‘చేనేత కార్మికులను ఆదుకోండి మోదీ సాబ్..’

జీఎస్టీ నుంచి చేనేత ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వాలని కోరిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.;

Update: 2025-08-18 10:48 GMT

తెలంగాణలో చేనేత రంగం సంక్షోభంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గిట్టుబాటు ధర రాక, ముడిసరుకుల ధరలు పెరిగిపోయి చేనేత కార్మికులు చిత్రవధ అనుభవిస్తున్నారని, చేనేత ఉత్పత్తులకు రోజురోజుకు గిరాకీ పడిపోతుండటం ఇందుకు ప్రధాన కారమణి ఆయన వివరించారు. ఈ క్రమంలోనే చేనేత ఉత్పత్తులపై విధిస్తున్న జీఎస్‌టీని తొలగించాలని కోరుతూ ప్రధాని మోదీకి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. అందులో ఆయన పలు కీలక అంశాలను లేవనెత్తారు. కేంద్రం విధిస్తున్న 5శాతం జీఎస్టీ వల్ల చెనేత రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని కేంద్రం ఆదుకోవాలని ఆయన కోరారు. హస్తకళల పరిశ్రమకు చేనేత రంగం ఊపిరిలాంటిదన్నారు.

‘‘నాణ్యత, సృజనాత్మకతకు అద్దం పట్టే పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, నారాయణపేట చీరలు, సిద్ధిపేట గొల్లభామ చీరలు, వరంగల్ దర్రీస్, కరీంనగర్ డబుల్ క్లాత్ చెద్దర్లు, ఇతర చేనేత వస్త్రాలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయి. వీటిలో ఆరు రకాల ఉత్పత్తులు జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 23,046 మంది చేనేత కార్మికులు, 34,569 మంది అనుబంధ కార్మికులు ఈ రంగంలో పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ముడి సరకుల ధరలు పెరగడం, పవర్లూమ్, మిల్ రంగాలు తక్కువ ఉత్పత్తి వ్యయంతో వస్త్రాలు తయారు చేయడంతో మార్కెట్లో చేనేత వస్త్రాలు తయారు చేసే నేత కార్మికులకు గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అని తెలిపారు.

దీనికి తోడు 5 శాతం జీఎస్టీ విధించడం వల్ల చేనేత ఉత్పత్తుల ధరలు పెరిగి వినియోగం తగ్గిపోతుందని, కార్మికుల జీవనాధారం సంక్షోభంలో పడుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘జీఎస్టీ వల్ల నష్టపోతున్న నేతన్నలు తమ సంప్రదాయ వృత్తిని వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. సాధారణంగా ఖాదీ రంగం, చేనేత రంగం రెండూ సహజ సిద్ధమైన గ్రామీణ పరిశ్రమలుగా ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఖాదీ ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపు ఉండగా, చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ కొనసాగించడం అన్యాయం. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సంఘాలు, కార్మికులు ఈ పన్నును వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేనేత కార్మికుల ప్రయోజనాలు కాపాడటంతోపాటు నిరంతరం ఉపాధి కల్పించేందుకు భారతీయ చేనేత కళా వారసత్వం భావితరాలకు అందించడానికి చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ మినహాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి" అని కోరారు.

Tags:    

Similar News