మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ కు ‘రక్త మార్పిడి’ చికిత్స, ప్రయోజనం ఉంటుందా?

ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది. దీంతో పార్టీ పెద్దలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

Update: 2023-12-18 12:17 GMT

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో గణనీయమైన మార్పులు చేసింది. పాత నాయకత్వం తీసేసి కాంగ్రెస్ ప్రమాణాలలో యువకుడైన వ్యక్తికి నాయకత్వం అప్పగించింది. యువరక్తం ఎక్కించానని,  ఈ చర్య రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలలో గెలిచేంతగా ఇది పార్టీకి బలాన్ని ఇస్తుందని హై కమాండ్ భావిస్తూ ఉంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం పెద్దగా మార్పులు చేయకుండా ప్రస్తుత నాయకత్వాన్ని కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది.

మధ్యప్రదేశ్‌లో నాయకత్వ మార్పులు..

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఓటమికి కారణాలను తెలుసుకుని కొత్త తరం నాయకులను తీసుకురావాలనే లక్ష్యంతో మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో నాయకత్వ మార్పులు చేపట్టింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తన 76 ఏళ్ల రాష్ట్ర యూనిట్‌ చీఫ్‌ కమల్‌ నాథ్‌ స్థానంలో వెనుకబడిన తరగతులకు చెందిన అట్టడుగు నాయకుడైన 50 ఏళ్ల జితు పట్వారీని ఎంపిక చేసింది. పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉమంగ్‌ సింఘార్‌ను ఎంపిక చేసింది.

49 ఏళ్ల ఉమంగ్‌ సింఘార్‌ గంద్వాని నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేత కూడా. అతేర్‌ నుంచి రెండుసార్లు ఎన్నికైన 38 ఏళ్ల హేమంత్‌ కటారే శాసనసభలో పార్టీ డిప్యూటీ లీడర్‌. హేమంత్‌ కటారే బ్రాహ్మణుడు కావడం గమనార్హం.

ఛత్తీస్‌గఢ్‌(Chattisgarh)లో కాంగ్రెస్‌(Congress) పార్టీ విజయం సాధిస్తుందని భావించినా బీజేపీ(BJP) చేతిలో ఓడిపోయింది. ఫలితంగా వెనుకబడిన తరగతుల కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 69 ఏళ్ల చరణ్‌ దాస్‌ మహంత్‌ను శాసనసభా పక్ష నేతగా ఎంచుకున్నారు. అయితే, ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా బస్తర్‌ ఎంపీ, గిరిజన నేత దీపక్‌ బైజ్‌నే కొనసాగించాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయించింది. బైజ్‌ నేతృత్వంలోనే పార్టీ ఇటీవలి ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. తాను ఎప్పుడూ పోటీచేసే స్థానం చిత్రకోట్‌లో ఆయన ఓటమిపాలయ్యారు.

రాజస్థాన్‌ పార్టీ నాయకత్వంలో ఇంకా మార్పులను ప్రకటించలేదు. గత ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు రాష్ట్ర యూనిట్‌లో లేదా అసెంబ్లీలో ముఖ్యమైన పదవి దక్కే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం (డిసెంబర్‌ 16) సాయంత్రం ప్రకటించిన కొత్త నియామకాలను చూస్తే.. మధ్యప్రదేశ్‌లోని మార్పులు చాలా ముఖ్యమైనవి.

20 ఏళ్ల తర్వాత తొలిసారిగా పట్వారీ, సింగర్‌ల నియామకాలు కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం గతంలో అనుసరించిన వ్యూహానికి భిన్నంగా ఉన్నాయి. ఈ మునుపటి వ్యూహం ప్రతికూల ఫలితాలను ఇచ్చింది.

పట్వారీ మరియు సింఘార్‌లకు మాజీ ముఖ్యమంత్రులు నాథ్‌, దిగ్విజయ్‌కు ఉన్న రాజకీయ అనుభవం, ఆర్థిక శక్తి లేకపోవచ్చు. పట్వారీ మరియు సింఘార్‌ ఇద్దరూ స్వతంత్ర నాయకులు. ఎవరి మద్దతు లేకుండా తమ స్థానాలను దక్కించుకున్నారు. పట్వారీ, సింఘార్‌ లేదా ఈ వర్గంలో కనీసం అనుభవం ఉన్న కటారే పార్టీ నిర్మాణాన్ని మార్చేస్తారని భావించడానికి వీల్లేదు.

కష్టమైన పని..

రాష్ట్ర జట్టు నాయకుడిగా పట్వారీకి చాలా కష్టమైన పని ఉంది. డిసెంబర్‌ 3న జరిగిన ఎన్నికల్లో 35 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. పట్వారీ వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు. రాష్ట్రంలోని మాల్వా ప్రాంతంలో యువత, రైతులపై ఆయన ప్రభావం ఉంది. కొత్తగా సీఎంగా నియమితులైన మోహన్‌ యాదవ్‌ కూడా ఈ ప్రాంతం నుంచే వచ్చారు. కుల గణన ద్వారా ఇతర వెనుకబడిన తరగతులకు సాధికారత కల్పించాలన్న డిమాండ్‌కు పట్వారీ మద్దతు తెలిపారు. నిరుద్యోగులు, రైతుల సమస్యలను పరిష్కరించడం కూడా పార్టీ లక్ష్యం. పట్వారీకి కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో సత్సంబంధాలున్నాయి. ఏ ప్రత్యేక వర్గంతోనూ సంబంధం లేని రాష్ట్రంలోని అతికొద్ది మంది పార్టీ నేతలలో పట్వారీ ఒకరు కావడం గమనార్హం.

గంద్వాని ఎమ్మెల్యే సింఘార్‌ బీజేపీకి బలమైన ప్రత్యర్థి. పార్టీలో గిరిజన సమాజానికి ముఖ్యమైన ప్రతినిధి. కేంద్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని తన సొంత పార్టీ సీనియర్‌ సభ్యులతో, ముఖ్యంగా దిగ్విజయ్‌ సింగ్‌తో సంబంధాలు అంతగా లేవు. ప్రతిపక్ష నాయకుడిగా నాయకత్వం వహించవలసి ఉంటుంది. అతను ఇందులో నైపుణ్యం ఉన్నా.. తన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడం అంత సులభం కాదు.

సింఘార్‌ ఇటీవల దిగ్విజయ్‌ రాజీపడేందుకు ప్రయత్నించారు. తన గత వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇది దిగ్విజయ్‌, అతని విధేయ ఎమ్మెల్యేలను గెలవడానికి సరిపోతుందో లేదో చూడాలి.

దిగ్విజయ్‌, సింఘార్‌ల మధ్య చిరకాల బంధం ఉంది. అవిభాజ్య మధ్యప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సింఘార్‌ అత్త జమునా దేవి ఎప్పుడూ దిగ్విజయ్‌ను విమర్శించేది. పట్వారీ, సింఘర్‌ ఇద్దరూ మాల్వా ప్రాంతానికి చెందినవారు. కటారే చంబల్‌ డివిజన్‌ నుంచి వచ్చారు. ఇటీవలి నియామకాలలో ప్రాధాన్యం ఇవ్వని వింధ్య, మహాకౌశల్‌ వంటి కీలక ప్రాంతాల నుంచి న్యాయమైన ప్రాతినిధ్యం ఉండేలా రాష్ట్ర విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచనలో కేంద్ర నాయకత్వం అలాగే పట్వారీ యోచిస్తున్నట్లు సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌లో కొత్త రక్తం..

రాష్ట్ర నాయకత్వాలో పార్టీ హైకమాండ్‌ సాహసోపేతమైన మార్పులు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఆశిచినంత మార్పుల్లేవని చెప్పాలి. మాజీ సీఎం భూపేష్‌ బఘేల్‌కు కొత్త స్థానం ఇవ్వలేదు. దీనికి ఆయన మితిమీరిన ఆత్మవిశ్వాసం, ఆత్మసంతృప్తే కారణమని పార్టీలోని వర్గాల సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ కొత్త సీఎల్పీగా చరణ్‌ దాస్‌ మహంత్‌ను ఎంపిక చేసింది. ఎంతో అనుభవం ఉన్న ఆయనకు గతంలో ముఖ్యమైన పదవులు కూడా ఉన్నాయి. ఓబీసీ నాయకత్వానికి పార్టీ విలువ ఇస్తుందనడానికి ఇది నిదర్శనం. మహంత్‌ నలభై సంవత్సరాల క్రితం విద్యార్థి రాజకీయ నాయకుడు. గొడవల జోలికి వెళ్లడనే పేరుంది. భూపేష్‌ బఘేల్‌, మాజీ డిప్యూటీ సీఎం టీఎస్‌ సింగ్‌ డియో నేతృత్వంలో పార్టీలో రెండు ప్రధాన గ్రూపులు ఉన్న రాష్ట్రంలో.. మహంత్‌ ఎంపిక మధ్యస్థంగా చూడాలి. ఈ ఎన్నికల్లో సింగ్‌ డియో ఓడిపోవడంతో బఘేల్‌కు ఏఐసీసీలో పదోన్నతి లభిస్తుందని భావిస్తున్నారు. సీఎల్పీ చీఫ్‌గా మహంత్‌ ఎంపిక మంచి నిర్ణయమే అని చెప్పాలి. అయితే బీజేపీని ఎంత గట్టిగా ఎదుర్కొంటారనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ కొత్త నాయకులకు పరిమిత సమయం, వనరుల కొరత అంతర్గత విభేదాలు ఉన్నా..ఏ మేరకు ఫలితాలు సాధించగలరో వేచిచూడాలి.

Tags:    

Similar News