‘అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్’

ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సేనని ఆరోపించారు.

Update: 2024-09-20 12:16 GMT

ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సేనని ఆరోపించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఇప్పుడున్నది గతంలోని కాంగ్రెస్‌ కాదని, ఆ పార్టీలో దేశభక్తి, స్ఫూర్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు. కాంగ్రెస్‌ అంటేనే అబద్ధం, మోసం, నిజాయతీ లేకపోవడం అని విమర్శించారు.

గణపతి ఉత్సవాలను కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని మోదీ చెప్పారు. నేటి కాంగ్రెస్ గణపతి పూజను కూడా అసహ్యించుకుంటోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వినాయకుడి విగ్రహాన్ని పోలీసు జీపులో ఎక్కించి, అవమానించిన ఘటనను గుర్తుచేస్తూ.. కాంగ్రెస్ మిత్రపక్షాలు ఈ ఘటనపై మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి స్పష్టంగా ప్రస్తావిస్తూ.. ఇండియా కూటమి పక్షాన జత కట్టిన పార్టీలకు ఓటు వేసే ముందు ఆలోచించాలని ప్రజలను కోరారు.

రాజకీయాల కోసమే కాంగ్రెస్ రైతులను వాడుకుంటుందని ఆరోపించారు. రైతులను నాశనం చేసిన కాంగ్రెస్‌కు మరో అవకాశం ఇవ్వకూడదని కోరారు. టెక్స్‌టైల్ వైభవాన్ని పునరుద్ధరించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. గత ఏడాది 18 వృత్తులకు చెందిన 20 లక్షల మంది విశ్వకర్మ పథకంలో భాగస్వాములయ్యారని, 8 లక్షల మందికి పైగా హస్తకళాకారులు, కళాకారులు నైపుణ్య శిక్షణ పొందారని తెలిపారు. అనంతరం ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. కొంతమంది పథకం లబ్ధిదారులను కలుసుకున్నారు. విశ్వకర్మ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన స్మారక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు.

Tags:    

Similar News