జూబ్లీలో బోగస్ ఓట్లకు పోలీసుల సహకారం
బైపోల్‌లో ఎంఐఎం కూడా అక్రమాలకు పాల్పడటాన్ని ప్రత్యక్షంగా చూశామన్న దాసోజు శ్రవణ్.
జూబ్లీహిల్స్ బైపోల్‌లో గెలవడం కోసం కాంగ్రెస్ అనేక అక్రమాలకు పాల్పడిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో కాంగ్రెస్‌కు ఎంఐఎం కూడా వంత పాడిందని, దీనికి పోలీసులు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. బైపోల్‌లో బోగస్ ఓటింగ్ జరుగుతుంటే పోలీసులు సహకరించారని, దానిని తాము ప్రత్యక్షంగా చూశామని తెలిపారు. కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం.. ఈ అక్రమాల్లో కూడా పాలుపంచుకుందని, దొంగఓట్లు వేయించడానికి కూడా ప్రయత్నాలు చేసిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ విమర్శనాస్త్రాలు సంధించారు. చేతకాని సీఎం అధికారంలో ఉంటే ఏమవుతుంది? అన్నదానికి రేవంత్ నిలువెత్తు నిదర్శనంగా మారారంటూ చురకలంటించారు.
ఆర్థిక అత్యాచారానికి పాల్పడిన రేవంత్..
‘‘కాగ్ రిపోర్ట్.. రేవంత్ బట్టలు విప్పేసింది. భారీగా అప్పులు తీసుకొచ్చి ఆయన ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనుభవం లేని సీఎం ఉంటే ఇంతకన్నా ఇంకేం జరుగుతుంది. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్‌ను రేవంత్ సర్వనాశనం చేశారు. హైడ్రా పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్‌తో దోపిడీకి తెరలేపారు. రెండేళ్లలో రూ.3.48 వేల కోట్ల అప్పులు తెచ్చారు’’ అని విమర్శించారు.
అంతేకాకుండా ఫిరాయింపు నేతల విచారణలో కూడా దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఈ విచారణకు సందర్శకులు, మీడియాను నిషేధించడం సరికాదన్నారు. ఇది అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్‌ల సొంత వ్యవహారం కాదని గుర్తుచేశారు. అదే విధంగా కేసు వాదిస్తున్న అడ్వకేట్లను ఫోన్లు తీసుకురాకూడదని హుకుం జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ఫుల్ బెంచ్ చేపట్టే విచారణలకు కూడా ఫోన్లను అనుమతిస్తారని, ఈ నిబంధనను వెంటనే ఎత్తివేయాలని ఆయన స్పీకర్‌కు లేఖ రాశానని శ్రవణ్ తెలిపారు.