మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ..
75 లక్షల మంది ఖాతాల్లో జమచేసిన బీహార్ సీఎం నితీష్ సర్కార్.. కొత్త ఖాతాదారులతో కిక్కిరిసిపోతున్న బ్యాంకులు, నెట్ కేఫ్‌ల ముందు భారీగా క్యూలైన్లు..
బీహార్(Bihar)లో అందరి నోట వినిపిస్తున్న మాట "దస్ హజార్". తర్వలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో సీఎం నితీష్ కుమార్( C.M. Nitish Kumar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘‘మహిళా రోజ్‌గార్ యోజన’’(Mahila Rozgar Yojana) పథకాన్ని ఆయన ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ ప్రారంభంలో ప్రకటించిన ఈ పథకం కింద పేద మహిళా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు జమ అవుతుంది.
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2.77 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సాయం అందించాలని నితీష్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోడానికి పెద్దగా కండీషన్లేమి పెట్టలేదు. దరఖాస్తుదారు, ఆమె భర్త ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాకుండా ఉంటే చాలని ప్రకటించడంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. సైబర్ కేఫ్‌ల వద్ద మహిళల రద్దీ పెరిగిపోయింది. ఇంకొంతమంది మహిళలు బ్యాంకుల్లో తమ అకౌంట్లను కేవైసీతో అప్‌డేట్ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 1.5 కోట్లకు పైగా మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
తొలి దఫా విడుదల..
2.77 కోట్ల మంది లబ్ధిదారులలో 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 10వేలు శుక్రవారం (సెప్టెంబర్ 26) జమ అయ్యింది. మిగతా 2.2 కోట్ల మందికి అక్టోబర్ మొదటి వారం, ఆ తరువాత అందే అవకాశం ఉంది. ఇప్పటికే డబ్బు అందుకున్న వారిలో ఆనందం వెల్లివిరుస్తుంది. పండుగ సీజన్ కావడంతో వారి ముఖాలు కలకలలాడుతున్నాయి.
‘ఆర్థిక సాయంతో కొంత ఊరట..’
"నేను పేదదాన్ని. పాట్నాలో ఇంటి పనిమనిషిగా పనిచేస్తూ నెలకు కేవలం రూ. 5వేలు సంపాదిస్తున్నాను. నా భర్త మమ్మల్ని వదిలేసి వెళ్లడంతో ఒంటరిగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. రూ. 10 వేల ఆర్థిక సాయం నాకు కొంత ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే చిన్న వ్యాపారం ప్రారంభించి మెరుగైన జీవితాన్ని గడపాలనుకుంటున్నా" అని నలుగురు పిల్లల తల్లి అయిన 32 ఏళ్ల షకీలా ఖాటూన్ అన్నారు.
‘తాకిడి పెరిగింది..’
"బీహార్‌లో బ్యాంకులు, సైబర్ కేఫ్‌లకు మహిళలతో కిక్కిరిసి పోవడం మునుపెన్నడూ చూడలేదు. నితీష్ కుమార్ మహిళలకు రూ. 10వేలు ప్రత్యక్ష నగదు బదిలీని ప్రకటించిన వెంటనే ఈ హడావిడి మొదలైంది" అని బ్యాంకు క్లర్క్ ఒకరు వ్యాఖ్యానించారు.
వందల సంఖ్యలో కొత్త ఖాతాలు..
“ప్రతిరోజూ డజన్ల కొద్దీ మహిళలు కొత్త ఖాతాలు తెరవడానికి, లేదా పాత వాటిని పునరుద్ధరించుకోడానికి వస్తున్నారు. మా బ్రాంచ్‌లో రోజుకు 50 కొత్త బ్యాంక్ ఖాతాలు తెరుస్తున్నాం. ఇక మిగతా బ్యాంకులు, బ్రాంచీల్లో పరిస్థితి ఏమిటో మీరే ఊహించుకోండి, ”అని మరో బ్యాంకు మేనేజర్ అన్నారు.
‘నితీష్ పథకం ఒక గేమ్ ఛేంజర్ ’ ..
ఇది మహిళల ఓట్ల కోసం తీసుకొచ్చిన అత్యంత ఆకర్షణీయమైన పథకం అని ఒక రాజకీయ పరిశీలకుడు పేర్కొన్నారు. నగదు ప్రోత్సాహకం "గేమ్ ఛేంజర్" కావచ్చని అభిప్రాయపడ్డారు.
మహిళా ఓట్లే కీలకం..
బీహార్‌లో పార్టీ గెలుపోటములలో మహిళా ఓటర్లే కీలకం. 2020లో జరిగిన ఎన్నికలలో మొత్తం 243 నియోజకవర్గాలలో 167 నియోజకవర్గాలలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. అదే కోసి-మిథిలాంచల్ బెల్ట్‌లో NDA నాయకత్వం తిరిగి అధికారంలోకి రావడానికి సాయపడింది. అయితే ఆ ఎన్నికలు JD(U) బలహీనతను బయటపెట్టాయి. పోటీచేసిన 115 సీట్లలో 43 సీట్లను మాత్రమే గెలుచుకుంది. BJP 110 సీట్లలో 74 స్థానాలను గెలుచుకుంది. చిరాగ్ పాస్వాన్ LJP వల్లే మాకు సీట్లు తగ్గాయని ఆ తర్వాత JD(U) తమ ఓటమిని సమర్థించుకుంది.
గతంలో ఎదురైన చేదు అనుభవాలతో నితీష్ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు చాలా పథకాలు తీసుకొచ్చారు. పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్ళ పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగాలలో 35% రిజర్వేషన్లు, పంచాయతీ, పట్టణ సంస్థల ఎన్నికలలో 50% రిజర్వేషన్లు ప్రకటించారు. అయితే ‘‘మహిళా రోజ్‌గార్ యోజన’’ ఎంత మాత్రం నితీష్‌ను గట్టేక్కిస్తుందో కౌంటింగ్ రోజున బయటపడుతుంది.