సాప్ట్ వేర్ ఇంజినీర్ పై విద్యుత్ స్థంభం పడి..
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు వచ్చి మృత్యు ఒడిలోకి;
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు వచ్చి మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్. హైదరాబాద్ విఎస్టీ కాలనీకి చెందిన భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వినాయక నిమజ్జన వేడుకలు జరుగుతున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది.
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు లారీ డ్రైవర్ నిర్లక్ష్యమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు .కార్తికేయనగర్ కు చెందిన సాప్ట్ వేర్ ఇంజినీర్ సాత్విక్ (23) వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వెళుతున్న క్రమంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపటంతో కేబుల్ వైర్లను తాకి రెండు స్థంభాలు విరిగిపడ్డాయి. వీటిలో ఒక స్థంభం సాత్విక్ ప్రయాణిస్తున్న బైక్ పై పడింది.దీంతో సాత్విక్ కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సాత్విక్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ ఉప్పల్ లో ఇటీవలె కృష్టాష్టమి వేడుకల్లో పాల్గొన్న పలువురికి కరెంట్ షాక్ తగిలి చనిపోయారు పాతబస్తీ చాంద్రాయణగుట్ట బడంగ్ పేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు వారం రోజుల క్రితం కరెంట్ షాక్ తగిలి మృత్యువాతపడ్డారు. వినాయకుడిని మండపానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో వరుస విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రజలు కలవరం చెందుతున్నారు.