రిజర్వేషన్ల పెంపుతో బీసీల రాజకీయ ప్రయోజనాలు నెరవేరతాయా?
సాధారణ ప్రజలకు ఆర్దిక, రాజకీయ ప్రయోజనాలూ దక్కాలి అనే దానిపై తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్నెగంటి రవి గారి విశ్లేషణ;
సామాజిక న్యాయం భావన దిశలో తెలంగాణ రెండడుగులు ముందుకు వేసింది. స్థానిక సంస్థల ఎన్నికలలో, విద్యా,ఉద్యోగ రంగాలలో వెనుకబడిన వర్గాల సమూహాలకు ( బీసీ ) ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ చట్ట సభలు (అసెంబ్లీ , మండలి ) ఒక చట్టాన్ని ఆమోదించాయి.
రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టం ఆమోదించేలా, సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్న, అందుకై ప్రభుత్వాలపై రాజకీయంగా ఒత్తిడి చేస్తున్న వెనుకబడిన ప్రజా సమూహాలకు, ఆయా సంఘాల నాయకులకు , మేధావులకు అభినందనలు చెప్పాలి. రాష్ట్ర అసెంబ్లీ లో ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా అభినందనలు చెప్పాలి.
ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఈ చట్టాన్ని చట్టపరంగా అమలు చేయలేకపోయినా, కాంగ్రెస్ పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ అభ్యర్ధులను 42 శాతం స్థానాలలో నిలబెడతామని ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన రాజకీయ పార్టీలపై కూడా దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీలు కూడా తమ తమ పార్టీల నుండీ పోటీ చేయించే బీసీ అభ్యర్ధుల సంఖ్యను తప్పకుండా పెంచాల్సి ఉంటుంది. రాష్ట్ర కుల గణన లో వెల్లడైన గణాంకాలు , ఇప్పటికే శాసన మండలి ఎన్నికలో అభ్యర్ధుల ఎంపికకు కారణమైన విషయం మనం చూశాం.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టాన్ని గవర్నర్ ద్వారా, రాష్ట్ర పతికి పంపిస్తారు.రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వాన్ని తన అభిప్రాయం చెప్పమని కోరతారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని దేశ చట్ట సభలలో ( లోక్ సభ , రాజ్య సభ ) చర్చకు పెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న చట్టాలలో ఈ మేరకు సవరణలు చేయాల్సి ఉంటుంది. దేశ వ్యాపిత ప్రభావం ఉండే ఈ చట్టం ఆమోదం పొందడానికి సమయం పట్టే అవకాశం ఉంది.
వెనుకబడిన ప్రజలకు మేము ఛాంపియన్, మా ప్రధాని మోడీ కూడా బీసీ కులం నుండీ వచ్చిన మనిషే అంటూ రోజూ చెప్పుకునే బీజేపీ పార్టీ దేశ వ్యాపిత కులగణన విషయం లో ఇప్పటి వరకూ ముందుకు రాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ ల పెంపు చట్టాన్ని ఏ మేరకు సమర్ధించి, చట్ట సభల్లో ఆమోదింప చేస్తుందో చూడాలి. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం విషయంలో ఆ పార్టీ హిపోక్రసీని ప్రజల ముందు బట్టబయలు చేయాల్సిన అవసరముంది. అందుకు సమయం వచ్చింది.
ఆధిపత్య కులాలు, ఆయా కులాల వ్యక్తులు ప్రధాన నాయకులుగా ఉన్న రాజకీయ పార్టీలు, తమ చేతుల్లో ఉన్న అధికారాన్ని అంత తొందరగా ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడవు . అధికారం ద్వారా పొందే ప్రయోజనాలు చేతుల నుండీ జారిపోతాయనే భయం ఒకటి వీళ్లలో పని చేస్తూ ఉంటుంది.
ఆర్ధికంగా బలోపేతంగా ఉండడమొక్కటే ఇందుకు కారణం కాదు, సామాజికంగా వెనుకబడిన వర్గాలను, షెడ్యూల్డ్ కులాలను, షెడ్యూల్డ్ తెగలను, మత పర మైనారిటీలను, మహిళలను వివక్షా పూరితంగా చూసే ధోరణి సమాజంలో, పార్టీలలో బలంగా ఉంది. అందుకే స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా, రాజ్యాంగం అమలులోకి వచ్చి కూడా 75 సంవత్సరాలు నిండినా, ప్రజాస్వామ్యం, సమానత్వం గురించి, రాజకీయ పార్టీలు ఉపాన్యాసాలలో ఎన్ని కబుర్లు చెప్పినా, ఆధిపత్య కుల భావనలు, పురుషాధిక్య భావనలు నరనరాన నిండి ఉండే నాయకులే ఎక్కువ. రాజకీయ సంస్థలే ఎక్కువ.
వెనుకబడిన వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తరగతులకు, మత పర మైనారిటీలకు, మహిళలకు ఆయా సమూహాల జనాభా కు అనుగుణంగా స్థానాలు కేటాయించడం, రిజర్వుడు స్థానాల లోనే కాకుండా, ఇతర జనరల్ స్థానాలలో కూడా ఈ సమూహాల నుండీ అభ్యర్ధులను నిలబెట్టడం, తాము ఓడిపోతామనుకున్న స్థానాలలో మాత్రమే కాకుండా, గెలిచే అవకాశం ఉన్న స్థానాలలో కూడా వారిని అభ్యర్ధులుగా నిలబెట్టడం - నిజంగా ప్రజాస్వామికంగా ఆలోచించే రాజకీయ పార్టీలు చేయాల్సిన పని.
ఇప్పుడు ఆ పని జరగడం లేదు. మెజారిటీ స్థానాలలో గెలుపు గుర్రాల పేరుతో, ఆర్ధికంగా బలంగా ఉన్న ఆధిపత్య కులాల వారినే అభ్యర్ధులుగా నిలబెట్టడం, దేశంలో బీజేపీ పార్టీ బలపడ్డాక, ఇతర రాజకీయ పార్టీలు కూడా హిందూ ఓట్లు జారిపోతాయేమోనన్న భయంతో, ముస్లిం అభ్యర్ధులను అసలు నిలబెట్టకపోవడం ( వారి జనాభాకు అనుగుణంగా) మనం చూస్తున్నదే. ఇలాంటి సందర్భంలో వెనుకబడిన వర్గాలకు వారి జనాభా సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్ లు పెంచడం తప్పకుండా అవసరమే. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ చేసిన చట్టం తప్పకుండా ఒక ముందడుగే.
షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ ల వర్గీకరణ కు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ లో మరో చట్టాన్ని ఆమోదించడం కూడా సరైన దిశలో పడిన అడుగు. ప్రయోజనాల నిజమైన పంపిణీ వల్లనే షెడ్యూల్డ్ కులాల ప్రజల మధ్య నిజమైన ఐక్యత ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ఇంకా గుర్తించకుండా, వర్గీకరణను అడ్డుకోవడానికి మాల కుల నాయకులు కొందరు చేస్తున్న రకరకాల ప్రయత్నాలు విషాదకరమే అయినా, తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ, సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా, ఏకసభ్య కమిషన్ వేసి, అందరి అభిప్రాయాలు సేకరించి, కమిషన్ ఇచ్చిన నివేదికను మొదట ఆమోదించింది. దానికి చట్టబద్ధత కల్పిస్తూ , తాజాగా అసెంబ్లీ లో చట్టం కూడా ఆమోదించింది.
ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగాల నోటిఫికేషన్ ల నుండీ ఈ వర్గీకరణ చట్టం వర్తిస్తుందని భావించవచ్చు.
షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ లలో జనాభా దమాషాలో వర్గీకరణ చేయాలని 1990 దశకంలో ప్రారంభమైన మాదిగ దండోరా ఉద్యమం అనేక మలుపులు తిరిగి, మూడు దశాబ్ధాల తరువాత సుప్రీం కోర్టు తీర్పుతో, ఒక అడుగు విజయం వైపు వేసింది. ఈ తీర్పుకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి అధికార పార్టీలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ చట్టాన్ని కూడా ఆమోదించింది. ఈ ప్రక్రియలో మొదటి నుండీ ఉన్న మాదిగ దండోరా ఉద్యమ నాయకత్వానికి, ఆ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన వివిధ రాజకీయ పార్టీలకు, సంఘాలకు అభినందనలు చెప్పాలి.
మిగిలిన సామాజిక ఉద్యమాలతో పోల్చినప్పుడు , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ ల వర్గీకరణ ఉద్యమం లక్షలాది మంది ప్రజలతో బలంగా సాగింది. అయితే ఈ ఉద్యమం మాదిగ, మాల కులస్థుల మధ్య ఆరని చిచ్చు రాజేసింది. మాల కుల నాయకులు, మాల మేధావులు, సామాజిక న్యాయ సూత్రాన్ని సరిగా అర్థం చేసుకోకుండా రిజర్వేషన్ ల వర్గీకరణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ, ప్రభుత్వాలు వర్గీకరణ చేయకుండా అనేక ప్రయత్నాలు చేశారు. ఈ మధ్య కాలంలో ఇరువురి మధ్యా మనసులను పరస్పరం గాయపరుచుకునే బాషా ప్రయోగం విచ్చలవిడిగా సాగింది. సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో తెలంగాణ లో రిజర్వేషన్లలో వర్గీకరణకు అనుకూలంగా చట్టసభలలో చట్టం ఆమోదం తరువాతయినా మాల కుల నాయకులు, మేధావులు తమ ప్రయత్నాలను మానుకుని, షెడ్యూల్డ్ కులాల మధ్య ఐక్యతకు చర్చలు ప్రారంభించాల్సిన అవసరంఉంది. షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఎదుర్కుంటున్న ఇతర అనేక సమస్యల మీద ఐక్యంగా పోరాడడానికి ఇరు ఉద్యమాల నాయకులూ ముందుకు రావలసిన అవసరంఉంది.
వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం స్థానాలు దక్కినా, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ ల వర్గీకరణ జరిగినా, ఆయా కులాల, వెనుకబడిన వర్గాల సమస్యలు , ముఖ్యంగా ఆయా సమూహాలలో సాధారణ ప్రజల సమస్యలు పరిష్కారం అయిపోతాయని భావించడం కూడా భ్రమే అవుతుంది.
నిజానికి గత మూడు దశాబ్ధాలలో మొత్తం ప్రభుత్వ రంగాన్ని ఈ ప్రభుత్వాలు ప్రైవేటీకరించడం వల్ల, రిజర్వేషన్ ల ఫలాలు ఈ సామాజిక వర్గాలకు ఎక్కువ అందడం లేదు. పైగా ఈ రిజర్వేషన్ ల పెంపు వల్ల, రిజర్వేషన్ లలో వర్గీకరణ వల్ల ఆయా సామాజిక వర్గాలలో క్రీమిలేయర్ గా ఉన్న కొందరు వ్యక్తులు ఎక్కువ ప్రయోజనం పొందుతారన్నది వాస్తవం. స్థానిక సంస్థలకు కూడా వాళ్ళే ఎన్నికవుతారు. ఒక మేరకు పరిపాలనలో వాళ్ళు భాగమవుతారు.
వెనుకబడిన వర్గాల నుండీ ఎన్నికైన వారికి సామాజిక న్యాయం పట్లా, ప్రజాస్వామ్యం పట్లా గౌరవం, అవగాహన ఉంటే, వారు వెనుక బడిన వర్గాల ప్రజల నిజమైన సమస్యలపై పని చేస్తారు. తమ పరిధిలో తాము పోరాడతారు. అటువంటి అవగాహన లేకపోయినా, స్పృహ లేకపోయినా, తాము గెలిచి కూడా ఆధిపత్య కులాల , ఆస్తిపర వర్గాల ప్రయోజనాల కోసమే పని చేస్తారు. అధికారం చుట్టూ ఏర్పడే అవినీతి వలయంలో చిక్కుకుంటారు. ప్రజా వ్యతిరేకులుగా మారిపోతారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా నిజాయితీగా పోరాడే సామాజిక సంస్థలు, కుల సంఘాలు సామాజిక న్యాయం కోసం, కుల వివక్షకు వ్యతిరేకంగా నిరంతరం జాగరూకతతో చైతన్యంతో ఉండాలి. సాధారణ ప్రజల ఆకాంక్షలను ఎత్తిపట్టి వాటి సాధన కోసం పోరాడాలి.
సాధారణంగా , కమ్యూనిస్టులు శ్రామికుల కోణంలో చూసి వర్గ సమస్యలపై పోరాటాలు నిర్మిస్తారు కానీ , సమస్యను కుల వివక్ష కోణంలో చూసి, ఆయా సామాజిక సమస్యలపై స్పందించి పోరాటాలు చేయరని ఒక బలమైన విమర్శ ఉంది. నిజానికి ఈ విమర్శ సామాజిక సమస్యలపై పోరాడే కుల సంఘాలపై , వాటి నాయకులపై కూడా ఉంది. , సామాజిక సమస్యలపై స్పందించి కొన్ని కార్యక్రమాలు చేపట్టే, కుల సంఘాల నాయకులు కూడా, తమ కులం లోని సాధారణ ప్రజల సమస్యలపై స్పందించి, ఉద్యమాలు నిర్మించడానికి సిద్దం కారు.
మంద కృష్ణ నేతృత్వంలో పని చేసిన మాదిగ దండోరా ఉద్యమం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాలం నుండీ పని చేస్తున్న దళిత బాహుజన ఫ్రంట్ లాంటి సంస్థలు చేసే కృషి ఇందుకు కొంత మినహాయింపు. కొన్ని ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలను ఈ సంస్థలు నిర్మించి విజయాలు సాధించాయి. కమ్యూనిస్టులైనా, సామాజిక సంస్థల నాయకులైనా, తమపై ఉన్న ఈ విమర్శని స్వీకరించి , తమ పరిధిలో తామూ, ఉమ్మడిగా కూడా రాష్ట్ర వ్యాపితంగా ఆయా ప్రజా సమస్యలపై ఉమ్మడి ఉద్యమాలకు సిద్దం కావాలి.
ఉదాహరణకు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో సన్న, చిన్నకారు రైతులుగా, వ్యవసాయ కూలీలుగా వెనుకబడిన వర్గాల వారు, షెడ్యూల్డ్ కులాల వారు ఎక్కువమంది ఉన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య లోనూ వీరి సంఖ్యే ఎక్కువ.
వ్యవసాయం ఆర్ధికంగా గిట్టుబాటు కాక, ఈ గ్రామీణ వ్యవసాయ కుటుంబాలన్నీ సంక్షోభంలో ఉన్నాయి. రాష్ట్రంలో జరిగే రైతు ఆత్మహత్యలలో కూడా వీరే ఎక్కువ మంది మరణిస్తున్నారు. కానీ గత పదిహేనేళ్లలో , ఆడపా దడపా తప్ప, ఒక్క సామాజిక సంస్థ కూడా( కుల సంఘం) కూడా ఈ సమస్యలపై గొంతెత్తి మాట్లాడలేదు. ఉద్యమాలు చేయలేదు.
నగరాలలో, పట్టణాలలో అసంఘటిత కార్మికులలో వెనుకబడిన వర్గాల వారూ, షెడ్యూల్డ్ కులాల వారూ, షెడ్యూల్డ్ తెగల వారూ ఎక్కువ. కానీ ఈ కార్మికులు యాజమానుల చేతుల్లో తీవ్ర దోపిడీకి గురవుతున్నా, కార్మిక చట్టాలు అమలు కాక అన్యాయానికి గురవుతున్నా ఒక్క కుల సంఘం కూడా వారి సమస్యలను అధ్యయనం చేయలేదు. వారిని కదిలించి ఉద్యమాలు నిర్మించలేదు.
అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను లాక్కుంటుంటే, ఒక్క కుల సంఘం నాయకుడు కూడా గొంతెత్తి మాట్లాడడం లేదు. తమ భూములు కోల్పోతున్న ప్రజలతో కలసి ఉద్యమాలలో పాల్గొనడం లేదు. వాతావరణంలో మార్పుల కారణంగా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, ఈ సామాజిక తరగతులకు చెందిన జనాభా ఎక్కువ నష్ట పోతున్నా, ఒక్క కుల సంఘం కూడా ఈ సమస్యలపై ఇప్పటి వరకూ దృష్టి సారించి ఆలోచించలేదు.
ఆయా కులాల నుండీ, సామాజిక వర్గాల నుండీ నాయకులుగా ఎదిగిన వాళ్ళలో ఎక్కువమంది , ఇప్పటి వరకూ అధికారంలో కీలకంగా ఉన్న ఆధిపత్య కులాల నాయకుల అనుచరులుగా మారిపోతున్నారు తప్ప, స్వయంగా తమ సామాజిక తరగతుల ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తూ, స్వంత కాళ్ళపై నిలబడే నాయకులుగా మిగలడం లేదు. ఆధిపత్య కులాల అధికారాన్ని నిలబెట్టడానికి పనిముట్లుగా ఉండడమంటే, తమ సామాజిక వర్గాలపై జరుగుతున్న దోపిడీ, పీడనలను మౌనంగా ఆమోదించడమే.
ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆస్తి పర వర్గాలకు , కార్పొరేట్ సంస్థలకు సేవలు చేస్తున్నాయి. ప్రజలకు సహజ వనరులపై హక్కులు నిరకరిస్తూ, రాజ్యాంగం కల్పించిన కనీస ప్రాధమిక హక్కులు నిరాకరిస్తూ, మిగిలిన ప్రజలకు కేవలం కొన్ని సంక్షేమ పథకాల బాస్కెట్ తో సరి పెట్టాలని చూస్తున్నాయి.ఫలితంగా వెనుకబడిన వర్గాల ప్రజలు,షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఆర్ధికంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. ఆర్ధికంగా నిలదొక్కుకోకుండా, ఈ వర్గాల ప్రజలు వెనుక బాటు తనం నుండీ, సామాజిక వివక్ష నుండీ పూర్తిగా బయట పడలేరు.
నాణ్యమైన ఉన్నత విద్య ఈ వర్గాల ప్రజలకు అందిస్తే, ఒక మేరకు ప్రయోజనం దక్కుతుంది కానీ, ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలో విద్యను పూర్తిగా ధ్వంసం చేసేశాయి. ప్రైవేట్ రంగంలో విద్యను కొనుగోలు చేయగలిగిన స్థితిలో ఈ వర్గాల కుటుంబాలు లేవు.
అందుకే ఈ సామాజిక వర్గాల సంఘాలు, వాటి నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడం, తమ సామాజిక వర్గాల శ్రామిక ప్రజల వెంట నిలబడడం, ఈ ప్రజలకు వ్యతిరేకంగా తీసుకునే ప్రభుత్వాల తప్పుడు విధానాలను ప్రశ్నించడం చాలా అవసరం.
సామాజిక న్యాయాన్ని కోరుకునే, అన్ని రకాల వివక్షను ప్రశ్నించే సామాజిక సంస్థలు, కుల సంఘాలు వాటి నాయకులు కనీసం ప్రజాస్వామ్యాన్ని, సమానత్వాన్ని,లౌకిక తత్వాన్ని కోరుకునే రాజకీయ పార్టీలలో ఉంటే, ఒక మేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా, మను స్మృతిని పూజించే బీజేపీ లాంటి రాజకీయ పార్టీలలో చేరడం అభ్యంతరకరం. అది ఆయా సామాజిక వర్గాల ప్రయోజనాలకు భిన్నమైనది.
తెలంగాణ లో బీజేపీ లో చేరుతున్న వెనుకబడిన వర్గాల, షెడ్యూల్డ్ కులాల నాయకులను చూస్తుంటే, తాము నిత్యం ప్రవచించే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నట్లు వెంటనే అర్థం చేసుకోవచ్చు. బీజేపీ లో చేరడం ద్వారా లేదా బీజేపీ ని బలపరచడం ద్వారా తమ స్వంత స్వార్ధ ప్రయోజనాలు తీర్చుకోవడం తప్ప, నిజమైన ప్రజాస్వామ్యాన్ని , సమానత్వాన్ని వీళ్ళు కోరుకోవడం లేదని మనం గుర్తించాలి.
సుదీర్ఘ కాలం బీసీ ఉద్యమ నాయకుడిగా ఉన్న ఆర్. కృష్ణయ్య బీజేపీ తరపున రాజ్య సభకు ఎన్నిక కావడం, మంద కృష్ణ గారు బీజేపీకి ఓటేయమని చెప్పడం, నరేంద్ర మోడీలో మహోన్నత వ్యక్తిత్వాన్ని వెతకడం, తాజాగా మండలి ఎన్నికలలో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు,జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు బీజేపీకి మద్ధతు ప్రకటించడాన్ని, ప్రజాస్వామిక ఉద్యమాలను నడిపే వాళ్ళు, మద్ధతు ప్రకటించే వాళ్ళు సమర్ధించలేరు. అందుకే ఈ విషయాన్ని, ఆయా నాయకులకు స్పష్టంగా, నిర్మొహమాటంగా దృష్టికి తీసుకు రావాలి. లేకపోతే దీర్ఘ కాలంలో నిచ్చెనమెట్ల వ్యవస్థలో అట్టడుగున ఉన్న, వివక్షకు గురవుతున్న, ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వర్గాలకు అన్యాయమే జరుగుతుంది.