‘ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పటికీ ఉపేక్షించదు’

కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ నాయకత్వంలో ప్రపంచదేశాలకు బయలుదేరిన అఖిల పక్ష ప్రతినిధి బృందం..;

Update: 2025-05-24 09:32 GMT
Click the Play button to listen to article

ఉగ్రవాదంపై భారత్ వైఖరి వివరించేందుకు ఇండియా తరుపున అఖిల పక్ష ప్రతినిధి బృందాలు విదేశీ పర్యటనకు బయల్దేరిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు బృందాల్లో మూడు బృందాలు ఇప్పటికే బయలుదేరాయి. కాంగ్రెస్(Congress) సీనియర్ నేత శశి థరూర్(Shashi Tharoor) నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం రాత్రి బయలుదేరింది. ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో శాంభవి (ఎల్‌జెపి-ఆర్‌వి), సర్ఫరాజ్ అహ్మద్ (జెఎంఎం), జిఎం హరీష్ బాలయోగి (టిడిపి), శశాంక్ మణి త్రిపాఠి (బిజెపి), భువనేశ్వర్ కలిత (బిజెపి), మిలింద్ దేవరా (శివసేన), తేజస్వి సూర్య (బిజెపి), మాజీ డిప్లొమా తరన్ ఉన్నారు. వీరంతా గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, అమెరికాలో పర్యటిస్తారు. అక్కడ అమెరికాలో జరిగిన 9/11 దాడితో సహా ఉగ్రవాదంతో పాకిస్తాన్‌కు ఉన్న సంబంధాలను బయటపెడతారు. విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలో ప్రతినిధి బృందం సభ్యుల చిత్రాలను ఎక్స్‌లో షేర్ చేసి ఇలా పేర్కొన్నారు. ‘‘నేను గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌, అమెరికాకు వెళ్లే అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహిస్తున్నా. దేశం తరఫున గళం విప్పేందుకు వెళ్తున్నాం. ఉగ్రవాదులు పేట్రేగిపోతుంటే భారత్‌ మౌనంగా ఉండదనే సందేశం ప్రపంచానికి ఇస్తాం. ఇది మా బాధ్యత. వాస్తవానికి దూరంగా ఎలాంటి ప్రకటనలు చేయం. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకి తప్ప ద్వేషం, ఉగ్రవాదానికి చోటు లేదని భారత్‌ విశ్వసిస్తోంది. ఇది ప్రపంచానికి తెలియచేడమే మా లక్ష్యం. జై హింద్‌’ అని శశిథరూర్ పేర్కొన్నారు.

ఇప్పటికే బయలుదేరిన బృందాలు..

జేడీ (యూ) ఎంపీ సంజయ్ కుమార్ ఝా, డీఎంకే ఎంపీ కె కనిమొళి, శివసేనకు చెందిన శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మూడు బృందాలు బుధవారం (మే 21) తమకు కేటాయించిన దేశాలకు బయలుదేరాయి.

ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, ప్రధాన్ బారువా, హేమాంగ్ జోషి (బీజేపీ), సీపీఎం జాన్ బ్రిట్టాస్, మాజీ విదేశాంగ మంత్రి కాంగ్రెస్ ప్రముఖుడు సల్మాన్ ఖుర్షీద్, రాయబారి మోహన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఇండోనేషియా, మలేషియా, జపాన్, సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాను సందర్శిస్తారు.

కనిమొళి నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో బీజేపీకి చెందిన బ్రిజేష్ చౌతా, ఎస్పీకి చెందిన రాజీవ్ రాయ్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మియాన్ అల్తాఫ్, ఆర్జేడీకి చెందిన ప్రేమ్ చంద్ గుప్తా, ఆప్‌కు చెందిన అశోక్ మిట్టల్, రాయబారులు మంజీవ్ పూరి, జావేద్ అష్రఫ్‌ ఉన్నారు. వీరు స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాకు వెళ్తారు.

శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో బీజేపీకి చెందిన బన్సూరి స్వరాజ్, అతుల్ గార్గ్, ఎస్ఎస్ అహ్లువాలియా, మనన్ కుమార్ మిశ్రాతో పాటు ఐయుఎంఎల్‌కు చెందిన ఇటి మొహమ్మద్ బషీర్, బిజెడికి చెందిన సస్మిత్ పాత్రా, రాయబారి సుజన్ చినాయ్ ఉన్నారు. వీరు యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్‌లను సందర్శిస్తారు. 

Tags:    

Similar News