గోకులాష్టమి వేడుకలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

రామాంతాపూర్ లో టెన్షన్..ఆందోళనకు దిగిన బాధితకుటుంబాలు;

Update: 2025-08-18 08:18 GMT

రామాంతపూర్ గోకుల్ నగర్ కృష్టాష్టమి వేడుకలో చోటు చేసుకున్న ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా చికిత్స పొందుతున్న మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. ఉరేగింపు రథానికి కరెంట్ తీగలు తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు చనిపోగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. బాధితులు విద్యుత్ శాఖాధికారులను నిలదీశారు. ప్రమాద వివరాలు తెలుసుకోవడానికి ఘటనా స్థలికి చేరుకున్న విద్యుత్ శాఖ సీఎండీని బాధితకుటుంబాలు నిలదీశాయి.

ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్టు ఆందోళన కారులు నినదించారు. ఆందోళన కారులను అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పుడు కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు, విద్యుత్ శాఖాధికారులతో ఆందోళనకారులు వాగ్వివాదానికి దిగారు.

ఐదు లక్షల  ఎక్స్ గ్రేషియా

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఆరుగురు చనిపోయిన ఘటనలో మృతుల కుటుంబాలను మంత్రి శ్రీధర్‌ బాబు సోమవారం పరామర్శించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

కృష్ణాష్టమి వేడుకల్లో మొరాయించిన రథాన్ని యువకులు చేతులతో లాగడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్‌ తీగలు తాకాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్‌ కొట్టింది. వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఈ క్రమంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Tags:    

Similar News