అమ్మాయిల్ని ఇలా కూడా తరలిస్తారా? వీళ్లు ఎలా చిక్కారంటే..

బెంగళూరులో ఉద్యోగమట.. అందుకని బీహార్ తీసుకెళ్తున్నారట.. కలికాలం కాకపోతే ఇదేంటీ..;

Update: 2025-07-23 11:51 GMT
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదేనేమో.. అమ్మాయిల్ని తరలించే ముఠా ఒకటి చేసిన ప్లాన్ చూస్తుంటే.. ఇలా కూడా చేస్తారా అని మనం ముక్కుమీద వేలేసుకోక తప్పదు.. గుంపుగా వచ్చిన అమ్మాయిలెవరి వద్దా టికెట్లు లేవు, రిజర్వేషన్ ఉన్న పేపర్లు లేవు.. కానీ అందరూ రైలు ఎక్కారు. మూతులకు గుడ్డలు కట్టుకున్నారు. టీసీ అడిగితే ఒక్కొక్కళ్లు చేతులు చూస్తున్నారు.. బోగీ నెంబర్, బెర్త్ నెంబరు చెబుతున్నారు. ఇదేంటా అని ఆరా తీస్తే అసలు గుట్టు బయటపడింది.

కోల్ కతా నుంచి బీహార్ రాజధాని పాట్నా బయల్దేరిన ఓ రైలులో కొంతమంది యువతులు ఎక్కారు. యువతులు అందరూ 18-31 ఏళ్ల లోపు వారే. అదేం నేరం కాదు. అలా వెళ్లడం ఇదేం కొత్తకాదు. టికెట్ అని టీసీ అడిగితే వాళ్ల చేతులపై అంటించిన స్టాంపులు చూసి చెబుతున్నారు. టీసీలకు అనుమానం వచ్చింది. పైగా అందరి చేతులపై స్టాంప్‌లు ఉండటం మరింత అనుమానం కలిగింది. తీగలాగితే డొంక కదిలింది. ఎవరో ఓ ముఠా - మహిళల అక్రమ రవాణా (Human Trafficking)కు ఈ ప్లాన్ చేసినట్టు తేలింది.
న్యూ జల్పాయ్‌గురి- పాట్నా క్యాపిటల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 56 మంది అమ్మాయిలు, యువతులు ఎక్కారు. వీరికో ఓ మహిళ, పురుషుడు ముఠా నాయకులుగా ఉన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా టీసీలు తనిఖీలు చేశారు. వాళ్లకు అనుమానం వచ్చి ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి చెప్పారు. వాళ్లు వీరున్న బోగీ వద్దకు వచ్చారు. యువతులంతా ఇలా ఒకేసారి ప్రయాణించడం, వారి ముఖాల్లో కంగారు గమనించిన రైల్వే సిబ్బందికి అనుమానం కలిగింది. వెంటనే వారిని టికెట్లు చూపించమని అడిగారు.
వాళ్లెవరి వద్ద టికెట్లు గానీ, ఇతర పత్రాలు గానీ ఏమీ లేవు. కేవలం కోచ్‌, బెర్త్‌ నంబర్లున్న స్టిక్కర్లు వాళ్ల చేతులపై అంటించి ఉన్నాయి. దీంతో రైల్వే పోలీసులు వాళ్లని ప్రశ్నించారు. కంగారులో ఓ యువతి- బెంగళూరులో ఉద్యోగం కోసం తమను రైల్లో తీసుకెళ్తున్నారని చెప్పింది. బెంగళూరులో ఉద్యోగమైతే బిహార్‌ ఎందుకు వెళ్తున్నారని అడిగారు. సమాధానం లేకపోవడంతో ఈ ముఠాకి నాయకత్వం వహిస్తున్న వారిని గట్టిగా అడగడంతో పొంతన లేని మాటలు చెప్పారు. దీంతో రైల్వే సిబ్బంది వారిని అరెస్టు చేశారు.
మహిళల అక్రమరవాణాలో భాగంగానే వీరిని బిహార్‌ తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
ఇది ఒక్క రైలు ప్రయాణంలో వెలుగు చూసిన అక్రమ రవాణా ముఠా దుశ్చర్య. మరి లెక్కలేనన్ని స్టేషన్లు, మార్గాల్లో ఎన్ని మూగ కథలెన్నో ఊహించగలమా?
Tags:    

Similar News