తెలంగాణలో జనసేన ఫ్యూచర్ ఎమిటి?

మారిన రాజకీయ వాతావరణంలో తెలంగాణలోనూ కొంతమంది మెజారిటీ బీసీ వర్గాలు జనసేనను ఆదరించే అవకాశం ఉంది.;

Update: 2025-04-19 05:49 GMT

- డాక్టర్. బి. కేశవులు

తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నాయకత్వం లోని జనసేన పార్టీ భవిష్యత్‌పై రాజకీయ విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా ప్రభావం చూపుతుండగా, తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు రాజకీయంగా అంతగా విజయవంతం కాలేదు. అయితే, భవిష్యత్తులో జనసేన పార్టీ తెలంగాణలో తన స్థాయిని ఎలా పెంచుకోగలదు? ఏయే అంశాలు జనసేన భవిష్యత్తును ప్రభావితం చేయగలవు? అనే ప్రశ్నలపై ఈ వ్యాసంలో విశ్లేషణ చేద్దాం.

ప్రస్తుత పరిస్థితి :

తెలంగాణలో జనసేన పార్టీకి పెద్దగా బలం లేదు. 2014లో పార్టీ స్థాపన అయినప్పటికీ, తెలంగాణలో రాజకీయంగా జనసేన చురుకుగా పనిచేయలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జనసేన ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది.పవన్ కళ్యాణ్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా సామాజిక న్యాయం, రాజకీయ మార్పు వంటి అంశాలపై ఆయన తలపెట్టిన పోరాటాలు యువతను ఆకర్షించగలవు. జనసేనకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని సామాజిక వర్గాల నుంచి మద్దతుగా ఉండగా, తెలంగాణలోనూ కొంతమంది మెజారిటీ బీసీ వర్గాలు జనసేనను ఆదరించవచ్చు. ప్రస్తుతం బీజేపీతో మైత్రి సంబంధాన్ని ఉపయోగించుకుని జనసేన లబ్ధి పొందే అవకాశం ఉంది.

భవిష్యత్ వ్యూహాలు :

తెలంగాణలో జనసేన భవిష్యత్తు అనేక అంశాలపై ఆధారపడి ఉంది. తెలంగాణలో జనసేన బలపడేందుకు మునుపటి వ్యూహాల కంటే మరింత ప్రగతిశీలమైన వ్యూహాలు అవసరం. స్థానిక నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ, యువతను ఆకర్షించుకుంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ, సరైన వ్యూహాలను పాటిస్తే తెలంగాణలో తన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంది. అయితే అంత తేలికైన పని కాదు సుమా ! ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మరిన్ని వ్యూహాలను పరిశీలిద్దాం.

1.నాయకత్వ నిర్మాణం :

జనసేనకు తెలంగాణలో ప్రభావశీలమైన లోకల్ లీడర్లు లేరు.లోకల్ లీడర్లను తయారు చేయాలి జిల్లాల్లో బలమైన నేతలను ఎంపిక చేసి వారికి స్వతంత్ర బాధ్యతలు అప్పగించాలి. పవన్ కళ్యాణ్ నేరుగా ప్రచారం చేసేవరకు పార్టీ నాయకత్వం స్థానికంగా ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి.పార్టీకి స్థిరమైన ఆర్థిక వనరులు లేకపోతే విస్తృత ప్రచారం చేయడం కష్టం.జనసేన కోసం ప్రత్యేకమైన "కార్యకర్త ఫండింగ్ మోడలు ను తీసుకురావాలి.నియోజకవర్గ స్థాయిలో క్యాడర్‌ను విస్తృతంగా విరివిగా వ్యాపింపచేయాలి.

2. ఉద్యమాలు :

పార్టీ కాదు ఉద్యమం” అనే భావన కల్పించాలి, తెరాస, కాంగ్రెస్ ఇస్తున్న హామీలను ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేయాలి. ప్రతి జిల్లాలో “యువ నాయకుల వేదిక” ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతను ఆకర్షించాలి. గ్రూప్-1, గ్రూప్-2, DSC, ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ భద్రత, స్థానిక యువతకు రిజర్వేషనులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రొఫెసర్ల కొరత పరిష్కారానికి ప్రయత్నం. విద్యను ప్రైవేటీకరణ నుంచి రక్షణ,బీసీలకు చట్ట బద్ద రిజర్వేషన్ల పెంపు ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లాన్ నిధులు ఖర్చు, ప్రభుత్వ హామీల అమలు లో జాప్యం, అసమానతలపై పోరాటం, కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ కోసం ప్రత్యేక ఉద్యమాలు చేయాలి.

3. రైతుల సంక్షేమం :

రైతుల నుంచి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్.వ్యవసాయ రుణమాఫీని పూర్తిగా అమలు చేయించేందుకు పోరాటం.కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల అవినీతిని బయటపెట్టడం.ప్రభుత్వ ప్రాజెక్టుల్లో అవినీతిని ఎండగట్టే కార్యక్రమాలు.నియంతృత్వ పోకడలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్యమం.పెరిగిన గ్యాస్, పెట్రోల్, విద్యుత్ చార్జీలపై ఉద్యమం.

4. ప్రాంతీయ వ్యూహాలు :

ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ బలమైన జిల్లాలు, కాబట్టి అక్కడ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి.

హైదరాబాద్ & సికింద్రాబాద్: యూసఫ్‌గూడ, ఎల్బీ నగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి , జూబ్లీహిల్స్, లాంటి మిగ్రంట్ ఆంధ్రా వోటర్లను సమీకరించాలి. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాల్లో ఆంధ్రా వలసదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ ఓటర్లను టార్గెట్ చేయాలి, వీరు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల వైపే మొగ్గు చూపుతున్నారు. జనసేన వీరికి కనెక్ట్ అయ్యేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి.

5. బీసీ వాదం & పొత్తుల వ్యూహం :

బీజేపీతో పొత్తు కొనసాగించాలి. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంక్ ఇప్పటికే 25- 30% వరకు ఉంది.గట్టి పట్టున్న బిజెపి, టీడీపీ మైలేజ్‌తో ముందుకు తీసుకెళ్లాలి. ఇతర చిన్న పార్టీలతో పొత్తుల ద్వారా ఓటు శాతం పెంచుకునే వ్యూహాన్ని కూడ అనుసరించాలి. ఎస్ సి, ఎస్ టి, బీసీ ల జనాభా 85 % కి పైగా ఉంది. బహుజన వాదం తో ముందుకి వెళ్ళితే మిడిల్ క్లాస్ & బీసీ ఓటర్లకు జనసేన ప్రత్యామ్నాయంగా కనపడుతోంది. దళిత బంధు, బీసీ సంక్షేమం ఎక్కడ అమలవుతున్నది, ఎక్కడ కేవలం హామీలుగా మారిందీ విశ్లేషిస్తూ ఎక్స్‌పోజ్ చేయాలి. బీసీలకు ప్రత్యేకంగా బీసీ ఆత్మ గౌరవ సదస్సులు నిర్వహించాలి. బీసీల్లోని వివిధ ఉపవర్గాలను టార్గెట్ చేస్తూ వారికోసం ప్రత్యేక కార్యాచరణ ఉండాలి.

6. బూత్ లెవల్ మేనేజ్‌మెంట్ :

జనసేనకు తెలంగాణలో బూత్ లెవల్ బలహీనత ఉంది. ప్రతి నియోజకవర్గానికి కనీసం 2,000 మంది సభ్యులను నియమించాలి. "బూత్ గెలిస్తే బలం పెరుగుతుంది" అనే నినాదంతో కార్యకర్తలను ప్రోత్సహించాలి. కనీసం ఒక లక్ష మంది క్యాడర్ ను ఏర్పాటు చేసుకోవాలి. తెలంగాణలో 18-35 ఏళ్ల మధ్య యువ ఓటర్ల శాతం 50% కి పైగా ఉంది. ఈ యువతను ఆకర్షించడానికి "జనసేన 50%" అనే క్యాంపెయిన్ నిర్వహించాలి, పవన్ కళ్యాణ్ తరచుగా టాలీవుడ్ యూత్‌ను ప్రేరేపించేలా మాట్లాడతారు, కానీ రాజకీయ యూత్ మోబిలైజేషన్ పెద్దగా జరగడం లేదు. పవన్ తన రూటు మ్యాప్ స్పష్టంగా తెలియజేసేలా రాష్ట్ర పర్యటనలు పెంచాలి. మాస్ కనెక్ట్ పెంచేలా ఇంటరాక్షన్ బేస్డ్ మీటింగ్‌లు, టౌన్ హాల్ సెషన్లు నిర్వహించాలి.

7. ఇంటెలిజెంట్ ప్రచారం :

పవన్ ఇమేజ్‌ను బలంగా నిలబెట్టేలా కొత్త పద్ధతిలో ప్రచారం చేయాలి. పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ లో సినిమా మార్కెట్ మద్దతు ఉంది, కానీ ఆ మార్కెట్ ఓట్లుగా మారడం లేదు. " సినిమా పవన్ vs రాజకీయ పవన్" అనే మధ్య తేడా తొలగించాలి. పవన్ వక్తవ్యాలను క్లియర్‌గా, తెలుగువారి సమస్యలపై ఫోకస్ చేస్తూ తయారు చేయాలి.జనసేనకు యూట్యూబ్ & సోషల్ మీడియా ప్రచారం బాగా ఉంది. కానీ అది వాస్తవ ఓటుగా మారాల్సిన అవసరం ఉంది. ట్విట్టర్ x క్యాంపెయిన్‌లకు భద్రతగా గ్రౌండ్ వర్క్ ఉండాలి. జనసేన టచ్ పోయింట్స్ ( ఫేస్ బుక్, వాట్సాప్, టెలిగ్రాం, ఇన్ స్టా గ్రామ్ ) ద్వారా ప్రతి నియోజకవర్గంలో 5000 మంది యువతను కలిపేలా చూడాలి.

(డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ. చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం)

Tags:    

Similar News