ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా?

షెడ్యూల్డ్ కులాలన్నీ సమానమేనా? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ఎస్సీలందరూ రాజ్యాంగబద్ధంగా 'సజాతీయులే' నని 2004లో ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాల్సి ఉందా?

Update: 2024-02-07 07:40 GMT
సుప్రీంకోర్టు

యుగయుగాల దోపిడిలో,

నరనరాల రాపిడిలో

వగదూరిన,

పొగచూరిన

శాసనాల జాడలు!

జాలిజార్చు గోడలు!” అంటారు మహాకవి శ్రీ.శ్రీ. అసలు ఉన్నదే తక్కువ, అందులో కొంతపంచి మరొకరికి ఇస్తామంటే ఎలా? అని అభివృద్ధిలో అట్టడుగున పడి అన్యాయానికి గురవుతున్న వారు ప్రశ్నిస్తుంటే మా మూలాలు అక్కడివే, మాకు ఆ అభివృద్ధి ఫలాలు అందాలి కదా అని మరోవర్గం ప్రశ్నిస్తోంది. అన్ని షెడ్యూల్డ్ కులాలు సమానమేనా లేక కొందరు మిగిలిన వారితో పోలిస్తే తక్కువగా ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి షెడ్యూల్డ్ కులాల వారందరూ రాజ్యాంగబద్ధంగా 'సజాతీయులే' అని 2004లో ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాల్సి ఉందా? ఇప్పుడీ చిక్కుప్రశ్న మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

రిజర్వేషన్లవే పెద్ద తేనెతుట్ట. దాన్ని ఎవరు కదిలించిన గాయ్ గాయ్ కావాల్సిందే, రచ్చ రచ్చ కావాల్సిందే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రణం చాలా కాలంగా సాగుతోంది. ఎస్సీలలో బాగా వెనుకబడిన మహా దళితులకు అందాల్సిన రిజర్వేషన్లపై చాలా కాలంలో కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు కొత్త చర్చకు తెరదీసింది. అదేమిటంటే.. మహా దళితులకు అందాల్సిన రిజర్వేషన్ల కోటా ప్రయోజనాలు వాళ్లకి కాకుండా ఎస్సీలలోని ప్రివిలైజ్డ్ వర్గాలకు అందించేలా షెడ్యూల్డ్ కులాలను ఉప వర్గీకరణ చేసే రాజ్యాంగ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? అనే సందేహాన్ని వెలిబుచ్చింది. ఒకళ్లిద్దరు కాకుండా మొత్తం ఏడుగురితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ సంకట స్థితిలో పడింది. 2004లో ఇదే కోర్టు ఇచ్చిన తీర్పును మళ్లీ పరిశీలించేందుకు నడుంకట్టింది.

విషయమేమిటంటే...

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఇ.వి. చిన్నయ్య 2000వ సంవత్సరంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కోర్టుకు వెళ్లారు. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2004లో తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిన్నయ్య మధ్య నడిచిన వ్యాజ్యం ఇది. షెడ్యూల్డ్ కులాలన్నీ" ఒకే సజాతీయ" సమూహంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందువల్ల షెడ్యూల్డ్ కులాలలో ఏదైనా అంతర్-సెక్షన్ లేదా వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘనగా చెప్పింది.

షెడ్యూల్డ్ కులాలను నాలుగు గ్రూపులుగా విభజించి, ఒక్కొక్కరికి విడివిడిగా రిజర్వేషన్లు కల్పించాలన్న జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీలను నాలుగు క్యాటగిరీలుగా వర్గీకరించింది. ప్రతి క్యాటగిరీకి రిజర్వేషన్ల వాటాను పంచింది. దీన్ని చెన్నయ్య తన పిటిషన్ లో వ్యతిరేకించారు. షెడ్యూల్డ్ కులాల్లోని అన్ని వర్గాలు ఒకటి కాదని, ప్రత్యేకించి చారిత్రాత్మకంగా అణచివేతకు, అణగదొక్కబడిన వర్గాలు ఉన్నాయని, ఈ వర్గీకరణతో విద్య, ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను కోల్పోతాయని చెన్నయ్య వాదించారు. అయితే, ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతి జాబితాలోని ఒక కులాన్ని షెడ్యూల్డ్ కులంగా ప్రకటించడమంటే అది అందరికీ ఒకే రకంగా ఉంటుందే గాని వేర్వేరుగా చూడకూడదంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. అన్ని ప్రయోజనాలు అందరికీ అందాలని, షెడ్యూల్డ్ కులాలను వేర్వేరు క్యాటగిరీగా చూడకూడదని అభిప్రాయపడింది.

ఇప్పుడు ఈ తీర్పును మళ్లీ మారుస్తారా...

ఎస్సీ వర్గీకరణపై 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చాలా రాష్ట్రాలు వ్యాజ్యాలు వేశాయి. పంజాబ్, తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర సహా చాలా రాష్ట్రాల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో మంద కృష్ణ మాదిగ పోరాటం కూడా ఇలాంటిదే. ఎస్సీ వర్గీకరణ జరగాలన్నది మంద కృష్ణ డిమాండ్. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. 2004 తీర్పు చెల్లుబాటవుతుందా, మళ్లీ పరిశీలన చేయాలా అనే మీమాంసలో పడింది. ఇదే సందర్భంలో పంజాబ్ షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల (సేవలలో రిజర్వేషన్) చట్టం, 2006 చెల్లుబాటును కూడా పరిశీలిస్తోంది. ఎస్సీలకు ఉన్న 15 శాతం రిజర్వేషన్లలో వాల్మీకులు, 'మజాబి'లకు 50 శాతం ఇస్తూ పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో ఓ చట్టాన్ని తెచ్చింది. షెడ్యూల్డ్ కులాల (SCలు) కోటా లోపల మళ్లీ కోటాలేమిటంటూ సుప్రీంకోర్టు దాన్ని కూడా కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లు తీసుకువచ్చింది. వచ్చే ఎన్నికల్లో దీన్ని ఓ అస్త్రంగా ఉపయోగించి లబ్ధి పొందే చాన్స్ ఉందని భావించిన రాజకీయ వర్గాలు.. సుప్రీంకోర్టు 2004 తీర్పును సమీక్షించాలని కోరుతున్నాయి. పంజాబ్ లోని ప్రస్తుత ఆప్ ప్రభుత్వమైతే మరో అడుగు ముందుకేసి పాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే రిజర్వేషన్లు నిలిపివేసిందో అక్కడి నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమన్నదంటే...

ఈ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బేలా ఎం త్రివేదీ, పంకజ్ మిట్టల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర మిశ్రా విచారణకు చేపట్టింది. పంజాబ్ అడ్వోకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ ప్రభుత్వం తరఫున హాజరయ్యారు. ఈ కేసు విచారణ ప్రారంభంలో సుప్రీం ధర్మాసనం చాలా కీలకవ్యాఖ్యలు చేసింది. “వెనుకబడిన వర్గాలలో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించాలి. ఉపాధి అవకాశాలు వినియోగించుకోవడంలో సమాన అవకాశాలు కల్పించాలి” అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలలో ఉప వర్గీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా లేదా అనే చట్టపరమైన ప్రశ్నను సుప్రీంకోర్టు పరిశీలించడం ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పంజాబ్ షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల (సేవలలో రిజర్వేషన్) చట్టం, 2006 చెల్లుబాటును కూడా పరిశీలిస్తోంది. 2010లో పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో సహా 23 పిటిషన్లను విచారిస్తోంది కోర్టు. 2004లో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఉల్లంఘించడం సహా 'వాల్మీకులు', 'మజాబి సిక్కు'లకు 50 శాతం ఎస్సీ కోటా కల్పించే పంజాబ్ చట్టంలోని సెక్షన్ 4(5)ని హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతి జాబితా నుండి ఎస్సీలుగా పరిగణించే కులాలను మినహాయించే అధికారం పార్లమెంటు మాత్రమే ఉందని, అసెంబ్లీలకు లేదని సుప్రీంకోర్టు 2004లో పేర్కొంది. అయితే, 2004లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తమకు వర్తించదని 2011లో పంజాబ్ ప్రభుత్వం.. హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

పంజాబ్ ప్రభుత్వం అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ 2020 ఆగస్టు 27న చిన్నయ్య (2004 తీర్పు) తీర్పుతో విభేదించింది. ఏడుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తుల పెద్ద బెంచ్ తీర్పు కోసం రిఫర్ చేసింది. ఇది రాజ్యాంగ వ్యవహారమని, ముగ్గురితోనో, ఐదుగురితోనో అయ్యే పని కాదని, పూర్తిస్థాయి బెంచ్ దీనిపై నిర్ణయం తీసుకుంటే పదేపదే కోర్టులకు రావాల్సిన పని ఉండదని అభిప్రాయపడింది. దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అంగీకరించారు.

ప్రస్తుత రాజ్యాంగ నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థలలోని సీట్లలో 22.5 శాతం షెడ్యూల్డ్ కులాలకు, 7.5 శాతం షెడ్యూల్డ్ తెగ (ST) విద్యార్థులకు రిజర్వ్ అయ్యాయి. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఎస్టీ జనాభా లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారణకు స్వీకరించింది. ఏ తీర్పు వెలువరిస్తుందో చూడాలి.

Tags:    

Similar News