తెరుచుకున్న కేదారనాథ్ ఆలయ ద్వారాలు..
తొలి పూజకు హాజరయిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి..;
పవిత్ర హిందూ దేవాలయాల్లో ఒకటయిన కేదారనాథ్ ఆలయ ద్వారాలు శుక్రవారం ఉదయం 7 గంటలకు తెరుచుకున్నాయి. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల్లో ఇది పదకొండవది. సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయాన్ని 108 క్వింటాళ్ల పుష్పాలతో అలంకరించారు. వీటికి ప్రత్యేకంగా నేపాల్, థాయిలాండ్, శ్రీలంక నుంచి తెపించారు. చార్‌ధామ్‌లోని నాలుగు ఆలయాల్లోకెళ్లా (కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి గంగోత్రి) కేదారనాథ్ (Kedarnath temple) వచ్చే భక్తుల సంఖ్య అధికం. ఏటా దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో వస్తుంటారు. శీతాకాలంలో మంచు కారణంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు.
తొలి పూజలో పాల్గొన్న సీఎం ధామి ..
ఉత్తరాఖండ్ (Uttarakhand) ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆలయంలో నిర్వహించిన తొలి పూజకు హాజరయ్యారు. ఆయన వెంట రావళ్ (ప్రధాన పూజారి) భీమశంకర్ లింగ్, పూజారి బగేశ్ లింగ్, కేదారనాథ్ ఎమ్మెల్యే ఆశా నౌటియాల్, రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ సౌరభ్ గహర్వార్, బీకేటీసీ సీఈఓ విజయ్ ప్రసాద్ థప్లియాల్, తీర్థ పూజారి శ్రీనివాస్ పోస్తి ఉన్నారు.
ప్రత్యేక హారతికి ఏర్పాట్లు..
ఆలయ సమీపంలో మందాకిని, సరస్వతి నదీ సంగమంలో ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని బద్రీనాథ్-కేదారనాథ్ ఆలయ కమిటీ (BKTC) సీఈఓ విజయ్ థప్లియాల్ తెలిపారు. వారణాసి, హరిద్వార్, ఋషికేశ్‌లో ఇచ్చే హారతిని పోలి ఉంటుందని చెప్పారు. ఈ హారతిని వీక్షించేందుకు వీలుగా భక్తుల కోసం మూడు వైపులా ర్యాంపులు ఏర్పాటు విజయ్ థప్లియాల్ తెలిపారు.