‘నా పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలి.’

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ;

Update: 2025-07-23 07:15 GMT
Click the Play button to listen to article

ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ బుధవారం (జూలై 23) తన పిటిషన్‌పై అత్యవసర విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టు(Supreme Court) ను కోరారు.

 ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. ఈ ఘటనపై అప్పటి సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా.. అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీని వేశారు. ఆ కమిటీ నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని తేల్చింది. దీంతో రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్‌ వర్మకు సీజేఐ సూచించారు. ఆయన తిరస్కరించడంతో.. అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా లేఖలు రాశారు.జస్టిస్‌ వర్మ (Justice Yashwant Varma)ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఈమేరకు 145 మంది ఎంపీలు తమ పిటిషన్‌ను సమర్పించారు. అదేవిధంగా రాజ్యసభలోనూ 63 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు సమర్పించిన విషయం తెలిసిందే.

‘తాను వైదొలుతున్నట్లు ప్రకటించిన సీజేఐ’

తన వాదన వినకుండానే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ.. జస్టిస్‌ వర్మ తాజాగా అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. కాగా వర్మ పిటిషన్‌ విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌(B R Gavai) వెల్లడించారు. విచారణ కమిటీలో తాను ఉన్నందున దాన్ని వేరొక బెంచ్‌కు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. "నేను ఒక బెంచ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది" అని వర్మ తరపున ఈ విషయాన్ని ప్రస్తావించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌తో గవాయ్ అన్నారు. జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనానికి సీజేఐ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 

Tags:    

Similar News