ఆపరేషన్ సింధూర్: కాశ్మీర్ లో హై అలెర్ట్.. కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు
సెలవులు రద్దు చేసిన జే అండ్ కే ప్రభుత్వం;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-08 07:21 GMT
పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్, పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో క్షిపణి దాడులు చేసిన నేపథ్యంలో శ్రీనగర్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ లోని అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు.
‘‘ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోని జిల్లా అత్యవసర ఆపరేషన్ సెంటర్ లో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ(డీడీఎంఏ) మొత్తం పర్యవేక్షణలో ఒక ఉమ్మడి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు’’ అని స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ ఒక ఉత్తర్వులో తెలిపారు.
కాశ్మీర్ లో ని 10 జిల్లాల్లో ఇలాంటి నియంత్రణ రూమ్ లను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుందని, అంతర్ విభాగ సమన్వయాన్ని సులభతరం చేయడానికి, ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు పర్యవేక్షించడానికి, సమాచారం సకాలంలో చేరడానికి కేంద్రంగా పనిచేస్తుందని డీఎం చెప్పారు.
‘‘ఇది సాధారణ ప్రజలకు ఫిర్యాదుల పరిష్కారవేదికగా పనిచేస్తుంది. నిజ సమయంలో తలెత్తే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి వీలు కల్పిస్తుంది’’ అని ఆర్డర్ పేర్కొంది.
ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అత్యవసర సేవలను సమన్వయం చేయడానికి, అవసరమైన మద్దతు, సహాయాన్ని అందించడానికి ఈ గదిని సంప్రదించవచ్చని తెలిపింది.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జెకే ప్రభుత్వం అన్ని పరిపాలనా కార్యదర్శులు, విభాగాధిపతులకు సెలవులు రద్దు చేశారు. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప సెలవులు ఇవ్వకూడదని ప్రభుత్వం ఆదేశించింది.