రాత్రి నుంచి తెల్లవారేదాకా విద్యుత్ సరఫరా నిలిపివేత
భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక పరిస్థితుల నేపథ్యంలో పంజాబ్ గురుదాస్‌పూర్‌లో నేటి నుంచి అమలు..;
భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంజాబ్ (Punjub) రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గురుదాస్‌పూర్‌లో రాత్రి నుంచి తెల్లవారేవరకు విద్యుత్ సరఫరా ( Power shut down) నిలిపేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురుదాస్‌పూర్ జిల్లా పాకిస్థాన్‌కు సరిహద్దు జిల్లా కావడంతో ఎప్పుడైనా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు..
ఈ రోజూ (మే 8) రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు గురుదాస్‌పూర్ జిల్లా అంతటా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ నోటీసు కూడా జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రోజు ప్రస్తుత ఉత్తర్వులు వర్తిస్తాయని, ప్రజలు సహకరించాలని కోరారు. జైలు, ఆసుపత్రులు, కంటోన్మెంట్ జోన్లలో మాత్రం విద్యుత్తు సరఫరా ఉంటుదని, అయితే కిటికీలు మూసివేసి, వెలుతురు బయటకు రాకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తర్వాత తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న రాష్ట్రం పంజాబ్. పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌ను కలిపే జిల్లా గురుదాస్‌పూర్. జమ్మూ కశ్మీర్ లోయకు ప్రవేశ ద్వారం కూడా.
బాణసంచాపై నిషేధం..
ఇటు అమృత్‌సర్, తర్న్ తరన్ డిప్యూటీ కమిషనర్లు జిల్లాల్లో బాణసంచా వాడకంపై పూర్తి నిషేధం విధించారు. వివాహాలు, వేడుకలు, మతపర కార్యక్రమాల కోసం అన్నిరకాల బాణసంచా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తు్న్నట్లు అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని ఒక ప్రకటన విడుదల చేశారు.