జూబ్లీలో గెలుపును ఈ పోలింగ్ కేంద్రాలే డిసైడ్ చేస్తాయా ?

ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం కొన్ని కేంద్రాల్లో 60శాతంకు పైగా మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో 50శాతానికి పైగా పోలింగ్ నమోదైంది

Update: 2025-11-13 10:17 GMT
Jubilee Hills contested candidates

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల కౌంటింగ్ మొదలవ్వటానికి సుమారు 20 గంటలే ఉన్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఇపుడు విషయం ఏమిటంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్(Congress Candidate Naveen Yadav) గెలుస్తాడని జోస్యాలు చెప్పాయి. అయితే ఈ జోస్యాలను బీఆర్ఎస్(BRS) అంగీకరించటంలేదు. సైలెంట్ ఓటింగే తమ అభ్యర్ధి(Maganti Sunitha) మాగంటి సునీతను గెలిపిస్తుందని కారుపార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

ఈనేపధ్యంలోనే పోలింగ్ సరళిపైన ఎన్నికల కమిషన్ వివరాలను విడుదలచేసింది. దీని ప్రకారం చూస్తే కొన్ని పోలింగ్ కేంద్రాలే అభ్యర్ధుల గెలుపోటములను శాసిస్తాయన్నది అర్ధమవుతోంది. నియోజకవర్గం మొత్తంమీద 4.01 లక్షల ఓట్ల పోలింగుకు ఎన్నికల కమిషన్ 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఓటింగ్ 48.76శాతం నమోదైంది. నిజానికి ఈ ఓటింగ్ శాతం చాలా తక్కువనే చెప్పాలి. అయితే ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం కొన్ని కేంద్రాల్లో 60శాతంకు పైగా మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో 50శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

రహ్మత్ నగర్ డివిజన్లోని 15 పోలింగ్ కేంద్రాలు, బోరబండ డివిజన్లో 13, ఎర్రగడ్డలో 3, వెంగళరావు నగర్లో ఒక డివిజన్లో 60శాతంకు పైగా పోలింగ్ జరిగింది. అలాగే రహ్మత్ నగర్ డివిజన్లో 73 కేంద్రాలు, బోరబండలో 47, ఎర్రగడ్డలో 30, షేక్ పేట డివిజన్లో 19, యూసుఫ్ గూడ డివిజన్లో 10, సోమాజిగూడ డివిజన్లో 9 కేంద్రాల్లో 50శాతం ఓటింగ్ నమోదైంది. అంటే మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 32 కేంద్రాల్లో 60శాతంకు పైగా, 192 పోలింగ్ కేంద్రాల్లో 50శాతంకు పైగా ఓటింగ్ జరిగింది. 224 డివిజన్లలో మాత్రమే చెప్పుకోదగ్గ స్ధాయిలో పోలింగ్ నమోదైనట్లు అర్ధమవుతోంది. ఈ డివిజన్లలో పోలైన ఓట్లలో ఏ అభ్యర్ధికి ఎక్కువగా పడితే ఆ అభ్యర్ధే గెలుపుకు దగ్గరగా ఉంటారన్నది అర్ధమవుతోంది.

వీటిల్లో కూడా ఎర్రగడ్డ, రహ్మత్ నగర్, బోరబండ డివిజన్లలోని బస్తీల్లో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పోలైన ఓట్లలో ముస్లింల ఓట్లే ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ నేతల అంచనా. కాబట్టి గెలుపు తమదే అన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ఏదేమైనా పైనచెప్పుకున్న డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల ఓటింగే అభ్యర్ధుల గెలుపోటములను డిసైడ్ చేస్తుంది అనటంలో ఏమాత్రం సందేహంలేదు.

Tags:    

Similar News