అశోక వర్సిటీ ప్రొఫెసర్‌కు మధ్యంతర బెయిల్..
SIT దర్యాప్తునకు ఆదేశిస్తూనే.. షరతులతో పెట్టిన అత్యున్నత న్యాయస్థానం;
‘ఆపరేషన్ సిందూర్’పై వివాదాస్పద పోస్టులు పెట్టిన అశోక వర్సిటీ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్‌కు సుప్రీంకోర్టు (SC) బుధవారం (మే 21) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై రెండు కేసులు నమోదుకాగా..మే 18న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
సిట్‌కు ఆదేశం..
అలీఖాన్ పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. వాటిపై లోతైన విచారణకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు (SIT) బృందాన్ని 24 గంటల్లోగా ఏర్పాటు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఆదేశించింది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నోంగ్‌మెయికపం కోటీశ్వర్ సింగ్‌తో కూడిన డివిజన్ బెంచ్.
ఖాన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, హర్యానా రాష్ట్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఖాన్ పోస్ట్‌లో "ఎలాంటి నేరపూరిత ఉద్దేశ్యం" లేదని సిబల్ పదే పదే వాదించారు. ఆయన భార్య తొమ్మిది నెలల గర్భవతి అయినందున బెయిల్ ఇవ్వాలని అప్పీల్ చేశారు.
షరతులతో కూడిన బెయిల్..
చివరకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూనే కొన్ని షరతులు పెట్టింది. ఇక ముందు ఆపరేషన్ సిందూర్ గురించి ఎలాంటి పోస్టులు పెట్టవద్దని, పెట్టిన పోస్టుల గురించి బయట ఎక్కడా మాట్లాడకూడదని ఆదేశించింది.కాగా ఖాన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడం మాకు ఉపశమనం కలిగించింది పేర్కొంటూనే..సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఆయన వ్యక్తిగతం పేర్కొంది యూనివర్సిటీ (Ashoka varsity).
ఇంతకు ఏం జరిగింది?
జమ్ము కశ్మీర్‌లోని పహెల్గామ్‌లోకి ఉగ్రమూకలు ప్రవేశించి 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టింది. అయితే ఈ ఆపరేషన్‌పై అలీఖాన్ (Ali Khan Mahmudabad) సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సిందూర్‌లో ఏం జరిగిందో చెప్పకుండా.. ప్రజలకు ఏం కావాలో అది మాత్రమే చెప్పారని అందులో ఖాన్ రాసుకొచ్చారు. ప్రభుత్వం తరఫున మాట్లాడే వారు క్షేత్ర స్థాయిలో జరిగిన వాస్తవాలను మాత్రమే చెప్పాలని, అలా చెప్పకపోవడం వంచనే అని పేర్కొన్నారు. ఆ పోస్టులపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆయనపై రెండు కేసులు కూడా నమోదు అయ్యాయి. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు.