జైపాల్ రెడ్డికి హైదరాబాద్ నివాళి

సర్వం కుశలం, పైసలవసరం..ఇది ఎవరి డైలాగో తెలుసుగా..

Update: 2024-01-16 12:27 GMT
Credits: DD News


సూదిని జైపాల్‌ రె((జనవరి 16, 1942 – జూలై 28 2019) ని ఎవరైనా 'అన్నా ఎట్టున్నవే' అని అడిగితే 'అరే ఏముందిర బయ్‌.. సర్వం కుశలం పైసలవసరం' అనే వారని  ఆయన్ను బాగా దగ్గరిగా చూసిన వాళ్లు చెబుతుంటారు. అంత నిర్మొహమాటంగా మాట్లాడడం రాజకీయాల్లో ఏ కొద్ది మందికో చెల్లుబాటవుతుంది. అది ఇందిరా గాంధీ పెట్టిన ఎమర్జెన్సీ అయినా, రిలయన్స్ పై పోరాటమైనా, తెలంగాణ ఉద్యమమైనా.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడంలో జైపాల్‌రెడ్డి రూటే వేరు.

క్లీన్‌ పాలిటిక్స్‌ జైపాల్‌ కల...

జైపాల్‌ రెడ్డిది ఊహించనలవి గాని కోర్కె కావొచ్చుగాని పరిశుద్ధమైన రాజకీయాల కోసం ఆయన అహర్నిశలు పోరాడారు. ఉస్మానియా న్యాయ కళాశాలకు స్టూడెంట్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనప్పటి నుంచి పార్లమెంటుకు వెళ్లేంత వరకు ఏనాడూ తను వెనుదిరిగి చూడలేదు. తన పట్టుదల, అసాధారణ కృషి, అసమాన్య రాజకీయ జర్నీకి ఆయన భౌతిక వైకల్యం ఎన్నడూ ఆటంకం కాలేదంటే జైపాల్‌రెడ్డి ఎంతటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. చిన్న దానికే కుంగిపోవడం తన జీవితంలో ఎన్నడూ జరగలేదు. ప్రజా జీవితంలో ఇలాంటి ఆణిముత్యాలు కొన్నే ఉంటాయంటే నమ్మలేం.


హైదరాబాద్ లో  జైపాల్ రెడ్డి విగ్రహం


 

82వ జయంతి వేడుకలు...

హైదరాబాద్‌లో దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. నెక్లెస్‌ రోడ్‌లోని స్ఫూర్తిస్థల్‌లో పార్టీలకు అతీతంగా మహామహులు నివాళులు అర్పించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరావుతో పాటు.. సీపీఐ, సీపీఎం నేతలు చాడా వెంకటరెడ్డి, పి.మధు, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు నివాళులు ఆర్పించారు.



జైపాల్ రెడ్డికి కాంగ్రెస్, వామపక్ష నేతల నివాళి


 పాలమూరు ప్రాజెక్ట్‌కి జైపాల్‌రెడ్డి పేరు...

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ విషయంపై సీఎంతో చర్చిస్తామన్నారు. జైపాల్‌రెడ్డి సేవలు మరువలేనివని మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఆయన సొంత తమ్ముడి కూతురి భర్త. మరోమాటలో చెప్పాలంటే రేవంత్‌ రెడ్డి జైపాల్‌రెడ్డికి అల్లుడన్న మాట.


జైపాల్ రెడ్డికి కుటుంబ సభ్యుల నివాళి


 చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా...

సుదిని జైపాల్ రెడ్డి 1942 జనవరి 16న జన్మించారు. తన 77వ ఏట 2019 జనవరి 28న చనిపోయారు. అద్భుత ఆంగ్ల ప్రావీణ్యం ఆయన సొంతం. ఆయన మాట్లాడడానికి లేచారంటే ప్రధానమంత్రి మొదలు అందరూ వినడానికి ఆసక్తి చూపేవారు. ఐదు సార్లు పార్లమెంటుకి ఎన్నికైన ఉత్తమ పార్లమెంటేరియన్‌. కాంగ్రెస్‌ వ్యతిరేకిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తిరిగి కాంగ్రెస్‌లోనే చేరిన జైపాల్‌ రెడ్డి తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గానికి కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 1998లో ఐకే గుజ్రాల్ క్యాబినెట్‌లో సమాచార, ప్రసార శాఖకు మంత్రిగా పనిచేశారు. 21 ఏళ్ల తర్వాత 1999లో భారత జాతీయ కాంగ్రెస్‌కు వచ్చి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2004లో మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 14వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్-1లో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 2009లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి 15వ లోక్‌సభకు తిరిగి ఎన్నికై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2012 నుండి 18 మే 2014 వరకు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు కేంద్ర మంత్రిగా వ్యవహరించారు.


కేంద్ర టూరిజం మంత్రి జి కిషన్ రెడ్డి జైపాల్ రెడ్డికి నివాళులర్పించారుు.


 


నర్మెట్ట నుంచి నుంచి ప్రస్థానం...

తెలంగాణ నల్గొండ జిల్లాలోని చండూరు మండలానికి చెందిన నర్మెట్ట గ్రామంలో జన్మించారు. పుట్టడానికి నర్మెట్టలో పుట్టినా.. ఆయన మూడు జిల్లాలు-నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ప్రస్తుత రంగారెడ్డికి చెందిన వారనే చెప్పాలి. ఈ మూడు జిల్లాలతో ఆయనకు వ్యక్తిగత, రాజకీయ అనుబంధం ఉంది.

పోలియా బారిన పడినా...

పోలియోకి వ్యాక్సిన్లు, మందులు లేని కాలం. ఒకవేళ ఉన్నా మారుమూల ప్రాంతాలకు దక్కని దుస్థితి. 18 నెలల వయస్సులో పోలియో బారిన పడ్డారు. నడవడానికి ఊతకర్రలు తప్ప మరే ప్రత్యామ్నాయం లేదు. దీంతో వాటితోనే జీవనయానాన్ని ప్రారంభించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివారు. 1960 మే 7న లక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి నాయకుడు. 1970లలో కాంగ్రెస్‌లో చేరారు.

కల్వకుర్తి నుంచే తొలిపోటీ ...

1969, 1984 మధ్య కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. నాలుగు సార్లు అక్కడి నుంచి గెలిచారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1977లో జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత జనతా పార్టీ చీలిపోవడంతో జనతాదళ్‌లో చేరారు. ఆయన ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. పార్లమెంటు ఉభయ సభలకూ ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకునిగానూ ఉన్నారు.

తెలంగాణను ఇప్పించడంలో కీలక భూమిక...

'తెలంగాణ ఏర్పాటుకు నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒప్పించడంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు' అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారంటే తెరవెనుక ఆయన కృషి ఎంత ఉందో అర్థమవుతుంది. 'తెలంగాణ తప్పకుండా వస్తుందని.. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని నాయకులు, ఉద్యమకారులకు జైపాల్‌రెడ్డి చెప్పేవారు. హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం కాబోదని భరోసా ఇచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా పనిచేశారు' కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారంటే జైపాల్‌రెడ్డి వ్యక్తిత్వం ఎంతటి గొప్పదో అర్థం అవుతుంది. అందుకే ఆయన్ను ఉత్తమ పార్లమెంటరీయన్‌గా దేశం గుర్తించింది. ఆ కీర్తి జైపాల్‌కి దక్కినందుకు తెలుగుజాతి గర్వీస్తోంది.


Tags:    

Similar News