కాంగ్రెస్ రెబల్స్‌తో ప్రమాదమా?

హర్యానాలో అసెంబ్లీ టిక్కెట్ దక్కని కొంతమంది కాంగ్రెస్ నాయకులు రెబల్స్‌గా మారిపోతున్నారు. స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీకి సిద్ధమవుతున్నారు.

Update: 2024-09-14 07:06 GMT

భారతీయ జనతా పార్టీ (బిజెపి) తరువాత ప్రస్తుతం కాంగ్రెస్‌లో తిరుగుబాటు బావుట కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ టికెట్ దక్కని కొందరు హస్తం పార్టీ నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు. అక్కడ కూడా టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఒక్క భివానీ మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)కి వదిలేసి, మిగతా 89 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను రంగంలోకి దింపింది. అయితే టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలతో పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

టికెట్ దక్కలేదని..

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఫరీదాబాద్‌లోని తిగావ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచి 2019లో ఓడిపోయిన లలిత్ నగర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనకు 1984 నుంచి ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉందని నగర్ చెప్పారు. “ పార్టీ నా కష్టాన్ని, నా సామర్థ్యాన్ని, నా అనుబంధాన్ని విస్మరించింది. నేను హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తని. నా నియోజ‌క‌వ‌ర్గ ప్రజల ఒత్తిడి మేర‌కు స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకుని నామినేషన్ వేశాను ’’ అని చెప్పారు.

శారదా రాథోడ్.. ఆమె మరో కాంగ్రెస్ రెబల్. బల్లభ్‌గఢ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. “జాబితాలో నా పేరు అగ్రస్థానంలో ఉందని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. నా క్షేత్రస్థాయి పరిజ్ఞానం, కృషి ఆధారంగా నా అభ్యర్థిత్వాన్ని పార్టీ ఆమోదించింది. నాకు బల్లభగఢ్ గురించిన అన్ని వివరాలు తెలుసు. నా నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రజలు నిత్యం నాతో టచ్‌లో ఉంటారు. టిక్కెట్ రాలేదని తెలిసి చాలా నిరాశ చెందాను. నేను నా నియోజకవర్గ ప్రజల కోసం పని చేయాలనుకుంటున్నాను. జాబితా ప్రకటించిన వెంటనే నా నామినేషన్ దాఖలు చేశాను' అని చెప్పారు.

అంబాలా కాంట్ నుంచి చిత్రా సర్వారా మరో అసంతృప్త కాంగ్రెస్ అభ్యర్థి. టికెట్ పంపిణీలోతనకు అన్యాయం జరిగిందని ఆమె ఫెడరల్‌తో అన్నారు.

“నేను అంబాలా కాంట్ నుంచి గెలుస్తాను. 2019లో హర్యానా హోం మంత్రి అనిల్ విజ్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చాను. కాంగ్రెస్ పోటీలో ఎక్కడా లేదు. 2024లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానన్న షరతుపై కాంగ్రెస్‌లో చేరాను. కానీ పార్టీ నన్ను చీకట్లో ఉంచింది. దీనికి నేను చాలా బాధపడ్డాను.” అని ఆమె చెప్పారు.

12వ హర్యానా అసెంబ్లీలో అనేకసార్లు గెలిచిన, అత్యంత సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడయిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి సంపత్ సింగ్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వలేదు. హిసార్‌లోని నల్వా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

భివానీ నుంచి అభిజిత్ తన్వర్, గోహనా నుంచి హర్ష్ ఛికార, నర్వానా నుంచి విద్యా రాణి టికెట్ల పంపిణీలో పార్టీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

సమర్థించుకున్న కాంగ్రెస్..

టికెట్ నిరాకరించిన వారందరితో పార్టీ మాట్లాడిందని, చాలా మంది పార్టీ పరిస్థితిని గ్రహించారని, అందుకే తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ నాయకుడు ఆశిష్ దువా ఫెడరల్‌తో అన్నారు. హర్యానాలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. “గురుగ్రామ్ సీటుకు నేను కూడా బలమైన పోటీదారుని. రెండు దశాబ్దాలుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నాను. అయితే పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి' అని దువా అన్నారు.

కుదరని పొత్తు..

హర్యానాలోని రాజకీయ విశ్లేషకుడు దేవీందర్ సింగ్ సూర్జేవాలా ది ఫెడరల్‌తో మాట్లాడుతూ..ఆప్‌తో జతకట్టకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమేమీ ఉండదని చెప్పారు. ఒంటరిగానే ఎన్నికలలో పోటీ చేసే సత్తా కాంగ్రెస్‌కు ఉందని పేర్కొన్నారు. ఆప్ మొత్తం 90 స్థానాల్లో పోటీ చేస్తోంది.

గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందా?

హర్యానాలో కాంగ్రెస్-ఆప్ చీలిక కూడా కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. జేజేపీ ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయగా, బీఎస్పీతో ఐఎన్‌ఎల్‌డీ జతకట్టింది.

“కాంగ్రెస్‌లో నిరసనలు ఊహించినవే. ఇది INLD, BSP లకు లాభం చేకూర్చవచ్చు. కానీ కాంగ్రెస్ తన తిరుగుబాటు నాయకులందరినీ తిరిగి పార్టీలో చేర్చుకుంటుంది. తనకు 50 ప్లస్ సీట్లు వచ్చేలా చూస్తుంది, ”అని ఒక జాట్ నాయకుడు ది ఫెడరల్‌తో అన్నారు. “హర్యానాలోని ఓటర్లు, కాంగ్రెస్ నాయకుల భావాలు ఆప్‌తో ఒప్పందానికి వ్యతిరేకంగా ఉన్నాయి. పట్టణాల్లో ఆప్ ప్రభావం ఉన్నా కాంగ్రెస్‌ను దెబ్బతీయదు. ఇది బీజేపీని దెబ్బతీస్తుంది’’ అని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జాల మధ్య సీట్ల సమీకరణలపై చివరి నిమిషంలో అభ్యంతరాలు రావడంతో.. కాంగ్రెస్ సీట్ల ప్రకటన ఆలస్యమైందని చెబుతున్నారు.

పోటీలో ప్రధాన పార్టీలు..

అక్టోబర్ 5న జరగనున్న ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ , కాంగ్రెస్‌తో పాటు, జననాయక్ జనతా పార్టీ (JJP), ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), ఆజాద్ సమాజ్ పార్టీ (ASP), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పోటీలో ఉన్నాయి.

Tags:    

Similar News