ఎన్నికల ముందు టీఎంసీలో కుమ్ములాటలు

2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్ లో గత దశాబ్ధంగా అధికారం చెలాయిస్తున్న టీఎంసీకి నేతల మధ్య కుమ్ములాటలు తలనొప్పిలా మారాయి.

Update: 2024-01-04 11:14 GMT
బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ

ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వర్గాలుగా పార్టీ ఇప్పటికే రెండుగా చీలినట్లు ప్రస్తుత పరిణామాలను చూస్తే తెలుస్తోంది. ఓ వర్గం సీఎం మమతను సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేస్తే, మరో వర్గం అల్లుడు అభిషేక్ ను పోగుడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వైరల్ చేస్తోంది. ఈ పరిణామాలు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ పుట్టిముంచుతాయని కొంతమంది టీఎంసీ సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓ వైపు ఐ ఎన్ డీ ఐ కూటమి(INDIA) నాయకులు సీట్ల పొత్తు, కూటమి ఉమ్మడి ప్రచారంపై చర్చోపచర్చలు జరపుతుండగా, టీఎంసీ పరిస్థితి ఇలా ఉంది. ముఖ్యంగా పార్టీకి చాలా కాలంగా అండగా ఉంటున్న కొన్ని వర్గాలు నేతల కుమ్ములాటతో దూరం జరిగే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అభిమానం వర్సెస్ దురభిమానం

పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజు అయిన జనవరి 1న చెలరేగిన గొడవలు గురువారం నాటికి ముదిరి పాకనపడ్డాయి. కొందరు బాలనగర్ ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతకుముందు రోజు(బుధవారం రాత్రి) ఆయన పేస్బుక్ లో ఓ పోస్టు షేర్ చేశారు. "కొందరు పార్టీని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. అవినీతిపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు నాకు బెదిరింపులు వస్తున్నాయి. నాకు ప్రాణభయం ఉంది" అని పోస్ట్ కు తన అభిప్రాయాన్ని జత చేశారు. దీనిపై వ్యతిరేక వర్గం గురువారం ఆయన పార్టీ ఆఫీసుపై దాడి చేసింది.

"ఇక్కడే ఉంటే తనను చంపి వేసేవారేమో" అని ఆందోళన వ్యక్తం చేస్తూ తన పేస్ బుక్ పేజీలో ఓ వీడియో పోస్ట్ చేశారు. నేను ఈ రోజు కోల్ కత్తలో ఉండటం నా అదృష్టం అంటూ అందులో పేర్కొన్నారు. జనవరి 7 తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటించారు. అయితే మనోరంజన్ పై దాడి చేసింది హూగ్లీ జిల్లా పరిషత్ సభ్యురాలు రూనాఖాతూన్ అనే అనుమానం ఆయన మద్ధతుదారులు వ్యక్తం చేశారు. ఆమెను బతికున్న పూలన్ దేవిగా బాలానగర్ ఎమ్మెల్యే వర్గంవారు అభివర్ణిస్తుంటారు.

ఎమ్మెల్యేకు, అభిషేక్ బెనర్జీ వర్గానికి కొంతకాలంగా సఖ్యత కుదరడం లేదు. తను సూచించిన వారికి కాకుండా మరోవర్గానికి సీట్లు కేటాయించడంతో గత ఏడాది జూన్ లో రెండు పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. కాగా మనోరంజన్ దీదీ వర్గానికి చెందిన నాయకుడిగా పేరుంది.

దళితులు దూరం అవుతారా?

బాలనగర్ ఎమ్మెల్యే మనోరంజన్ బైపారీ బెంగాల్ లో అతిపెద్ద ఎస్సీ కమ్యూనిటీల్లో ఒకటైనా ‘మథువా’ వర్గానికి చెందిన నాయకుడు. ఆయన మంచిరచయిత, రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ వర్గాలను ఆకట్టుకునేందుకు సీఏఏ నిబంధనలను అమలు చేయాలని చూస్తున్న బీజేపీ సర్కార్ కి, ఈ అంశం మేలు చేస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. "బీజేపీ మథువా ప్రణాళికను ఎలా ఎదుర్కోవాలో అని ఆలోచిస్తున్నప్పుడు ఆ వర్గం ఎమ్మెల్యేపైనే దాడులు చేయడం నిజంగా మంచి పరిణామం కాదు" మథువా వర్గానికి చెందిన టీఎంసీ నాయకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నువ్వు తెల్ల ఏనుగు.. కాదు నువ్వు కుక్కవి

ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే టీఎంసీ ఎంపీ, సహాయమంత్రి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎంపీ సుదీప్ బందోపాధ్యాయను ప్రణాళిక, గణాంక శాఖ సహాయమంత్రి తపస్ రాయ్.. నువ్వు పార్టీకి ‘తెల్ల ఏనుగు’ లాంటి వాడివని విమర్శించారు. దీనికి కౌంటర్ గా ఆయన ‘ఏనుగు వెళ్తుంటే కుక్కలు ఇలానే మొరుగుతాయ్’ అర్ధం వచ్చే విమర్శ చేశారు. దీంతో పార్టీలో ఏ నాయకుడు ఎప్పుడు ఏం మాట్లాడి వివాదం చేస్తారో అని అధినాయకత్వం తలలు పట్టుకుంటోంది. ఈ పరిణామాలపై కోల్ కత మేయర్ ఫిర్హాద్ హకీమ్ పార్టీ నాయకులతో మాట్లాడారు. అన్ని వర్గాలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇండియా కూటమి లెక్కలు

వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం కూటమి మధ్య సీట్ల పొత్తులు, బేరసారాలు జోరుగా నడుస్తున్నాయి. ఒకపక్క రాష్ట్రంలో ఉన్న 27 శాతం మైనారిటీ ఓట్లు చీలకుండా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి టీఎంసీ సిద్ధంగా ఉంది. అయితే ఆ పార్టీకి కేవలం మూడే సీట్లు ఇచ్చే ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిలో మాల్దా సౌత్, బహరంపూర్ తో పాటు డార్జిలింగ్ స్థానాలు మాత్రమే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే లోక్ సభ లో కాంగ్రెస్ పక్షనేత అయిన అధిర్ రంజన్ చౌధరి మాత్రం ఏడు సీట్లు కావాలని బేరసారాలు చేస్తున్నారు. మరో వైపు 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు ఏర్పాటైన సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెప్ట్ పార్టీ తోను పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే లెప్ట్ పార్టీ లు మాత్రం టీఎంసీతో కలవడానికి అంత సుముఖంగా లేవు. 

Tags:    

Similar News