రైతు సమస్యలపై కేంద్రానికి తుమ్మల లేఖ
సోయబీన్, మొక్కజొన్న, పత్తి రైతులను ఆదుకోవాలని వినతి
సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం మరోమారు బహిరంగ లేఖ రాశారు. 'మొంథా' తుఫాను, అకాల వర్షాలతో పంటలకు అపార నష్టం వాటిల్లిందని, రైతులకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలన్నారు. అలానే సోయాబీన్ ఎఫ్ఏక్యూ ప్రమాణాల్లో సడలింపు ఇవ్వాలని తుమ్మల కోరారు. వర్షాల ప్రభావంతో గింజల్లో రంగు మారడం, ముడతలు వచ్చి నాణ్యత దెబ్బతింది.
రాష్ట్రంలో 3.66 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సోయాబీన్ సాగు చేశారని, ఎకరాకు 7.62 క్వింటాళ్ల సగటు దిగుబడి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 48,757 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయడంతో 14,519 మంది రైతులకు లాభం చేకూరిందని తుమ్మల తెలిపారు. కనీస మద్దతు ధర కింద మొత్తం 16.85 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు NAFED, NCCF సంస్థలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోళ్లలో ఎకరాకు 7 క్వింటాళ్ల పరిమితి అనేది రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని, ఆ పరిమితిని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తిలో తేమ శాతం సడలించాలని, ఎకరాకు 11.74 క్వింటాళ్ల దిగుబడి ఆధారంగా కొనుగోలు కొనసాగించాలని కేంద్రానికి ఆయన సూచించారు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ రైతులకు ఆదుకోవడానికి కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు.