‘ఆర్టీసి రెవెన్యూ పెంచేందుకు మార్గాలను అన్వేషించండి’

అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Update: 2025-11-13 10:13 GMT
Rtc review meeting

ఆర్టీసి రెవెన్యూ పెంచేందుకు మార్గాలను అన్వేషించాలని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసి ఉన్నతాధికారులతో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. కొత్త కాలనీలకు బస్సు రూట్ పెంచేందుకు అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. కారుణ్య నియామకాల క్రింద ఎంపికైన కండక్టర్ల ప్రొవిజన్ పీరియడ్ రెండేళ్లకు కుదించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపోలు లాభాలు ఆర్జించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆరంఘర్‌లో బస్సు టెర్మినల్‌ కోసం పోలీసు శాఖ భూములపై సంప్రదింపులు జరపాలన్నారు. హైదరాబాద్‌లో కొత్త డిపోలకు స్థల పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. బస్సు ప్రమాదాలను తగ్గించడానికి డ్రైవర్‌ మానిటరింగ్‌ సిస్టం అందుబాటులో తేవాలన్నారు. త్వరలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం( మహలక్ష్మి) ద్వారా ప్రభుత్వానికి భారమైన తెలంగాణ ఆర్టీసీని గట్టెక్కించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కొత్త ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రి సూచించారు. మహాలక్ష్మీ పథకం తొలుత భారమని ఆర్టీసీ భావించినా.. తరువాత ఆ పథకం కోసం ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా వస్తున్న ఆదాయం నష్టాల్లో ఉన్న ఆర్టీసి ని లాభాల బాట పట్టించగలదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో.. ఈ పథకం ఎలక్ట్రికల్ బస్సుల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటుగా సంస్థకు ఆదాయం మరింతగా పెంచే ఆలోచనల పైన దృష్టి కేంద్రీకరించేలా చేసింది ఈ సమీక్షా సమావేశం.


237 కోట్ల మహిళలకు జీరో టికెట్


ఆర్టీసీలో ఇప్పటివరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ వినియోగించు కున్నారు. అందుబాటులోకి రానున్న ఎలక్ట్రికల్ బస్సుల్లోనూ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే విధంగా సంస్థకు ఆదాయ మార్గాల పైన అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.

ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు, వికారాబాద్, బీహెచ్ఈఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్‌సుఖ్‌నగర్, హకీంపేట్, రాణిగంజ్, మిథానితో పాటు పలు డిపోలు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సమీక్షా సమావేశంలో అధికారులను కోరారు. ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ నిర్మాణం, బస్ సౌకర్యాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అధ్యయనం చేయాలని పొన్నం ఆదేశించారు.
Tags:    

Similar News