అమర్‌నాథ్‌‌కు మూడో బ్యాచ్‌లో 6,400 మంది యాత్రికులు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత.. ఆన్‌లైన్లో నమోదు చేసుకున్న 3.5 లక్షలకు పైగా భక్తులు..యాత్రికులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌లు..;

Update: 2025-07-04 07:45 GMT
Click the Play button to listen to article

హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమర్‌నాథ్(Amarnath). హిమాలయాల్లో మంచు రూపంలో దర్శనమిచ్చే పరమ శివుడి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య యాత్రికులను బ్యాచ్‌లవారీగా అనుమతిస్తున్నారు. ఈ యాత్ర 38రోజుల పాటు జరగనుంది. ఈ సారి యాత్ర సమయాన్ని ప్రభుత్వం 52 రోజుల నుంచి 38 రోజులకు కుదించింది. యాత్ర జులై3న ప్రారంభమై ఆగస్టు 9వరకు కొనసాగనుంది.


మొదటి బ్యాచ్​ యాత్రికులు(Pilgrims) బుధవారం(జూన్ 2) ఉదయం జమ్ము నుంచి తమ యాత్రను మొదలుపెట్టారు. తెల్లవారుజామున 4.30 గంటలకు భగవతీ నగర్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్న జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) మనోజ్‌ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. తొలి బ్యాచ్‌లో 1,115 మంది మహిళలు, 31 మంది చిన్నారులు ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి భద్రతను మరింత పటిష్ఠం చేశామని, రాజ్‌భవన్, పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి యాత్రను 24 గంటలూ పర్యవేక్షిస్తామని ఎల్జీ సిన్హా చెప్పారు.

రెండో బ్యాచ్‌లో 5,200 మంది యాత్రికుల గురువారం(జూన్ 3) బేస్ క్యాంప్ బయలుదేరారు. వీరిలో 4,074 మంది పురుషులు, 786 మంది మహిళలు, 19 మంది పిల్లలు ఉన్నారు.

సుమారు 6,400 మంది యాత్రికులతో మూడో బ్యాచ్ శుక్రవారం(జూన్ 4) బయలుదేరింది. ఇందులో 4,723 మంది పురుషులు, 1,071 మంది మహిళలు, 37 మంది పిల్లలు, 580 మంది సాధువులు ఉన్నారు వీరంతా 291 వాహనాల్లో బయలుదేరారు.

పహల్గామ్‌(Pahalgam)లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించినప్పటికీ..కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య యాత్ర యథావిధిగా కొనసాగుతుంది. ఈ యాత్రకు ఇప్పటివరకు 3.5 లక్షలకు పైగా భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. యాత్రికుల కోసం జమ్మూ అంతటా 34 వసతి కేంద్రాలు ఏర్పాటుచేసి, వారికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ట్యాగ్‌లు అందజేశారు. ఆన్-ది-స్పాట్ రిజిస్ట్రేషన్ కోసం పన్నెండు కౌంటర్లను అందుబాటులో ఉంచారు.

17 వేల అడుగుల ఎత్తులో..

అమర్‌నాథ్ గుహ జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)లోని గందర్‌బల్ జిల్లాలో అమర్‌నాథ్ పర్వతంపై 17 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుహ పహల్గాం నుంచి 46 కి.మీ ఉంటే, బాల్‌తాళ్‌ నుంచి 14 కి.మీ దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహ వద్దకు కాలినడకన లేదా గుర్రాలు, డోలీల ద్వారా చేరుకోవచ్చు.

Tags:    

Similar News