Farmers Agitation | యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన
తమ భూములను సరిపడా పరిహారం చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ..దాదాపు 20వేల మంది రైతులు ఢిల్లీ సరిహద్దు వద్ద ధర్నాకు దిగారు.
తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి వెళ్లేది లేదని ఉత్తర్ ప్రదేశ్ రైతులు తెగేసి చెప్పారు. యూపీ సర్కారు గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్‌వే తదితర ప్రాజెక్టుల కోసం తమ భూములను తీసుకుని సరిపడా పరిహారం చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ..దాదాపు 20వేల మంది అన్నదాతలు ఢిల్లీ సరిహద్దు సమీపంలోని దళిత ప్రేరణ స్థల్ వద్ద 'ధర్నా'కు దిగారు. తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుని తమ ఆందోళన కొనసాగించాలని రైతులు భావించారు. అయితే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున రైతులను నగరంలోకి అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రద్దీపై నిఘా ఉంచేందుకు పోలీసులు డ్రోన్లను వినియోగించారు. రైతుల నిరసన కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా - ఢిల్లీ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
నిరసన ఉధృతం చేస్తాం..
తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని, నిర్వాసిత రైతులకు ప్లాట్‌ల కేటాయించాలని లేకపోతే తమ ఆందోళనకు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలను ఏడు రోజుల్లోగా పరిష్కరించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రైతులు డెడ్‌లైన్ విధించారు. కాగా ప్రాజెక్టు ప్రభావిత రైతుల భూ సమస్యలు రెండు దశాబ్దాలకు పైగా అపరిష్కృతంగా ఉన్నాయని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.
రేపు కూడా నిరసన?
విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం ఉత్తరప్రదేశ్ అంతటా కూడా నిరసనలు చేపట్టాలని రైతు సంఘం యోచిస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్‌ఎస్‌పికి చట్టపర హామీ, వ్యవసాయ రుణాల మాఫీ, రైతులపై పోలీసు కేసుల ఉపసంహరణ కోరుతూ..పంజాబ్‌కు చెందిన రైతులు డిసెంబరు 6న ఢిల్లీ వైపు మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.