్ళలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కార్మికులు ఎంతమంది ఉన్నారు ? ఉత్తర భారత దేశం నుండీ, ముఖ్యంగా బీహార్ నుండీ వలస వచ్చిన కార్మికులు ఎంతమంది ఉన్నారో కూడా కనుక్కోండి. వాళ్ళ పని గంటల గురించే, వాళ్ళ శ్రమ గురించీ, వాళ్ళ సెలవుల గురించీ, వాళ్ళ వేతనాల గురించీ, వాళ్ల కున్న హక్కుల గురించీ అడగండి. కొంచెం ఓపిక చేసుకుని ఆ పారిశ్రామిక ప్రాంతానికి దగ్గరలో ఉండే బస్తీకి, లేదా గ్రామానికి వెళ్ళండి. కార్మికుల ఇల్లు చూడండి . కార్మికుడు కుటుంబంతో ఉంటే, ఆ కుటుంబ సభ్యులతో కొద్ది సేపు మాట్లాడండి. మనం 21 వ శతాబ్ధంలోనే ఉన్నామా ? 18 వ శతాబ్ధం లో ఉన్నామా అనే అనుమానం మీకు కలగక పోతే నన్ను నిలదీయండి.
సాధారణంగా ఈ కార్మిక వాడలు మన మధ్య ఎప్పుడు చర్చలోకి వస్తాయి ? వలస కార్మికుల బాధలు అందరూ ఎప్పుడు వింటారు ? పారిశ్రామిక ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగి పదుల కొద్దీ కార్మికులు చనిపోతే అప్పుడు మన దృష్టి అటువైపు మళ్లుతుంది. అలా మన దృష్టిని ఆకర్షించిన ప్రమాద ఘటన సంగారెడ్డి జిల్లా పాశ మైలారం ప్రాంతంలో సిగచీ కంపనీ లో జరిగిన పేలుడు. మేము ఆ ఘటనా స్థలానికి ఒక బృందంగా వెళ్ళి వచ్చాము.
జూన్ 30 న సంగారెడ్డి జిల్లా పాశ మైలారం పారిశ్రామిక ప్రాంతంలో సిగాచి ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు జరిగి, పదుల కొద్దీ కార్మికులు, అధికారులు చనిపోవడం పై 13-07-2025 న తెలంగాణ పౌర సమాజ ప్రతినిధుల బృందం నిజనిర్ధారణ చేసింది. సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ సంస్థ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కలపాల బాబూరావు నేతృత్వంలో పాశ మైలారం పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించిన ఈ బృందం ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాల సభ్యులను కలసి వివరాలను సేకరించింది. ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించి , కొన్ని వివరాలను రాబట్టింది. ఆ రోజు కంపనీ ప్రమాదం నుండీ బయట పడిన వారిని కూడా కలసి మాట్లాడింది. కంపనీ సెక్యూరిటీ అధికారులను , స్థానిక ప్రజలను, ఆ ప్రాంత పౌర సమాజ ప్రతినిధులను కలసి నిజ నిర్ధారణ చేసింది.
ఈ నిజ నిర్ధారణ బృందంలో రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది, మానవ హక్కుల వేదిక నాయకులు వసుధా నాగరాజు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) రాష్ట్ర కో కన్వీనర్ కన్నెగంటి రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. వెంకట రెడ్డి, వై. అశోక్ కుమార్ , అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (APCR) రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఉస్మాన్, నాయకులు మజీద్ , ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక(NAPM) రాష్ట్ర కన్వీనర్ మీరా సంఘ మిత్ర, NAPM నాయకులు అఖిల్ సూర్య , సంగారెడ్డి జిల్లా TPJAC నాయకులు జనార్ధన్ , కందిలి పత్రిక సంపాదకులు రాజేంద్ర ఉన్నారు.
బృందం ఈ క్రింది అంశాలను గమనించింది.
1. సిగాచీ కంపనీలో అత్యధికులు క్యాజువల్,కాంట్రాక్ట్ లేబర్ గా ఉన్నారు. కొద్దిమంది మాత్రమే పర్మినెంట్ ఉద్యోగులుగా ఉన్నారు. రోజుకు రెండు షిఫ్టుల చొప్పున కార్మికులతో 12 గంటలు పని చేయించుకుంటున్నారు. ఎక్కువమంది కార్మికులు ఉత్తర భారత దేశ రాష్ట్రాల నుండీ వచ్చిన పేద కార్మికులు. ఈ కార్మికులకు కనీస వేతనాలు కూడా కల్పించకుండా యాజమాన్యం దోపిడీ చేస్తున్నది.
2. కార్మికులకు, ఉద్యోగులకు ప్లాంట్ లో రక్షణ పై, తీసుకోవలసిన జాగ్రత్తలపై యాజమాన్యం కనీస అవగాహన కూడా కల్పించలేదు. వారి బధ్రతను పూర్తిగా గాలికి వదిలేసింది.
3. ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్య ప్రతినిధులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయలేదు. యాజమాన్యం వారు ప్రమాదానికి పూర్తి బాధ్యత వహించకుండా, ఆసుపత్రిలో ఉన్న కార్మికుల విషయంలో తగిన పట్టింపు లేకుండా, కేవలం తోటి ఉద్యోగులకు మాత్రమే గాయపడిన వారు ఉన్న ఆసుపత్రి వద్ధ డ్యూటీలు వేసి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
4. ఇప్పటి వరకూ ఆ రోజు కంపనీ విధులలో ఎంతమంది కార్మికులు ఉన్నారు ? ఈ ప్రమాదంలో వారిలో ఎంతమంది కార్మికులు మరణించారు? ఎంతమంది గాయపడ్డారు ? అనే విషయాలను ఇప్పటి వరకూ అధికారికంగా ప్రభుత్వం కానీ, కంపనీ యాజమాన్యం కానీ స్పష్టంగా ప్రకటించలేదు. ప్రమాదంలో మరణించిన కుటుంబాల ప్రతినిధులకు, మరణించిన వారి మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి సిద్దం కావడం లేదు.
5. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మిస్ అయినట్లుగా అధికారులు చెప్పినప్పటికీ, వారి మృతిని ధృవీకరించడం లేదు. వారికి డెత్ సర్టిఫికెట్ జారీ చేయడం లేదు.
6. మరణించిన వారి కుటుంబాలకు తక్షణ సహాయం గా 50,000- 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి మౌనంగా ఉంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 10,00,000 , కొంచెం గాయపడిన వారికి 5,00,000 రూపాయలు ఇస్తామని ప్రమాదం జరిగిన రోజు ప్రభుత్వం ప్రకటించినట్లుగా, ఆయా కుటుంబాలకు మిగిలిన పరిహారం చెల్లింపు విషయంలో స్పష్టత ఇవ్వకుండా వ్యవహరిస్తున్నది.
7. రాష్ట్రం లో ఇంత తీవ్ర ప్రమాదం జరిగినా కార్మిక శాఖ అధికారులు ఎవరూ , ఇప్పటికీ ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో విచారణ చేసి, తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించడం లేదు. కార్మికులకు భరోసా కల్పించడం లేదు.
8. ప్రమాదాలకు కారణాలను వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసినా, గాయపడిన, ప్రమాదం నుండీ బయట పడిన వారిని ఇంతవరకూ ఆ కమిటీ సభ్యులు కలసి వివరాలు సేకరించలేదని,బాధిత కుటుంబాల సభ్యులు మా బృందం దృష్టికి తెచ్చారు.
మా బృందం పర్యటన సందర్భంగా డాక్టర్ బాబూరావు గారిని అక్కడి ప్రజలు, జర్నలిస్టులు సిగాచీలో పేలుడుకు కారణమేమమిటి ? పేలుడు ఎలా జరిగింది? ఇప్పుడు ఎందుకు జరిగింది?అనే ప్రశ్నలు అడిగారు. దానికి ఆయన ఇలా సమాధాన మిచ్చారు.
“ మొదటి పేలుడు స్ప్రే డ్రైయర్‌లో సంభవించింది, అది పూర్తిగా ధ్వంసమైంది. ఈ పేలుడు తీవ్రతకు ఆ భవనంలో పేరుకుపోయిన మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ (MCC) ధూళి గాలిలోకి లేచి అంటుకొని రెండో పేలుడుకు దారితీసింది. ఈ రెండు పేలుళ్లూ చాలా తక్కువ వ్యవధిలో జరిగాయి. రెండో పేలుడు మొదటి దానికంటే చాలా పెద్దదిగా ఉండటంతో, అది సృష్టించిన విధ్వంసానికి భవనం కూలిపోయింది. ఈ సంఘటనలో ప్రాణ నష్టం సంభవించింది. ఇది ధూళి పేలుడు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు”.
ఈ పేలుడుకు అనేక కారణాలు దోహదపడ్డాయి. వీటిలో ప్రధానమైనవి:
1. దీర్ఘకాలిక నిర్లక్ష్యం: 35 సంవత్సరాలుగా ఆ పరిశ్రమలో ఇంతటి తీవ్రమైన పేలుడు జరిగే అవకాశం ఉందని యాజమాన్యానికి గానీ, పర్యవేక్షణాధికారులకు గానీ ఏమాత్రం ఆలోచన రాలేదు. ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏవీ అమలు చేయబడలేదు.
2. భద్రత పట్ల విధానపరమైన అలక్ష్యం: ప్రధానంగా, భద్రతా నియమాలు సులభ వ్యాపార విధానాలకు అడ్డంకి అనే తప్పుడు అవగాహనతో భద్రత పట్ల నిర్లక్ష్యం వహించారు. ఇది ఒక విధానపరమైన వైఫల్యం.
3. పర్యవేక్షణ లోపాలు: ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లలో నైపుణ్య లోపం మరియు భద్రతా విద్య పట్ల అలక్ష్యం స్పష్టంగా కనిపించింది.
4. తప్పుడు నివేదికలు: తెలుగు రాష్ట్రాల్లో దహనశీల ధూళి (Combustible Dust) ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, వాటిని గుర్తించకుండా తప్పుడు నివేదికలు ఇవ్వడం ద్వారా యాజమాన్యాల బాధ్యతను తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. ఇది భద్రతా వ్యవస్థను దారి తప్పించింది.
5. ప్రమాదాల నుండి పాఠాలు నేర్చుకోకపోవడం: ఆగస్టు 24న పరవాడలోని సినర్జీన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ (Synergene Active Ingredients)లో ఘన రసాయన పొడిని రియాక్టర్‌లోకి వేస్తున్నప్పుడు పేలి నలుగురు కార్మికులు చనిపోయారు. దాని దర్యాప్తు ఉన్నత స్థాయి కమిటీకి అప్పగించినప్పటికీ, నివేదిక ఇంకా బయటకు రాలేదు. ఇలాంటి సంఘటనలకు కారణాలు గుర్తించి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఉంది.
6. ధూళి పేలుళ్ళు – అంతర్జాతీయ దృక్పథం: ధూళి పేలుళ్ళు కొత్తేమీ కాదు. మొదటగా గుర్తించిన పేలుడు 1785లో ఇటలీలోని పిండిమరలో జరిగింది. అమెరికాలో 1980-2017 మధ్య 386 పేలుళ్ళు నమోదయ్యాయి. 2006లో అమెరికాలోని రసాయన భద్రతా సంస్థ (CSB), ఈ పేలుళ్ల నివారణకు నియమ నిబంధనలు అవసరమని, భద్రతా సంస్థ OSHA వాటిని తెచ్చి అమలు చేయాలని సిఫారసు చేసింది. దీని తరువాత దహనశీల ధూళిని ఉపయోగించే ప్రతి పరిశ్రమ ధూళి ప్రమాద విశ్లేషణ (Dust Hazard Analysis) జరపాలి. ధూళి మండే కనిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట, గరిష్ట ధూళి సాంద్రతల వంటి వివరాలు సేకరించి, రిస్క్ అంచనా (Risk Assessment) వేసి, తగిన భద్రతా చర్యలు అమలు చేయాలి. అయితే, మన దేశంలో ఈ ప్రమాదానికి సరైన గుర్తింపు లేకపోవడంతో నిబంధనల అమలు లేదు.
7. భద్రతా విద్య, నైపుణ్యాల కొరత: ప్రమాదం జరిగిన తర్వాత నిపుణుల కమిటీలు వేశారు. అయితే, రాష్ట్రంలో భద్రతా విద్య లేకపోవడం వల్ల నిపుణుల కొరత ఉంది. ప్రమాద దర్యాప్తు అనేది భద్రతా రంగంలో ప్రత్యేక నైపుణ్యం అవసరమైన పని. పరిశ్రమలలో భద్రతా విభాగంలో పనిచేయడానికి కూడా సరైన విద్యార్హతలున్న వారు లేరు. ఈ లోపాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విశ్వవిద్యాలయ స్థాయిలో భద్రతా విద్య కోర్సులు ప్రారంభించాలి.
8. సిగాచీలో పేలుడుకు అనువైన పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి, మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే విషయాలపై నిపుణులు విశ్లేషించి తగిన సిఫారసులు చేయాలి.
ఈ నేపధ్యంలో మేము ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాము.
1. సిగాచీ కంపనీ ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణం. కాబట్టి ఆ కంపనీ యాజమానులపై హత్యా కేసు నమోదు చేసి, తక్షణమే వారిని అరెస్టు చేయాలి.
2. ఇలాంటి ప్రాయందలకు అవక్షం ఉన్న అన్ని కపనీల విషయంలో ఒక విచారణ కమిటీ వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మరిన్ని ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
3. ప్రమాదం జరిగిన రోజు డ్యూటీలో ఉన్న, ప్రమాదంలో మరణించిన , గాయపడిన వారి వివరాలను వెంటనే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయాలి.
4. ప్రమాదంలో మరణించిన వారికి ( మిస్ అయిన వారితో సహా ) కోటి రూపాయల పరిహారం వెంటనే అంద చేయాలి. అందుకు అనుగుణంగా వారందరికీ యుద్ధ ప్రాతిపదికన మరణ దృవీకరణ పత్రాలు జారీ చేయాలి.
5. ప్రమాదంలో గాయపడిన వారికి 10,00,000 రూపాయల పరిహారం వెంటనే అందించాలి. కొంత కాలం పాటు వారికి పూర్తి స్థాయిలో కొలుకునే వరకూ, ఉచిత వైద్య సేవలు అందించాలి. అవసరమైన సమయంలో మానసిక వైద్యం కూడా అందించాలి.
6. కంపనీ లో మొత్తం ఎంత మంది పని చేస్తున్నారు ? వారి వివరాలు ఏమిటి ? అనే విషయాలను కార్మిక శాఖ ప్రకటించి, వారందరికీ, కంపనీ తిరిగి తెరిచేంత వరకూ ప్రతి నెలా పూర్తి వేతనాలను చెల్లించాలి .
7. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలలో పిల్లల చదువులు ఆగిపోకుండా అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలి. టీసీలు, ఆధార్ కార్డులు లాంటివి ఆడగకుండా, వలస కార్మికుల పిల్లలకు ప్రభుత్వ స్కూల్స్ లో ప్రవేశం కల్పించాలి.