ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ వద్ద కొనసాగుతున్న ఐఏఎస్ ఆశావహుల నిరసన..

ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు ఐఏఎస్ ఆశావహులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై సహ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Update: 2024-07-31 05:36 GMT

ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనం సెల్లార్‌లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు ఐఏఎస్ ఆశావహులు చనిపోయిన ఘటనలో.. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని సహ విద్యార్థులు మంగళవారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. 400 మందికి పైగా విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

భారీ వర్షం కారణంగా సెల్లార్‌లోకి ఒక్కసారిగా వరద నీరు చేరడంతో తెలంగాణకి చెందిన సోనీ తానియా (25), ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన శ్రేయ యాదవ్ (25), కేరళకి చెందిన నెవిన్ డాల్విన్ (28) ఊపిరాడక చనిపోయిన విషయం తెలిసిందే.

"ఘటనను పాలకులు సీరియస్‌గా తీసుకోలేదు"

ఘటనను ఢిల్లీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని ఐఏఎస్ ఆశావహులు ఆరోపిస్తున్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్నారు.

నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని కోరుతున్నారు. ఢిల్లీలో సెల్లార్లు, బెస్‌మెంట్లలో లైబ్రరీలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గవర్నర్‌ను కలిసిన విద్యార్థుల బృందం..

నిరసన తెలుపుతున్న ఐఏఎస్ ఆశావహులు గవర్నర్‌ వీకే సక్సేనాను కలిశారు. ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు చేయించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

స్టడీ సర్కిల్ యజమాని, కో ఆర్డినేటర్ అరెస్టు..

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే IAS స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తా, కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు మంగళవారం రావూస్ IAS స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తా మామ VP గుప్తాను ప్రశ్నించారు. వీపీ గుప్తా తన పేరున ఉన్న ఈ భవవాన్ని తన కూతురు, అల్లుడు అభిషేక్ గుప్తాకి రాసిచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News