కల్పనా సోరెన్.. జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి ?
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ని ఈడీ అరెస్ట్ చేస్తే తదుపరి సీఎంగా ఆయన భార్య కల్పనా సోరెన్ బాధ్యతలు తీసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మనీలాండరింగ్, భూకుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అయితే తదుపరి ముఖ్యమంత్రిగా ఆయన భార్య కల్పనా సోరెన్ బాధ్యతలు చేపడతారని జేఎంఎం వర్గాలు చెబుతున్నాయి.
ఈ రోజు మధ్యాహ్నం నుంచి హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు ఆయన ఇంటిలో నే విచారిస్తున్నారు. ఒకవేళ ఈడీ ఆయనను అరెస్ట్ చేస్తే ఏం చేయాలనే దానిపై పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని కూటమిలో ఇతర పార్టీలు సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో తన భార్య పోటీ చేయబోదని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ కల్పనా సోరెన్ నే సీఎంగా చేయాలని పార్టీ లోని మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు.
కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి అయితే ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీ కాల వ్యవధి సంవత్సరం లోపు ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించకూడదనే రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయి.
ఈ ఏడాది నవంబర్ లో జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. మరీ కల్పనాను ఎలా సీఎం చేస్తారని ఓ ప్రశ్న పార్టీ వర్గాల్లో తలెత్తుతోంది. దీనిపై నిఫుణులతో మాట్లాడుతున్నారని, త్వరలో నిర్ణయం తీసుకుంటారని జేఎంఎం వర్గాలు చెబుతున్న మాట. బహూశా ఆమె సీఎం కాకుండా చట్టపరంగా అడ్డంకులు ఎదురవుతాయని రాజ్యాంగ నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.
వ్యాపారంలో విజయవంతమైన మహిళ
కల్పనా సోరెన్ కు 2006లో హేమంత్ సోరెన్ తో వివాహం జరిగింది. వీరిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. తండ్రి ఒడిశాలోని మయూర్ భంజ్ కు చెందిన వ్యాపారవేత్త, తల్లి గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు నిఖిల్, అన్షు ఉన్నారు.
కల్పనా సోరెన్ ఇంజనీరింగ్, ఎంబీఏ పూర్తి చేసింది. విద్య, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, సామాజిక సమీకరణాల వంటి వివిధ రంగాలలో అనేక విజయాలు సాధించింది. కొన్ని వాణిజ్య భవనాలు, ఓ పాఠశాలను నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రొత్సహిస్తోంది. మహిళా సాధికారత, పిల్లలను సరిగా పెంచడం వంటి సామాజిక కార్యక్రమాలకు ఎక్కువగా హజరవుతూ ఉంటారు. అయితే 2022లో హేమంత్ సోరెన్ తన భార్యకు చెందిన కంపెనీకి పారిశ్రామిక ప్లాట్ ను కేటాయించడానికి సీఎంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారని మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఆరోపించారు. ఈ విషయంలో కల్పనా సోరెన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.