‘ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి’
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణానికి తెరపడిన నేపథ్యంలో అమెరికా పాత్ర గురించి అఖిలపక్ష సమావేశంలో వివరించాలన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేష్.;
ఎట్టకేలకు భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్త వాతావరణానికి తెరపడింది. అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ప్రధాని మోదీ(PM Modi) అధ్యక్షతన అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్(Congress) పార్టీ కోరింది. పార్లమెంటులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గడిచిన 18 రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాల గురించి వివరించాలని కాంగ్రెస్ కమ్యూనికేషన్ల ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ (Jairam Ramesh) ‘ఎక్స్’ వేదికగా మోదీని కోరారు.
శాంతి అవసరమే.. కాని..
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. "ఇరుదేశాల వెనక్కు తగ్గడం శుభపరిణామమే. సంయమనం పాటించారు. శాంతి అవసరాన్ని స్వాగతిస్తున్నా. భారత్ దీర్ఘకాల యుద్ధం కోరుకోదు. అలాగని ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పకుండా ఉండదు. కేంద్రం నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత, అంతకుముందు జరిగిన పరిణామాల్ని వివరించాల్సి ఉంది," అని అన్నారు.
అమెరికా పాత్ర..
భారత్- పాక్ శాంతికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అనంతరం భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ మాట్లాడుతూ.. ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం భూతల, గగనతల, సాగరజలాల్లో అన్నిరకాల కాల్పులు, సైనిక చర్యలను భారత్-పాక్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రెండు దేశాల డీజీఎంవోలు శనివారం సాయంత్రం నేరుగా మాట్లాడుకున్నారని.. రెండువైపులా అన్నిరకాల సైనిక కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయించారని అన్నారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ..జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాలపైకి పాకిస్థాన్ డ్రోన్లు ప్రయోగించింది. దీంతో గగనతల రక్షణ వ్యవస్థల్ని ఉపయోగించి.. భారత్ వాటిని కూల్చేసిన విషయం తెలిసిందే.