తెలంగాణ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు కోర్టు షాక్..
బాధిత కుటుంబానికి రూ.10.3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు.;
ఓ రోడ్ యాక్సిడెంట్ కేసులో జనగావ్ జిల్లా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TGSRTC), బస్సు డ్రైవర్ కలిసి రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.10.3 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం తెలిపింది. ఆరు సంవత్సరాల పాటు సాగిన విచారణ తర్వాత తాజాగా న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జనగావ్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
6 నవంబర్ 2019న ఆర్టీసీకి చెందిన ఒక బస్సు అధిక వేగంతో ప్రయాణిస్తుంది. అదే స్పీడ్‌లో ర్యాంగ్ లేన్‌లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అవుతూనే ఆ లేన్‌లో ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. జనగావ్ జిల్లా నిడిగొండ గ్రామం దగ్గర్లో జరిగిన ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యాదగిరి(55) మరణించారు. బైక్‌పై వెనకాల కూర్చిని ఉన్న యాదగిరి భార్య లక్ష్మీ బాయికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిందన్న సమాచారం అందిన వెంటనే రఘునంతపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బస్ డ్రైవర్ ఎం.నగేష్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించారు. ఆరేళ్లుగా వాళ్లు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసు విచారణ సమయంలోనే లక్ష్మీబాయి కుమారుడు మరణించాడు.
ఈ కేసు విచారణలో ప్రమాదానికి దారితీసిన కారణాలపై న్యాయస్థానం ఫోకస్ పెట్టింది. ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ వల్లే జరిగిందని న్యాయస్థానం గుర్తించింది. అంతేకాకుండా ఈ ఘటనకు తాము బాధ్యులం కాదన్న టీఎస్‌ఆర్‌టీసీ వాదనను తోసిపుచ్చింది న్యాయస్థానం. ఈ కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి రూ.1.3 లక్షల పరిహారాన్ని డ్రైవర్, ఆర్టీసీ కలిసి చెల్లించాలని స్పష్టం చేసింది.
అయితే యాదగిరి నెలకు రూ.25వేల సంపాదించేవారని బాధిత కుటుంబం పేర్కొంది. కానీ దానిని నిరూపించేలా ఎటువంటి సాక్షాధారాలు చూపలేకపోవడంతో.. యాదగిరి నెలసరి ఆదాయాన్ని న్యాయస్థానం రూ.9,516గా నిర్ధారించింది. దాని ప్రకారమే లెక్కలు కట్టిన న్యాయస్థానం కుటుంబ ఆధారాన్ని కోల్పోయినందుకు గానూ బాధిత కుటుంబానికి అందాల్సిన పరిహారాన్ని రూ.9.12 లక్షలుగా తేల్చింది. మిగిలిన పలు అంశాలకు పరిహారంగా మిగిలిన పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో బాధిత కుటుంబానికి ఆర్టీసీ, డ్రైవర్ కలిసి చెల్లించాల్సిన మొత్తం పరిహారం రూ.10.3 లక్షలుగా ఉంది. అయితే ఈ పరిహారం మొత్తం నుంచి లక్ష్మీ బాయి రూ.3 లక్షలు తీసుకోవచ్చిన, మిగిలిన మొత్తాన్ని యాదగిరి మనవరాలు 18 ఏళ్ల వయసుకు వచ్చేవరకు ఫిక్సిడ్ డిపాజిట్‌లో ఉంచాలని ఆదేశించింది.