తెలంగాణ ఆరు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్

తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.;

Update: 2025-08-18 03:36 GMT
అతి భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదనీరు

తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో సోమవారం మెరుపు వరదలు సంభవించే అవకాశముందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం వల్ల ఫ్లాష్ ఫ్డడ్స్ వచ్చే అవకాశముందని ఆమె హెచ్చరించారు. జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో కుండపోత వర్షాల వల్ల లోతట్టుప్రాంతాలు మునిగిపోతాయని ఆమె వివరించారు.




 పది జిల్లాల్లో అతి భారీవర్షాలు

తెలంగాణలో సోమవారం పది జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఉత్తర, తూర్పు తెలంగాణ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని నాగరత్న వివరించారు.



 బంగాళాఖాతంలో వాయుగుండం

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ, మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ అధికారి డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారి మంగళవారం మధ్యాహ్నం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశముందని ఆయన తెలిపారు.



 రాగల 48 గంటల పాటు భారీ వర్షాలు

సోమవారం ఉత్తర, తూర్పు జిల్లాల నుంచి మరో అల్పపీడన ప్రభావం వల్ల భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రాల్లో రాగల 24 నుంచి 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు.హైదరాబాద్ నగరంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు 40కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని ఆయన వివరించారు.

అల్పపీడన ప్రభావం వల్ల ముసురు

అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో ముసురు పట్టిందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వచ్చే 24గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్, మేడ్చల్ - మల్కాజిగిరి, యాదాద్రి - భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ లో పేర్కొన్నారు.


Tags:    

Similar News